Sujata Stephen
-
చచ్చు గింజలు తింటే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
వేరుశనగపప్పులు బూజు పట్టి, చర్మం ముడుచుకుని పోయి ఉన్నాయంటే అవి తెగుళ్ల కారణంగా విషపూరితమయ్యాయని అర్థం. ఫంగస్ సోకిన, ముడుచుకుని పోయిన వేరుశనగ పప్పులను తినడం ఆరోగ్యానికి హానికరం. ఈ విషాల బారిన పడకుండా దేహాన్ని సంరక్షించే ప్రక్రియలో మొదటగా దెబ్బతినేది కాలేయం, వ్యాధినిరోధక వ్యవస్థ.బూజు పట్టిన పప్పులు లివర్ డ్యామేజ్‌కి కారణమవుతాయి. కాలేయం వాపు, మచ్చలతోపాటు పనితీరు లోపించడం, లివర్ క్యాన్సర్ వంటి అనారోగ్యాలు సంభవిస్తాయి. వీటితోపాటు తక్షణం బయటపడే అనేక ఇతర అనారోగ్యాలు, అలర్జీలు, కడుపు నొప్పి, డయేరియా, తల తిరగడం, వాంతులవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. దీర్ఘకాలంలో ఎదురయ్యే సమస్యల్లో బ్రాంకైటిస్, ఆస్త్మాతోపాటు ఇతర శ్వాసకోశ సంబంధ సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్, పెద్ద పేగు క్యాన్సర్లకు దారితీస్తుంది. సంవత్సరాలపాటు ఆహారంలో ఇవి కొనసాగినట్లయితే నర్వస్ సిస్టమ్ కూడా బలహీనపడుతుంది. తరచూ తలనొప్పి, దేహంలో ప్రకంపనలు, జ్ఞాపకశక్తి లోపించడం జరుగుతుంది. మనం ఊహించని మరో సమస్య పునరుత్పత్తి వ్యవస్థ అపసవ్యతలకు లోనుకావడం కూడా.అందుకే వేరుశనగపప్పులనాణ్యతను పరిశీలించుకున్న తర్వాత మాత్రమే వంటల్లో వాడాలి. పప్పులను కొన్న వెంటనే పేపర్ మీద పోసి బూజుపట్టిన, ముడుచుకు పోయిన పప్పులను తొలగించి మంచి పప్పులను డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి. పప్పులు సేకరించి నూనె పట్టించుకునే వాళ్లు కూడా బూజు పట్టిన పప్పులను, డొల్లగా ఉన్న పప్పులను జాగ్రత్తగా ఏరి పారేసి మంచి పప్పులతో నూనె పట్టించుకోవాలి.– సుజాత స్టీఫెన్ ఆర్.డి, న్యూట్రిషనిస్ట్ఇవి చదవండి: వంధ్యత్వం కాదు.. అంధత్వం! -
తెల్లటి ఆహారాలన్నీ డేంజరేనా? ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి ఇవి తింటే..
తెలుపు రంగులో ఉండే ఆహారాలు ఎప్పుడూ ప్రమాదం తెచ్చిపెడుతుంటాయని కొందరు ఆహార నిపుణులు అంటుంటారు. కానీ అది పూర్తిగా వాస్తవం కాదు. తెలుపు ఎప్పుడూ డేంజరు అనే మాట కేవలం ‘పాలిష్ చేసిన తెల్లటి బియ్యం, చక్కెర, ఉప్పు’ అనే మూడురకాల ఆహారాలకు మాత్రమే వర్తిస్తుంది. మిగతా తెలుపు రంగు ఆహారాలన్నీ మనకు మేలు చేసేవే. తెల్లగా పాలిష్ చేసిన తెల్లటి బియ్యానికి బదులు బ్రౌన్‌రైస్ ఎప్పుడూ మేలే. అలాగే తెల్లటి రంగులో ఉంటూ కూరలోకి వాడే ఉల్లి, వెల్లుల్లి, కాలీఫ్లవర్, వైట్ క్యాబేజీ, తెల్లవంకాయ, వైట్ మష్రూమ్స్ అనేవి ఆరోగ్యానికి ఎప్పుడూ మేలు చేసేవే. మేలు చేసే తెల్లటి ఆహారాలివి... ఉల్లి, వెల్లుల్లి తెల్ల రంగులోనే ఉన్నప్పటికీ, తమలోని ఘాటుదనంతో క్యాన్సర్‌ను అవి తరిమి కొడతాయి. వాటిల్లో ఉండే అలిసిన్ అనే పోషకం (ఫైటో కెమికల్) వల్ల వాటికా ఘాటుదనం వస్తుంది. అలిసిన్ అనేక రకాల క్యాన్సర్లను నివారించడమే కాదు... రక్తంలోని హానికరమైన కొలెస్ట్రాల్ మోతాదులను గణనీయంగా తగ్గిస్తుంది. అందుకే పొట్ట, పెద్దపేగు, మలద్వార క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్లతో పాటు గుండెజబ్బులను సైతం వెల్లుల్లి, ఉల్లి నివారిస్తాయి. కాలీఫ్లవర్ / వైట్ క్యాబేజీ వీటిల్లో ఐసోథయనేట్స్, ఐసోఫేవోన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు కూడా అనేక రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. మెదడుకు మంచి చురుకుదనాన్నీ ఇస్తాయి. తెల్ల ముల్లంగి ఈ దుంప ఎరుపుతో పాటు తెల్లరంగులోనూ లభ్యమవుతుంది. దీన్ని చాలా శక్తిమంతమైన టీ–టాక్సిఫైయర్గా చెబుతారు. అంటే దేహంలో పేరుకున్న విషాలను సమర్థంగా బయటికి పంపుతుందన్నమాట. కాలేయానికి చాలా మేలు చేస్తుందది. కామెర్లు వచ్చిన వాళ్లలో నాశమయ్యే ఎర్రరక్తకణాలను సంరక్షించడంతో పాటు వాటినలా కాపాడటం ద్వారా కణాలన్నింటికీ మరిన్ని పోషకాలూ, ఆక్సిజన్ అందేలా దోహదపడుతుంది. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు దుంపకూరలను తినకూడదు లేదా చాలా పరిమితంగా తినాలంటారు. కానీ ముల్లంగికి ఆ మాట వర్తించదు. దానిలోని పీచు కారణంగా చక్కెర మెల్లగా విడుదలయ్యేలా చేసే గుణం వల్ల అది రక్తంలోని చక్కెర మోతాదులను అదుపులో ఉంచుతుంది. వీటిల్లో కూడా క్యాన్సర్‌ను ఎదుర్కొనే యాంటీ–క్యాన్సరస్ గుణాలున్నాయి. వీటిలోని యాంటీఫంగల్ ప్రోటీన్ ‘ఆర్ఎస్ఏఎఫ్పీ2’ ఫంగల్ వ్యాధులను నివారిస్తుంది. అలాగే తెల్లవంకాయ, తెల్ల మష్రూమ్స్ కూడా అంతే ఆరోగ్యకరం. అవి వ్యాధినిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తాయి. బీటా–గ్లూకాన్స్ అని పిలిచే అందులోని పాలీసాకరైడ్స్ తెల్లరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. (మన దేహ రక్షణకు తెల్లరక్తకణాలు ఎంతగానో తోడ్పడతాయన్న సంగతి తెలిసిందే). అంతేకాదు... వాటిల్లో ఎపిగల్లాకాటెచిన్ గ్యాలేట్ (ఈజీసీజీ) అనే పోషకం క్యాన్సర్‌తో పాటు ఎన్నెన్నో వ్యాధుల నుంచి కాపాడుతుంది. - సుజాతా స్టీఫెన్ సీనియర్ న్యూట్రీషనిస్ట్ -
ఊసేయకండి ఆర'గింజ'oడి
పంటి కింద గింజ పడితే అంతగా ఎందుకు గింజుకుంటారు? మింగితే కడుపులో ఏమైనా చెట్టవుతుందా? అవుతుంది... ఆరోగ్య ఫలాలిచ్చే చెట్టవుతుందండీ! ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. జ్ఞానం విత్తులాంటిదని కూడా అంటారు. ఈ కథనంతో ఆ విత్తు మీలో నాటుకుంటే ఆరోగ్యవృక్షం మీ ఒంటి నిండా విస్తరిస్తుంది. ఆరోగ్యఫలాలను మీకు అందించిన భాగ్యం మన ‘సాక్షి’ ఫ్యామిలీకి దక్కుతుంది. మీకు ఆరోగ్యాన్నందించడమే మా భాగ్యం. మీ ఆరోగ్యమే మీకూ, మాకూ మహాభాగ్యం. కొన్ని గింజలను తినలేని, తినరానివాటిగా చూస్తుంటాం. పంటి కిందికి వచ్చిందా... గబుక్కున ఊసేస్తుంటాం. ఉదాహరణకు బొప్పాయి మధ్యన కనిపించే నల్లని గింజ ఒక్కటి పొరబాటున వచ్చినా దాన్ని ఠక్కున బయటకు తీసిపడేస్తాం. పుచ్చకాయ తినేటప్పుడు దాని గింజల్నీ అంతే. కానీ... తినరానివంటూ మనం పరిగణించే చాలా రకాల గింజలకు చాలా విలువ ఉంది. ఆరోగ్యపరంగా వాటికి ఉండే ప్రాధాన్యం తేలిగ్గా తీసిపారేయలేనిదే. వాటిలో చాలా రకాల విటమిన్లు, ప్రోటీన్లు, పీచు, ఖనిజలవణాల వంటి పోషకాలు ఉంటాయి. మనం తేలిగ్గా పరిగణించి, తుపుక్కున ఊసేసే కొన్ని గింజల ప్రాధాన్యాన్ని తెలుసుకుందాం. కమలం గింజలు (లోటస్ సీడ్స్) చాలామందికి లోటస్ గింజలు అన్న మాటే కొత్తగా అనిపిస్తుంది. కానీ తామరపూల నుంచి ఈ గింజలు లభ్యమవుతాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఈ గింజల లభ్యత ఎక్కువ. తామర పూల నుంచి వచ్చే ఆ గింజలను లోటస్ సీడ్స్ అని కొందరు, లోటస్ నట్స్ అని మరికొందరు పిలుస్తారు. వీటిని కొంతమంది కూరగా వండుకుంటారు. చాలామంది వీటిని ఎండబెట్టి ఔషధల తయారీలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా చైనీయులు ఈ గింజల నుంచి తమ సంప్రదాయ మందులను తయారు చేస్తుంటారు. తామర గింజల నుంచి ఎన్నో పోషకాలు లభ్యమవుతాయి. ఇందులో ప్రోటీన్లతో పాటు మెగ్నీషియమ్, పొటాషియమ్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు, ఐరన్, జింక్ వంటి లోహధాతువులు పుష్కలంగా ఉన్నాయి. ఈ గింజల్లో ‘ఎల్–ఐసోయాస్పరై్టల్ మిథైల్ట్రాన్స్ఫెరేజ్’ అనే ఎంజైమ్ ఉంది. ఇది మనలోని దెబ్బతిన్న కణజాలాన్ని చాలా వేగంగా రిపేర్ చేస్తుంది. అందుకే వీటిని తినేవారు చాలా కాలం యౌవనంగా కనిపిస్తారు. లోటస్ గింజల్లోని ఈ గుణం కారణంగా చాలా కాస్మటిక్ కంపెనీలు తమ యాంటీ–ఏజింగ్ మందుల్లో వీటిని వాడుతున్నాయి. ఈ గింజల్లో అభ్యమయ్యే కింప్ఫెరాల్ అనే ఫ్లేవనాయిడ్ పోషకం చిగుర్లలో వచ్చే నొప్పి, వాపు, మంటను (ఇన్ఫ్లమేషన్ను) సమర్థంగా నివారించి, దంతాల ఆరోగ్యం బాగుండేలా చూస్తుంది. అందుకే దీర్ఘకాలం పాటు యౌవనం, దంతాల ఆరోగ్యం బాగుండాలంటే తామర గింజలను వాడటం మంచిది. పుచ్చకాయ గింజలు పుచ్చపండు తినే సమయంలో ఆ ఎర్రటి గుజ్జులో ఇమిడి ఉండే ఈ గింజల్ని వెంటనే ఊసేస్తాం. కానీ ఈ గింజల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు (దాదాపు 100 గ్రాముల) ఎండబెట్టి గింజలను సేకరించి విశ్లేషిస్తే... అందులో 30.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుందనీ, మనకు రోజుకు అవసరమయ్యే ప్రోటీన్‌లో అది 61% అని తెలుస్తుంది. ఆ గింజల్లో ఉండే మరో పోషకం ఆర్గనైన్. ఇది రక్తపోటును నియంత్రించడమే కాదు... గుండెజబ్బులు రాకుండా నివారిస్తుంది. ఇక పుచ్చగింజల్లో మెగ్నీషియమ్ 556 మిల్లీగ్రాములు ఉంటుంది. అది మన రక్తపోటును తగ్గిస్తుంది. మనం తినే పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్) సక్రమంగా జీర్ణమై, ఒంటికి పట్టేల చూస్తుంది. ఇక ఐరన్, ఫాస్ఫరస్, సోడియమ్, కాపర్, మ్యాంగనీస్, జింక్ వంటి అనేక ఖనిజాలు పుచ్చగింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన జీవక్రియలకు అత్యంత అవసరమైన ఖనిజాలే. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే... ఒక కప్పు పుచ్చగింజలలో దాదాపు 51 గ్రాముల కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇందులో శాచ్యురేటెడ్ కొవ్వులు, మోనో అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు, పాలీ అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ ఉంటాయి. వీటిలో ఉండే ఒమెగా–6–ఫ్యాటీ యాసిడ్స్ అనే మంచి కొవ్వులు రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యం పదిలంగా ఉండేలా చూస్తాయి. ఇక వీటిల్లో బి–కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. శరీర జీవక్రియలకు అవసరమైన శక్తి వనరు బి–కాంప్లెక్స్. ఇందులోని నియాసిన్ మన నాడీవ్యవస్థ, జీర్ణవ్యవస్థల ఆరోగ్యానికి, ప్రకాశవంతమైన చర్మసౌందర్యం కోసం ఉపయోగపడుతుంది. ఇక బి–కాంప్లెక్స్‌లోని ఇతర అంశాలైన ఫోలేట్, థయామిన్, రైబోఫ్లేవిన్, విటమిన్ బి6, ప్యాంటథోనిక్ యాసిడ్స్ సంపూర్ణారోగ్యానికి దోహదపడతాయి గుమ్మడి గింజలు ఈ గింజల్లో పనాగమిక్ ఆసిడ్ అనే పోషకం ఉంటుంది. దీన్నే పనాగమేట్ అని కూడా అంటారు. విటమిన్ బి–15 అని కూడా అంటారు. ఈ పనాగమేట్ అనే పోషకం జీవకణంలో జరిగే వాయువుల మార్పిడి (సెల్ రెస్పిరేషన్) సక్రమంగా జరిగేలా చేస్తుంది. అంతేకాదు... కండరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తం పీహెచ్ పాళ్లు సక్రమంగా ఉంచుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, మనలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇక మన శరీరం అనేక జీవక్రియలు జరిగే సమయంలో ఆ ప్రక్రియకు చెందిన వ్యర్థాలుగా ఫ్రీ రాడికల్స్ అనే పరమాణు పదార్థాలు వెలువడుతాయి. ఇవి క్యాన్సర్‌ను కలిగించడంతో పాటు... వయసు పెరిగే ప్రక్రియను వేగవంతం చేస్తాయన్న విషయం తెలిసిందే. గుమ్మడి గింజల్లో ఉండే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్... ఈ ఫ్రీ రాడికల్స్ దుష్ప్రభావాన్ని పూర్తిగా హరించి వేస్తాయి. అందుకే యాంటీ ఆక్సిడెంట్స్ ఎంతగా తీసుకుంటే ఆరోగ్యం అంత బాగుంటుంది. గుమ్మడి గింజల్లో పనాగమిక్ ఆసిడ్ ఎక్కువ. ఆక్సిజన్ లేదా పెరాక్సైడ్స్ పెరగడం వల్ల కలిగే దుష్ప్రభావాలను పనాగమిక్ ఆసిడ్ నిరోధిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడటానికి దోహదం చేస్తుంది. ఇక ఒత్తిడిని నివారించడానికి గుమ్మడి గింజలు ఎంతగానో దోహదపడతాయి. ఒత్తిడి వల్ల కలిగే అలసట ఫీలింగ్‌ను గుమ్మడి గింజలు పోగొడతాయి. గుమ్మడి గింజలు ఎక్కువగా తీసుకుంటే ఎప్పుడూ ఏదో తినాలనే కాంక్ష తగ్గుతుంది. అందుకే స్థూలకాయం పెరగకుండా చూసుకోవాలని జాగ్రత్తపడేవారు ఈ గుమ్మడి గింజలను తీసుకోవచ్చు. ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇవి తోడ్పడతాయి. అంతేకాదు... గుమ్మడి గింజలు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఆర్థరైటిస్ ముప్పును తగ్గిస్తాయి. బొప్పాయి గింజలు హైబ్రీడ్ బొప్పాయిలో గింజలు ఉండవు. కానీ ఆరోగ్యానికి దేశవాళీ బొప్పాయి చాలా మంచిది. బొప్పాయిని కోశాక దాని లోపలి గోడలకు అంటుకుని కనిపించే గింజలను కత్తితోనో, స్పూన్‌తోనో వదిలించుకుంటాం. పొరబాటున ఒకటో అరో గింజలు పంటికిందికి పోయిన పర్లేదు. లేదా మీరు కొరికి తిన్నా ఓకే. ఎందుకంటే... బొప్పాయి గింజల్లో ఓలిక్, పాల్మిటిక్ యాసిడ్స్ అనే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. శక్తిమంతమైన ఆ ఫ్యాటీయాసిడ్స్ క్యాన్సర్‌ను దూరంగా తరిమేస్తాయి. చైనా సంప్రదాయ మందుల్లో ఈ గింజల్ని కాలేయాన్ని శుద్ధి చేసే ఔషధంగా ఉపయోగిస్తారు. మనమంటే వాటిని వాడం గానీ... హవాయీ ద్వీపాలకు చెందిన వారు బొప్పాయి గింజలను వంటకాల్లో ఉపయోగిస్తారు. మనం మన వంటకాలపై మిరియాల పౌడర్ చల్లుకున్నట్లుగానే వారు ఆ గింజల పౌడర్‌ను వాడతారు. పనస గింజలు సాధారణంగా చాలా మంది పనస తొనలు తిన్న తర్వాత ఆ గింజలను పారేస్తుంటారు. అయితే పనస గింజల్లో చాలా పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల పనస గింజల్లో 184 క్యాలరీల శక్తి, 7 గ్రాముల ప్రోటీన్లు, 38 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 1.5 గ్రాముల పీచు, కొవ్వుపదార్థాలు ఉంటాయి. వాటిలో పీచు ఎక్కువ కాబట్టి స్థూలకాయం రాకుండా నివారిస్తాయి. జీర్ణప్రక్రియ సాఫీగా అయ్యేలా చూస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెజబ్బులను అరికడతాయి. రక్తంలో చక్కెరపాళ్లను అరికట్టే తత్వం ఉన్నందున డయాబెటిస్‌ను నివారిస్తుంది. జీర్ణాశయాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. తద్వారా పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వీటిల్లో ఉండే థయామిన్, రైబోఫ్లేవిన్ మంచి శక్తివనరుగా పనిచేయడంతో పాటు చర్మం, కళ్లు, కురుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. జింక్, ఐరన్, క్యాల్షియమ్, కాపర్, పొటాషియమ్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు ఎక్కువ. పనస గింజల్లోని పాలీఫీనాల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి వృక్షరసాయనాలు క్యాన్సర్లను దూరంగా తరిమివేస్తాయి. ద్రాక్ష గింజలు గతంలో ద్రాక్ష తింటున్నప్పుడు పొరబాటున గింజ వచ్చిందంటే తక్షణం ఊసేసేవారు. కానీ ఇప్పుడైనా సరే... గింజలున్న ద్రాక్ష తింటున్నప్పుడు ఒకటీ అరా గింజలనూ నమలండి. ఎందుకంటే ద్రాక్షగింజల్లో ఆలిగోమెరిక్ ప్రోయాంథోసయనడిన్ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. అందుకే ద్రాక్షగింజను నమిలేశామంటే క్యాన్సర్ వ్యాధిని దూరంగా తరిమేశామని అర్థం. ద్రాక్షగింజల్లోని ప్రోయాంథోసయనడిన్స్ మన రక్తనాళాల, వాటి చివరన ఉండే రక్తకేశనాళికల (క్యాపిల్లరీస్) ఆరోగ్యం బాగుండేలా చూస్తాయి. ద్రాక్షగింజలు చేసే ఈ అద్భుతాలను 2009లో ‘ద జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్’ అధికారికంగా నమోదుచేశారు. అంతేకాదు... ద్రాక్షగింజల్లో విటమిన్–ఇ, ఫ్లేవనాయిడ్స్, లినోలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులను దూరంగా తరిమేస్తాయి. మహిళల్లో అవి మరింత సమర్థంగా ఈ పనిచేస్తాయట. గుండెపోటును నివారించడమే కాదు... గుండెలయతప్పే టాకికార్డియా వంటి గుండెజబ్బులనూ అరికడతాయి. డోక్సోరూబిసిన్ వంటి కొన్ని రకాల ఔషధాలు గుండె పాలిట విషపూరితంగా పనిచేస్తాయి. వాటిని ద్రాక్షగింజలు శుభ్రం చేస్తాయి. అంతేకాదు... రక్తనాళాలు పెళుసుబారిపోయే అథెరోస్కి›్లరోసిస్ కండిషన్‌ను నివారిస్తాయి. దానితోపాటు డిప్రెషన్‌ను సమర్థంగా అరికడతాయి. అవిశె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) వ్యాధి నిరోధక శక్తిని పుష్కలంగా కల్పించే పోషకాలు ఒమెగా–3 ఫ్యాట్స్ అవిశెగింజల్లో చాలా ఎక్కువ. గుండెజబ్బుల నివారణ కోసం, అధిక రక్తపోటును తగ్గించడానికి, డయాబెటిస్‌ను నివారించడానికి అవి ఎంతగానో తోడ్పడతాయి. ఆర్థరైటిస్, ఆస్తమా, ఇన్ఫ్లమేటరీ జబ్బులు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, క్యాన్సర్లను అవిశలు చాలావరకు నిరోధిస్తాయి. అవిశెల్లో విటమిన్–బి, విటమిన్–ఇ చాలా ఎక్కువ. దాంతో పాటు పీచుపదార్థాలు (సొల్యుబుల్ ఫైబర్) కూడా ఎక్కువ. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల అవిశె పొడిని నీళ్లలోగానీ లేదా పాలు, పెరుగులో కలిపి తీసుకుంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది. గుర్తుంచుకోండి... తినకూడని గింజ ఆపిల్ గింజ! పండ్ల గింజల్లో పోషకాలు ఉన్నాయి కదా అని అన్ని పండ్లగింజలూ అంతే మేలు చేయవు. ఆపిల్ గింజలను పొరబాటున కూడా తినవద్దు. అయితే పంటికిందకి వస్తే ఆందోళన పడకండి. కానీ వెంటనే ఊసేయండి. నిజానికి ఆపిల్ గింజల్లో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు ఉన్నప్పటికీ కొరకకుండా జాగ్రత్త తీసుకోవడమే మంచిది. ఎందుకంటే వీటిల్లో అమైగ్డాలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మంచిదా చెడ్డదా అన్న అంశంపై భిన్న వాదనలు ఉన్నాయి. ఆపిల్ గింజలు ఎక్కువగా తింటే ఊపిరి సరిగా అందని స్థితికి వెళ్తారు. అంతేకాదు, తలనొప్పి, వికారం, వాంతులు, తల దిమ్ము, బలహీనత, గుండె స్పందనలు మందగించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ఆపిల్ గింజలకు దూరంగా ఉండండి. గమనిక పొరబాటున నమలడం సరే... ఇక్కడ పేర్కొన్న గింజల వల్ల సమకూరే ఆరోగ్య ప్రయోజనాలు పొందాలనుకునే వారు... ఆయా గింజలను ఎండబెట్టి, పౌడర్లా చేసుకొని, మనం మిరియాల పొడి (పెప్పర్) చల్లుకున్నట్లుగా నీళ్లు, పాలు లేదా పెరుగన్నంలో చిటికెడంత చల్లుకోవచ్చు. ఇక పనసగింజలను మాత్రం కూర లేదా పులుసు వండుకుంటే సరిపోతుంది. – సుజాత స్టీఫెన్, చీఫ్ న్యూట్రిషనిస్ట్, యశోద హాస్పిటల్స్, మలక్ పేట, హైదరాబాద్ -
ఆ విషాలను కడుగుదాం రండి!!
జీవఫలం – చేదు విషం! ఒకప్పుడు చందమామ కథల్లో కొన్ని పండ్లు చాలా ఆకర్షణీయంగా కనిపించేవి. కానీ అవి తినగానే చనిపోవడమో లేదా కురూపులైపోవడమో జరుగుతుందని అరణ్యంలో మారువేషాల్లో సంచరించే రాజులనూ, రాకుమారులనూ హెచ్చరించేది పేదరాసి పెద్దమ్మ. ఇప్పుడు అడవుల్లోకి పోయి... ఆకర్షణీయమైన వింతపండ్లను వెతకనక్కర్లేదూ... పేదరాసి పెద్దమ్మతో చెప్పించుకోనవసరం లేదు. మన మార్కెట్లోకి వచ్చే ద్రాక్ష పండ్లను చూస్తే చాలు. దూరం నుంచి చూసినా పండుపై ఏదో మందులు చిమ్మిన పొరలు కనిపిస్తాయి. ముట్టుకొని చూస్తే పండు జిడ్డు జిడ్డుగా చేతికి తగులుతూ ఉంటుంది. ఆ చేతిని ఎప్పుడెప్పుడు కడుక్కుందామా అని ఫీలింగ్‌తో చేతులు కడుక్కునేవరకూ అంతా అస్థిమితంగా ఉంటుంది. గుత్తి నుంచి అప్పుడో, ఇప్పుడో ఒకటో రెండో పండ్లను తీసుకొని తినాలన్న ఇచ్ఛ ఇగిరిపోతుంది. మనసు చచ్చిపోతుంది. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ద్రాక్షల్లో నల్లద్రాక్ష, పచ్చద్రాక్ష, క్యాప్సూల్ ద్రాక్ష వంటి గుత్తులు వినియోగదారులను ఆకర్షిస్తున్నా... వాటిపై పేరుకుపోయి కనిపిస్తున్న రసాయన మందులు, క్రిమిసంహార మందులతో వెంటనే వాటి నుంచి దృష్టి మళ్లుతోంది. అత్యాధిక మోతాదులో వాడే ఎండోసల్ఫాన్ వంటి మందులు... పండ్లు తినేవారి ఆరోగ్యంపై దీర్ఘకాలిక దుష్ప్రభావాలకు కారణమవుతున్నాయి. అంతేకాదు... గతంలోలా ఒకసారో, రెండోసార్లో ద్రాక్షపండ్లను కడిగినా ఇప్పుడు ప్రయోజనం లేదు. క్రిమిసంహారకమందుల అవశేషాలు అన్నో, ఇన్నో పండ్లపై మిగిలిపోతున్నాయి. ఈ విషయాన్ని ఆహారం, మందుల భద్రతపై అత్యున్నత సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)తో పాటు మన దేశానికి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) వేర్వేరుగా పేర్కొంటున్నాయి. ఇటీవలే సీఎస్ఈ సమర్పించిన నివేదిక ప్రకారం... ద్రాక్షను కడిగాక కూడా వాటిపై మిగిలిపోతున్న క్రిమిసంహారక మందుల అవశేషాలు (కెమికల్ రెసిడ్యూస్) వల్ల క్యాన్సర్, ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసేలా నరాలకు సంబంధించిన వ్యాధులు, పిల్లల్లో పుట్టుకతో వచ్చే వ్యాధులు కనిపిస్తున్నాయని పేర్కొంది. అంతేకాదు. ఇలాంటి పండ్ల వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా దెబ్బతింటోందని చెబుతోంది సీఎస్ఈ. సాంప్రదాయిక పద్ధతుల్లో ఇప్పటివరకూ మనం ఒక లీటర్ నీళ్లలో రెండు చెంచాల ఉప్పు కలిపి, రెండుసార్లు కడిగినా రసాయన మందుల అవశేషాలు పూర్తిగా పోవడం లేదని సీఎస్ఈ పేర్కొంది. అందుకే ద్రాక్ష, ఆపిల్స్, జామ, రేగుపండ్లు, మామిడి , పీచ్, పియర్ వంటి పండ్లనూ, వాటితో పాటు కొన్ని కూరగాయలను కడిగే విధానాన్ని అది సూచిస్తోంది. పండ్లను ఆరోగ్యకరంగా కడగటం ఎలాగంటే... నీళ్లు 90 శాతం, తెల్ల వెనిగర్ 10 శాతం తీసుకుని, అందులో మనం తినదలచుకున్న పండ్లను కాసేపు ఉంచి, ఆ తర్వాత నల్లానుంచి జారుతూ ఉన్న ఫ్రెష్ వాటర్ ప్రవాహంలో వాటిని కడగడం వల్ల చాలావరకు రసాయనాలు శుభ్రం అవుతాయని పేర్కొంటోంది సీఎస్ఈ. అంతేకాదు... ఇలా నల్లా నుంచి జారే నీటి వల్ల (అంటే రన్నింగ్ వాటర్ కింద) పండ్లను కడిగే సమయంలో పండుపై ఏదైనా గుంటలు, ఇరుకు చారల వంటి ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన రసాయనాలూ, కడుక్కుపోయి, కొట్టుకుపోతాయని పేర్కొంటోంది ఆ సంస్థ. మరో మార్గం ఇలా... ఒక బౌల్లో నాలుగు వంతుల నీరు, ఒక వంతు వెనిగర్ తీసుకొని అప్పటికే కచ్చాపచ్చాగా కడిగిన పండ్లను, కూరగాయలను అందులో ఉంచాలి. మనం తినాలనుకున్న పండ్లను అందులో దాదాపు 30 – 60 నిమిషాల పాటు ఉంచి మళ్లీ వాటిని రుద్దుతూ (రిన్సింగ్ చేస్తూ) కడగాలి. ఆ తర్వాత జర్రున జారుతున్న నీటి ప్రవాహంలో మళ్లీ కడగడం సురక్షితం అంటున్నారు నిపుణులు. కొన్ని పెద్దసైజు పండ్ల మీద మరి ఎక్కువ రసాయన అవశేషాలు ఉన్నాయని అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్సోడాలను ఒక కప్పు నీళ్లలో కలిపి... ఆ మిశ్రమాన్ని పండుపై వేసి రుద్దుతూ శుభ్రం చేయాలి. అలా రుద్దిన ఆ పండును నీటి ప్రవాహం కింద ఉంచి, పండుపై పేరుకున్న లెమన్‌జ్యూస్, బేకింగ్‌సోడాల జడ్డిమిశ్రమం కొట్టుకుపోయే వరకు కడగాలి. ఇలా చేయడం వల్ల పండుపై ఉన్న రసాయనాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. మొత్తం ఒకే కట్టగా ఉపయోగించే వాటిని కడగడం ఇలా... కొత్తిమీర, కర్వేపాకులను సాధారణంగా మొత్తం కట్టకట్టనంతా ఒకేసారి కడుగుతుంటారు. ఇలా కడిగే వాటిని నీరు నిండి ఉన్న బౌల్లో రెండు మూడుసార్లు తిప్పుతూ కడగాలి. ఆ తర్వాత పేపర్ టవల్‌తో తుడవాలి. కొలరాడో స్టేట్ యూనివర్సిటీ వారి అధ్యయనం ప్రకారం ఇలాంటి వాటిని కడగడానికి ఉపయోగించే నీటిలో కాస్తంత నిమ్మరసం, కొంత వెనిగర్ వేయడం వల్ల కట్ట మీది బ్యాక్టీరియా, ఈ–కొలై శుభ్రంగా కడుక్కుపోవడంతో పాటు కట్టకు కాస్తంత కొత్త రుచి కూడా వస్తుంది. ఇక నేరేడు, బెర్రీపండ్ల వంటి వాటిని వెనిగర్ సొల్యూషన్‌లో కడగాలి. మనం షాపింగ్ చేస్తున్నప్పుడే పండుపై దెబ్బలేని వాటిని ఎంపిక చేయాలి. గిన్నెలను కడగడం ఎలా? మనం ఆహారపదార్థాలు, కూరగాయలు, ఆకుకూరలను పెట్టుకునే గిన్నెలు, బౌల్స్‌ను వేడినీళ్లతోనూ, డిటెర్జెంట్తోనూ మొదట కడగాలి. ఆ డిటర్జెంట్ తాలూకు సబ్బు పూర్తిగా కడుక్కుపోయేలా మళ్లీ మంచినీళ్లతో ఈసారి చల్లటి నీళ్లతో కడగాలి. ఆ తర్వాతే మనం శుభ్రం చేసుకున్న కూరగాయలను ఆ గిన్నెలలో పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు గిన్నెలు లోహంతో చేసినవి కాకుండా, పింగాణీవి అయితే అవీ శుభ్రంగా ఉంటాయి. శుభ్రపరచిన, కోసిన కూరగాయలూ మళ్లీ అపరిశుభ్రమయ్యే అవకాశాలు తక్కువ. మట్టి కింద ఉండే దుంపల్ని శుభ్రం చేయడమిలా... ∙మట్టి కింద ఉండే బంగాళదుంప (ఆలుగడ్డ), క్యారట్ వంటి వాటని వెంటనే శుభ్రపరచకుండా కొద్దినిమిషాల పాటు నీళ్లలో నాననివ్వాలి. వాటిని ఎలాగూ చెక్కుతీసి వాడినప్పటికీ, నాననిచ్చిన తర్వాత కోసే ముందుగా ధారగా పడే నీళ్లలో కడగాలి. ∙కాలిఫ్లవర్, బ్రకోలీ లాగా ముడుతలు ముడుతలుగా ఉండి, ఆ ముడుతల్లో మట్టి చేరే అవకాశమున్న పువ్వుకూరలను కాసేపు నీళ్లలో నాననివ్వాలి. ఆ తర్వాత నీళ్లు కారిపోయేలా రంధ్రాలుండే పాత్ర (కొలాండర్)లోకి వాటిని తీసుకోవాలి. ∙కాయగూరల పైపొర చెక్కు తీసేలా ఉండే పొట్లకాయ, బీరకాయ, సొరకాయ వంటివాటిని పైనుంచి ధారగా పడుతున్న నీటిలో ఒకటికి రెండుసార్లు కడిగిన తర్వాతే కోయాలి. ∙ఇటీవల పుట్టగొడుగులను కూరగాయలుగా వాడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. వీళ్లకోసం మష్రూమ్ బ్రష్ అనే ఉపకరణం అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని చల్లటి నీటిలో కడగాలి. ఆ తర్వాత పేపర్ టవల్‌తో శుభ్రం చేయాలి. ∙కూరగాయలలో వంకాయలను కోసే పద్ధతి కాస్త వేరుగా ఉంటుంది. ముందుగా వంకాయలను ధారగా పడుతున్న నీటిలో కలగాలి. ఆ తర్వాత కాస్తంత వాటిని కాస్తంత నిమ్మనీరు, కాస్తంత ( 2 శాతం) చింతపండు నానేసిన నీరు, కాస్తంత ఉప్పు, 4 శాతం అసిటిక్ ఆసిడ్ ద్రవాలను ఒక పెద్ద పాత్రలోని నీళ్లలో కలిపి, ఆ ద్రవంలో ఒక్కొక్క వంకాయను విడివిడిగా కడగాలి. దీనివల్ల వంకాయల మీద చల్లి ఉన్న క్రిమిసంహారకాలు కడుక్కుపోతాయి లేదా నిర్వీర్యమవుతాయి. ∙పుచ్చకాయ, కర్బూజకాయ లాంటి వాటిని ధారగా పడుతున్న నీటికింద కడుగుతూ మెత్తటి కుచ్చులున్న వెజిటబుల్ బ్రష్‌తో శుభ్రంగా కడిగాకే, ముక్కలుగా కోయాలి. మరికొన్ని పండ్లు/కూరగాయలు.... వాటిని శుభ్రపరిచే విధానాలు వేర్వేరు వెజిటబుల్స్ శుభ్రపరిచే పద్ధతులివి... ∙చిన్న కాడకు అంటి ఉండే పండ్లను బాగా శుభ్రం చేశాక... మురికి పేరుకునే అవకాశాలు ఎక్కువగా కాడ వద్ద ఉంటాయి. కాబట్టి ఇలా కాడ ఉన్న పండ్లను శుభ్రం చేశాక అటు కాడ, ఇటు కాడకు రెండోవైపున చెక్కు తీసినట్లుగా కత్తితో కోయడం మేలు. ఈ నియమం ఆపిల్, పియర్ పండు, పీచ్ పండ్లకు వర్తిస్తుంది. ∙మందంగా ఉండే తోలు ఉన్న పండ్లు (ఉదాహరణకు నారింజ, కమలాలు) తినబోయే ముందు, మనం ఎలాగూ పండు తోలును తినకపోయినా.. ఒక్కసారి తేలిగ్గా కడగడం మేలు. ∙ఇక పాలకూర, లెట్యూజ్, కొత్తిమీర, కరివేపాకు, క్యాబేజీ లాంటి వాటిని శుభ్రం చేసే ముందర వాటిని నల్లా/కొళాయి కింద ప్రవహించే నీళ్ల కింద కాసేపు ఉంచి, శుభ్రం చేయడం మంచిది. క్యాబేజీ లాంటివి శుభ్రం చేసే సమయంలో వాటి పైన ఉన్న ఆకులు ఒకటి రెండు పొరలను తీసేయడం వల్ల మిగతాదంతా శుభ్రంగా ఉంటుంది. ∙ఆకుకూరల్ని శుభ్రంగా కడిగాక వాటిపై నీళ్లు ఆరేలా కాసేపు ఆగాలి. ఆ తర్వాత శుభ్రమైన టీ టవల్‌తో వాటిని తుడవాలి. అప్పుడే వాటిని కోయాలి. అంతేగానీ ఆకుకూరల్ని కోశాక వాటిని కడగడం సరికాదు. అలా చేయడంవల్ల పోషకాలు కోల్పోతాం. సలాడ్స్‌గా చేయదలచిన ఆకుకూరలను, కాయగూరలను ఇంటికి తెచ్చిన వెంటనే కడిగి సలాడ్స్‌గా కోసుకోవాలి. – సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్ -
లైఫ్ ఈజ్ బ్యూ'టీ'ఫుల్ & కలర్‌ఫుల్
మనం రోజూ తాగే టీకి ఒక ప్రత్యేకమైన రంగు ఉంటుంది. కాస్త పాలు ఎక్కువైతే తేలికపాటి రంగు, డికాక్షన్ ఎక్కువైతే ముదురు రంగు వస్తాయి. అంతేగాక... టీలలో మరికొన్ని రంగులు కూడా ఉంటాయి. అవి దేనివల్ల వస్తాయి... వాటి ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం. వైట్ టీ : ఇది పాల పాళ్లుఎక్కువ కావడం వల్ల వచ్చే తేలిక పాటి రంగు కాదు. చాలా లేతగా ఉండే టీ-ఆకులతో తయారైన టీ-పౌడర్‌తో కాచే టీ వల్ల ఈ రంగు వస్తుంది. ఇది రొటీన్‌గా ఉండే రుచితో కాకుండా కాస్తంత పచ్చిగా ఉన్నట్లుంటుంది. అయితే ఇందులో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ కాబట్టి అనేక క్యాన్సర్లను నివారిస్తుంది. సాధారణ టీ : మనం రోజూ తాగే చాయ్ ఇది. కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కోసారి అది రెండు కప్పులకు మించితే తొలుత చాలా ఎక్కువగా ఉత్తేజపరచి, ఆ తర్వాత నిస్తేజమయ్యేలా చేయవచ్చు. కానీ సాధారణంగా కాఫీ కంటే టీలో కెఫిన్ తక్కువ. అందుకే కాఫీ కంటే టీని ఎక్కువ సార్లు తీసుకోవచ్చు. అయితే దీన్ని కూడా మరీ ఎక్కువగా తీసుకుంటే అది సాధారణ జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగించడం, పోషకాలు ఒంటికి పట్టకుండా చేసే ప్రమాదం ఉంది. కాబట్టి టీ మరీ ఎక్కువగా తీసుకోవడం (రోజుకు ఐదు కప్పులకు మించి) తాగడం కూడా అంత మంచిది కాదు. బ్లాక్ టీ : సాధారణంగా పాలు కలపకుండా కేవడం డికాక్షన్ మాత్రమే తీసుకుంటే దాన్ని బ్లాక్ టీగా పరిగణిస్తారు. ఇది నలుపు రంగులో కాకుండా డికాక్షన్‌కు ఉండే సహజమైన మెరుపుతో ఉంటే మరీ మేలు చేస్తుంది. పశ్చిమాసియా, యూరప్‌కు చెందిన వారు ఈ చాయ్ ఎక్కువగా తాగుతుంటారు. ఇందులోని హెర్బల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే అంతగా అలవాటు లేనివారు బ్లాక్ టీని మరీ మితిమీరి తాగితే నిద్రలేమి, గుండెదడ, రక్తం వేగంగా ప్రవహించడం వంటి దుష్పరిణామలు సంభవించవచ్చు. అందుకే బ్లాక్ టీని కూడా పరిమితంగానే తాగాలి. గ్రీన్-టీ : ఇటీవల ఆరోగ్యం కోసం చాలామంది గ్రీన్-టీ తాగుతున్నారు. ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్‌ను నివారిస్తాయి. అయితేకాదు... గుండెజబ్బుల నుంచి నివారణ కలుగుతుంది. కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గిస్తాయి. ఎపిగెల్లో కాటెచిన్-3 (ఈజీసీజీ) అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. ఈ టీలోని మరీ ఎక్కువ చేదుదనాన్ని నివారించడం కోసం కొంతమంది తేనె కలుపుకుంటారు. దీన్ని చేదుగా తీసుకోవడమే మేలు. మరీ ఎక్కువ తేనె వల్ల రక్తంలో చక్కెరపాళ్లు మితిమీరవచ్చు. అయితే దీన్ని కూడా పరిమితంగా తాగితేనే మేలు. చాక్లెట్ టీ : ఇది కాస్త చాక్లెట్ రంగు మిళితమైనట్లు కనిపించడంతో పాటు చాక్లెట్ ఫ్లేవర్‌నూ కలిగి ఉంటుంది. డార్క్ చాక్లెట్స్ వల్ల మన నరాలు ఉత్తేజితం కావడంతో పాటు ఇందులోని పాలీఫినాల్స్ ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. అయితే చాక్లెట్ టీని షుగర్ వ్యాధిగ్రస్తులు అదేపనిగా తాగడం అంత మంచిది కాదు. మరీ ఎక్కువ చాక్లెట్ టీ వల్ల నరాలు మరీ ఎక్కువగా ఉత్తేజితం చెందితే నిద్రలేమి కూడా రావచ్చు. బ్రౌన్ టీ లేదా ఊలాంగ్ టీ : ఇది చాలా తక్కువ ప్రాసెస్ చేసిన గ్రీన్, బ్లాక్ టీల సమ్మేళనం. దీన్ని ఎక్కువగా చైనా, తైవాన్ దేశాలలో తాగుతుంటారు. ఊలాంగ్ టీలలో జాస్మిన్, కొబ్బరి, క్యారమెల్ వంటి ఇతర రకాలు కూడా ఇటీవల అందుబాటులోకి వస్తున్నాయి. జాయ్‌ను ఇచ్చే చాయ్‌లోని కొన్ని రంగులివి. - సుజాతా స్టీఫెన్ న్యూట్రిషనిస్ట్, మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్, మాదాపూర్, హైదరాబాద్ -
శాకాహారులకు మాంసకృత్తులు...
మనం తీసుకునే ఆహారంలో పిండిపదార్థాలు అవసరమైన శక్తిని సమకూరుస్తాయి. కొవ్వులు కొన్ని విటమిన్లను తమలో కరిగేలా చేసుకొని శరీరానికి అవసరమైన జీవక్రియలు జరిగేలా చూస్తాయి. మరి మాంసకృత్తులో? పోషకాహార శాస్త్ర పరిభాషలో ప్రోటీన్లు అని పిలిచే ఈ మాంసకృత్తులు ప్రధానంగా మాంసాహారంలో ఉంటాయి. కానీ వేర్వేరు సామాజిక నమ్మకాల కారణంగా కొంతమంది మాంసాహారాన్ని ముట్టుకోరు. వారికి ఈ మాంసకృత్తులు (ప్రోటీన్లు) సమకూరేదెలాగో తెలుసుకుందాం. మాంసకృత్తులు అంత అవసరమా? కండరాల మంచి సౌష్ఠవపూరిత నిర్మాణం కోసం, కండరాలు దెబ్బతిన్నప్పుడు వాటిని రిపేర్ చేయడం కోసం మాంసకృత్తులు (ప్రోటీన్లు) అవసరం. అందుకే గుండె ఆపరేషన్ జరిగాక కొవ్వులను తగ్గించాలనే డాక్టర్లు సైతం ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత ఆ గాయం మానేవరకూ, ఆ రిపేర్ జరిగే వరకూ చికెన్‌లాంటివి తినమని సలహా ఇస్తుంటారు. మాంసాహారులకు ప్రోటీన్లు ఎలాగైనా అందుతాయి. మరి శాకాహారులకూ వారి జీవక్రియల కోసం మాంసకృత్తులు అవసరం కదా. వారు ఈ ప్రోటీన్లను ఎలా భర్తీ చేసుకుంటారు. అదృష్టవశాత్తూ కేవలం మాంసాహారంలోనే గాక... శాకాహారంలోని చాలా పదార్థాలలోనూ మాంసకృత్తులు ఉంటాయి. ఆయా ఆహారాల ద్వారా అవి శాకాహారులకూ అందుతాయి. అవేమిటో తెలుసుకుంటే మంచి శరీర సౌష్ఠవం, కండరాల నిర్మాణం, దెబ్బతిన్న కండరాల రిపేర్లను సులభంగా చేసుకోవచ్చు. ఆరోగ్యంగా జీవించవచ్చు. నట్స్, గింజలలో... ఎండుగా కనిపించే కొన్ని నట్స్‌లో, గింజలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని గుప్పెట్లో పట్టుకుని కూడా సులభంగా తినవచ్చు. కాబట్టి మీటింగ్స్ మధ్య మధ్యలోనూ, జిమ్‌కు వెళ్లే ముందర తేలిగ్గా వీటిని తినవచ్చు. పైగా నట్స్, గింజలనుంచి లభ్యమయ్యే మాంసకృత్తులతో వ్యాధి నిరోధక శక్తి సమకూరుతుంది. ఇందులో మాంసాహారంలోని ప్రోటీన్లతో పీచు లభ్యం కాదు. కానీ ఈ నట్స్, గింజల (సీడ్స్) ద్వారా అదనంగా పీచు పదార్థం కూడా లభ్యమవుతుంది. మాంసాహారపు ప్రోటీన్లతో మలబద్దకం వస్తే శాకాహారంతో లభ్యమయ్యే ఈ ప్రోటీన్లతో దాన్ని నివారించినట్లు కూడా అవుతుంది. పైగా ఇందులోని మినరల్స్, విటమిన్-ఈ, ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్ వంటి పోషకాలు చాలా కాలం పాటు వ్యక్తులను యౌవనంగా ఉంచడానికి తోడ్పడతాయి. నట్స్, గింజల (సీడ్స్) ద్వారా ప్రోటీన్లను ఇచ్చే కొన్ని ఆహారపదార్థాలివే... జనుము గింజలు (హెంప్ సీడ్స్) : మనం ఆహారంగా వాడటానికి పెద్దగా ఇష్టపడకపోయినా... జనుము గింజల్లో (హెంప్ సీడ్స్) ప్రోటీన్లు నిండి కూరి కూరి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. 30 గ్రాముల జనుము గింజల్లో 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంతేకాదు... ఇందులో మానవ జీవక్రియలకు అవసరమైన 10 అత్యవసరమైన అమైనోఆసిడ్స్ ఉన్నాయి. చాలాకాలం యౌవనంగా కనిపించేలా చేసే ఒమెగా 3-ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉన్నాయి. అవిశె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) : 100 గ్రాముల అవిశె గింజలలో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి మంచి ప్రోటీన్ కోరుకునేవారికి అవిశె గింజలు ఉత్తమమైన వనరు. గుమ్మడి గింజలు (పంప్కిన్ సీడ్స్) 100 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇక ఇందులో ప్రోటీన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రియెంట్స్ లాంటి అనేక పోషకాలు ఉంటాయి. పైగా గుమ్మడి గింజల్లో మెగ్నీషియమ్, మాంగనీస్, కాపర్, జింక్, ఐరన్ లాంటి పోషకాలూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచింది. జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా : ప్రతి 100 గ్రాముల ఈ ఎండుఫలాల్లో (నట్స్‌లో) దాదాపు 20 - 22 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి పైన పేర్కొన్న గింజలు, నట్స్ ద్వారా శాకాహారులు ప్రోటీన్స్‌ను పొందవచ్చు. పాలు పాల ఉత్పాదనలలో : పాలలో రెండు రకాల ప్రోటీన్లు ఉంటాయి. మొదటి ప్రోటీన్‌ను ‘వే’ అంటారు. పాలలో ఇది 20 శాతం ఉంటుంది. మిగతా 80 శాతం ప్రోటీన్‌కు కేసీన్ అని పేరు. ఈ రెండూ చాలా ఉత్తమమైన ప్రోటీన్లు. శాస్త్రీయంగా చూస్తే ఈ రెండింటిలోనూ అత్యుత్తమ స్థాయి అమైనోయాసిడ్స్ నిండి ఉన్నాయి. ఇక పాలతో పాటు పాల ఉత్పాదనలైన పెరుగు, చీజ్‌లలోనూ ప్రోటీన్లు ఎక్కువ. పాలు, పాల ఉత్పాదనలలో 20 : 80 నిష్పత్తిలో లభించే వే, కేసీన్ ప్రోటీన్లు హైబీపీని నియంత్రిస్తాయి. ఇక 100 గ్రాముల చీజ్‌లో 11 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కూరగాయలు, పప్పులలో : సోయాబీన్స్‌లో : సోయా ఉత్పాదనల్లో చాలా పుష్కలమైన ప్రోటీన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేసేవి. మనకు మాంసాహారం ద్వారా లభ్యమయ్యే ప్రోటీన్లతో పోలిస్తే సోయాతో దొరికే ప్రోటీన్ కూడా అంతే నాణ్యమైనదని చెప్పవచ్చు. మంచి శెనగల్లో : మంచి శెనగల్లోనూ ప్రోటీన్లతో పాటు డయటరీ ఫైబర్, పొటాషియమ్ పుష్కలంగా దొరుకుతుంది. కాయధాన్యాల్లో : లెంటిల్స్ అని పిలిచే కాయధాన్యాలలోనూ, అన్ని రకాల పప్పులలోనూ ప్రోటీన్ల పాళ్లు చాలా ఎక్కువే. అందుకే డాక్టర్లు శస్త్రచికిత్స జరిగాక పప్పులు ఎక్కువగా తినమంటూ రోగులకు సలహా ఇస్తుంటారు. అయితే పప్పు తినడం వల్ల సర్జరీ చేసిన గాయానికి చీము పడుతుందనే అపోహతో చాలామంది ఈ సూచనను పాటించరు. నిజానికి పప్పుల్లో చీము పట్టించే గుణం ఉండదు. చీము పట్టడం అన్నది గాయంలోని బ్యాక్టీరియాతో తెల్లరక్తకణాలు పోరాడటం వల్ల జరిగే ప్రక్రియ. అంతేతప్ప పప్పులు తింటే గాయానికి చీము పట్టదు. టోఫూ : టోఫూను గడ్డకట్టిన సోయా పాల పెరుగుగా అభివర్ణిస్తారు. తెల్లటి ఘన (క్యూబ్) ఆకృతిలో కనిపించే ఈ టోఫూ నిజానికి ప్రోటీన్ల గడ్డ అనుకోవచ్చు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. కాస్త మెత్తగా ఉండేవి, ఒక మోస్తరుగా ఉండేవి. మరీ గడ్డపెరుగులా గట్టిగడ్డలా ఉండేవి... ఇలా రకరకాలుగా లభ్యమవుతుంటాయి. వాస్తవానికి చైనా, జపాన్ లాంటి ప్రాచ్య ఆసియా దేశాలకు చెందిన ఈ ఆహార పదార్థాన్ని అనేక రకాల వంటకాలు, తీపి పదార్థాల తయారీలలో ఉపయోగిస్తారు. ఇందులో చాలా తక్కువ క్యాలరీలు ఉండి, ప్రోటీన్ల విషయానికి వస్తే చాలా ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. ఐరన్, క్యాల్షియమ్, మాంగనీస్ లవణాలూ పుష్కలంగా ఉంటాయి. శాకాహారంలో టోఫూ అంతగా ప్రోటీన్లు లభ్యమయ్యే ఇతర వనరులు చాలా తక్కువ. సోయా పాల నుంచి తయారు చేసే ఈ పూర్తి శాకాహార పదార్థాన్ని శాకాహారులు తమ ప్రోటీన్ వనరుల కోసం నిశ్చింతగా వాడుకోవచ్చు. సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్,సన్ ఫైన్ హాస్పిటల్స్ , మాదాపూర్,హైదరాబాద్. -
ఉప్పు..! తగ్గితే తప్పు... పెరిగితే ముప్పు
ఉప్పు అన్నది కేవలం వంటల్లో వేసుకునే చిటికెడంత పదార్థం అనుకుంటే అది పొరబాటే. వాడుకోడానికి చిటికెడంత అయినా మన సంస్కృతిలో దాని స్థానం బోలెడంత. మన జాతీయాల్లో, నుడికారాల్లో అది కోరికలకూ, కృతజ్ఞతకూ ప్రతీక. ఒకనాటి కరెన్సీకి ప్రతిరూపం. వేతనానికి పర్యాయపదం. ఇలా సంస్కృతిలో దానిస్థానం ఎంత పదిలమో... ఆరోగ్యం విషయంలోనూ అంతే ప్రధానం. పుట్టబోయే బిడ్డ మేధోవికాసం సరిగా జరగాలంటే అయొడైజ్డ్ ఉప్పు వాడాలి. మన దేహంలో మెదడు నుంచి అన్ని అవయవాలకు అందాల్సిన అన్ని రకాల కమ్యూనికేషన్ సరిగా జరగాలంటే ఉప్పు కావాలి. అయితే ఈరోజుల్లో ఎవరి నోట విన్నా ఆహారంలో ఉప్పు తగ్గించాలనీ, ఉప్పు వాడకం పెరిగితే రక్తపోటు వచ్చి ప్రమాదకరమైన పరిణామాలెన్నో జరుగుతాయన్న మాటే. అది విని చాలామందిలో ఒక ఆందోళన. ఉప్పు నిజంగానే అంత ప్రమాదకరమా, ఆరోగ్యానికి చేటు కలగకుండా వాడుకోవాలంటే ఎంత పరిమాణంలో వాడాలి... లాంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. మితిమీరిన ఉప్పు నిజంగానే ప్రమాదకరం. అందులో సందేహం లేదు. అయితే ఈ కారణం వల్ల నిజంగానే ఉప్పును పూర్తిగా పరిహరించాలా? ఈ ప్రశ్నకు సమాధానం కాదు అనే చెప్పాలి. ఎందుకంటే శరీరానికి అవసరమైన ప్రధానలవణాల్లో ఉప్పు ఎన్నో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుంది. అయితే మితిమీరిన ఉప్పు రక్తాన్ని వేగంగా పరిగెత్తిస్తుంది. దాంతో రక్తనాళాల్లో రక్తం ప్రవహించే వేగం పెరుగుతుంది. అయితే రక్తనాళాల చివరల్లో అత్యంత సన్నగా ఉండే నాళాలూ ఉంటాయి. ఉదాహరణకు రక్తాన్ని వడపోసే అతి సన్నటి రక్తనాళాలు వెంట్రుక కంటే సన్నగా ఉండటం వల్ల రక్తకేశనాళికలు (కేపిల్లరీస్) అంటారు. వీటి గోడలు చాలా పలుచగా ఉండటంతో రక్తపు అధిక ఒత్తిడికి అవి పగిలిపోవడం వల్ల కిడ్నీలు దెబ్బతినవచ్చు. అదే పరిణామం గుండె గోడల్లో జరగడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు, మెదడుకు జరిగితే పక్షవాతం (స్ట్రోక్) వచ్చే అవకాశం ఉంది. అందుకే ఉప్పు మోతాదును తగ్గించాలని డాక్టర్లు మొదలుకొని, ఆహార నిపుణుల వరకు అందరూ సలహా ఇస్తుంటారు. రక్తపోటు, డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు ఉన్నవారిని ఉప్పు చాలా తక్కువగా తీసుకోవాలంటూ సలహా ఇచ్చేది కూడా అందుకే! ఉప్పుతో ఉపయోగమే లేదా? మోతాదుకు మించిన ఉప్పు ప్రమాదకారే. కానీ మోతాదుకు మించని ఉప్పుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. పైగా మెదడు నుంచి వచ్చే ఆదేశాలను అన్ని అవయవాలకు అందించడంతో పాటు చాలా రకాల కీలకమైన జీవక్రియలకు ఉప్పు అవసరం. అందుకే దాన్ని మోతాదుకు మించనివ్వద్దు తప్ప... .పూర్తిగా ఆపేయకూడదు. ఉప్పుతో ఉపయోగాలివి... ఉప్పులోని లవణగుణంలో ఉండే అయాన్ల సహాయంతోనే మన నాడీ వ్యవస్థలోని నరాల నుంచి వివిధ అవయవాలకు ఆదేశాలు అందుతుంటాయి. ఆ ఆదేశాలకు అనుగుణంగానే మన వివిధ అవయవాలన్నీ పనిచేస్తుంటాయి. అందుకే నరాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే ఉప్పు కావాలి. కండరాల కదలికలకు (మజిల్ కంట్రాక్షన్ అనే ప్రక్రియ ద్వారా) ఉప్పు ఉపయోగపడుతుంది. మన కాళ్లూ చేతులు ఉప్పు వల్లనే కదులుతుంటాయి. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు లవణాలు అందకపోవడం వల్ల కాళ్లూ, చేతుల కండరాలు బిగుసుకుపోతుంటాయి. దాంతో కండరాలు, పిక్కలు బలంగా పట్టేస్తుంటాయి. ఇది ఎంత బాధాకరమైన పరిణామమో మనలో అనుభవించిన చాలామందికి తెలిసిన విషయమే. అందుకే క్రికెట్ మొదలుకొని చాలామంది క్రీడాకారులు క్రాంప్స్ కారణంగా ఆటలాడలేని పరిస్థితి వస్తుంది. ఆడలేకపోవడం అటుంచి కాలు కదపడమే కష్టమైనంత బాధాకమైన పరిస్థితి వస్తుంది. వేసవిలో వడదెబ్బ తగిలిన వారు, నీళ్ల విరేచనాల వల్ల శరీరంలో ద్రవాలు కోల్పోయిన వారు... ఒక్కోసారి మరణించే పరిస్థితికి చేరువవుతారంటే అది కేవలం శరీరంలో నీళ్లు తగ్గడం వల్లనే కాదు. ఆ నీరు తగ్గినందువల్ల ప్రతి అవయవానికి అవసరమైన ఉప్పు అందకపోవడం వల్లనే. అందుకే వేసవిలో డీ-హైడ్రేషన్‌కు గురైన వారికి కేవలం నీళ్లు తాగించడం మాత్రమే గాక అందులో చిటికెడు ఉప్పు, చారెడు పంచదార వేస్తారు. పై కండిషన్లో కొందరు లవణాలు పుష్కలంగా ఉండే కొబ్బరినీళ్లని తాగిస్తారు. ఇక ఇలాంటి వారికి ఇచ్చే చికిత్సలో భాగంగా రక్తనాళం నుంచి సెలైన్ ఎక్కించే ప్రక్రియలో ‘సెలైన్’లో ఉండే పోషకాల్లో నీరు, ఉప్పు అత్యంత ప్రధానమైనవి. ఉప్పులోని సోడియం శరీరంలోని నీటిపాళ్లను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. కిడ్నీ చేసే మేలెంతో! ‘మరి ఉప్పుతో ఇన్ని ఉపయోగాలున్నప్పుడు కొందరు దాన్ని పూర్తిగా పరిహరిస్తారు. అది తీసుకుంటేనే ప్రమాదమంటూ దూరం పెడతారు. అలాంటివారికి ఎలాంటి ప్రమాదాలూ చోటుచేసుకోవడం లేదు కదా!’ అని కొందరిలో సందేహం ఉండవచ్చు. నిజానికి మన శరీరంలో ఉప్పు తగ్గినప్పుడు, ఆ పరిస్థితిని గుర్తించి చక్కబెట్టే బాధ్యత మూత్రపిండాలది. శరీరంలో ఉప్పు తగ్గినట్లుగా కిడ్నీలకు ‘ఉప్పందుతుంది’. దాంతో అవి తమ బాధ్యతను మొదలుపెడతాయి. శరీరంలోంచి మూత్రం ద్వారా ఉప్పు బయటికి పోకుండా అడ్డుకుంటాయి. అలా అవసరమైనదాని కంటే ఎక్కువగా ఉన్న ఉప్పును తమ వద్ద నిల్వ చేసి ఉంచి శరీరానికి అందిస్తుంటాయి. అదే శరీరంలో ఉప్పు పాళ్లు పెరగగానే మళ్లీ యథావిధిగా మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అందుకే చాలామందిలో ఉప్పు పాళ్లు తగ్గినా అప్పుడప్పుడూ పొరబాటునో, లేక వాళ్లు బయటతినే పదార్థాల్లో లభ్యమైన ఉప్పును జాగ్రత్త చేసి శరీరానికి అందిస్తూ ఆ కొరత తీరుస్తుంటాయన్నమాట. (కొన్ని పదార్థాలలో స్వాభావికంగానే ఉప్పు ఉంటుంది. అంటే మాంసంలో, కూరగాయల్లో, పాలకు సంబంధించిన పదార్థాలైన డెయిరీ ప్రాడక్ట్స్‌లో ఉప్పు ఉంటుంది. బ్రెడ్ పీసెస్ రెండింటిలో స్వాభావికంగానే 296 మి.గ్రా. ఉప్పు ఉంటుంది) అందుకే చాలామందిలో ఉప్పు అంతగా అందకపోయినా శరీరంలో ఉండే ఈ రక్షణ వ్యవస్థ వల్ల వారికి ప్రమాదం జరగదు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే కొందరిలో ‘సోడియమ్ సెన్సిటివిటీ’ అనే గుణం ఉంటుంది. ఆ గుణం ఉన్నవారు కొద్దిపాటి ఉప్పు తీసుకున్నా వారిలో రక్తపోటు పెరిగి అది గుండె జబ్బులకు, పక్షవాతానికి, కిడ్నీ సమస్యలకు, హార్ట్ ఫెయిల్యూర్‌కు దారి తీయవచ్చు. ఎంత ఉప్పు వాడాలి? అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు ప్రకారం: ఉప్పు చాలా పరిమితంగా వాడాలన్న విషయం నిర్వివాదాంశమే అయినా నిర్దిష్టంగా ఒకరికి ఎంత ఉప్పు అవసరమన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఉదాహరణకు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సుల ప్రకారం ఒక వ్యక్తి తనకు బ్లడ్‌ప్రెషర్, డయాబెటిస్, గుండెజబ్బుల వంటివి లేకపోయినా ప్రతిరోజూ 3.75 గ్రాములకు మించి వాడకూడదు. ఈ మోతాదులోనే ఉప్పు తీసుకోవడం వల్ల జీవక్రియలకు అవసరమైన 1.5 గ్రాముల సోడియమ్ అందుతుందన్నమాట. ఇక ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కిడ్నీపై అదనపు భారం పడకుండా ఉండటం కోసం ఉప్పువాడకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ గరిష్టంగా 6 గ్రాములకు మించనివ్వకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు డబ్ల్యూహెచ్ఓ సిఫార్సుల ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజుకు గరిష్టంగా 4.2 గ్రాములకు మించనివ్వకుండా ఉప్పు తీసుకోవచ్చు. అలాగే ఒక వ్యక్తి రోజుకు కనీసం 1.5 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంతకంటే తగ్గడం వల్ల అతడికి అవసరమైన సోడియమ్ పరిమాణానికి, జీవక్రియలకు విఘాతం కలగవచ్చు. ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే వారి వయసును బట్టి వాళ్లకు అవసరమైన ఉప్పు వివరాలివి... 1 నుంచి 3 ఏళ్ల పిల్లల్లో ... రోజుకు 2 గ్రాముల ఉప్పు (అంటే 0.8 గ్రా. సోడియమ్ కోసం) 4 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో... రోజుకు 3 గ్రాముల ఉప్పు (అంటే 1.2 గ్రా. సోడియమ్ కోసం) 7 నుంచి 10 ఏళ్ల పిల్లల్లో... రోజుకు 5 గ్రాముల ఉప్పు (అంటే 2 గ్రా. సోడియమ్ కోసం) 11 ఏళ్లు పైబడ్డ పిల్లలకు... రోజుకు 6 గ్రాముల ఉప్పు (అంటే 2.4 గ్రాముల సోడియమ్ కోసం) కావాలి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి తాము వాడాల్సిన ఉప్పును నిర్ణయించుకొని, దాన్ని అదే మోతాదులో పరిమితికి మించకుండా తీసుకుంటే ఆరోగ్యం అన్ని విధాలా బాగుంటుంది. స్వతహాగా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలివి... ఉప్పు పరిమితికి మించితే అది అనారోగ్య హేతువు అన్న విషయం తెలిసిందే. అందుకే రక్తపోటు, గుండెజబ్బులు, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు స్వతహాగా ఉప్పు ఎక్కువ పాళ్లలో ఉండే ఆహారాలను పరిహరించాలి. ఆ ఆహార పదార్థాల్లో కొన్ని... అప్పడాలు పచ్చళ్లు బేకరీ ఐటమ్స్ సాస్ నిల్వ ఉంచే ఫ్రోజెన్ ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్ స్మోక్డ్ మాంసాహారం చీజ్ సలాడ్స్ సాల్టెడ్ చిప్స్ వంటి నిల్వ ఉంచే చిరుతిండ్లు దీర్ఘకాలం నిల్వ ఉంచేందుకు వీలుగా (షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండేలా) రూపొందించిన శ్నాక్స్. ఉప్పు విపరీతంగా తగ్గితే కనిపించే లక్షణాలు శరీరంలో ఉప్పు పెరిగితే అది ప్రమాదకరమన్న విషయం తెలిసిందే. అలాగే శరీరంలో ఉప్పు పాళ్లు విపరీతంగా తగ్గినా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో సోడియమ్ పాళ్లు తగ్గడం వల్ల ఆ లక్షణాలు కనిపిస్తాయి. అవి... తీవ్రమైన అలసట (ఫెటీగ్) తలనొప్పి కండరాలు బిగుసుకుపోవడం (మజిల్ క్రాంప్స్) హైపోనేట్రీమియా కండిషన్: ఆహారంలో ఉప్పు విపరీతంగా తగ్గడం వల్ల ఏర్పడే హైపోనేట్రీమియా అన్న కండిషన్ వల్ల ఒక్కోసారి ఐసీయూలో చేరి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఉప్పు ఎక్కువ కావడం వల్ల కనిపించే లక్షణాలు విపరీతమైన దాహం కిందినుంచి అపానవాయువు రూపంలో గ్యాస్ పోవడం (బ్లోటింగ్) పై అంశాలన్నింటినీ బట్టి ఆహారంలో ఉప్పును తగ్గనివ్వకూడదు, అలాగని మించనివ్వకూడదు అన్న విషయం గుర్తుంచుకోవాలి. -నిర్వహణ: యాసీన్ గర్భిణులూ జాగ్రత్త! కొందరు ఉప్పు తగ్గించి తినాలనే వారు చాలా పరిమితంగా ఉప్పు వాడుతుంటారు. అలాంటి కుటుంబంలో ఉండే గర్భవతులు ఒకింత జాగ్రత్తగా ఉండాలి. మిగతావారి విషయం ఎలా ఉన్నా గర్భవతులు రోజుకు 2 నుంచి 8 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంతకు మించి తీసుకోవడం కూడా ప్రమాదమే అని గుర్తుంచుకోవాలి. గర్భవతుల్లో ఉప్పు పాళ్లు బాగా తగ్గితే కడుపులోని బిడ్డ బరువు బాగా తగ్గి అండర్‌వెయిట్ బేబీగా పుట్టవచ్చు. తక్కువ బరువున్న పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పైగా గర్భిణులు 2 గ్రా. నుంచి 8 గ్రా. ఉప్పు కూడా తీసుకోకపోతే బిడ్డలో మానసిక వికాసం కూడా తగ్గవచ్చు. అందుకే ఇలా ఉప్పు బాగా తగ్గించి తీసుకునే కుటుంబాల్లోని గర్భవతులు తమ సోడియమ్ అవసరాల కోసం స్వాభావికంగా ఉప్పు లభ్యమయ్యే కూరగాయలు, తాజాపండ్లు, పండ్లరసాల వంటివి ఎక్కువ పరిమాణంలో తప్పక తీసుకోవాలి. సుజాత స్టీఫెన్ న్యూట్రిషనిస్ట్ అవేర్ గ్లోబల్ హాస్పిటల్స్, హైదరాబాద్