లైఫ్ ఈజ్ బ్యూ'టీ'ఫుల్ & కలర్‌ఫుల్ | Life Is Beautiful & Colorful | Sakshi
Sakshi News home page

లైఫ్ ఈజ్ బ్యూ'టీ'ఫుల్ & కలర్‌ఫుల్

Published Mon, Sep 19 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

లైఫ్ ఈజ్ బ్యూ'టీ'ఫుల్ & కలర్‌ఫుల్

లైఫ్ ఈజ్ బ్యూ'టీ'ఫుల్ & కలర్‌ఫుల్

మనం రోజూ తాగే టీకి ఒక ప్రత్యేకమైన రంగు ఉంటుంది. కాస్త పాలు ఎక్కువైతే తేలికపాటి రంగు, డికాక్షన్ ఎక్కువైతే ముదురు రంగు వస్తాయి. అంతేగాక... టీలలో మరికొన్ని రంగులు కూడా ఉంటాయి. అవి దేనివల్ల వస్తాయి... వాటి ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం.
 
వైట్ టీ : ఇది పాల పాళ్లుఎక్కువ కావడం వల్ల వచ్చే తేలిక పాటి రంగు కాదు. చాలా లేతగా ఉండే టీ-ఆకులతో తయారైన టీ-పౌడర్‌తో కాచే టీ వల్ల ఈ రంగు వస్తుంది. ఇది రొటీన్‌గా ఉండే రుచితో కాకుండా కాస్తంత పచ్చిగా ఉన్నట్లుంటుంది. అయితే ఇందులో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ కాబట్టి అనేక క్యాన్సర్లను నివారిస్తుంది.
 
సాధారణ టీ : మనం రోజూ తాగే చాయ్ ఇది. కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కోసారి అది రెండు కప్పులకు మించితే తొలుత చాలా ఎక్కువగా ఉత్తేజపరచి, ఆ తర్వాత నిస్తేజమయ్యేలా చేయవచ్చు. కానీ సాధారణంగా కాఫీ కంటే టీలో కెఫిన్ తక్కువ. అందుకే కాఫీ కంటే టీని ఎక్కువ సార్లు తీసుకోవచ్చు. అయితే దీన్ని కూడా మరీ ఎక్కువగా తీసుకుంటే అది సాధారణ జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగించడం, పోషకాలు ఒంటికి పట్టకుండా చేసే ప్రమాదం ఉంది. కాబట్టి టీ మరీ ఎక్కువగా తీసుకోవడం (రోజుకు ఐదు కప్పులకు మించి) తాగడం కూడా అంత మంచిది కాదు.
 
బ్లాక్ టీ : సాధారణంగా పాలు కలపకుండా కేవడం డికాక్షన్ మాత్రమే తీసుకుంటే దాన్ని బ్లాక్ టీగా పరిగణిస్తారు. ఇది నలుపు రంగులో కాకుండా డికాక్షన్‌కు ఉండే సహజమైన మెరుపుతో ఉంటే మరీ మేలు చేస్తుంది. పశ్చిమాసియా, యూరప్‌కు చెందిన వారు ఈ చాయ్ ఎక్కువగా తాగుతుంటారు. ఇందులోని హెర్బల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే అంతగా అలవాటు లేనివారు బ్లాక్ టీని మరీ మితిమీరి తాగితే నిద్రలేమి, గుండెదడ, రక్తం వేగంగా ప్రవహించడం వంటి దుష్పరిణామలు సంభవించవచ్చు. అందుకే బ్లాక్ టీని కూడా పరిమితంగానే తాగాలి.
 
గ్రీన్-టీ : ఇటీవల ఆరోగ్యం కోసం చాలామంది గ్రీన్-టీ తాగుతున్నారు. ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్‌ను నివారిస్తాయి. అయితేకాదు... గుండెజబ్బుల నుంచి నివారణ కలుగుతుంది. కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గిస్తాయి. ఎపిగెల్లో కాటెచిన్-3 (ఈజీసీజీ) అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. ఈ టీలోని మరీ ఎక్కువ చేదుదనాన్ని నివారించడం కోసం కొంతమంది తేనె కలుపుకుంటారు. దీన్ని చేదుగా తీసుకోవడమే మేలు. మరీ ఎక్కువ తేనె వల్ల రక్తంలో చక్కెరపాళ్లు మితిమీరవచ్చు. అయితే దీన్ని కూడా పరిమితంగా తాగితేనే మేలు.
 
చాక్లెట్ టీ : ఇది కాస్త చాక్లెట్ రంగు మిళితమైనట్లు కనిపించడంతో పాటు చాక్లెట్ ఫ్లేవర్‌నూ కలిగి ఉంటుంది. డార్క్ చాక్లెట్స్ వల్ల మన నరాలు ఉత్తేజితం కావడంతో పాటు ఇందులోని పాలీఫినాల్స్ ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. అయితే చాక్లెట్ టీని షుగర్ వ్యాధిగ్రస్తులు అదేపనిగా తాగడం అంత మంచిది కాదు. మరీ ఎక్కువ చాక్లెట్ టీ వల్ల నరాలు మరీ ఎక్కువగా ఉత్తేజితం చెందితే నిద్రలేమి కూడా రావచ్చు.
 
బ్రౌన్ టీ
లేదా ఊలాంగ్ టీ : ఇది చాలా తక్కువ ప్రాసెస్ చేసిన గ్రీన్, బ్లాక్ టీల సమ్మేళనం. దీన్ని ఎక్కువగా చైనా, తైవాన్ దేశాలలో తాగుతుంటారు. ఊలాంగ్ టీలలో జాస్మిన్, కొబ్బరి, క్యారమెల్ వంటి ఇతర రకాలు కూడా ఇటీవల అందుబాటులోకి వస్తున్నాయి.
 
జాయ్‌ను ఇచ్చే చాయ్‌లోని కొన్ని రంగులివి.
- సుజాతా స్టీఫెన్ న్యూట్రిషనిస్ట్, మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్, మాదాపూర్, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement