బన్ను పోయి బిస్కట్ | the osmania biscuit story | Sakshi
Sakshi News home page

బన్ను పోయి బిస్కట్

Published Mon, Oct 13 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM

బన్ను పోయి బిస్కట్

బన్ను పోయి బిస్కట్

బన్ను... ఉదయం చాయ్‌తోపాటు తినటం ప్రజల అలవాటు. దైనందిన జీవనంలో దీనిది విడదీయరాని బంధం. అయితే ఇది 1920కి ముందు ఉన్న పరిస్థితి. అప్పుడే నగరంలో కాలుమోపింది మరో పదార్థం. చూస్తుండగానే బన్ను కనుమరుగై ఆ కొత్త పదార్థం మన ఇరానీ చాయ్‌కి సరిజోడీ అయింది. దానితో పాటు ఆస్వాదిస్తేనే ఇరానీ చాయ్ రుచికి ఓ అర్థం ఉంటుందనేంతగా సగటు హైదరాబాదీని మెప్పించింది. అదే ఉస్మానియా బిస్కట్..!
 
ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా చరిత్ర సృష్టించిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన రాజ్యం ప్రపంచ పటంలో ప్రత్యేకతను సంతరించుకోవాలని కలలుగన్నాడు. ఆ కలలను సాకారం చేస్తూ హైదరాబాద్ నగరాన్ని అన్నింటా ముందు నిలిపాడు.

విద్యుదీకరణ, రైల్వే, రోడ్డు, విమాన సర్వీసుల అభివృద్ధి, అసెంబ్లీ, జూబ్లీహాలు, హైకోర్టు భవనం, స్టేట్ మ్యూజియం, నేటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియూ యూనివర్సిటీ... ఇలా భాగ్యనగరం కొత్త రూపు సంతరించుకుంటూ ప్రగతి దిశగా పరుగులెత్తింది. దీనికితోడు తన అభి‘రుచు’లు పదికాలాల పాటు నిలిచిపోయేలా కూడా చొరవచూపాడు. అలా పుట్టిందే ఉస్మానియూ బిస్కట్.

1920 నాటికి హైదరాబాద్‌లో బన్ను (డబల్‌రోటీ)దే హవా. అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న ఇరాన్ చాయ్‌తోపాటు బన్ను తినటం ఉన్నత వర్గం అలవాటు. ఇరానీచాయ్ లేనిదే నిజాంకు కూడా పూటగడవదు. ఓరోజు చాయ్‌తోపాటు ఆయన మైదా పిండితో రూపొందించిన పదార్థం రుచి చూశారు. అది ఆయనకు తెగ నచ్చేసింది. ఇక నాటి నుంచి చాయ్‌తో పాటు దాన్ని ఆరగించటం ప్రారంభించారు. క్రమంగా అది దివానం దాటి గల్లీలకూ పాకింది. ఆయన నాంది పలికిన అలవాటు కావటంతో ఆ పదార్థానికి ఆయన పేరే  దక్కింది. అదే
 
ఉస్మానియూ బిస్కట్..!  
సిటీలోని కేఫ్‌లో ఓ మూల కూర్చుని చాయ్ తాగుతూ బిస్కట్‌లను లాగిస్తుంటే సమయం తెలియదు. ఆలోచనలకు పదునుపెడుతుంది, ఉత్సాహాన్ని నింపుతుంది, బద్ధకాన్ని వదిలిస్తుంది, పనిలో వేగాన్ని కలిగిస్తుంది, స్నేహాన్ని పెంచుతుంది... అంటూ యువత కితాబిస్తున్న ఆ కవల జంట కాంబినేషనే... ఇరానీ చాయ్ ఉస్మానియూ బిస్కట్.

హైదరాబాద్‌లో పుట్టిన ఈ బిస్కట్‌కు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు. ఉస్మానియా బిస్కట్ పేరుతోనే అమెరికా, బ్రిటన్‌లలోనూ అది హల్‌చల్ చేస్తోంది. ఇక పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఎడారి దేశాల్లో దాని హవా చెప్పనే అక్కర్లేదు. హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ చాయ్‌లకు ఏమాత్రం తీసిపోని కీర్తిని ఇది సొంతం చేసుకుంది.
 
బట్టీలో భలేగా సిద్ధం...
ఉస్మానియూ బిస్కట్ రుచిలోని మజాయే వేరు. కాసేపు తీయగా, ఆ వెంటనే ఉప్పగా, ఇంతలో కమ్మగా... వెరసి గ‘మ్మత్తు’గా ఉంటుంది. ముందు గట్టిగా అనిపించినా టీలో నంజుకుని నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. గుండ్రగా, మందంగా, వెనకవైపు కాస్త మాడినట్టుగా కనిపించే ఉస్మానియూ బిస్కట్లు బట్టీల్లో సిద్ధమవుతారుు. వీటి తయూరీకి మూల పదార్థం మైదాపిండి. ఇందులో చక్కెర, ఉప్పు, కాస్త నెరుు్య, పాల పొడి, కస్టర్డ్ పొడిని కలిపి బిళ్లలుగా చేసి బట్టీలో నిప్పుల వేడిపై కాలుస్తారు. ప్రతి బేకరీలో వీటిని తయూరు చేస్తున్నారు. నిత్యం లక్షల్లో ఇవి స్వాహా అవుతుండటంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బేకరీల్లో వీటి తయూరీపైనే దృష్టి సారిస్తుంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement