డబుల్ జ్యువెల్! | Double Jewel! | Sakshi

డబుల్ జ్యువెల్!

Published Sat, Dec 13 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM

డబుల్ జ్యువెల్!

డబుల్ జ్యువెల్!

యాసీన్
 
సింగిల్ చాయ్‌నైనా డబుల్‌స్ట్రాంగ్‌గా తాగుతారు మన హైదరాబాద్ సిటీ పీపుల్. డబుల్ స్ట్రాంగ్ చాయ్‌లో డబుల్ రోటీ అనే పేరున్న రోటీని అద్దుకుని తింటారు. వాస్తవానికి అది కేవలం బన్. కానీ డబుల్ అంటే గానీ... లేదా డబుల్ ఉంటే గానీ మనకు ఆనదు కాబట్టి దానికి డబుల్ రోటీ పేరు పెట్టారు మన సిటీ‘జెమ్స్’! దీన్నిబట్టి తెలిసేదేమిటి? మన హైదరాబాదీలకు సింగిల్ సరిపోదు. డోసు డబులైతేనే పీసు నచ్చుతుంది.
 
బిర్యానీ తినడానికి హోటల్‌కు వెళ్లినవాడు... పెట్టింది తిని బుద్ధిగా వచ్చేస్తాడా? కుదర్దు. ఆర్డర్ ఇచ్చేటప్పుడే... ‘ఏక్ బిర్యానీ... విత్ డబుల్ మసాలా అండ్ డబుల్ గోష్’ అంటూ గొంతులో కమాండ్ నింపుకొని తన డిమాండ్ చెబుతాడు. అలాగే సగటు నగర ప్రయాణికులు మొన్నమొన్నటి వరకూ డబుల్ డెక్కర్ ఎక్కేవారు. కానీ అంతస్తుల తేడా వస్తుందనీ, అందరూ సమానమనే సామ్యవాద స్ఫూర్తి దెబ్బతింటోందని, ఈ మధ్య పై అంతస్తును కిందికి దింపేసి, వెస్టిబ్యూల్‌తో రెండు బస్సులనూ కలిపేసి ఇలా పొడుగ్గా ఉండే డబుల్ బస్‌లలో ప్రయాణం చేస్తున్నారు.

అంతేనా... పీక్ టైమ్స్ అని పిలిచే ఏ ఉదయమైనా, ఏ సాయంత్రమైనా సరే... ఒక్క బస్సులోనే రెండు బస్సుల జనాలు కూరి కూరి నింపినట్లుగా నిండి ఉంటారు. అనగా ప్రయాణీకులూ డబుల్ ఉంటారన్నమాట. దాంతో జనాల మధ్య దూరాలూ, అంతరాలూ తగ్గి, ప్రేమలూ డబుల్ అవుతాయి. ఒక కాలు పట్టే స్థలంలో ఆ కాలు మీదికి మరో కాలు ఎక్కి డబులవుతుంది. ఇలా ఈ రద్దీలో ఒకవేళ ఎవరో ఎవరిదో కాలు తొక్కినందువల్ల తిట్టుకున్నా అదీ ప్రేమకొద్దే అనుకోవాలి. అదీ ‘డబుల్’ కాన్సెప్ట్ పట్ల సిటీ పీపుల్‌కు ఉన్న ప్రేమ.
 
ఇంతటితోనే ఆగిందా... నగరం చుట్టూ ఎన్నో చెరువులున్నా, అఫీషియల్‌గా ‘సాగర్’ అన్న పేర్లున్న సరస్సులూ డబులే! ఒకటి హుస్సేన్‌సాగర్, రెండోది హిమాయత్‌సాగర్. నగరంలో ఒకే ఒక్క చార్మినార్ ఉండటం నామోషీ అనిపించిందో ఏమిటో గానీ... ఇంజనీర్లు హైటెక్స్‌కు పోయే ఎంట్రెన్స్ మార్గాన్ని మోడ్రన్ చార్మినార్ షేపులో కట్టి దాన్నీ ‘డబుల్’ చేశారు. ఇక ముగ్గురు ప్రయాణం చేసే మామూలు ఆటోలు మనకు ఆనలేదు. అందుకే మామూలు ఆటోల కంటే రెట్టింపు మంది పట్టేలా సెవెన్ సీటర్ ఆటోలని కొత్తవి ప్రవేశపెట్టి ‘డబుల్’ కాన్సెప్టును మరింత పరిపుష్టం చేశారు.
 
అంతెందుకు హైదరాబాద్ అన్న ఒక్క నగరం మనకు సరిపోలేదు. అందుకే సికింద్రాబాదునూ నిర్మించి జంటనగరాలన్నారు. అందరూ ఇంగ్లిష్‌లో వీటిని ట్విన్ సిటీస్ అంటారు. కానీ... ట్విన్స్ అంటే కవలలు అని అర్థం. నిజానికి హైదరాబాద్ ఎప్పుడో నాలుగొందల ఏళ్ల క్రితం పుట్టింది. సికింద్రాబాద్ ఆ తర్వాత చాలా కాలానికి పుట్టింది కాబట్టి వీటిని ట్విన్స్ అనగా కవల నగరాలు అనడం కంటే తెలుగులో చక్కగా జంటనగరాలు అనే అర్థం వచ్చేలా ‘డబుల్ సిటీస్’ అనడమే కరక్టేమో! ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటే దిల్‌కు జిల్లుగా ఉంటుంది. ఒకే టికెట్‌పై రెండు సినిమాలు చూస్తే థ్రిల్లుగా ఉంటుంది. అందుకే హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోని మనం ఏ సిటీలో నివసించినా మనకు మరో సిటీ అదనం! అదే మన జంటనగరాల గొప్పదనం!!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement