వారిరువురూ అన్నదమ్మలు.. ఒకరు చదువు కోసం..మరొకరు ఉపాధి కోసం నగరానికి వచ్చారు.. అందరిలా కాకుండా తమ కాళ్లపై తాము నిలబడాలనుకున్నారు.. అనుకున్నదే తడవుగా తమ వద్ద ఉన్న కొద్ది మొత్తంతో ఓ టీ దుకాణాన్ని పెట్టారు.. అదే చాయ్ జీపీటీ..
అంతటితో ఆగకుండా.. తమ స్టాల్‌లో లభ్యమయ్యే ఫ్లేవర్‌తో టీ పౌడర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయాలనుకుంటున్నారు.. అసలీ ఆలోచన ఎలా వచ్చింది? దీని వెనుక కథేంటి? తులుసుకుందాం..!
శ్రీనగర్‌కాలనీ: సరికొత్త ఆలోచనతో ఓ ఇద్దరు అన్నదమ్ములు నగరంలోని యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. జిహ్వకో రుచి.. పుర్రెకో ఆలోచన అన్నట్లు.. వెరైటీగా ఆలోచించారు. అందరిలా ఉద్యోగాలు కాకుండా.. వ్యాపారంలో రాణించాలని భావించారు.. తమ వ్యాపారాన్ని విస్తరించడానికి మార్కెట్‌లో ఓ కొత్త టీ ప్రొడక్ట్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే తెలుగు టీ రుచులను వినియోగదారులకు పరిచయం చేస్తామని ధీమాగా చెబుతున్నారు.
టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న చాట్ జీపీటీ నేడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం జనాల బుర్రల్లో తిరుగుతున్న పేరునే తమ కంపెనీ పేరుగా మలుచుకున్నారు.. ఓ టెక్నాలజీ పేరైన చాట్ జీపీటీని తలపిస్తూ చాయ్ జీపీటీతో ఓ చాయ్ దుకాణాన్ని నగరంలోని మధురానగర్‌లో గత సంవత్సరం ప్రారంభించారు ఈ ఇద్దరు అన్నదమ్ములు రోహిత్, కిరణ్ దుమ్ము. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ ఇద్దరూ చదువు నిమిత్తం నగరానికి వచ్చారు. రోహిత్ విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కిరణ్ డిగ్రీ చదువుతున్నాడు. ఉద్యోగాలు కాకుండా తమ సొంత కాళ్ళపై నిలబడాలన్న తపనలో చాయ్ జీపీటీ పేరిట చాయ్ స్టోర్‌ని ప్రారంభించారు. చాయ్‌లో ఏఐని తీసుకొని ఏఐ(అడ్రక్–ఇలాచి), జీపీటీని( జెన్యూన్లీ ప్యూర్ టీ)గా మలిచారీ అన్నదమ్ములు.
ఆయుర్వేద మూలికలతో..
తెలుగు టీలలో ఎక్కువగా ఇలాచి, అడ్రక్‌లను ఆయుర్వేద మూలికగా ఆరోగ్యానికి ఉపయోగిస్తారు. మనం రోజువారీ విధానంతో పాటు చలికాలంలో ఎక్కువగా అల్లం, యాలుకల టీని తీసుకుంటాం. నిజానికి వీటిలో చాలా ఔషధగుణాలున్నాయి. వీటిని టీలో తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. అందుకే టీలలో వీటికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ మన తెలుగుదనాన్ని ఉట్టిపడేలా టీని తయారుచేస్తున్నాం. మార్కెట్‌లో ఉండే వాటికంటే భిన్నంగా మా టీ ఉత్పత్తి ఉండేలా సన్నాహాలు చేస్తున్నాం. మన రుచిని మిస్ అవ్వకుండా టీ పౌడర్‌లో కలపి చాయ్ జీపీటీ ప్రాడెక్ట్ చిన్న ప్యాకెట్లతో పాటు పెద్ద ప్యాకెట్లలో మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో అన్ని పర్మిషన్స్ తీసుకొని వినియోగదారుల ముందుకొస్తామని, అయితే తమకు ఇన్వెస్టర్స్ తోడైతే మరింత తోడ్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదువు, ఉద్యోగం కోసం ఓ మారుమూల ప్రాంతం నుంచి నగరానికి వచి్చ.. సరికొత్త ఆలోచనతో చాయ్ జీపీటీ ప్రాడక్ట్‌ను మార్కెట్‌లో తీసుకురావాలన్న ఆలోచన చేసిన ఈ ఇద్దరి అన్నదమ్ముల కృషి యువతకు ఆదర్శనంగా నిలుస్తుంది.
తెలుగురుచికి తగ్గట్టుగా..
నేను డిగ్రీ చదువుతున్నాను. అన్నయ్య రోహిత్ బాటలో నడవాలన్నది నా ఆకాంక్ష. ఇప్పుడిప్పుడే స్టోర్ బాగా నడుస్తోంది. అల్లం, యాలుకలు మన ఆయుర్వేద ఔషధ మూలికలకు మన దైనందిన జీవితంలో ప్రత్యేకస్థానం ఉంది. వీటిని చాయ్ జీపీటీలో కలిపి మన తెలుగురుచికి తగ్గట్టుగా అసలు సిసలైన టీని అందించాలన్నది మా లక్ష్యం. అన్నయ్యతో కలిసి సాధిస్తాం.
– కిరణ్, డిగ్రీ విద్యార్థి, చాయ్ జీపీటీ నిర్వాహకుడు
మరింత మందికి ఉపాధి..
ఉపాధిలో మనకున్న ప్రతిభతో అక్కడ రాణిస్తాం. కానీ వ్యాపారంలో మన ఆలోచనలు, సృజనాత్మకతను జోడించి మరికొంతమందికి ఉపాధిని అందిస్తాం. అందుకే ఉద్యోగం కన్నా వ్యాపారమే చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. మా దగ్గర ఉన్న పెట్టుబడితో టీ స్టోర్‌ని ఏర్పాటుచేశాం. కానీ మా లక్ష్యం మన తెలుగుదనం ఉట్టిపడేలా చాయ్ జీపీటీ టీ పౌడర్ బ్రాండ్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చి మన సత్తాచాటడమే. దానికి అనుగుణంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.
– రోహిత్, సాఫ్ట్వేర్ ఉద్యోగి. చాయ్ జీపీటీ నిర్వాహకుడు
Comments
Please login to add a commentAdd a comment