chai
-
Bandi Sanjay: మస్కా బన్ తిని.. చాయ్ తాగి!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా హిమాయత్ నగర్‌లోని నీలోఫర్ కేఫ్‌లో ప్రత్యక్షమయ్యారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ బీజేపీ ఆధ్వర్యంలో మూసీ బాధితుల పక్షాన ఇందిరాపార్క్ వద్ద ధర్నా అనంతరం ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లంకల దీపక్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు యాదవ్‌తో కలిసి నీలోఫర్ కేఫ్‌కు వచ్చారు. సాదాసీదాగా కేఫ్‌లోకి వెళ్లి కూర్చుని ‘మస్కాబన్’ తిన్నారు. ఛాయ్ తాగారు. బండి సంజయ్ వచ్చారని తెలుసుకున్న నీలోఫర్ కేఫ్ యజమాని బాబూరావు అక్కడికి వచ్చి పరిచయం చేసుకున్నారు. తాము ఈ మధ్య చిట్టిముత్యాలతో తయారు చేసిన సాంబార్ రైస్‌ను బాబూరావు అభ్యర్థన మేరకు సంజయ్ రుచిచూసి బాగుందని పేర్కొన్నారు. కేఫ్‌కు నీలోఫర్ పెట్టడానికి కారణమేంటని ప్రశ్నించడంతో.. ‘తాను చాలా పేదరికం నుండి వచ్చానని, 1976లో నీలోఫర్ ఆస్పత్రి వద్ద రూ.2 రూపాయలకు చిన్న ఉద్యోగం చేసి.. అక్కడే టీ, బిస్కట్లు అమ్మానని, వాటికి గిరాకీ ఉండటంతో కేఫ్ స్థాపించానని తెలిపారు. అందుకే నీలోఫర్‌కు వచ్చే రోగులకు తనవంతు సహకారం అందిస్తున్నాని తెలపడంతో బండి సంజయ్ బాబూరావును ప్రత్యేకంగా అభినందించారు. -
పాత బస్తీ.. బైకర్స్ మస్తీ..
చార్మినార్ సమీపంలో జనసంచారం అరకొరగా ఉండే ప్లేస్‌ను వెదకాలంటే.. అది కేవలం అర్ధరాత్రుళ్లు తప్ప అసాధ్యం. అందుకే సిటీ బైకర్స్ తమ చిట్‌చాట్‌కు అదే టైమ్‌ను ఎంచుకుంటున్నారు. పబ్స్, కేఫ్స్‌లో చిల్ అవుట్ అవడం ఎలా ఉన్నా ఓల్డ్ సిటీలో నైట్ అవుట్ మజాయే వేరు అంటున్నారీ బైకర్స్. నగరంలో విభిన్న రకాల పేర్లతో పదుల సంఖ్యలో బైకర్స్ క్లబ్స్ ఉన్నాయి. జాయ్ రైడ్స్ నుంచి లాంగ్రైడ్స్కు, ప్రత్యేక సందర్భాల్లో సందేశాత్మక రైడ్స్‌కు సైతం పేరొందిన ఈ క్లబ్స్.. తరచూ తమ ఓల్డ్‌సిటీని చుట్టి వస్తుంటారు. ‘ఓల్డ్ సిటీలో కూర్చుని ముచ్చట్లు పెట్టుకోవడం అనేది నగరంలోని బైకర్స్‌కు ఒక సంప్రదాయంగా మారుతోంది. దీనికి తొలిసారి నగరంలో ఈ తరహా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన క్లబ్స్ కారణం’అంటూ చెప్పారు నగరంలోని ఓ బైకర్స్ క్లబ్‌కు చెందిన శ్రీకాంత్.గరమ్ చాయ్.. బన్ మస్కా..సిటీలో ఎక్కడ చాయ్ తాగినా రాని కిక్ ఓల్డ్ సిటీలో ముచ్చట్లతో కలిపి పంచుకుంటే వస్తుందంటారు వాండరర్స్ క్లబ్‌కి చెందిన లలిత్ జైన్. నగరంలోని అత్యంత పాత క్లబ్స్‌లో ఒకటైన వాండరర్స్ తరపున పర్యాటక రంగ ప్రమోషన్స్ కోసం పాత బస్తీలో తరచూ రైడ్స్ నిర్వహిస్తుంటామని చెప్పారాయన. చాయ్‌తో పాటు ఉస్మానియా బిస్కెట్, బన్ మస్కా వంటివి ఓల్డ్‌సిటీకి మాత్రమే ఫేమస్ అయిన పలు హైదరాబాదీ ఫుడ్ ఐటమ్స్‌ను ఎంజాయ్ చేసేందుకు రద్దీ లేని వేళల్లో రైడ్స్ వేస్తుంటారు బైకర్స్. వెజ్, నాన్ వెజ్రైడర్స్ అందరూ ఎంజాయ్ చేసేందుకు అవసరమైన ఫుడ్ అక్కడ దొరుకుతుందని, దీంతో ఓల్డ్ సిటీ రైడ్ అంటే రైట్ అంటామని బైకర్ సిద్ధు చెబుతున్నాడు.ఓల్డ్ ఈజ్ గోల్డ్.. పాత బస్తీ అనేది ప్రతి హైదరాబాదీకి ఒక ఎమోషన్ అంటారు రాజ్‌దూత్ బైక్ మీద రైడ్స్ చేసే నగరవాసి ఛటర్జీ. సాధారణ సమయాల్లో విపరీతమైన రద్దీ వల్ల ఆ ప్రాంతాన్ని సరిగా ఆస్వాదించలేమని, అదే బాగా పొద్దుపోయాక వెళితే.. బైక్ లైట్స్ వెలుగులో మిలమిల మెరిసే చార్మినార్ పరిసరాల్ని వదిలి రాలేమని అంటున్నారాయన. ఆయన లాగే అనేక మంది నగరానికి చెందిన మధ్య వయసు్కలు తమ యుక్త వయసులోని పిల్లల్ని తీసుకుని మరీ రాత్రుళ్లు.. బైక్స్ మీద ఓల్డ్ సిటీ టూర్ వేస్తుండడం సర్వసాధారణం.అతిథి దేవోభవ..దేశ విదేశాల్లో పర్యటించే బైకర్స్.. కొన్ని నగరాలు, ప్రాంతాలకు తాము వస్తున్న సమాచారాన్ని తరచూ ఇచ్చి పుచ్చుకుంటుంటారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో, ఊర్లలో ఉన్న బైకర్స్ వెంటనే వారికి ఎదురేగి స్వాగతాలు పలకడం, తమ ప్రాంత విశేషాలను గురించి వారికి వివరించడం చేస్తుంటారు. అదే క్రమంలో నగరానికి వచ్చే ఇతర ప్రాంతాల బైకర్స్‌కు తప్పకుండా సందర్శనీయ స్థలం పాత బస్తీయే అవుతుంటుంది. అలా తరచూ వచ్చే బైకర్స్‌ను స్వాగతించి వారు కోరిన విందు విహారాలతో అతిథి మర్యాదలకు స్థానిక బైకర్స్ పాత బస్తీనే ఎంచుకుంటారు.తెల్లవారు ఝాము దాకా.. అర్ధరాత్రి ప్రారంభించి తెల్లవారుఝామున బ్రేక్‌ఫాస్ట్‌తో ముగించడం దాకా అక్కడే గడిపే బైకర్స్ కూడా ఉన్నారు.. బిర్యానీ, క్యారామెల్ పుడ్డింగ్, జఫ్రాన్ టీ వంటి వెరైటీలకు పేరొందిన నయాబ్ హోటల్, మసాలా బ్లాక్ టీ, జిందా తిలిస్మాత్ బ్లాక్ టీలు లభించే చౌక్ ఏరియాలోని డికాక్షన్ పాయింట్, నిహారీ, పాయా, షోర్బాలకు పేరొందిన చౌహాముల్లా ప్యాలెస్ సమీపంలోని అల్హాముదులైలాహ్ హోటల్, జ్యూస్‌లు, సలాడ్స్ అంటే గుర్తొచ్చే చారి్మనార్ దగ్గర్లోని మిలాన్ జ్యూస్ సెంటర్, సిద్ధి అంబర్ బజార్లో ఇడ్లీ దోశలతో ఆహా్వనించే ప్రహ్లాద్, అన్నపూర్ణ టిఫిన్స్.. ఇంకేం కావాలి చెప్పండి అంటున్న బైకర్స్‌కు ఆయా హోటల్స్ యజమానులు అంతా చిరపరిచితులే. దీంతో కాస్త ముందుగా చెబితే చాలు వచ్చేవారి సంఖ్యకు తగ్గట్టు ఐటమ్స్ రెడీ చేసేస్తారు.నురానీ కేఫ్ నుంచి నాసిక్ హైవేకి.. రాత్రి 12 దాటిన తర్వాత పాతబస్తీలోని నురానీ కేఫ్‌లో చాయ్ తాగి కాసేపు ముచ్చట్లు పెట్టుకోవడం రొటీన్. మరింత లాంగ్‌రైడ్ కోసం అక్కడ నుంచి నాసిక్ హైవే పై 100 నుంచి 120 కిమీ, అలాగే అక్కడి నిమ్రా కేఫ్ కూడా తరచూ మా మీటింగ్ పాయింట్ అవుతుంటుంది. రాత్రి పూట బైక్ మీద చారి్మనార్‌కు అత్యంత సమీపానికి వెళ్లడం, అక్కడి చాయ్, చాట్ ఆస్వాదించడం బాగుంటుంది. బయట నుంచి వచి్చన బైకర్స్‌ను తప్పకుండా పాత బస్తీకి తీసుకువెళతాం. – అమర్, హిందూస్థాన్ రాయల్స్ బుల్లెటీర్స్ క్లబ్స్అడ్వెంచర్ ఫీల్ కోసం.. రైడ్స్ మధురమైన జ్ఞాపకాలను పోగు చేసుకోడానికే. అందులో రాత్రి పూట రైడ్స్ ప్రత్యేకమైనవి. నైట్ రైడ్ అడ్వెంచర్ ఫీల్ వస్తుంది. మా వాండరర్స్ తరచూ ఫుడ్ రైడ్స్ నిర్వహిస్తుంటాం. రాత్రి పూట హైవే మీది దాబాల లాగే పాత బస్తీలో వెరైటీ ఫుడ్ అందించే ప్రాంతాల్లో రైడ్స్ వేస్తుంటాం. నగరం మీదుగా పర్యటించే బైకర్స్ గురించి తెలుసుకుని ఆహా్వనిస్తాం. పాతబస్తీ చరిత్రతో పాటు ఆహారాన్ని రుచిచూపిస్తాం. మళ్లీ మళ్లీ ఓల్డ్‌సిటీకి రావాలని అనిపిస్తుందంటారు. – రాహుల్.వాండరర్స్ క్లబ్ -
దేశమంతా...‘దక్కన్ చాయ్’
సాక్షి, హైదరాబాద్: విభిన్న రుచుల చాయ్లున్నా హైదరాబాద్ చాయ్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. టీ కొట్టు నుంచి స్టార్ హోటళ్ల వరకూ హైదరాబాద్ ఫ్లేవర్ చాయ్‌కు ప్రత్యేక ఆదరణ ఉంది. ఈ హైదరాబాదీ చాయ్‌ను విశ్వవ్యాప్తం చేయనున్నామని, మొదట దక్షిణాది రాష్ట్రాలకు పరిచయం చేయనున్నామని ప్రముఖ శ్రేయాస్ గ్రూప్ చైర్మన్ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఇప్పటికే సినిమా, ఈవెంట్, ఫ్యాషన్ రంగాల్లో తమదైన గుర్తింపు పొందిన శ్రేయాస్ గ్రూప్ ‘దక్కన్ చాయ్’తో మార్కెట్లోకి ప్రవేశించింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని శుక్రవారం బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఏర్పాటు చేశారు. దేశంలో చాయ్ వ్యాపారం 11 వేల మిలియన్ డాలర్ల మార్కెట్‌కు కలిగి ఉందని, మరో పదేళ్లలో ఇది 18 వేల మిలియన్ డాలర్లకు చేరుకోనుందని తెలిపారు. ఇందులో హైదరాబాదీ చాయ్‌ను మరింత ప్రాచూర్యంలోకి తీసుకురావడంలో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహా రాష్ట్రలో దాదాపు వెయ్యి ఔట్లెట్లను ప్రారంభించనున్నామని శ్రీనివాస్ రావు అన్నారు. ఇలా వెయ్యి మంది ఎంటర్ప్రూనర్స్తో పాటు 2 వేల మందికి హైదరాబాదీ చాయ్ తయారీ పై శిక్షణ అందించి ఉద్యోగావకాశాలను కలి్పస్తామన్నారు. ‘దక్కన్ చాయ్’ వ్యవస్థాపకులు వీరన్న మాట్లాడుతూ.. ఇప్పటికే 250 ఔట్లెట్లతో దక్కన్ చాయ్ తేనీటి విందును అందిస్తున్నాయని, శ్రేయాస్ మీడియా భాగస్వామ్యంతో ఈ సేవలు మరింత పెరగనున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఆర్ట్ ఆఫ్ టీ మేకింగ్ కోర్సుతో యువతకు శిక్షణ అందించనున్నామని, కొత్తవాళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తామే స్టాల్ వేదికగా డిజిటల్ యాడ్స్, వాల్ మార్ట్ రూపంలో అదనంగా ఆదాయం వచ్చేలా రూపకల్పన చేశామన్నారు. -
వెరై‘టీ’.. చాయ్ జీపీ‘టీ’..
వారిరువురూ అన్నదమ్మలు.. ఒకరు చదువు కోసం..మరొకరు ఉపాధి కోసం నగరానికి వచ్చారు.. అందరిలా కాకుండా తమ కాళ్లపై తాము నిలబడాలనుకున్నారు.. అనుకున్నదే తడవుగా తమ వద్ద ఉన్న కొద్ది మొత్తంతో ఓ టీ దుకాణాన్ని పెట్టారు.. అదే చాయ్ జీపీటీ..అంతటితో ఆగకుండా.. తమ స్టాల్లో లభ్యమయ్యే ఫ్లేవర్‌తో టీ పౌడర్‌ను మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నారు.. అసలీ ఆలోచన ఎలా వచ్చింది? దీని వెనుక కథేంటి? తులుసుకుందాం..!శ్రీనగర్‌కాలనీ: సరికొత్త ఆలోచనతో ఓ ఇద్దరు అన్నదమ్ములు నగరంలోని యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. జిహ్వకో రుచి.. పుర్రెకో ఆలోచన అన్నట్లు.. వెరైటీగా ఆలోచించారు. అందరిలా ఉద్యోగాలు కాకుండా.. వ్యాపారంలో రాణించాలని భావించారు.. తమ వ్యాపారాన్ని విస్తరించడానికి మార్కెట్లో ఓ కొత్త టీ ప్రొడక్ట్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే తెలుగు టీ రుచులను వినియోగదారులకు పరిచయం చేస్తామని ధీమాగా చెబుతున్నారు. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న చాట్ జీపీటీ నేడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం జనాల బుర్రల్లో తిరుగుతున్న పేరునే తమ కంపెనీ పేరుగా మలుచుకున్నారు.. ఓ టెక్నాలజీ పేరైన చాట్ జీపీటీని తలపిస్తూ చాయ్ జీపీటీతో ఓ చాయ్ దుకాణాన్ని నగరంలోని మధురానగర్‌లో గత సంవత్సరం ప్రారంభించారు ఈ ఇద్దరు అన్నదమ్ములు రోహిత్, కిరణ్ దుమ్ము. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ ఇద్దరూ చదువు నిమిత్తం నగరానికి వచ్చారు. రోహిత్ విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కిరణ్ డిగ్రీ చదువుతున్నాడు. ఉద్యోగాలు కాకుండా తమ సొంత కాళ్ళపై నిలబడాలన్న తపనలో చాయ్ జీపీటీ పేరిట చాయ్ స్టోర్‌ని ప్రారంభించారు. చాయ్‌లో ఏఐని తీసుకొని ఏఐ(అడ్రక్–ఇలాచి), జీపీటీని( జెన్యూన్లీ ప్యూర్ టీ)గా మలిచారీ అన్నదమ్ములు. ఆయుర్వేద మూలికలతో.. తెలుగు టీలలో ఎక్కువగా ఇలాచి, అడ్రక్లను ఆయుర్వేద మూలికగా ఆరోగ్యానికి ఉపయోగిస్తారు. మనం రోజువారీ విధానంతో పాటు చలికాలంలో ఎక్కువగా అల్లం, యాలుకల టీని తీసుకుంటాం. నిజానికి వీటిలో చాలా ఔషధగుణాలున్నాయి. వీటిని టీలో తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. అందుకే టీలలో వీటికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ మన తెలుగుదనాన్ని ఉట్టిపడేలా టీని తయారుచేస్తున్నాం. మార్కెట్లో ఉండే వాటికంటే భిన్నంగా మా టీ ఉత్పత్తి ఉండేలా సన్నాహాలు చేస్తున్నాం. మన రుచిని మిస్ అవ్వకుండా టీ పౌడర్‌లో కలపి చాయ్ జీపీటీ ప్రాడెక్ట్ చిన్న ప్యాకెట్లతో పాటు పెద్ద ప్యాకెట్లలో మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో అన్ని పర్మిషన్స్ తీసుకొని వినియోగదారుల ముందుకొస్తామని, అయితే తమకు ఇన్వెస్టర్స్ తోడైతే మరింత తోడ్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదువు, ఉద్యోగం కోసం ఓ మారుమూల ప్రాంతం నుంచి నగరానికి వచి్చ.. సరికొత్త ఆలోచనతో చాయ్ జీపీటీ ప్రాడక్ట్‌ను మార్కెట్లో తీసుకురావాలన్న ఆలోచన చేసిన ఈ ఇద్దరి అన్నదమ్ముల కృషి యువతకు ఆదర్శనంగా నిలుస్తుంది. తెలుగురుచికి తగ్గట్టుగా.. నేను డిగ్రీ చదువుతున్నాను. అన్నయ్య రోహిత్ బాటలో నడవాలన్నది నా ఆకాంక్ష. ఇప్పుడిప్పుడే స్టోర్ బాగా నడుస్తోంది. అల్లం, యాలుకలు మన ఆయుర్వేద ఔషధ మూలికలకు మన దైనందిన జీవితంలో ప్రత్యేకస్థానం ఉంది. వీటిని చాయ్ జీపీటీలో కలిపి మన తెలుగురుచికి తగ్గట్టుగా అసలు సిసలైన టీని అందించాలన్నది మా లక్ష్యం. అన్నయ్యతో కలిసి సాధిస్తాం. – కిరణ్, డిగ్రీ విద్యార్థి, చాయ్ జీపీటీ నిర్వాహకుడు మరింత మందికి ఉపాధి..ఉపాధిలో మనకున్న ప్రతిభతో అక్కడ రాణిస్తాం. కానీ వ్యాపారంలో మన ఆలోచనలు, సృజనాత్మకతను జోడించి మరికొంతమందికి ఉపాధిని అందిస్తాం. అందుకే ఉద్యోగం కన్నా వ్యాపారమే చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. మా దగ్గర ఉన్న పెట్టుబడితో టీ స్టోర్‌ని ఏర్పాటుచేశాం. కానీ మా లక్ష్యం మన తెలుగుదనం ఉట్టిపడేలా చాయ్ జీపీటీ టీ పౌడర్ బ్రాండ్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చి మన సత్తాచాటడమే. దానికి అనుగుణంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. – రోహిత్, సాఫ్ట్వేర్ ఉద్యోగి. చాయ్ జీపీటీ నిర్వాహకుడు -
అలసిన దేహానికో'టీ'..! భారత్‌లో మొదటిసారిగా..
పొద్దునో టీ.. సాయంత్రమో టీ.. దోస్తులతో టీ.. చుట్టాలతో టీ.. పని ఆపి ఒక టీ.. పనయ్యాకో టీ.. తాగాల్సిందే టీ అంటూ టీ ప్రియులు చెబుతున్నారు. చెమటలు కక్కే వేడిలోనూ పొగలుకక్కే చాయ్ తాగుతున్నారు. చాయ్ కలిగించే కిక్కులను పేద, ధనిక వ్యత్యాసం లేకుండా ఆస్వాదిస్తుంటారు. ఎంత పేదలైనా ఇంటికి వెళ్లామంటే.. ఓ గ్లాసు మంచినీళ్లు, ఓ కప్పు టీ ఇవ్వాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలకు టీ అత్యంత ఇష్టమైన పానీయం. అలాంటి టీకి ఒక రోజు ఉంది. 2005 నుంచి ఏటా మే 21న అంతర్జాతీయ ‘టీ’ దినోత్సవం నిర్వహిస్తున్నారు.1793 నుంచే..అలిసిన మనసుకు, దేహానికి ఉత్తేజాన్ని ఇచ్చే పానీయం టీ. అరె భాయ్ చటుక్కున తాగరా చాయ్.. అంటూ ఓ సినీగేయ రచయిత టీ గొప్పతనాన్ని వర్ణిస్తూ పాట రాశాడు. ఎంతో చరిత్ర కలిగిన టీని తేనీరు, చాయ్ అని పిలుస్తారు. 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచానికి టీ పరిచయమైంది. మొట్టమొదటగా మన దేశంలో 1793లో కలకత్తాలోని బొటానికల్ గార్డెన్లో లార్డ్ మెకార్డి టీ మొక్కలు పెంచడం ప్రారంభించాడు. ఇప్పుడు ఇంటింటికీ టీ చేరింది. ప్రపంచ టీ ఉత్పత్తిలో చైనా తర్వాతి స్థానం భారత్‌దే. అంతర్జాతీయంగా 30శాతం టీ పొడిని ఒక్క భారతీయులే వినియోగిస్తున్నారు.సహజమైన పానీయం..టీ సహజమైన పానీయం. ఇంటికి ఎవరు వచ్చినా అతిథి మర్యాదలో మొదట చేరిపోయేది ‘టీ’. స్నేహితులు కాలక్షేపానికి టీ పాయింట్‌కు చేరాల్సిందే. సమావేశాల్లోనూ తేనీటిది ప్రత్యేక స్థానం. ప్రస్తుతం బయట రకరకాల కేఫ్‌లు వెలుస్తున్నాయి. టీలలో కూడా చాలా రకాలు తయారు చేస్తున్నారు. అల్లం టీ, లెమన్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, మసాలా టీ, కరోనా టీ రకరకాల టీలను టీ ప్రియులు ఆస్వాదిస్తున్నారు. మండల కేంద్రాల్లో సైతం ప్రస్తుతం వివిధ కంపెనీలు వివిధ పేర్లతో టీ పాయింట్లు ఏర్పాటు చేసి ఒక కప్పు చాయ్‌కు రూ.10లకు తగ్గకుండా విక్రయిస్తున్నారు. కానీ పలువురు టీ వ్యాపారులు ఇప్పటికీ రూ.5లకే టీ విక్రయిస్తున్నారు.ఇవి చదవండి: నాలుగు మాటల్లో.. ఈ చిత్రకారుడి కథ! -
అలాంటి పదబంధాలను ఉపయోగించొద్దు! నటి పద్మాలక్ష్మి
ఇటీవల మన తెలుగు వాడుక భాషలో ఆంగ్ల పదాలు అలవొకగా చేరిపోయాయి. మనం కూడా వాటికే అలవాటు పడిపోయాం. తెలుగు, ఆంగ్లం మిక్స్ కొట్టినట్లుగా మాట్లాడుతున్నాం. ఆ క్రమంలో కొన్ని అర్థరహితమైన పదబంధాలను వినియోగిస్తున్నాం. వాటినే గుర్తు చేసి అవి ఎంత అర్థ రహితమో వివరిస్తున్నారు భారత సంతతి అమెరికన్, రచయిత్రి టీవీ నటి పద్మాలక్ష్మి. తప్పుగా ఉపయోగిస్తున్న గమ్మత్తైన పదబంధాలేంటో చూద్దామా..!చాలామంది 'చాయ్ టీ'కి పోదామా అంటుంటారని పద్మాలక్ష్మి చెబుతున్నారు. అస్సలు ఇది ఎంత చెత్త పదబంధమో ఒక్కసారి చూడండంటూ వాటి అర్థం గురించి వివరించారు. నిజానికి చాయ్ అంటే టీ మళ్లీ దానికి టీ అనే పదాన్ని కూడా జోడిస్తున్నాం. అంటే టీ టీ అని అర్థం వస్తుంది. అందుకే చాయ్ టీ వద్దు. ఆ పదం లేదు. అని సవివరంగా చెప్పారు. అలాగే ఘుమఘమలాడే 'అల్లం టీ' కావాలంటే మసాలా టీ అనండి చాలు అంటున్నారు. అలాగే చాలామంది 'గీ బట్టర్' అని అంటారు ఇది కూడా తప్పే ఎందుకంటే.. వెన్న, నెయ్యి వేరువేరు అది గుర్తించుకోండి అని చెబుతున్నారు పద్మాలక్ష్మి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తాము కూడా విన్న అలాంటి పదబంధాల గురించి చెప్పుకొచ్చారు. ఓ నెటిజన్ చాలామంది ఏటీఎం మిషన్ అని పిలుస్తుంటారు. ఇది కూడా చాలా తప్పు పదబంధం. ఏటీఎం అంటేనే(ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్). అలాంటప్పుడు మళ్లా మిషన్ ఎందుకు వ్యాఖ్యానించడం అని కామెంట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. మరో నెటిజన్ ఇలాంటి తప్పు పదబంధాలు భారత్‌లోని స్టార్‌బక్స్ మెనూలో కూడా ఉందని చెప్పుకొచ్చాడు. అక్కడ ఆహార మెనులో ఇలానే 'చాయ్ టీ' ఉండటం విచారకరం అంటూ పోస్ట్ పెట్టాడు. (చదవండి: బ్లింకిట్ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!) -
‘మోదీ చాయ్’కి పెరిగిన డిమాండ్!
లోక్‌సభ ఎన్నికలకు రోజులు సమీపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో ‘మోదీ చాయ్’ వార్తల్లో నిలిచింది. బీహార్‌లోని లాహెరియాసరాయ్‌లోని లోహియా చౌక్‌లో రాకేష్ రంజన్ అనే యువకుడు ఇటీవలే ఒక టీ దుకాణాన్ని తెరిచాడు. దానికి ‘మోదీ టీ’ అని పేరు పెట్టాడు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏర్పాటైన ఈ దుకాణంలో ‘మోదీ టీ’ని రుచి చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. ఇక్కడికి టీ తాగేందుకు వచ్చేవారు వివిధ రాజకీయ అంశాలపై బహిరంగంగా చర్చించుకోవడం పరిపాటిగా మారింది. ఈ టీ దుకాణం బ్యానర్‌పై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ముద్రించారు. దీనికి ఆకర్షతులైనవారంతా ‘మోదీ టీ’ తాగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక్కడ టీ తాగుతూ, మోదీ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ ప్రధానిని ప్రసంశలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు ఈ దుకాణంలో టీ విక్రయాలు పెరగడంతో దాని యజమాని రాకేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. -
'చాయ్'ని ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా?
రోజువారీ జీవితంలో ఒకటి లేదా రెండు సార్లు చాయ్‌ని ఆస్వాదించకుండా ఉండం. కొందరూ అంతకు మించి తాగేవాళ్లు ఉన్నారు. అందుకోసమే కాబోలు పని ప్రదేశాల్లో టీ బ్రేక్ అని వచ్చేసింది. కొద్దిగా అలా బయటకు వెళ్లి కొంచెం టీ తాగి రిలాక్స్ అయితే చాలు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. అలాంటి టీ మన ఇండియాలో చాలా విభిన్న పద్ధతుల్లో చేస్తారు. వాటి పేర్లు కూడా చాలా వెరైటీగా ఉంటాయి. ముఖ్యంగా ఎన్ని రకాల చాయ్‌లు ఉన్నాయో తెలసిందే. అలాంటి చాయ్‌ని ఓ మహిళ చాలా వెరైటీగా తయారు చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అందులో ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టి అందులో టీ పోడి, కొంచెం షుగర్ వేసి కాసేపు వేయించింది. ఇంతలో షుగర్ కరిగి మిశ్రమం దగ్గరకు వస్తుందనంగా యాలకులు, అల్లం, కొంచెం నీళ్లు వేశారు. కాపేపటికి పాలు వేసి కాసేపు మరగించి సర్వ్ చేశారు. 'టీ' ఇలా కూడా చేయొచ్చా అన్నంత వెరైటీగా చేసిందామె. చూస్తే మాత్రం 'చాయ్' మంచి రంగులో, చిక్కదనంతో అందంగా కనిపించింది. ఈ వీడియోని వీక్షించిన నెటిజన్లు 'ఏం చేశార్ మేడమ్' అని కొందరూ ప్రశంసిస్తే. మరికొందరూ మాత్రం ఇలానే చేసేదీ అని ఫైర్ అయ్యారు. I strongly condemn this new way to make chai. Should we file a petition in SC to stop this nonsense? pic.twitter.com/jy4BMgR472 — Monica Jasuja (@jasuja) November 25, 2023 (చదవండి: ఫ్రూట్ ఇడ్లీ గురించి విన్నారా? తయారీ విధానం చూస్తే..షాకవ్వుతారు!) -
ప్రధాన న్యాయమూర్తి ముందు... దివ్యాంగుల జాతీయ గీతాలాపన!
దేశరాజధాని ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగణంలో ‘మిట్టీ కేఫ్’ పేరిట దివ్యాంగుల ఒక స్టోర్ ఏర్పాటు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డివై చంద్రచూడ్ ఇతర న్యాయమూర్తులతో కలిసి దీనిని ప్రారంభించారు. నూతనంగా నిర్మితమైన ఈ కేఫ్ దివ్యాంగుల పర్యవేక్షణలో నడవనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో వికలాంగులు తమ ప్రతిభ చూపారు. సంకేత భాషలో జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రారంభోత్సవం సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ ఇక్కడకు వచ్చేవారు కేఫ్‌కు మద్దతుగా నిలవాలని కోరారు. VIDEO | CJI DY Chandrachud inaugurates 'Mitti Cafe' inside Supreme Court complex. The cafe is managed by differently-abled people. pic.twitter.com/MpRbpL4dy6 — Press Trust of India (@PTI_News) November 10, 2023 ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులకు సంబంధించిన సంస్థ ద్వారా ఈ ‘మిట్టి కేఫ్’ నిర్వహణ కొనసాగనుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరు విమానాశ్రయంతో పాటు వివిధ బహుళజాతి కంపెనీల కార్యాలయాలలో ఇప్పటికే 35 కేఫ్‌లు నడుస్తున్నాయి. ఈ సంస్థ 2017లో ప్రారంభమయ్యింది. దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంటుంది. ఈ కేఫ్‌లో పౌష్టికాహారాన్ని కూడా అందజేస్తారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో 51 ఘాట్లలో 24 లక్షల దీప కాంతులు! VIDEO | CJI DY Chandrachud and other judges watch as differently-abled children perform on National Anthem in sign language during an event inside the Supreme Court premises. pic.twitter.com/cDHRMX4wQv — Press Trust of India (@PTI_News) November 10, 2023 -
ఎంతో ఇష్టంగా తాగే చాయ్‌లో పాలు ఎందుకు కలుపుతారో తెలుసా!
ఓ కప్పు 'టీ' తాగితే హమ్యయ్య అనిపిస్తుంది. అంతెందుకు పనివాళ్ల దగ్గర నుంచి ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల వరకు అబ్బా ఓ కప్పు 'టీ' పడితే ప్రాణం సుఖంగా ఉంటుంది. హుషారుగా పనిచెయ్యొచ్చు అనుకుంటారు. చాలామంది టీ తాగితే చాలు ఆకలి తీరిపోయిందనుకుంటారు. అంతలా చాయ్‌కి అతక్కుపోయారు కొందరూ. అలాంటి టీలో ఒకప్పుడూ పాలు కలిపేవారే కాదట. మధ్యలోంచే మొదలైంది. అక్కడనుంచి టీని పాలు కలిపి తయారు చేయడం ప్రారంభించారట. అంతేగాని ముందుగా ఓన్లీ డికాషన్ తప్ప పాలు కలపేవారే కాదట. అసలెప్పుడూ అలా చేయడం ప్రారంభమైంది? ఎలా వచ్చింది? తదితరాలు గురించే ఈ కథనం. మన దేశంలో ఎవరైన వస్తే ముందుగా టీ తాగుతారా అని అడుగుతారు. ఇంట్లో ఏం లేకపోయిని జస్ట్ ఓ టీ కప్పు, కొన్ని బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి చాయ్‌లో పాలు కలపడం అనే ప్రక్రియ భారత్ నుంచి ప్రారంభం కాలేదట. మన వరకు వచ్చేటప్పటికీ.. బ్రిటీస్ వాళ్లు టీ తోటలు పెంచేంత వరకు మనకు చాయ్ గురించి తెలియనే తెలియదు. బ్రిటీష్ వాళ్లకు కూడా టీ గురించి 17వ శతాబ్దం వరకు తెలియదట. టిబెట్‌లో ప్రజలు టీ పొడితో పాలు కలిపి తయారు చేసేవారట. అలా చైనా నుంచి మంగోలియాకు టీ తయారీ విధానం విస్తరించిందట. ఇక 1800 మధ్య కాలం నుంచి బ్రిటీష్‌వారు టీ పొలాలు ఏర్పాలు చేసి దుకాణాలు పెట్టి విక్రయించేంతవరకు టీ పెట్టే అలవాటు మనకు లేనేలేదట. కాబట్టి మనకు టీలో పాలు కలపడం గురించి బ్రిటీష్ వాళ్లు అలవాటు చేసిందే గానీ ముందుగా భారత్‌లో మాత్రం లేదు. టీలో పాలు కలపడం వెనుక కారణం.. పశ్చిమ ఐరోపాలో పర్యటించేటప్పుడూ సుదీర్ఘ సముద్ర ప్రయాణాలు ఉండేవి. ఆ టైంలో కాస్త నకీల టీల బెడద ఎక్కువగా ఉండేది. దీంతో టీని ఆసక్తికరంగా రుచిగా ఉండేలా తయారు చేసే విధానాలపై దృష్టి పెట్టారు అప్పటి ప్రజలు. ఆ క్రమంలో పాలు జోడించటం జరిగింది. సాధారణ 'టీ' డికాషన్ చేదుగా ఉండటంతో పాలు జోడించి మరింత రుచిగా తాగేలా చేయడమ ప్రారంభించారు. అలానే మరో కారణం కూడా ఉంది. అదేంటంటే..యూరోపియన్ పింగాణి పాత్రలు చాలా సున్నితమైనవి, ఖరీదైనవి. దీంతో వేడివేడీ టీ పోయగానే అవి పగలిపోయేవి. కప్పులు పగలకుండా లేదా పగళ్లు రాకుండా ఉండేలా చల్లటి పాలు పోసి ఆ తర్వాత వేడివేడి టీ డికాషిన్ పోసేవారట. అలా పాలతో టీ సర్వ్ చేయడం ప్రారంభమైందట. పాలతోనే రుచిగా ఉటుందని ఎప్పుడూ తెలిసిందంటే.. టిబెటియన్లు పోషకాహారాన్ని పెంచెందుకు ఈ టీ తయారీకి పాలు జోడించారట. అలాగే బ్రిటన్ పారిశ్రామిక విప్లవం సమయంలో శ్రామిక తరగతి ప్రజలు టీలో పాటు జోడించేవారట. వారు దానిని బిల్డర్స్ టీ అని పిలిచేవారట. సుదీర్ఘ పనిదినాల్లో టీ విరామంలా దీన్ని సేవించి తిరిగి నూతన ఉత్తేజంతో పనిచేశేవారట. టీలో ఉండే టానిన్లు కారణంగా చేదుగా ఉంటుంది. పాలుతో కాకుండా నేరుగా తాగితే నోరు పొడిబారినట్లు అవుతుంది. అదే ఇలా పాలతో తీసుకుంటే టానిన్ల ప్రభావాన్ని తగ్గించి చక్కటి రుచితో బాటు కాస్త నోరు తేమగా ఉండేలా చేస్తుంది. పాలు ఉపయోగించడంతో తక్షణమే ఒంట్లోకి శక్తి వచ్చి కాస్త బలంగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అప్పటి నుంచి ఇలా పాలను టీ పోడితో జోడించి రుచిగా తయారు చేయడం ప్రారంభమైందట. అలాగే మరో కారణం కూడా చెబుతుంటారు కొందరూ. టీని పాలతో తీసుకునే అలవాటు ఫ్రెంచ్ ఉన్నత వర్గానికి చెందిన వారి నుంచి మొదలైందని కొందరి వాదన. 1685లో, ఫిలిప్ సిల్వెస్ట్రే డుఫోర్ పాలతో దగ్గు, జీర్ణ రుగ్మతలకు విరుగుడుగా ఇలా టీని తయారు చేశాడని అంటారు. కలోనియల్ బోస్టన్లోకి దిగుమతి చేసుకున్న చైనీస్ బ్లాక్ టీలు తప్పనిసరిగా పాలతో బాగా రుచిగా ఉండేవి. వారు కాంటన్ నుంచి లండన్ మీదుగా తమ సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసే సమయానికి టీ పాతబడిపోయి రుచిగా ఉండేది కాదు. దీంతో పాలు జోడించగానే రుచిగా ఉండేది. ప్రస్తుతం భారతదేశం, శ్రీలంక కెన్యాలో ప్రస్తుతం ఉత్పత్తి చేయబడిన టీలో ఎక్కువ భాగం పాలతో కలిపి తాగడానికి తయారు చేసిన టీనే ఉత్పత్తి చేస్తోంది. (చదవండి: పిల్లల్లో టాన్సిల్స్ సమస్య ఎందుకు వస్తుంది? నిజానికి ట్రాన్సిల్స్ మంచివే ఎందుకంటే..) -
కరోడ్‌పతి చాయ్‌వాలా: ఐఐ‘టీ’యన్ చాయ్ కహానీ..
దేశంలో ఉన్నత చదువులు చదివిన కొంత మంది యువత ఉద్యోగాలు దొరక్క టీ దుకాణాలు ప్రారంభించి ఉపాధి పొందడం చూస్తున్నాం. ఇలా లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ల గురించి వింటున్నాం. అయితే లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం అదీ అమెరికన్ జాబ్ మానేసి మరీ చాయ్ బిజినెస్ పెట్టిన వాళ్ల గురించి ఎప్పుడైనా విన్నారా? అమెరికాలో ఉద్యోగం చాలా మందికి కల. కానీ అది కొందరికే దక్కుతుంది. ఇంతటి క్రేజ్ ఉన్న యూఎస్ ఉద్యోగాన్ని ఎవరైనా వదులుకుంటారా? ఐఐటీయన్ నితిన్ సలూజా (Nitin Saluja) వదులుకున్నాడు. చాయోస్ (Chaayos) అనే పేరుతో టీ బిజినెస్‌ను ప్రారంభించాడు. నితిన్ సలూజా ప్రారంభించిన చాయోస్ వ్యాపారంలో మొదట్లో అనేక ఒడిదుడుకులు వచ్చాయి. కానీ నితిన్ పట్టుదల, సంకల్పంతో కంపెనీని విజయ శిఖరాగ్రానికి తీసుకెళ్లాడు. స్టార్‌బక్స్, కేఫ్ కాఫీ డే, కేఫ్ మోచా, బరిస్టా వంటి కాఫీ షాపుల ఆధిపత్యంలో ఉన్న దేశంలో చాయోస్ తనకంటూ ఒక పేరును సంపాదించుకుంది. భారతదేశంలోని ప్రముఖ చాయ్ కేఫ్‌గా మారింది. చాయ్ బిజినెస్‌ను స్థాపించి, రూ. 100 కోట్ల వ్యాపారంగా మార్చిన నితిన్ సలూజా కథను తెలుసుకుందాం. మెకానికల్ ఇంజనీర్ నితిన్ సలూజా ఐఐటీ బాంబేలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. తన చదువు పూర్తయిన తర్వాత, సలుజా అమెరికాలోని ఒక పెద్ద సంస్థలో కార్పొరేట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా చేరారు. రూ.లక్షల్లో జీతం. ఒక రోజు నితిన్, తన భార్యతో కలిసి టీ తాగుదామనుకున్నారు. కానీ కనుచూపు మేరలో టీ షాప్ కనిపించలేదు. అప్పుడే నితిన్ ఓ ఆలోచన వచ్చింది. టీ కేఫ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఉద్యోగాన్ని మానేసి ఇండియాకి తిరిగొచ్చేశాడు. టీ వ్యాపారానికి ప్రణాళికలు రూపొందించడం ప్రారంభించాడు. చాయోస్ పుట్టిందిలా.. నితిన్ అమెరికాలో ఉన్నప్పుడు టీ బూత్‌ల నుంచి టీ కొనడం సవాలుగా ఉందని గమనించాడు. టీ తాగడానికి ఒక హై-ఎండ్ టీ షాప్ ఏర్పాటు చేయగలిగితే అది అద్భుతంగా ఉంటుందని భావించాడు. భారత్‌లో రకరకాల కాఫీని అందించే కేఫ్‌లు చాలా ఉన్నాయి కానీ విభిన్న టీని అందించేవి ఏవీ లేవని గుర్తించాడు. దేశంలో ప్రత్యేకమైన టీ తాగే సంస్కృతి ఉంది. భారతీయులు అనేక రకాల టీలను తయారుచేస్తారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న నితిన్.. ఇండియాలో టీ తాగేవాళ్లకు ఉపయోగపడే టీ కేఫ్‌ను ప్రారంభించాలని భావించాడు. 2012లో తన స్నేహితుడు రాఘవ్‌తో కలిసి చాయోస్ని స్థాపించాడు. గురుగ్రామ్‌లో తమ మొదటి కేఫ్ ప్రారంభించారు. రూ. 100 కోట్ల ఆదాయం ఇంతో ఇష్టంగా చాయోస్ను ప్రారంభించిన నితిన్ కస్టమర్లకు 'మేరీ వాలీ చాయ్' అందించడం మొదలు పెట్టాడు. ప్రారంభంలో కొన్నేళ్లు మూలధనం, పెట్టుబడి సమస్యలతో మనుగడ కోసం కష్టపడ్డాడు. తానే స్వయంగా ఆర్డర్లు తీసుకోవడం, టీ తయారు చేయడం, సర్వ్ చేయడం వంటివి చేసేవాడు. ప్రతి కస్టమర్‌కూ ప్రత్యేకమైన టీని అందిస్తూ ఆకట్టుకునేవాడు. ఇలా వ్యాపారం వేగం పుంజుకుంది. అవుట్లెట్లు విస్తరించాయి. కాగా కోవిడ్ సమయంలో అన్ని వ్యాపారాల లాగే చాయోస్ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. తర్వాత 2020లో మళ్లీ పుంజుకుంది. తొలినాళ్ల కష్టాల తర్వాత నితిన్ శ్రమకు ప్రతిఫలం దక్కింది. కంపెనీ 2020లో రూ. 100 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. చివరికి ముంబై, బెంగళూరు, చండీగఢ్, పుణేలలో చాయోస్ స్టోర్లు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200కి పైగా చాయోస్ కేఫ్‌లు ఉన్నాయి. -
చాయ్, సమోసా రూ.490.. షాకవుతున్న నెటిజన్లు..!
వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరికీ టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఉదయం లేవగానే టీ తాగాల్సిందే లేదంటే ఏం తోచదు. ఇంట్లో అయినా, బయట అయినా రోజుకు నాలుగు కప్పుల టీ అయినా లాగించేస్తుంటారు. ఇక చాయ్, సమోసా ఆ కాంబినేషనే వేరు. చాలా మంది టీ తాగిన తర్వాత స్నాక్స్‌లా సమోసా తింటుంటారు. సాధారణంగా వీటి ధర కూడా ఎంతనుకున్న రూ. 50కు మించదు. అయితే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మాత్రం ధరలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ముంబై ఎయిర్‌పోర్టులో రెండు సమోసా, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేసినందుకు రూ. 499 బిల్ వేశారు.. ఈ విషయాన్ని ప్రముఖ జర్నలిస్టు ఫరా ఖాన్ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. డిసెంబర్ 28న రెండు ఫోటోలను షేర్ చేస్తూ.. ముంబై చత్రపతి శివాజి మహారాజ్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో రెండు సమోసాలు, ఒక కప్ టీ, ఒక వాటర్ బాటిల్ ధర 490’ గా పేర్కొంది. దీనికి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే క్యాప్షన్ పెట్టింది. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో 'అచ్ఛే దిన్ ఆనే వాలే హై' (మంచి రోజులు రాబోతున్నాయి' అని మోదీ చేసిన నినాదాన్ని గుర్తు చూస్తూ వ్యంగ్యంగా జర్నలిస్ట్ ఈ విధంగా క్యాప్షన్ జోడించింది. Two samosas, one chai and one water bottle for 490 Rs at Mumbai airport!! Kafi ache din aa gae hain. #Vikas pic.twitter.com/aaEkAD9pmb — Farah khan (@farah17khan) December 28, 2022 ఇందులో ఇందులో సాధారణ సైజ్ కలిగిన రెండు సమోసాలు ఒక చాయ్ కప్పు కనిపిస్తోంది. చాయ్ సమోసాపై చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిలియన్ వ్యూస్ రావడమే కాకుండా వేలల్లో లైక్‌లు వచ్చి చేరుతున్నాయి. అయితే ఈ పోస్టు చూసిన నెటిజన్లు ‘ముంబై కండివాలీ రైల్వే స్టేషన్లో 52 రూపాయలకు రెండు సమోసాలు, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ దొరుకుతుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరొకొందరు ‘ఏంటి విమానశ్రయంలో రెండు సమోసా, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ రూ.490నా’ అంటూ షాక్ అవుతున్నారు. చదవండి: ‘ముంబై మహారాష్ట్రదే.. ఎవడబ్బ సొత్తు కాదు’ -
‘టీ’ చేయటంలో గిన్నిస్ రికార్డ్.. మీరూ ప్రయత్నిస్తారా?
కేప్‌టౌన్: చాయ్ అంటే ఒక పానీయమే కాదు అది చాలా మంది జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉదయం లేవగానే కప్పు టీ లేకుండా ఉండటాన్ని ఊహించలేని స్థాయిలో దానికి ఆదరణ లభించింది. ఇంటికి ఎవరైనా బంధవులచ్చినప్పుడు ముందుగా టీ తాగుతారా? అని అడుగుతారు. క్షణాల్లోనే తీసుకొచ్చి ఇస్తుంటారు. అయితే.. అదే టీ చేసి గిన్నిస్ రికార్డ్ కొట్టేయొచ్చని మీకు తెలుసా? ఓ మహిళ చేసి చూపించారు. ఒక్క గంటలోనే ఎక్కువ కప్పుల టీ చేసి ఈ ప్రపంచ రికార్డును తన పేరు లిఖించుకున్నారు. దక్షిణాఫ్రికాలోని వుప్పెర్థల్ ప్రాంతానికి చెందిన ఇంగర్ వలెంటైన్ అనే మహిళ ఈ ఫీట్‌ను సాధించారు. స్థానికంగా లభించే ‘రూయ్‌బోస్’ అనే టీని తయారు చేయటం ద్వారా తమ దేశ పర్యటక, ట్రావెల్ రంగాలను బలోపేతం చేయాలని భావించి ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ ఛాలెంజ్‌లో ఇంగర్ వలెంటైన్ మూడు రకాల రుచులు వెన్నిల, స్ట్రాబెర్రీ, ఒరిజినల్ టీని ఉపయోగించారు. రికార్డు సాధించేందుకు గంట సమయంలో 150 కప్పుల టీని తయారు చేయాల్సి వచ్చింది. ఇందులో ఓ మెలిక సైతం ఉంది. ఒకే టీ తయారీ పాత్ర ఉపయోగించాలి, కొన్ని కప్పులు వాడాలి. దీంతో ఆమె ఓ స్ట్రాటజీని వాడి.. ఈ ఫీట్‌ను పూర్తి చేశారు. పాత్రలో ఒకేసారి నాలుగు టీ బ్యాగులు వేసి రెండు నిమిషాల పాటు వాటిని కరిగించారు. దానిని నాలుగు కప్పుల్లో పోశారు. ఆ తర్వాత మళ్లీ రిపీట్ చేశారు. ఆమెకు స్థానిక విద్యార్థులు సైతం సాయంగా నిలిచారు. చేసిన టీ చేసినట్లు తాగుతూ కప్పులు కడిగి మళ్లీ ఇంగర్‌కు అందించే వారు. ఇలా ఒక్క గంట సమయంలోనే 249 కప్పుల టీని తయారు చేయటమే కాదు.. దానిని విద్యార్థులు తాగేలా చేశారు. అంటే ఒక్క నిమిషానికి నాలుగు కప్పుల టీని తయారు చేసినట్లన్నమాట. Here's what you missed on the latest episode of Stumbo Record Breakers 👇@stumbopopssa @etv https://t.co/SnOAnSHa1E — Guinness World Records (@GWR) October 18, 2022 ఇదీ చదవండి: మోడ్రన్ కృష్ణుడు.. తన మ్యూజిక్‌తో గోవులను ఆకర్షించేస్తున్నాడు.. వీడియో వైరల్ -
మన చాయ్ పానీ ముందు..పిజ్జా, బర్గర్లు జుజుబీ అనాల్సిందే!
సంస్కృతి, సాంప్రదాయాలకు భారత్ నిదర్శనం. అలాంటి మన దేశ రుచులు ఎల్లలు దాటుతున్నాయి. పిజ్జాలు, బర్గర్లు తినే అమెరికన్లు సైతం ఆహా ఏమిరుచి తినరా మైమరిచి అంటూ మన వంటకాల్ని లొట్టలేసుకుంటూ ఆవురావురుమంటూ తింటున్నారు. తమ దేశంలోనూ స్ట్రీట్ ఫుడ్లను అందించడంలో భారత్ రెస్టారెంట్లే బాగున్నాయంటూ కొనియాడుతున్నారు. మెహెర్ వాన్ ఇరానీ భారతీయ వంటకాలన్నీ అమెరికన్లకు రుచి చూపించేందుకు 2009లో అమెరికా నార్త్ కరోలినా యాష్‌లో 'చాయ్ పానీ' పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. కేవలం 8 డాలర్ల నుంచి 17డాలర్ల మధ్య ధరలతో చాట్‌ను అందించడంతో ఆ రెస్టారెంట్‌కు భారత్, అమెరికన్లకే కాదు వివిధ దేశాలకు చెందిన ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంది. ముఖ్యంగా మనదేశంలో విరివిరిగా లభ్యమయ్యే మసాలల్ని దట్టించిన చాట్లలో షడ్రుచులు తోడవవ్వడం అమెరికాలో 1946 నుంచి సంప్రాదాయ వంటకాల్ని అందించే బ్రెన్నాన్స్ వంటి హోటల్స్ ను చాయ్ పానీ వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. ధర తక్కువ, రుచికరమైన వంటకాల్ని అందించడంతో చాయ్ పానీ ఫుడ్ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో 40 ఏళ్లలో ఎన్నుడూ చెల్లించిన విధంగా అమెరికన్లు ఆహరం కోసం ఈ ఏడాది అత్యధికంగా చెల్లిస్తున్నారు. అదే సమయంలో రీజనబుల్ ప్రైస్‌లో చాయ్ పానీ వంటకాలు లభ్యం కావడంతో అమెరికాలో బెస్ట్ రెస్టారెంట్‌గా ప్రసిద్దికెక్కింది. జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ అవార్డ్స్ సొంతం చేసుకొని ప్రథమ స్థానంలో నిలిచింది. చదవండి👉పెట్రోల్‌పై డిస్కౌంట్! యూఎస్‌లో ఆకట్టుకుంటున్న భారతీయుడు -
వైరల్ చాయ్వాలీ ప్రియాంక.. దుకాణం బంద్!
పాట్నా: నిరుద్యోగంపై ఎదురు తిరిగి.. చివరకు సొంతంగా చాయ్ దుకాణం పెట్టిన ప్రియాంక కథ.. ఇంటర్నెట్లో ఎంతో స్ఫూర్తి ఇచ్చింది. రెండేళ్ల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో సొంతంగా ఆమె టీ స్టాల్ పెట్టుకుని.. గ్రాడ్యుయేట్ చాయ్‌వాలీగా గుర్తింపు దక్కించుకుంది. అయితే ఇప్పుడామె ఆ స్టాల్‌ను మూసేసింది. ఆగండి.. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. బీహార్ పాట్నాలో ఉమెన్స్ కాలేజీ దగ్గర ఓ టీ స్టాల్ నడిపిస్తోంది ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ ప్రియాంక గుప్తా. 2019లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. కానీ, ఈ రెండేళ్లలో ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో.. ఎంబీఏ చాయ్‌వాలా ప్రఫుల్ బిలోర్(మధ్యప్రదేశ్) కథనం ఆమెకు స్ఫూర్తి ఇచ్చిందట. ఎప్పుడూ చాయ్‌వాలా కథనాలేనా? అందుకే చాయివాలీ కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈమధ్యే ఈ 24 ఏళ్ల అమ్మాయి టీ స్టాల్ ఓపెన్ చేసింది. ఇందుకు తల్లిదండ్రుల సహాకారం కూడా లభించింది. అయితే ఈ గ్రాడ్యుయేట్ చాయ్వాలీ కథనం.. ఓ వ్యక్తిని కదిలించిందట. అందుకే ప్రియాంక తన బిజినెస్‌ను విస్తరించుకునేందుకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రియాంకకు ఫుడ్ ట్రక్‌ను అందించారు. దీంతో టీ స్టాల్‌ను ఎత్తేసిన ప్రియాంక.. ఫుడ్ ట్రక్‌ను కొందరు స్టాఫ్‌తో కలిసి నడిపిస్తోంది. తక్కువ టైంలో ఎదిగిన ఆమె కథతో సోషల్ మీడియా పవరేంటో మరోసారి నిరూపితమైంది. Bihar: Priyanka Gupta, an economics graduate sets up a tea stall near Women's College in Patna I did my UG in 2019 but was unable to get a job in the last 2 yrs. I took inspiration from Prafull Billore. There are many chaiwallas, why can't there be a chaiwali?, she says pic.twitter.com/8jfgwX4vSK — ANI (@ANI) April 19, 2022 -
తందూరీ టీ.. దీని కథేంటీ.. ఎలా తయారు చేస్తారో తెలుసా..?
కొత్తపేట/రావులపాలెం(తూర్పుగోదావరి జిల్లా): బెల్లం టీ, అల్లం టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, మిరియాల టీ వంటి వివిధ రకాల టీల గురించి విన్నాం.. తాగుతున్నాం.. భిన్న రుచులను ఆస్వాదిస్తున్నాం. కానీ ఈ తందూరీ చాయ్ (టీ) ఏమిటనుకుంటున్నారా! ఇదో కొత్త రకం చాయ్.. సహజంగా అందరికీ తందూరీ అనే పదం చికెన్ వంటకాల్లో వింటాం. కోడి మాంస ప్రియులకు ఈ పదం గురించి బాగా తెలుస్తుంది. రెస్టారెంట్లలో కోడిని శుభ్రం చేసి, నిప్పులపై కాల్చి వండి తందూరీగా అందిస్తారు. మరి ఇక్కడ చాయ్‌లో తందూరీ ఏమిటనే సందేహం కలుగుతుంది కదా... చాయ్‌ను కూడా నిప్పుల పైనే తయారు చేస్తారు. దీని కథా కమామీషు ఏమిటో తెలుసుకోవాలంటే రావులపాలెం అక్షర సినిమా థియేటర్స్ సమీపాన తందూరి చాయ్ సెంటర్‌కు వెళ్లాల్సిందే. చదవండి: ఆరేసుకోబోయి పారేసుకున్న బీజేపీ నేతలు.. వీడియో వైరల్ ఇలా చేస్తున్నారు.. మట్టితో తయారు చేసిన గ్లాసులను ఎర్రగా కాల్చేందుకు ఇనుప పీపాలో కొలిమి మాదిరిగా ఏర్పాటు చేశారు. దీనిలో బొగ్గులు వేసి రోజంతా మండేలా తయారు చేశారు. ఎర్రగా బట్టీల్లో ఇటుకలా కాలుస్తుంటారు. సాధారణ టీ మాదిరిగానే పాలు, పంచదార, టీ పొడి, నీళ్లతో కలిపి తయారు చేసి దానిని జార్‌లోకి తీసుకుని కొలిమి వద్దకు తీసుకువస్తారు. కొలిమిలో ఎర్రగా కాలుతున్న మట్టి గ్లాసును బయటకు తీసి ఒక ఇత్తడిపాత్రలో ఉంచుతారు. ఎర్రటి మట్టి గ్లాసులోకి ఆ చాయ్ పోస్తారు. వెంటనే అది మట్టిపాత్ర వేడికి పొగలు చిమ్ముతూ, నురగలుగా పొంగుతుంది. అలా పొంగిన చాయ్ ఇత్తడి పాత్రలో చేరుతుంది. స్వచ్ఛమైన మట్టిలో మరిగిన చాయ్‌కు తందూరి రుచి.. వాసన వస్తుంది. ఆ పాత్ర నుంచి మళ్లీ మట్టి గ్లాసులో పోసి విక్రయిస్తున్నారు. దీనిని తాగేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. మంచి టేస్ట్ రిలాక్స్‌గా.. యాంత్రిక జీవనంలో పని ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్ కోసం చాలా మంది చాయ్ తాగుతుంటారు. ఏదైనా పనిలో ఉన్నప్పుడు చురుకుదనం, ఉత్సాహాన్ని పొందేందుకు చాలా మందికి చాయ్‌ని ఆస్వాదించడం అలవాటు. ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల చాయ్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్ని ఆరోగ్యపరంగా తయారు చేస్తుంటే, కొన్ని రుచి కోసమే తయారు చేస్తున్నారు. ఫిల్టర్ టీ, కాంటినెంటల్ టీ, స్ట్రాంట్ టీ, ధమ్ టీ పేర్లతో రకరకాలుగా అందిస్తున్నారు. రావులపాలెంలో యువకులు కొత్తగా ఆలోచించి ఉత్తరాది తందూరి చాయ్‌ను ఇక్కడ తయారుచేస్తూ స్థానికులను, టీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నారు. ఇదేవిధంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా కొందరు తందూరీ చాయ్ తయారు చేస్తూ టీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నారు. -
Pink Cafe: చాయ్‌తోపాటు.. మీ సమస్యలకు పరిష్కారం కూడా..
‘చాయ్ చాయ్ కోసమే కాదు...సామాజిక విశ్లేషణకు కూడా’ అనడానికి సజీవ సాక్ష్యం ఈ పింక్ కేఫ్. హరియాణాలోని రోహ్తక్ నగరానికి చెందిన కాలేజీ అమ్మాయిలు, గృహిణులు ‘పింక్ కేఫ్’ ప్రారంభించారు. దీని వెనుక ‘పథ్ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ చొరవ ఉంది. స్థూలంగా చెప్పాలంటే...ఇది మహిళల కోసం మహిళల చేత ఏర్పడిన కేఫ్. ఈ కేఫ్‌లో వేడి వేడి చాయ్ తాగుతూ హాట్ టాపిక్ల గురించి చర్చించుకోవచ్చు. భావాలను పరస్పరం పంచుకోవచ్చు. తమ బాధలకు పరిష్కార మార్గం వెదుక్కోవచ్చు. ‘గతంలో ఏదైనా సమస్య వస్తే నాలో నేను కుమిలిపోయేదాన్ని. దీంతో బాధ మరింత పెరిగేది. పింక్‌కేఫ్ పరిచయమయ్యాక వయసుతో నిమిత్తం లేకుండా ఎంతోమంది పరిచయమయ్యారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పింక్కేఫ్కు వస్తేచాలు ఆ సమస్యకు అద్భుతమైన పరిష్కారం దొరికుతుంది’ అంటుంది నీలిమ అనే అమ్మాయి. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! ఒకే కేఫ్ ఒక్కోరోజు ఒక్కో వేదికలా మారుతుంది. ఒకరోజు మహిళా రచయిత్రులు, కవయిత్రులు, సంగీతకారులు తమలోని సృజనను ఆవిష్కరించుకునే వేదిక అవుతుంది. ఒక రోజు ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు చూపే కౌన్సెలింగ్ సెంటర్ అవుతుంది. ఒకరోజు...పేద మహిళలకు ఉపాధి మార్గాలను సూచించే వేదిక అవుతుంది. హక్కులు, ఆరోగ్యం, అనుభవాలు, పరిష్కారాలు... ఒక్క మాటలో చెప్పాలంటే మహిళలకు ఈ పింక్‌కేఫ్ ఒక చుక్కాని. ఔత్సాహిక కళాకారులకు భుజం తట్టే వేదిక. ఉదా: రంజనికి కవిత్వమంటే ఇష్టం. తాను రాసిన కవిత్వాన్ని పుస్తకంగా వేసుకోవాలనేది ఆమె కల. అయితే తనకు అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో కల కలగానే ఉండిపోయింది. ‘పింక్ కేఫ్’ పరిచయమ య్యాక... ఒకరోజు తన కవితలను అక్కడ వినిపించింది. అవి నచ్చిన ముగ్గురు కలిసి కవిత్వాన్ని ప్రచురించారు. ఆ పుస్తకం చూసి రంజని ఎంతగానో మురిసిపోయింది. ‘ఈ కేఫ్ మొదలు పెట్టినప్పుడు కాలక్షేపం కబుర్లకు తప్ప ఎందుకు అన్నవాళ్లు... ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకొని వేనోళ్ల పొగుడుతున్నారు. ఇది చాలు పింక్‌కేఫ్ విజయం గురించి చెప్పడానికి’ అంటుంది పింక్ కేఫ్ మొదలు కావడానికి కష్టపడిన మహిళల్లో ఒకరైన సునీత. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
వేడి వేడి బటర్ చాయ్.. నిర్వాహకుడిపై వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ: పొద్దున్నే ఒక కప్పు చాయ్, కాఫీ కడుపులో పడితేగాని ఆ రోజు రోజులా ఉండదు. లేవగానే గరం గరం చాయ్ తాగిన తర్వాతే ఏ పని అయిన మొదలు పెడతాం. అయితే ఉదయాన్నే తీసుకునే ఈ టీని ప్రజలంతా రకరకాలుగా తయరు చేసుకుంటారు. అల్లం టీ, లెమన్ టీ, మసాలా టీ, ఇలా కొన్ని రకాలుంటాయి. అయితే ఎప్పుడైన బటర్ చాయ్ తాగారా. ఆ రకం చాయ్ ఉంటుందని కనీసం ఊహించారా? అయితే ఓసారి చూడండి మరి. ఆగ్రాలోని ఓ టీ నిర్వహకుడు మరుగుతున్న టీలో బటర్ కట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఇప్పటికి వరకు 2.5 లక్షలకు పైగా వ్యూస్ రాగా వేడి వేడి బటర్ టీ అందిస్తున్న టీ స్టాల్ నిర్వహకుడిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. (చదవండి: వేడి వేడి బటర్ చాయ్.. నిర్వహకుడిపై వ్యంగ్యాస్త్రాలు) ఆగ్రాలో బాబా స్టాల్ షాపు నిర్వహకుడు వెరైటీగా ఆలోచించాడు. ఇందుకోసం మరుగుతున్న టీలో బటర్ ముక్కలుగా కట్ చేసి వేశాడు. బటర్ కరిగాక ఆ చాయ్‌ని వడపోపి పెట్టాడు. ఈ వీడియోను ఫుడ్డీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు ‘చాయ్‌లో వెన్న వేయడం ఏంట్రా బాబు’ అంటూ తల పట్టుకుంటుండగా మరికొందరూ వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారు. ‘టీలో బటర్‌తో పాటు సాస్, మయోన్నైస్ కూడా కాస్తా వేయ్’, ‘కొంచం పావ్ బాజీ కూడా వేయండి’ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: కొడుకుతో పెళ్లి.. బిడ్డకు జన్మనిచ్చిన సెలబ్రిటీ) View this post on Instagram A post shared by FOODIEAGRA (@foodieagraaaaa) -
కేఫ్.. ఎలా సేఫ్!
సాక్షి, హైదరాబాద్: నలుగురు ఓ చోట చేరితే కరోనా (కోవిడ్-19) వైరస్ ప్రబలే ప్రమాదం ఉన్నందున వీలైనంత మేరకు గుమికూడే పరిస్థితి లేకుండా చూడాలని ప్రభుత్వం వెల్లడించింది. అన్నీ బంద్ చేయించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు జనానికి ఆహ్వానం పలికే కేఫ్‌లు మాత్రం ఇప్పుడూ అదే పంథాను అనుసరిస్తూ బెదరగొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తప్ప మిగతా చోట్ల ఇప్పటికీ అవి కిటకిటలాడుతూనే ఉన్నాయి. సమోసాలు తింటూ చాయ్ బిస్కెట్లు లాగించే వారితో కేఫ్‌లు నిండుగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పాతనగరం పరిధిలో పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. (హైదరాబాద్ : కరోనా భయంతో సిటీజనుల్లో అలజడి) ఓ వైపు కరోనా వైరస్ భయపెడుతుండటంతో వీలైనంత వరకు జనసమూహం లేకుండా చేయటం ద్వారా వైరస్ మన ప్రాంతంలో విస్తరించకుండా చూడాలన్న తాపత్రయం కనిపిస్తుండగా, కేఫ్‌ల నిర్వాహకులు మాత్రం దాన్ని పట్టించుకుంటున్నట్టు కనిపించటం లేదు. చాలావాటిని మూసేయించిన సర్కారు జనం సరుకులు కొనేందుకు వీలుగా మాల్స్, ఇతర దుకాణాలకు మాత్రం అనుమతించింది. ఇవి నిత్యావసరాలకు సంబంధించినవి కావటంతో వాటిని మూసివేయించటం సరికాదని ప్రభుత్వం భావించింది. కానీ ఏ రకంగానూ అత్యవసరం, నిత్యావసరం జాబితాలోకి రానప్పటికీ కేఫ్‌లు మాత్రం యథాప్రకారం తెరిచే ఉంటున్నాయి. హైదరాబాద్ నగరంలో దాదాపు 23 వేల వరకు కేఫ్‌లున్నాయి. ఇవన్నీ ఇప్పుడు కోవిడ్ భయం ఇసుమంతైనా లేకుండా దర్జాగా జనంతో కళకళలాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం గతంతో పోలిస్తే రద్దీ తగ్గినా, చాలా ప్రాంతాల్లో ఎప్పటిలాగేనే కేఫ్‌లు కిటకిటలాడుతున్నాయి. (కనికా కపూర్‌కు కరోనా) ఇవి ప్రమాదకరం కావా... 1. గ్లాసులు శుభ్రం చేస్తారా.. కొన్ని పెద్ద కేఫ్‌లలో ఎప్పుడు చూసినా వందమందికి తగ్గకుండా కనిపిస్తారు. చిన్నవాటిల్లో ఆ సంఖ్య పది నుంచి 20 మంది వరకు ఉంటుంది. కేఫ్ అనగానే ముందుగా కనిపించేది చాయ్. నిత్యం వందల కప్పుల చాయ్ ఖర్చవుతుంటుంది. చాయ్‌కి ముందుగా వేళ్లు నీటిలో మునిగేలా బాయ్ మంచినీటి గ్లాసులు తెచ్చిపెడతాడు. ఈ గ్లాసులను సరిగా శుభ్రం చేయరన్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితిలో ఇది ప్రమాదంగా పరిణమిస్తుందన్న భయం వ్యక్తమవుతోంది. 2. ఆ వదిలేసిన బిస్కెట్లు, సమోసాలే కేఫ్‌లలో బిస్కెట్లు, సమోసాలు అనగానే ప్లేట్లో కొన్నింటిని తెచ్చి పెడతారు. అందులో మనం తినగా మిగిలిన వాటిని తిరిగి తీసుకెళ్లి ఇతరులకు అందిస్తారు. చిన్న నిర్లక్ష్యం ఉన్నా వైరస్ విస్తరించే తరుణంలో ఇది ప్రమాదకరమే కదా..! 3. ఒకరికొకరు తగిలేలా.. ఒక టేబుల్ చుట్టూ నలుగురైదుగురు కూ ర్చుంటారు. ఎక్కువగా వారంతా ఒకరినొకరు తగిలేలా కూర్చుంటారు. ఇది ప్రస్తుత పరిస్థితిలో ప్రమాదకరం. 4. ఒక సిగరెట్.. ముగ్గురు మిత్రులు.. ఒక సిగరెట్ వెలిగించి సరదాగా దాన్ని ఇద్దరు ముగ్గురు మిత్రులు కాల్చే పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఇందుకు ఎక్కువగా కేఫ్‌లే వేదికవుతాయి. చాయ్ తాగి ఓ సిగరెట్ వెలిగించి తలో రెండు పఫ్‌లు లాగించి వెళ్లిపోతుంటారు. ఈ ఎంగిలి కూడా ప్రమాదకరమే. కేఫ్‌లో పోగయ్యే అవకాశం లేకుంటే ఇది కూడా కొంతమేర తగ్గుతుంది. -
అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో మట్టికప్పుల్లోనే చాయ్!
న్యూఢిల్లీ: ఇకపై ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్ డిపోల వద్ద ఉన్న స్టాళ్లు, ఎయిర్‌పోర్టులు, మాల్స్‌లో మట్టి కప్పుల్లో చాయ్‌ని ఆస్వాదించవచ్చు. ఈమేరకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ.. రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం వారణాసి, రాయ్‌బరేలీ రెండు రైల్వే స్టేషన్లలో మాత్రమే కేటరర్లు ఈ మట్టి కప్పుల్లో చాయ్‌ను అందిస్తున్నారు. ‘సుమారు 100 రైల్వే స్టేషన్లలో, ఎయిర్‌పోర్టులు, రాష్ట్రాల్లోని బస్ డిపోల వద్ద ఉన్న టీ స్టాళ్లలో మట్టి కప్పుల్లోనే చాయ్‌ను అందించడాన్ని తప్పనిసరి చేయాలని గోయల్‌కు లేఖ రాశాను. దీంతో స్థానిక తయారీదారులకు మార్కెట్ లభించడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించే పేపర్, ప్లాస్టిక్‌ల వాడకాన్ని నిషేధించినట్లవుతుందని వివరించారు. -
చక్కెర చాయ్‌తో క్యాన్సర్!
న్యూఢిల్లీ : చిక్కటి చక్కెర చాయ్ తాగితే నీరసంగా ఉన్న శరీరానికి అనుకోని బలం హఠాత్తుగా వచ్చినట్లు ఉంటుంది. గ్లాసుడు పళ్ల రసం పుచ్చుకున్న నిస్సత్తువ శరీరానికి ఎక్కడిలేని శక్తి వచ్చినట్లు ఉంటుంది. అయితే ఈ రెండింటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు భారీగా పెరుగుతాయని శాస్త్రవేత్తలు తాజాగా ఓ అధ్యయనం తేల్చారు. 100 మిల్లీ లీటర్ల స్వచ్ఛమైన పళ్ల రసం రోజు పుచ్చుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం 12 శాతం పెరుగుతుందని దాదాపు లక్ష మంది ప్రజలు ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేసిన ఫ్రాన్స్ వైద్యులు తెలిపారు. ఇక అంతే మొత్తంలో కార్డియల్, ఫిజ్జీ పాప్లు తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశం 19 శాతం పెరుగుతాయని వారు చెప్పారు. రెండు టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకొని రోజుకు ఒక్క కప్పు టీ తాగినా అంతే ప్రమాదమట. కోక కోలా డ్రింక్ కన్నా కప్పు ఛాయ్ ప్రమాదమట. చక్కెర కలవడం వల్లనే ఈ పానీయాలన్నీ క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతున్నాయని అధ్యయనకారులు అభిప్రాయపడ్డారు. వయస్సును బట్టి చక్కెర పాళ్లను పరిమితం చేస్తే పెద్ద ప్రమాదమేమీ లేదని వారే చెబుతున్నారు. బ్రిటన్ పిల్లలు మోతాదుకు మించి చక్కెర తీసుకుంటున్నారని ‘పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్’ ఆందోళన చెందుతోంది. పిల్లలు, టీనేజర్లు కూల్ డ్రింకులను ఎక్కువగా తీసుకుంటున్నారని, వాటిల్లోనే క్యాన్సర్‌కు దారితీసే చక్కెర శాతం ఎక్కువ ఉంటుందని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. బాటిళ్లలో దొరకి పళ్ల రసాల్లో కూడా చక్కెర కలుపుతారుకనుక సాధారణ పళ్ల రసాల కన్నా అవి మరింత ప్రమాదకారకాలని వారంటున్నారు. క్యాన్సర్ మరణాలను తగ్గించాలంటే అన్ని డ్రింకుల్లో చక్కెర పాళ్లను నియంత్రించాల్సిన అవసరం ఎంతైన ఉందని అధ్యయనకారులు ఫ్రెంచ్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. పారిస్‌లోని సార్బోన్, ఫ్రెంచ్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ నిపుణులు సంయుక్తంగా ఈ తాజా అధ్యయనం జరిపారు. -
ఛాయ్ బిజినెస్‌తో మిలీనియర్ అయ్యింది
న్యూఢిల్లీ : ఛాయ్ బిజినెస్ ఓ అమెరికన్ మహిళను లక్షాధికారి చేసింది. అదీ కూడా రుచికరమైన భారతీయ టీ. కొలరాడోకు చెందిన బ్రూక్ ఎడ్డీ అనే అమెరికన్ మహిళ 2002లో భారత్‌ను సందర్శించింది. అనంతరం ఆమె 2006తో తిరిగి తన స్వదేశం అమెరికా వెళ్లిపోయింది. కానీ కొలరాడోలో కేఫ్‌ల్లో ఎక్కడ కూడా.. ఆమెకు అచ్చం భారత్‌లో దొరికిన మాదిరి రుచికరమైన టీ లభించలేదు. దీంతో ఆమెనే భారత భక్తి ఆదర్శాలతో ఓ ఛాయ్ వ్యాపారం చేపట్టాలని నిర్ణయించింది. అనుకున్నదే తడువుగా వెంటనే 2007లో భక్తి ఛాయ్ పేరుతో ఛాయ్ వ్యాపారం ప్రారంభించేసింది. ఈ ఛాయ్ వ్యాపారమే ఇప్పుడు ఏడు మిలియన్ డాలర్ల రెవెన్యూ కంపెనీగా అవతరించింది. ఈ ఛాయ్‌కి రుచిమరిగిన అమెరికన్లు, ఆ కంపెనీ టీ తాగకుండా ఉండలేకపోతున్నారు. బ్రూక్ ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. రోజురోజుకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెద్ద ఎత్తున్న చేకూరుతోంది. అమెరికన్ వీక్లీ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 2002లో భారత్ సందర్శించినప్పుడు తాను తాగిన టీ ఎంతో ఇష్టమని బ్రూక్‌చెప్పింది. ప్రతీసారి తాను ఏదో ఒక కొత్తదాన్ని ప్రవేశపెడుతుంటానని, ఇది కూడా అలాంటిదేనని పేర్కొంది. ఈ ఛాయ్ వ్యాపారం ప్రారంభించిన ఏడాది తర్వాత భక్తి ఛాయ్ తన తొలి వెబ్సైట్ కూడా లాంచ్ చేసింది. అలా తన వ్యాపారాలను వృద్ధి చేసుకుంటూ వచ్చింది. బ్రూక్ ప్రస్తుతం ఇద్దరు కవలలకు, సింగిల్ మదర్. ఫుల్-టైమ్ జాబ్‌కు గుడ్‌బై చెప్పి మరీ బ్రూక్ ఈ ఛాయ్ వ్యాపారంతో సామాజికంగా, పర్యావరణంగా మార్పు తీసుకొస్తోంది. 2014లో బ్రూక్ ఎడ్డీ, ఎంటర్‌ప్రిన్యూర్ మేగజైన్స్ ‘ఎంటర్‌ప్రిన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులో టాప్-5 ఫైనలిస్ట్. -
చాయ్, పకోడా మాటలు అందుకే..
సాక్షి, లక్నో : మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చాయ్, పకోడాలను తెరపైకి తెస్తున్నదని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. అభివృద్ధిపై చర్చ జరగడం ఇష్టం లేని కేంద్ర, రాష్ర్ట బీజేపీ ప్రభుత్వాలు చాయ్, పకోడా అంటూ ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని అన్నారు. గోరఖ్‌పూర్ లోక్‌సభ బైపోల్స్‌లో జాతికి మెరుగైన సందేశాన్ని పంపాలని ఆయన ఓటర్లను కోరారు. యూపీ సీఎంగా ఎన్నికైన అనంతరం యోగి ఆదిత్యానాథ్ గోరఖ్‌పూర్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. గోరఖ్‌పూర్ నుంచి యోగి ఆదిత్యానాథ్ వరుసగా అయిదుసార్లు ఎంపీగా గెలుపొందారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిపై యోగి పలుమార్లు విజయం సాధించడంతో అక్కడ బీజేపీ, ఎస్పీ మధ్యే గట్టిపోటీ నెలకొంది. కాంగ్రెస్ ఇప్పటికే ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థిని ప్రకటించింది. ఇక డిప్యూటీ సీఎంగా ఎన్నికైన కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రాతినిథ్యం వహిస్తున్న పూల్పూర్ పార్లమెంట్ స్ధానానికీ ఉప ఎన్నికలు జరగనుఆన్నయి. ఇక్కడ నుంచి మనీష్ మిశ్రాను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. -
మోదీవాలా
మోదీజీ ఫీల్డ్‌లోకి రాక ముందే మనకో సెలబ్రిటీ ‘చాయ్‌వాలా’ ఉన్నాడు! చాయ్‌వాలా అంటే చాయ్‌వాలా కాదు. చాయ్వాలాల్ని పైకెత్తిన సినీవాలా.. మన చిరంజీవి! ‘యే.. చాయ్, చటుక్కునా తాగరా భాయ్’ అని చిరు డాన్స్ చేసిన ‘మృగరాజు’ మూవీ 2012లో రిలీజ్ అయింది. ‘ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్’ అని కూడా అందులో చిరు పాడారు. చాయ్ చేసిన ఓ చమక్కు.. మోదీజీ మన ప్రధాని కావడం! మృగరాజుతో ఒక్క ఆంధ్రాలోనే (అప్పటికింకా తెలంగాణ రాలేదు) చాయ్ ఫేమస్ అయితే, 2014లో మోదీరాజు రాకతో అన్నీ రాష్ట్రాల్లోనూ చాయ్ సెలబ్రిటీ అయింది. చాయ్ తాగేవాళ్లూ సెలబ్రిటీలు అయ్యారు. హార్డ్‌వర్క్‌కి, మంచి ఆడ్మినిస్ట్రేషన్కీ, మాటకారితనానికీ చాయ్ ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్! ‘నేనూ ఒకప్పుడు చాయ్‌వాలానే’ అని మోదీ చెప్పాకా, చాయ్వాలాలందరికీ పీయెంకి వచ్చినంత ఫేమ్ వచ్చేసింది. విషయం ఏంటంటే.. హైదారాబాద్ అంటే బిర్యానీ అన్నట్లు, ఇండియా అంటే ‘చాయ్’ అనే పేరొచ్చేసిందని తాజా సమాచారం. -
చాయ్ డబ్బా తలకిందులు!
సాక్షి, హైదరాబాద్: ‘‘పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులకు కడక్ చాయ్ ఇచ్చా.. వారిని వదిలే ప్రసక్తే లేదు..’’ ప్రధాని మోదీ అన్న మాటలివీ! కుబేరుల సంగతేమోగానీ పెద్దనోట్ల రద్దుతో చాయ్‌వాలాల పరిస్థితి మాత్రం తలకిందులవుతోంది!! బతుకుబండిని నడిపించే చాయ్ డబ్బా పట్టాలు తప్పుతోంది. దశాబ్దాలుగా నడుపుకొంటూ వస్తున్న చాయ్ దుకాణాలు వారం రోజుల్లోనే చతికిల పడ్డారుు. మహానగరం హైదరాబాద్‌లో ఇలా చాయ్ డబ్బాలు పెట్టుకొని పొట్టబోసుకునేవారెందరో అష్టకష్టాలు పడుతున్నారు. అందులో యాదగిరి ఒకరు. పెద్దనోట్ల రద్దుతో ఆయన దయనీయ పరిస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. నాలుగు దశాబ్దాల ప్రస్థానం.. త్యాగరాయగాన సభ మీదుగా చిక్కడపల్లి నుంచి అశోక్‌నగర్‌కు వెళ్లే మార్గంలో నగర కేంద్ర గ్రంథాలయానికి ఎదురుగా ఉంటుంది యాదగిరి చాయ్ డబ్బా. నలభై ఏళ్లుగా యాదగిరి అక్కడే చాయ్ దుకాణం నడిపిస్తున్నాడు. అప్పట్లో చిక్కడపల్లి ఏ మాత్రం జనసంచారం లేని అతి సాదాసీదా ప్రాంతం. అక్కడొకటి, ఇక్కడొకటి విసిరేసినట్లుగా ఉండే ఇళ్లు, లైబ్రరీ మాత్రమే ఉండేవి. ఆ రోజుల్లో పత్రికలు, నవలలు, కథలు చదివే పాఠకులు చాలా తక్కువ సంఖ్యలో వచ్చేవారు. అలా వచ్చేవారికి కట్ల అబ్బయ్య చాయ్ డబ్బా బాగా పరిచయం. యాదగిరి తండ్రే అబ్బయ్య. తొలినాళ్లలో అబ్బయ్య చాయ్ దుకాణం నడిపించినా ఆ తర్వాత క్రమంగా దాని బాధ్యత యాదగిరిపైనే పడింది. ‘‘పది పైసలు, పదిహేను పైసలు ఉన్నప్పట్నుంచి చాయ్ అమ్ముతున్నం. మా నారుున తర్వాత నేను చాయ్ దుకాణానికి ఎక్కిన తర్వాత చారాణా అరుుంది. అట్లా అట్లా పెంచుకుంటా ఇప్పడు ఆరు రూపాయాల దాకా వచ్చినం’’ అని అన్నాడు యాదగిరి. క్రమంగా చిక్కడపల్లి-అశోక్‌నగర్ మార్గం జనసమ్మర్ధంతో నిండడంతో యాదగిరి కుటుంబం మొత్తం ఈ చాయ్ దుకాణం పైనే ఆధారపడే స్థారుుకి చేరుకుంది. చిల్లర కోసం తలోదిక్కు.. పిడుగుపాటులా వచ్చి పడ్డ నోట్ల కష్టం ఇప్పుడు యాదగిరి కుటుంబానికి పెద్ద కష్టాలనే తెచ్చిపెట్టింది. మొన్నటి వరకు రోజుకు 20 లీటర్ల పాలు ఖర్చయ్యేవి. వెరుు్యకి పైగా చాయ్‌లు అమ్మేవాళ్లు. ఉదయం నుంచి రాత్రి వరకు యాదగిరి, అతని కొడుకులు కలిసి పనిని పంచుకొనేవాళ్లు. ముషీరాబాద్‌లోని ఇంటి దగ్గర నుంచి తెల్లవారు జామున 4 గంటలకు బయల్దేరి బండి దగ్గరకు వస్తే రాత్రి 10 తర్వాత ఇంటికి వెళ్లేవాళ్లు. కానీ వారం రోజుల నుంచి పరిస్థితి మారింది. ఉదయాన్నే తలా ఒక దిక్కు బ్యాంకులకు, ఏటీఎం సెంటర్లకు పరుగెత్తుతున్నారు. నోట్లు మార్చుకొనేందుకు మధ్యాహ్నం వరకు బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. అరుునా వంద నోట్లు లభించడం లేదు. చిల్లర కొరత భయానకంగా మారింది. ఆ సమయంలో యాదగిరి బండి దగ్గరే ఉండి గిరాకీ చూసుకుంటున్నాడు. చేతిలో చిల్లర లేకపోవడంతో ఉద్దెర బేరానికి తలొగ్గాల్సి వస్తుంది. లేదంటే గిరాకీ వదులుకోవలసి వస్తుంది. ‘‘గిరాకీ బాగా ఉన్న రోజుల్లో ఖర్చులన్నీ పోను రోజుకు రూ.1000 నుంచి రూ.500 ఆదాయం లభించేది. ఇప్పుడు రూ.500 కూడా రావడం లేదు. 20 లీటర్ల పాలు అమ్మిన చోట 10 లీటర్లు కూడా అమ్మలేకపోతున్నాం. పరిస్థితి పూర్తిగా మారింది. వెరుు్య చాయ్‌లు అమ్మిన చోట ఇప్పుడు రెండు, మూడు వందలు కూడా అమ్మలేకపోతున్నాం’’ అంటూ యాదగిరి ఆవేదన వ్యక్తం చేశాడు. ‘పెద్ద’ దెబ్బ... యాదగిరి, ఆయన తల్లి, ఆయన భార్య, కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు అంతా కలిపి 15 మందికి ఆ చాయ్ డబ్బాయే ఆధారం. ఆయన భార్య రాజ్యలక్ష్మి కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతోంది. ఇప్పటికే రూ.6 లక్షలు ఖర్చయ్యారుు. తరచుగా ఆసుపత్రికి వెళ్లాలి. రూ.వేలల్లో ఖర్చు. రేషన్, నిత్యాసవరాలు తడిచి మోపెడవుతున్నారుు. ‘‘ఇప్పటి వరకు చాయ్ దుకాణాంపైనే ఆధారపడి అన్ని కష్టాలను గట్టెక్కుతూ వచ్చినం. పరిస్థితి ఇట్లాగే ఉంటే ఏం చేయాల్నో అర్థమైతలేదు. వెనుకటికి ముషీరాబాద్ మహాత్మానగర్ల 50 గజాల ఇంటిస్థలం సంపాదించి పోరుుండు మా నారుున. ఇంటి కిరారుు బాధలు లేవు కానీ. మిగతా ఖర్చులన్నీ భారీగానే ఉన్నారుు’’ అని యాదగిరి చెప్పాడు. ఇలాంటి ఎంతో మంది చాయ్వాలాలు ఇప్పుడు ఆ ‘చాయ్‌వాలా’ సృష్టించి న బాధల సుడిగుండాల్లో చిక్కుకున్నారు. నేనెక్కడికి పోవాలే? ‘‘యాదగిరి చాయ్ డబ్బా అంటే ఈ రాస్తాల అందరికీ తెలుసు. కానీ ఏం లాభం? జేబుల చిల్లర పైసలు లేవని చాలామంది చాయ్ తాగడానికి వస్తలేరు. ఉద్దెర గిరాకీ పెరిగింది. చాయ్‌కి రూ.500 నోటు ఇస్దే దాన్ని తీసుకొని నేనెక్కడికి పోవాలే? అరుునా రాత్రనకా, పగలనకా నా కొడుకులూ, నేను అటు బ్యాంకులకు. ఇటు ఏటీఎం సెంటర్లకు పరుగెత్తుతూనే ఉన్నం. ఎక్కడికి పోరుునా వంద నోట్లు దొరుకుడు కష్టంగానే ఉంది’ - చాయ్‌వాలా యాదగిరి ఆవేదన ఇది.