ఢాంలెస్‌తో టపాస్ | Asthma patients beware, Diwali is here | Sakshi
Sakshi News home page

ఢాంలెస్‌తో టపాస్

Published Thu, Oct 23 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM

ఢాంలెస్‌తో టపాస్

ఢాంలెస్‌తో టపాస్

ఆస్తమాతో దీపావళి చేసుకోవడం ఎంత కష్టం. కాలుష్యం వల్ల నగరం మొత్తం తాను అనుభవిస్తున్న క్షోభ మనిషికీ అనుభవంలోకి రావాలని బహుశా ప్రకృతి ‘ఆస్తమా’ అనే జబ్బును సృష్టించి జనాల మీదికి వదిలిందేమో! ఉరి బాధను ఊరికే కాసేపని కాకుండా... ఆస్తమా ఉన్నవారికి అస్తమానం ఆ బాధ గంటలూ, రోజులూ అనుభవంలోకి వచ్చేలా చేసే జబ్బు అది. దానికి కారణం... మనం వెలువరిచే పొగ, కాలుష్యం! అలాగని ఆస్తమాతో దీపావళి చేసుకోకపోవడమూ ఎంత కష్టం! అందుకే ఉత్సవాన్ని ఊరితో అనువర్తించుకుని ఆవిష్కరించుకుంటే ఉరిబాధ నుంచి కాసేపు ఊరట! అందుకోసమే పండుగనాటి సాయంత్రం పూట బాణసంచాను మన షహర్‌కు ఆపాదించి ఆ బహార్‌లో విహరించి, ఆనందించడం మొదలుపెట్టా. అంతేకాదు... ఇలా స్మోక్‌లెస్, సౌండ్‌లెస్ దీపావళిని ఆలోచనలతో జరుపుకోవడం ఎలాగో మా బుజ్జిగాడికీ చెప్పడం ప్రారంభించా.
 
 ట్యాంక్‌బండ్ ఈ చివర్నుంచి ఆ చివరి వరకూ రోడ్డు తారాజువ్వ ప్రయాణమార్గంలా సూటిగా ఉందనిపించింది. ఇక రింగురోడ్డు అచ్చం భూచక్రం వెలువరించి ఏర్పాటు చేసిన కాంతివలయంలా ఉంది. మెహిదీపట్నం వద్ద మొదలై... శంషాబాద్ వరకు ఉన్న ఎక్స్‌ప్రెస్ హైవే అచ్చం... చీపురుపుల్ల రాకెట్‌ను ఏటవాలుగా వదిలితే... ఇక్కడ మొదలై... విమానాలు దిగే చోట... రాకెట్ కూడా దిగినట్లనిపించింది.
 
 ‘మరి చిచ్చుబుడ్డి లేదా నాన్నా’ అడిగాడు మా బుజ్జిగాడు. ‘ఎందుకు లేదూ...! బిర్లా మందిర్ ఉన్న నౌబత్‌పహాడ్ అచ్చం చిచ్చుబుడ్డి షేప్‌లోనే ఉంటుంది. దాని చివర తెల్లటి కాంతుల వెలుగులు విరజిమ్ముతూ ‘బిర్లామందిర్’ ఒకపక్కా.... మరో వైపు నుంచి చూస్తే విజ్ఞాన కాంతులు ఎగజిమ్ముతూ ‘ప్లానెటోరియం’ మరో పక్క. ఏదైనా  వాహనం మీద ఆ గుట్ట పక్కనుంచీ ప్రయాణం చేస్తూ ఉంటే... ఆ మందిరమూ, ఈ భవనమూ సదరు నౌబత్‌పహాడ్ అనే చిచ్చుబుడ్డి శిఖరంపై మారిమారి దివ్వెలు వెలువరిస్తూ కనిపిస్తుంటే... మనసులో ఆధ్యాత్మిక, వైజ్ఞానిక వెలుగురవ్వలు రాలుతున్నట్లుంటుంది. ఇక ఊరి మధ్యనున్న హస్సేన్‌సాగర్ అంటావా... మంటలేవైనా అకస్మాత్తుగా వెలువడితే ఆర్పడానికి ముంగిట్లో పెట్టిన నీళ్ల బక్కెట్‌లా ఉంటుంది.
 
 ‘‘అన్నీ బాగున్నాయ్ నాన్నా. కానీ బాంబులు లేవా? ఢామ్మంటూ శబ్దాలు వద్దా’’ ‘‘వద్దు... ఆనాడు గోకుల్ చాట్‌లో మొదలైన ఆ పేలుళ్లు... నిన్నటి దిల్‌సుఖ్‌నగర్ బాంబులతో ఆఖరైతే ఇక అంతేచాలు. జంతువుల గుండెలు గుబగుబలాడించడంతో పాటు... గుండెలవిసిపోయేలా మనుషులనూ గుండెలు బాదుకునేలా చేసే బాంబులు వద్దే వద్దు. ఈ విషయాన్ని బాంబులు పేల్చేవాళ్లూ గ్రహిస్తే ఇక నగరంలో పూలపూల దీపావళే తప్ప పేలుళ్ల దీపావళి ఉండదు. టపాసు ‘టప్’ అని సున్నితంగా పాస్ కావాలి తప్ప... ఢామ్మంటూ గుండెల్నీ, చెవుల్నీ బద్దలు కొట్టకూడదు. ఇది నగరవాసులంతా గ్రహించిన నాడు నగరవాసులందరూ కలిసి నగరం నగరాన్నే ‘ఆస్తమా’ నుంచి రక్షించినంత గొప్ప. ఆనాడు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నంత ఘనత. అందుకే పండుగ ఎంత ‘ఢామ్’లెస్‌గా జరిగితే... టపాస్ ఎగ్జామ్స్‌లో పాస్ కావడమే కాదు... అందులో టాపర్సూ మనమే. మన పర్సులోని కాపర్సూ, కరెన్సీ సేఫే’’ అంటూ పెన్సిల్ కడ్డీలాంటి విషయాన్ని స్ట్రెయిట్‌గానే ఉపదేశించా మా బుజ్జిగాడికి. అన్నట్టూ... ఇంతకీ ఈ రోజు మీరు
 జరుపుకొనేది ఢాంలెస్ దీపావళేనా?
 - యాసీన్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement