భాగ్యనగరంతో బంపర్ ఆఫర్ | Sairam Shankar talks to Sakshi city plus about Hyderabad city | Sakshi
Sakshi News home page

భాగ్యనగరంతో బంపర్ ఆఫర్

Published Sat, Sep 13 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM

భాగ్యనగరంతో బంపర్ ఆఫర్

భాగ్యనగరంతో బంపర్ ఆఫర్

నాడు ఎర్ర బస్సెక్కి వచ్చిన అనుభవాలు, రోడ్లపై పచార్లు, అడ్డాలో చాయ్ బాతాఖానాలు.. నేటికీ సజీవం! ఫారిన్ కార్లలో షికార్లు కొట్టినా.. ‘క్లాప్’లతో ‘షో’పుటప్‌లు పెరిగినా.. ఆ అనుభూతులు పదిలం. సొంతూరు పుట్టుకనిస్తే, భాగ్యనగరం బతుకునిచ్చింది. అమ్మదనం నిండిన కమ్మదనం, బంధుత్వాన్ని మరిపించిన స్నేహగణం.. అన్నీ ఇచ్చిన హైదరాబాద్‌తో తనది మరపురాని బంధమంటున్నాడు హీరో సాయిరామ్ శంకర్. భాగ్యనగరంతోనే తన జీవితానికి బంపర్ ఆఫర్ వచ్చిందంటున్నాడు.
 
 ఆ రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. 1997లో.. పెట్టేబేడా సర్దుకొని నగరానికి షిఫ్ట్ అయ్యా. అంతకుముందు చాలాసార్లే వచ్చివెళ్లినా పర్మనెంట్‌గా వచ్చింది మాత్రం ఆ ఏడాదే. అప్పట్లో అన్నయ్య పూరీ జగన్నాథ్ ఇక్కడ సీరియల్ డైరెక్టర్‌గా పనిచేసేవాడు. తన దగ్గరే మకాం. ఎర్రగడ్డ జక్ కాలనీలో ఉండేవాళ్లం. ఎదురుగా గోకుల్ థియేటర్. అదే మా అడ్డా. అన్నయ్య దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసేవాడిని.
 
 బ్లూసీ.. వాటే టీ..!
 నిఖార్సయిన చాయ్ తాగాలంటే సికింద్రాబాద్ బ్లూసీకి వెళ్లాల్సిందే. నిజంగా అంత టేస్టుంటుంది అక్కడ టీ. రెగ్యులర్‌గా చాయ్ తాగడానికి దస్ నంబర్ బస్ ఎక్కి మరీ వెళ్లేవాళ్లం. ఇక సంగీత్ థియేటర్‌లో సినిమా చూడ్డం ఓ హాబీ. ఆ సౌండ్ ఎఫెక్ట్స్, పిక్చర్ క్వాలిటీకి ఫిదా అవ్వని ప్రేక్షకుడుంటాడా! వారం వారం అన్నయ్య, నేను అందులో ఇంగ్లిష్ సినిమాలు చూసేవాళ్లం.
 
 ఎర్రగడ్డ టు అమీర్‌పేట్
 కొంతకాలానికి మకాం అమీర్‌పేట్‌కు మారింది. అప్పుడప్పుడూ ఊర్వశి రెస్టారెంట్‌లో ‘ఎంజాయ్‌మెంట్’. రూమ్‌లో వంట (అన్నయ్యే నేర్పించాడు) బోర్ కొడితే గోల్డెన్ కేవ్ రెస్టారెంట్‌లో వాలిపోయేవాళ్లం. మా బ్యాచ్ దాదాపు పాతిక మంది. బాటా ఎదురుగా ఓ చిన్న కేఫ్ ఉండేది. ఇరవై నాలుగు గంటలూ అక్కడే. అర్ధరాత్రి పోలీసులు వచ్చి తరిమేసిన సందర్భాలూ ఉన్నారుు. దర్శకుడు శ్రీను వైట్ల కూడా వచ్చేవాడు. కానీ ఆయనతో మాకప్పుడు పరిచయం లేదు.
 
 రోడ్ నంబర్ 3.. నాడలా...
 ఫ్లాష్‌బ్యాక్‌కు వెళితే ఒక్కోసారి విచిత్రమనిపిస్తుంది. ఆ వెంటనే ఆనందమూ ఉప్పొంగుతుంది. నేను తొలిసారి షూటింగ్ కోసం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3కి వచ్చా (1997). ‘నాంది’ చిత్రం షూటింగ్ కోసం బస్సులో అక్కడి నుంచి బయలుదేరి బనగానపల్లి వెళుతున్నాం. జాన్ (నటి హేవు భర్త) దానికి కెమెరామన్. నేను అసిస్టెంట్ కెమెరామన్. ఆ బస్సులో బంపర్ ఆఫర్ రవి, బాలీవుడ్ దర్శకుడు ఇ.నివాస్ తదితరులున్నారు. అప్పట్లో ఈ రోడ్డులో మసీదు, క్యూ మార్టే కనిపించేవి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు తరువాత పెద్దమ్మ గుడి ఒకటి ఉండేదని తెలుసంతే. ఇదే రోడ్డులో ఓ బిల్డింగ్ ఉంది. సినిమాలో హీరో ఇల్లు కొన్నా, అమ్మినా.. మరేదైనా బిల్డింగ్ సీన్ అయినా అప్పుడక్కడే షూటింగ్. ఇప్పుడా బిల్డింగ్‌లోనే ఓ ఫ్లాట్ కొన్నా. కెరీర్ వేటలో మొదట అడుగు పెట్టిన చోటే ఇప్పుడు నివాసముంటుంటే.. అదో వింత అనుభూతి.
 
 ఎలా కట్టారో?
 నగరంలో నాకు బాగా నచ్చే స్పాట్ గోల్కొండ. అంత పెద్ద కోటను ఎలా కట్టారోననిపిస్తుంది. షూటింగ్‌లకు వెళ్లినప్పుడు హడావుడిగా చూడటమే గానీ, ఇంత వరకు కోట పైకి వెళ్లడం కుదరలేదు.
 
 ప్యూర్ నాన్‌వెజ్!

 బేసిగ్గా నేను ప్యూర్ నాన్‌వెజ్జీని (నవ్వుతూ). షూటింగ్‌లు లేనప్పుడు ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా. లేదంటే స్క్రిప్ట్‌లు వింటుంటా. బోర్ కొడితే ఏ రెస్టారెంట్‌కో వెళ్లి వెరైటీ ఫుడ్ ఆర్డర్ చేస్తుంటా. కేఫ్ 4 రెస్టాలో చికెన్ పాస్తా, జిటిలో ఆలూ చికెన్, డైన్‌హిల్‌లో గ్రిల్ చికెన్.. ఇలా ఒక్కో చోట ఒక్కో వెరైటీ టేస్ట్ చేయడం సరదా.
 
 నాన్న కోరిక అన్నయ్య తీర్చాడు
 నన్ను వెండితెరపై చూడాలన్నది మా నాన్న అభిలాష. హీరోని చేసి ఆ కోరికను అన్నయ్య తీర్చాడు. నేనీ స్థాయిలో ఉన్నానంటే ఆ క్రెడిట్ అన్నయ్యదే. ఆయన దగ్గర చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశా. అదే సమయంలో ‘ఇడియట్’లో నటించా. హీరోగా మాత్రం తొలి సినిమా ‘143’. ప్రస్తుతం ‘రోమియో’ విడుదలకు సిద్ధంగా ఉంది. జగదంబ, తమిళ హీరో శరత్‌కుమార్‌తో కలిసి మరో సినిమా చేస్తున్నా. నాకు నచ్చే నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన ఆల్ ఇన్ వన్. తరువాత బ్రహ్మానందం హాస్యం తెగ ఎంజాయ్ చేస్తా.
 
 ప్రేమ.. పెళ్లి..
 ఇప్పటికీ చాలామందికి తెలీదు.. నాకు పెళ్లయినట్టు. ఈ విషయం ఎక్కడా చెప్పలేదనుకోండి. సిటీలోనే ఆమెతో పరిచయం. పేరు వనజ. లవ్ మ్యారేజ్. ఒక పాప.. జనన్య. నర్సరీ చదువుతోంది.
 
 టుడే ఈజ్ మై బర్త్‌డే
 అన్నట్టు చెప్పడం మరిచా.. ఈ రోజే నా బర్త్‌డే! సెలబ్రేషన్స్ అంటూ ఏమీ చేసుకోను. ఉదయం దేవాలయానికి వెళ్లడం, కుదిరితే ఫ్యామిలీతో కలసి లంచో, డిన్నరో చేసి రావడం. ఇంతకు మించి నో స్పెషల్స్.
 
 ఎవర్ స్పెషల్
 విశాఖపట్నం నర్సీపట్నం దగ్గర ఓ చిన్న గ్రామం మాది. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన తరువాత హైదరాబాద్‌కు వచ్చా. పుట్టి పెరిగిన ఊరునొదిలి రావడం బాధగా ఉన్నా, కెరీర్ కోసం మకాం మార్చక తప్పలేదు. ఒకటి జీవితం ఇచ్చిన ఊరు, ఇంకొకటి జీవించడం నేర్పిన ఊరు. భాగ్యనగరమే నాకు బతుకునిచ్చింది. అందుకే ఈ మహానగరం అంటే నాకు ఎప్పటికీ ప్రత్యేకమే.
 - హనుమా
 ఫొటో : ఎన్.రాజేష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement