వాహ్.. చాయ్ | Jhansi shares her feelings on irani chai | Sakshi
Sakshi News home page

వాహ్.. చాయ్

Published Fri, Sep 19 2014 12:30 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

వాహ్.. చాయ్ - Sakshi

వాహ్.. చాయ్

పౌనా చాయ్ విత్ ఉస్మానియా బిస్కట్.. వో భీ చార్మినార్‌కే సామ్‌నే..
ఇంతకన్నా గొప్ప పెహచాన్ ఉంటుందా అసలైన హైదరాబాదీకి!


ప్రస్తుతం అమెరికాలో ఉన్న నేను స్టార్‌బక్స్ కాఫీ సిప్ చేస్తుంటే గుర్తొచ్చింది. పల్చటి కాఫీలో పాలలాంటి క్రీమర్ ఎంత వేసినా రాని చిక్కదనంతో కుస్తీ పట్టలేక నల్లని అమెరికానోతో సరిపెట్టుకున్నాను. పైగా ఎంత తాగినా తరగనంత పెద్ద లోటాలాంటి గ్లాస్ ఒకటి. కాఫీ క్రావింగ్‌తో టీ వేట మొదలుపెట్టా. కనీసం అదైనా రుచిగా ఉంటుందేమోనని. అది ఇంకోరకమైన కష్టం. అలా కాఫీ, టీ వేటల్లో అలసిపోయి కళ్లు మూసుకున్నా.. చార్మినార్ ప్రత్యక్షమైంది. నిమ్రా కేఫ్ చాయ్ రుచి గుర్తొచ్చింది. అక్కడి ఉస్మానియా బిస్కట్ కూడా.. కళ్లు తెరిచి
‘వాహ్.. చాయ్’అనుకున్నా!

ఇరానీ.. బహుత్ పురానీ
బిజీ హైదరాబాద్‌లో ఎన్ని ఇరానీ కేఫ్‌లో! చార్మినార్‌ని చూస్తూ చాయ్ తాగుతూ ఉస్మానియా బిస్కట్ తినడాన్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం నిమ్రాలోకి అడుగుపెట్టాల్సిందే! పది నిమిషాలకోసారి ఆ కేఫ్‌లో ఫ్రేమ్ మారిపోతూంటుంది కానీ అరవైఏళ్లుగా మాత్రం ఆ  చాయ్ రుచి మారలేదంటారు అక్కడి చాయ్ ప్రేమికులు.
 
ఉస్మానియా బిస్కట్..
హైదరాబాద్‌లో నేను తిన్న బెస్ట్ బిస్కట్ ఉస్మానియా బిస్కట్. పెద్దపెద్ద బ్రాండ్స్ బిస్కట్స్ ఎన్నో తిన్నా ఈ బిస్కట్ రుచికి సాటిరావు. అసలు ఈ బిస్కట్‌కు ఇంత రుచికి కారణమేంటా అని ఆరాతీయాలనిపించి... నిమ్రా కిచెన్‌లోకి వెళ్లా. ఈ బిస్కట్ రుచి వెనుక సీక్రెట్ ఏంటని ముగ్గురు యజమానులనూ (సోదరులు) అడిగా! సీక్రెట్‌కి బదులు చిరునవ్వే సమాధానంగా దొరికింది.
 
పూరీ సృజనకు ఇంధనం...
హైదరాబాద్ గల్లీగల్లీల్లోని ఇరానీ కేఫుల్లో మరిగే చాయ్ కనిపిస్తుంది. దాంతోపాటు గరమ్‌గరమ్ కబుర్లూ వినిపిస్తాయి. తలనొప్పికి మందు చాయ్.. బద్ధకానికి మందలింపూ చాయే! కొందరికి పనిలో బ్రేక్‌నిచ్చేది చాయ్ అయితే.. ఇంకొందరికి చాయ్ కోసమే పనిలో బ్రేక్ కావాలి. ఫ్రెండ్స్‌కి తోడుగా చాయ్.. సిగరెట్‌కే సాథ్‌మే చాయ్! బోర్ కొడితే చాయ్.. బోర్ కొట్టకుండా ఉండటానికీ చాయ్! ఎందరో క్రియేటర్స్ సృజనకు ఇంధనమూ ఇరానీ చాయే! నమ్మలేని వాళ్లకు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి చెప్పాల్సిందే! ఆయన కెరీర్ తొలినాళ్లలో అమీర్‌పేట బస్‌స్టాప్ పక్కనే ఉన్న చిన్న ఇరానీ కేఫ్‌ని తన స్థావరంగా మార్చేసుకున్నారు. ఆయన్ని కలవడానికి ఎవరొచ్చినా సంభాషణ ఒక ఇరానీ చాయ్‌తో మొదలుపెట్టాల్సిందే. అప్పట్లో ఆయన కోసం వాళ్లింటికి ఎవరు వెళ్లినా ఒకటే సమాధానం.. ‘అన్న కేఫ్‌లో ఉన్నారు’ అని. రానురాను ఇంటికి వచ్చేవాళ్లంతా ముందు కేఫ్‌లో చూసుకొని అక్కడ లేకపోతేనే ఇంటికి వెళ్లేవాళ్లు. పూరీగారి హిట్లన్నీ ఆ చాయ్ కిక్కులోంచి వచ్చినవే.
 
సూపర్ కాంబినేషన్
హైదరాబాద్ సంస్కృతిలో భాగమైపోయిన ఇరానీ కేఫ్‌ల స్థానంలో ఇప్పుడు కొత్త కాఫీకేఫ్‌లు దర్శనమిస్తున్నాయి. మీటింగులు, చాటింగులు, హ్యాంగింగ్‌లకు సెంటర్‌పాయింట్ అయిపోతున్న ఈ మోడర్న్ కేఫుల్లో పదిరకాల చాయ్‌లు, ఇరవైరకాల కాఫీలు.. కాంప్లికేటెడ్ పేర్లు, కాంప్లికేటెడ్ మెషీన్లు, డిస్పెన్సెస్‌లతో. టెక్నాలజీ హడావిడికి చిరునామాల్లాగా! కాఫీనురగలో డిజైన్‌హంగులు సరేసరి! జూబ్లీహిల్స్ 180డిగ్రీ కేఫ్‌లో ఒకసారి కాఫీ నురగపై ఏకంగా నా పేరే రాసిచ్చాడు ఓ కళాపోషకుడు. కాఫీల్లో, టీల్లో ఎన్ని రకాలైనా రావచ్చుగాక.. కేఫేలు ఎన్ని కొత్తరూపాలైనా ఎత్తొచ్చుగాక... కొన్ని మాత్రం సజీవంగా ఉంటాయి. అమ్మమ్మ వేసే ఫిల్టర్ వాసన.. అమ్మ కలిపిన ఇన్‌స్టంట్ రుచి.. అక్క పెట్టిన టీలోని ఆప్యాయత.. శ్రీవారిచ్చిన కప్పులో ప్రేమ.. ఎప్పటికీ మారవు. అలాగే ఇరానీ చాయ్ విత్ ఉస్మానియా బిస్కట్ ఇన్‌ఫ్రంటాఫ్ చార్మినార్.. ఎవర్‌గ్రీన్ కాంబినేషన్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement