గ్రూప్‌–3లోనూ పురుషులే ‘టాప్‌’ | Group 3 results: boys outperform Girls in Telangana | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–3లోనూ పురుషులే ‘టాప్‌’

Published Sat, Mar 15 2025 1:08 AM | Last Updated on Sat, Mar 15 2025 1:08 AM

Group 3 results: boys outperform Girls in Telangana

శుక్రవారం గ్రూప్‌–3 ఫలితాలను విడుదల చేస్తున్న టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం

మొదటి పది ర్యాంకుల్లో ఒక్కరే మహిళ 

టాప్‌ 92 ర్యాంకుల్లో పది మంది మహిళలకే చోటు 

గ్రూప్‌–3 మార్కులు, జీఆర్‌ఎల్‌ విడుదల చేసిన టీజీపీఎస్సీ 

దరఖాస్తులు 5,36,400.. పరీక్ష రాసినవారు 2,67,921 మంది

18,364 మంది అనర్హత. 2,49,557 మంది జీఆర్‌ఎల్‌ విడుదల 

గ్రూప్‌–1, 2, 3లోనూ టాపర్లుగా నిలిచిన కొందరు అభ్యర్థులు 

దీంతో కొన్ని కిందిస్థాయి పోస్టులు మిగిలిపోయే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–3 కొలువుల భర్తీ కోసం నిర్వహించిన అర్హత పరీక్షల ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. గ్రూప్‌–2 లాగే గ్రూప్‌–3 పరీక్షల్లోనూ పురుషులే ఆధిపత్యం కనబరిచారు. ఈ ఫలితాల్లో టాప్‌ 10 ర్యాంకుల్లో ఒకే ఒక్క మహిళ ఉన్నారు. టాప్‌ 92లో పది మంది మహిళలు మాత్రమే నిలిచారు. మొత్తం 450 మార్కులకు గాను మొదటి ర్యాంకు సాధించిన వ్యక్తి 339.239 మార్కులు సాధించాడు. గ్రూప్‌–2లో టాప్‌ 31 ర్యాంకుల్లో ఒక్క మహిళ కూడా లేని విషయం తెలిసిందే. 

18 వేల మందికి అనర్హత 
మొత్తం 1,388 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ 30 డిసెంబర్, 2022లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఉద్యోగాల కోసం 5,36,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో పరీక్ష­లు నిర్వహించారు. గ్రూప్‌–3లో మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు. ఈ పరీ­క్షల ఫలితాలు, జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టు(జీఆర్‌ఎల్‌), మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్లు, ఫైనల్‌ కీ, ఓఎంఆర్‌ షీట్‌ స్కాన్డ్‌ కాపీలను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఈ పరీక్షలకు 2,67,921 హా­జరుకాగా, వీరిలో ఏకంగా 18,364 మంది అనర్హతకు గురయ్యారు. దీంతో జీఆర్‌ఎల్‌లో 2,49,557 మంది అభ్యర్థుల వివరాలు మాత్రమే ఉన్నాయి. అభ్యర్థులు వారి టీజీపీఎస్సీ ఐడీ, హాల్‌ టికెట్‌ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. తాజాగా విడుద­ల చేసిన ఫైనల్‌ కీపై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని కమిషన్‌ స్పష్టం చేసింది. జీఆర్‌ఎల్‌ ఆధారంగా ధ్రువపత్రాల పరిశీలన కోసం ప్రాథమి­క ఎంపిక జాబితా రూపొందిస్తామని తెలిపింది. నో­టి­ఫికేషన్‌లో నిర్దేశించిన విధంగా అభ్యర్థులు వారి ఒరిజినల్‌ ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.

సాంకేతిక సమస్యలకు సంబంధించిన సమాచారం కోసం టీజీపీఎస్సీ హెల్ప్‌డెస్క్‌ ఫోన్‌ నంబర్లు 040–23542185, 040–2354­2187లలో సంప్రదించాలని, లేదా ‘హెల్ప్‌డెస్‌్క(ఎట్‌)టీఎస్‌పీఎస్సీ.జీఓవీ.ఇన్‌’లో ఈమెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చని తెలిపింది. ఈ నెల 10వ తేదీన గ్రూప్‌–1 మార్కులు విడుదల చేసిన టీజీపీఎస్సీ... 11న గ్రూప్‌–2 ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా గ్రూప్‌–3 జీఆర్‌ఎల్‌ విడుదల చేసి­న కమిషన్‌.. హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పరీక్షల తుది ఫలితాలను 17న, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పరీక్షల తుది ఫలితాలను 19న ప్రకటించనుంది. కాగా, గ్రూప్‌–3 జీఆర్‌ఎల్‌లో అభ్యర్థి ర్యాంకు, హాల్‌ టికె­ట్‌ నంబర్, సాధించిన మార్కులు మాత్రమే ఉన్నాయి.  

పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం 
గ్రూప్‌–1, గ్రూప్‌–2, గ్రూప్‌–3 కొలువులకు సంబం­ధించిన పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ వరుస­గా విడుదల చేసింది. అయితే, ఈ మూడు కేటగిరీల్లోనూ టాపర్లుగా నిలిచినవారు ఎక్కువ మందే ఉ­న్నా­రని సమాచారం. అదేవిధంగా ఇప్పటికే గ్రూప్‌­–­4 ఉద్యోగాల్లో చేరిన కొందరు గ్రూప్‌–3లోనూ అర్హత సాధించారు. వీరిలో చాలామంది గ్రూప్‌–1 ఉద్యోగాల్లో లేదంటే గ్రూప్‌–2 ఉద్యోగాల్లో చేరుతారు. దీంతో గ్రూప్‌–3లో కొన్ని పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అదే సమయంలో గ్రూప్‌–4 ఉద్యోగం చేస్తూ గ్రూప్‌–3 పోస్టు సాధించినవారు.. ప్రస్తుతం చేస్తున్న గ్రూప్‌–4 ఉద్యోగాలను వదిలేసే అవకాశమే ఎక్కువ. దీంతో పలు కేటగిరీల్లో కొన్ని పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందని సమాచారం.

గ్రూప్‌–3 స్టేట్‌ టాపర్‌ అర్జున్‌రెడ్డి గ్రూప్‌–2లోనూ 18వ ర్యాంకు 
పాపన్నపేట (మెదక్‌): గ్రూప్‌– 3 పరీక్షల్లో స్టేట్‌ టాపర్‌గా మెదక్‌ జిల్లా పాపన్నపేటకు చెందిన అర్జున్‌రెడ్డి నిలిచారు. శుక్రవారం టీజీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో 450 మార్కులకు గాను ఆయన 339.239 మార్కులు సాధించారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్‌– 2 ఫలితాల్లో కూడా అర్జున్‌రెడ్డికి స్టేట్‌ 18వ ర్యాంకు రావటం విశేషం. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన అర్జున్‌రెడ్డి.. ప్రస్తుతం హవేలిఘనపూర్‌ మండల రెవెన్యూ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ, మెదక్‌ కలెక్టరేట్‌లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్‌–2 పోస్టుకు ప్రాధాన్యం ఇస్తానని అర్జున్‌రెడ్డి తెలిపారు.

గ్రూప్‌–3, గ్రూప్‌–2లో మహిళా టాపర్‌ ఒక్కరే  
సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–3 పరీక్ష ఫలితాల్లో మహిళా విభాగంలో డాక్టర్‌ వినీషారెడ్డి మహిళా విభాగంలో టాపర్‌గా నిలిచారు. మొత్తం 450 మార్కులకు గాను ఆమె 325.157 మార్కులు సాధించి 8వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. గ్రూప్‌–2 ఫలితాల్లోనూ మహిళల విభాగంలో ఆమే టాపర్‌ కావటం విశేషం. సీడీపీఓ పరీక్షల్లో సైతం వినీషారెడ్డి స్టేట్‌ టాపర్‌గా నిలిచారు. గ్రూప్‌–1 పరీక్షలో కూడా మంచి మార్కులు సాధించారు. ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండానే సొంతంగా పరీక్షలకు సిద్ధమైనట్లు ఆమె తెలిపారు. తన లక్ష్యం ఐఏఎస్‌ ఉద్యోగం సాధించటమేనని చెప్పారు.

3–7–27–27 పోటీ పరీక్షల్లో చంద్రకాంత్‌ ర్యాంకులివి 
శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు చంద్రకాంత్‌ పోటీ పరీక్షల్లో సత్తాచాటారు. గ్రూ­ప్‌–2, గ్రూప్‌–3, గ్రూప్‌–4, జూని­యర్‌ లెక్చరర్‌పరీక్షల్లో అత్యుత్త­మ ర్యాంకులు సాధించాడు. శుక్రవారం విడుదలైన గ్రూప్‌–3 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంక్‌ సాధించిన చంద్రకాంత్, ఈ నెల 11 వెల్లడైన గ్రూప్‌–2 ఫలితాల్లోనూ రాష్ట్ర స్థాయిలో 27వ ర్యాంకు సాధించాడు. కొన్నాళ్ల క్రితం ప్రకటించిన గ్రూప్‌–4 పరీక్షల్లోనూ ఇతడు 27 ర్యాంకు సాధించటం విశేషం. అంతేకాదు, జూనియర్‌ లెక్చరర్‌ పరీక్షల్లో కూడా స్టేట్‌ 3వ ర్యాంకు సొంతం చేసుకొని ప్రశంసలు పొందాడు. ఈ నెల 12న రవీంద్రభారతిలో సీఎం చేతుల మీదుగా జేఎల్‌ ఉద్యోగ నియామక పత్రం అందుకున్నాడు.

గ్రూప్స్‌ పరీక్షలన్నింట్లోనూ ర్యాంకులు 
పెంట్లవెల్లి: టీజీపీఎస్సీ గ్రూప్స్‌–1, 2, 3, 4 పరీక్షలన్నింట్లోనూ మంచి ర్యాంకులు సాధించి ఔరా అనిపించాడు నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామానికి చెందిన హవల్దారి శ్రీనాథ్‌. ఇతడు గ్రూప్‌–1లో 454.5 మార్కులు సాధించాడు. గ్రూప్‌–2లో స్టేట్‌ 68వ ర్యాంకు పొందిన శ్రీనాథ్‌.. శుక్రవారం ప్రకటించిన గ్రూప్‌–3లో స్టేట్‌ 88వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. గ్రూప్‌–4లో స్టేట్‌ 136వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడిన శ్రీనాథ్‌.. తన తల్లిదండ్రుల నిరంతర ప్రోత్సాహం వల్లే తాను పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించినట్లు చెప్పాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement