ఆ విషాలను కడుగుదాం రండి!! | Healthy fruits that could have been washing ... | Sakshi
Sakshi News home page

ఆ విషాలను కడుగుదాం రండి!!

Published Wed, Mar 8 2017 11:01 PM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

ఆ విషాలను  కడుగుదాం రండి!!

ఆ విషాలను కడుగుదాం రండి!!

జీవఫలం – చేదు విషం!

ఒకప్పుడు చందమామ కథల్లో కొన్ని పండ్లు చాలా ఆకర్షణీయంగా కనిపించేవి. కానీ అవి తినగానే చనిపోవడమో లేదా కురూపులైపోవడమో జరుగుతుందని అరణ్యంలో మారువేషాల్లో సంచరించే రాజులనూ, రాకుమారులనూ హెచ్చరించేది పేదరాసి పెద్దమ్మ. ఇప్పుడు అడవుల్లోకి పోయి... ఆకర్షణీయమైన వింతపండ్లను వెతకనక్కర్లేదూ... పేదరాసి పెద్దమ్మతో చెప్పించుకోనవసరం లేదు. మన మార్కెట్‌లోకి వచ్చే ద్రాక్ష పండ్లను చూస్తే చాలు. దూరం నుంచి చూసినా పండుపై ఏదో మందులు చిమ్మిన పొరలు కనిపిస్తాయి. ముట్టుకొని చూస్తే పండు జిడ్డు జిడ్డుగా చేతికి తగులుతూ ఉంటుంది. ఆ చేతిని ఎప్పుడెప్పుడు కడుక్కుందామా అని ఫీలింగ్‌తో చేతులు కడుక్కునేవరకూ అంతా అస్థిమితంగా ఉంటుంది. గుత్తి నుంచి అప్పుడో, ఇప్పుడో ఒకటో రెండో పండ్లను తీసుకొని తినాలన్న ఇచ్ఛ  ఇగిరిపోతుంది. మనసు చచ్చిపోతుంది.

ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తున్న ద్రాక్షల్లో నల్లద్రాక్ష, పచ్చద్రాక్ష, క్యాప్సూల్‌ ద్రాక్ష వంటి గుత్తులు వినియోగదారులను ఆకర్షిస్తున్నా... వాటిపై పేరుకుపోయి కనిపిస్తున్న రసాయన మందులు, క్రిమిసంహార మందులతో వెంటనే వాటి నుంచి దృష్టి మళ్లుతోంది. అత్యాధిక మోతాదులో వాడే ఎండోసల్ఫాన్‌ వంటి మందులు... పండ్లు తినేవారి ఆరోగ్యంపై దీర్ఘకాలిక దుష్ప్రభావాలకు కారణమవుతున్నాయి. అంతేకాదు... గతంలోలా ఒకసారో, రెండోసార్లో ద్రాక్షపండ్లను కడిగినా ఇప్పుడు ప్రయోజనం లేదు. క్రిమిసంహారకమందుల అవశేషాలు అన్నో, ఇన్నో పండ్లపై మిగిలిపోతున్నాయి. ఈ విషయాన్ని ఆహారం, మందుల భద్రతపై అత్యున్నత సంస్థ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ)తో పాటు మన దేశానికి చెందిన సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) వేర్వేరుగా పేర్కొంటున్నాయి. ఇటీవలే సీఎస్‌ఈ సమర్పించిన నివేదిక ప్రకారం... ద్రాక్షను కడిగాక కూడా వాటిపై మిగిలిపోతున్న క్రిమిసంహారక మందుల అవశేషాలు (కెమికల్‌ రెసిడ్యూస్‌) వల్ల క్యాన్సర్,  ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసేలా నరాలకు సంబంధించిన వ్యాధులు, పిల్లల్లో  పుట్టుకతో
వచ్చే వ్యాధులు కనిపిస్తున్నాయని పేర్కొంది. అంతేకాదు. ఇలాంటి పండ్ల వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా దెబ్బతింటోందని చెబుతోంది సీఎస్‌ఈ.

సాంప్రదాయిక పద్ధతుల్లో ఇప్పటివరకూ మనం ఒక లీటర్‌ నీళ్లలో రెండు చెంచాల ఉప్పు కలిపి, రెండుసార్లు కడిగినా రసాయన మందుల అవశేషాలు పూర్తిగా పోవడం లేదని సీఎస్‌ఈ పేర్కొంది. అందుకే ద్రాక్ష, ఆపిల్స్, జామ, రేగుపండ్లు, మామిడి , పీచ్, పియర్‌ వంటి పండ్లనూ, వాటితో పాటు కొన్ని కూరగాయలను కడిగే విధానాన్ని అది సూచిస్తోంది.

పండ్లను ఆరోగ్యకరంగా కడగటం ఎలాగంటే...
నీళ్లు 90 శాతం, తెల్ల వెనిగర్‌ 10 శాతం తీసుకుని, అందులో మనం తినదలచుకున్న పండ్లను కాసేపు ఉంచి, ఆ తర్వాత నల్లానుంచి జారుతూ ఉన్న ఫ్రెష్‌ వాటర్‌ ప్రవాహంలో వాటిని కడగడం వల్ల చాలావరకు రసాయనాలు శుభ్రం అవుతాయని పేర్కొంటోంది సీఎస్‌ఈ. అంతేకాదు... ఇలా నల్లా నుంచి జారే నీటి వల్ల (అంటే రన్నింగ్‌ వాటర్‌ కింద) పండ్లను కడిగే సమయంలో పండుపై ఏదైనా గుంటలు, ఇరుకు చారల వంటి ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన రసాయనాలూ, కడుక్కుపోయి, కొట్టుకుపోతాయని పేర్కొంటోంది ఆ సంస్థ.

మరో మార్గం ఇలా...
ఒక బౌల్‌లో నాలుగు వంతుల నీరు, ఒక వంతు వెనిగర్‌ తీసుకొని అప్పటికే కచ్చాపచ్చాగా కడిగిన పండ్లను, కూరగాయలను అందులో ఉంచాలి. మనం తినాలనుకున్న పండ్లను అందులో దాదాపు 30 – 60 నిమిషాల పాటు ఉంచి మళ్లీ వాటిని రుద్దుతూ (రిన్సింగ్‌ చేస్తూ) కడగాలి. ఆ తర్వాత జర్రున జారుతున్న నీటి ప్రవాహంలో మళ్లీ కడగడం సురక్షితం అంటున్నారు నిపుణులు. కొన్ని పెద్దసైజు పండ్ల మీద మరి ఎక్కువ రసాయన అవశేషాలు ఉన్నాయని అనిపిస్తే 1 టేబుల్‌ స్పూన్‌ లెమన్‌ జ్యూస్, 2 టేబుల్‌ స్పూన్స్‌ బేకింగ్‌సోడాలను ఒక కప్పు నీళ్లలో కలిపి... ఆ మిశ్రమాన్ని పండుపై వేసి రుద్దుతూ శుభ్రం చేయాలి. అలా రుద్దిన ఆ పండును నీటి ప్రవాహం కింద ఉంచి, పండుపై పేరుకున్న లెమన్‌జ్యూస్, బేకింగ్‌సోడాల జడ్డిమిశ్రమం కొట్టుకుపోయే వరకు కడగాలి. ఇలా చేయడం వల్ల పండుపై ఉన్న రసాయనాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు.

మొత్తం ఒకే కట్టగా ఉపయోగించే వాటిని కడగడం ఇలా...
కొత్తిమీర, కర్వేపాకులను సాధారణంగా మొత్తం కట్టకట్టనంతా ఒకేసారి కడుగుతుంటారు. ఇలా కడిగే వాటిని నీరు నిండి ఉన్న బౌల్‌లో రెండు మూడుసార్లు తిప్పుతూ కడగాలి. ఆ తర్వాత పేపర్‌ టవల్‌తో తుడవాలి. కొలరాడో స్టేట్‌ యూనివర్సిటీ వారి అధ్యయనం ప్రకారం ఇలాంటి వాటిని కడగడానికి ఉపయోగించే నీటిలో కాస్తంత నిమ్మరసం, కొంత వెనిగర్‌ వేయడం వల్ల కట్ట మీది బ్యాక్టీరియా, ఈ–కొలై శుభ్రంగా కడుక్కుపోవడంతో పాటు కట్టకు కాస్తంత కొత్త రుచి కూడా వస్తుంది. ఇక నేరేడు, బెర్రీపండ్ల వంటి వాటిని వెనిగర్‌ సొల్యూషన్‌లో కడగాలి. మనం షాపింగ్‌ చేస్తున్నప్పుడే పండుపై దెబ్బలేని వాటిని ఎంపిక చేయాలి.

గిన్నెలను కడగడం ఎలా?
మనం ఆహారపదార్థాలు, కూరగాయలు, ఆకుకూరలను పెట్టుకునే గిన్నెలు, బౌల్స్‌ను వేడినీళ్లతోనూ, డిటెర్జెంట్‌తోనూ మొదట కడగాలి. ఆ డిటర్జెంట్‌ తాలూకు సబ్బు పూర్తిగా కడుక్కుపోయేలా మళ్లీ మంచినీళ్లతో ఈసారి చల్లటి నీళ్లతో కడగాలి. ఆ తర్వాతే మనం శుభ్రం చేసుకున్న కూరగాయలను ఆ గిన్నెలలో పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు గిన్నెలు లోహంతో చేసినవి కాకుండా, పింగాణీవి అయితే అవీ శుభ్రంగా ఉంటాయి. శుభ్రపరచిన, కోసిన కూరగాయలూ మళ్లీ అపరిశుభ్రమయ్యే అవకాశాలు తక్కువ.

మట్టి కింద ఉండే దుంపల్ని శుభ్రం చేయడమిలా...
∙మట్టి కింద ఉండే బంగాళదుంప (ఆలుగడ్డ), క్యారట్‌ వంటి వాటని వెంటనే శుభ్రపరచకుండా కొద్దినిమిషాల పాటు నీళ్లలో నాననివ్వాలి. వాటిని ఎలాగూ చెక్కుతీసి వాడినప్పటికీ, నాననిచ్చిన తర్వాత కోసే ముందుగా ధారగా పడే నీళ్లలో కడగాలి. ∙కాలిఫ్లవర్, బ్రకోలీ లాగా ముడుతలు ముడుతలుగా ఉండి, ఆ ముడుతల్లో మట్టి చేరే అవకాశమున్న పువ్వుకూరలను కాసేపు నీళ్లలో నాననివ్వాలి. ఆ తర్వాత నీళ్లు కారిపోయేలా రంధ్రాలుండే పాత్ర (కొలాండర్‌)లోకి వాటిని తీసుకోవాలి. ∙కాయగూరల పైపొర చెక్కు తీసేలా ఉండే పొట్లకాయ, బీరకాయ, సొరకాయ వంటివాటిని పైనుంచి ధారగా పడుతున్న నీటిలో ఒకటికి రెండుసార్లు కడిగిన తర్వాతే కోయాలి. ∙ఇటీవల పుట్టగొడుగులను కూరగాయలుగా వాడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. వీళ్లకోసం మష్‌రూమ్‌ బ్రష్‌ అనే ఉపకరణం అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని చల్లటి నీటిలో కడగాలి. ఆ తర్వాత పేపర్‌ టవల్‌తో శుభ్రం చేయాలి. ∙కూరగాయలలో వంకాయలను కోసే పద్ధతి కాస్త వేరుగా ఉంటుంది. ముందుగా వంకాయలను ధారగా పడుతున్న నీటిలో కలగాలి. ఆ తర్వాత కాస్తంత వాటిని కాస్తంత నిమ్మనీరు, కాస్తంత ( 2 శాతం) చింతపండు నానేసిన నీరు, కాస్తంత ఉప్పు, 4 శాతం అసిటిక్‌ ఆసిడ్‌ ద్రవాలను ఒక పెద్ద పాత్రలోని నీళ్లలో కలిపి, ఆ ద్రవంలో ఒక్కొక్క వంకాయను విడివిడిగా కడగాలి. దీనివల్ల వంకాయల మీద చల్లి ఉన్న క్రిమిసంహారకాలు కడుక్కుపోతాయి లేదా నిర్వీర్యమవుతాయి. ∙పుచ్చకాయ, కర్బూజకాయ లాంటి వాటిని ధారగా పడుతున్న నీటికింద కడుగుతూ మెత్తటి కుచ్చులున్న వెజిటబుల్‌ బ్రష్‌తో శుభ్రంగా కడిగాకే, ముక్కలుగా కోయాలి.

మరికొన్ని పండ్లు/కూరగాయలు....   వాటిని శుభ్రపరిచే విధానాలు
వేర్వేరు వెజిటబుల్స్‌ శుభ్రపరిచే పద్ధతులివి...
∙చిన్న కాడకు అంటి ఉండే పండ్లను బాగా శుభ్రం చేశాక... మురికి పేరుకునే అవకాశాలు ఎక్కువగా కాడ వద్ద ఉంటాయి. కాబట్టి ఇలా కాడ ఉన్న పండ్లను శుభ్రం చేశాక అటు కాడ, ఇటు కాడకు రెండోవైపున చెక్కు తీసినట్లుగా కత్తితో కోయడం మేలు. ఈ నియమం ఆపిల్, పియర్‌ పండు, పీచ్‌ పండ్లకు వర్తిస్తుంది. ∙మందంగా ఉండే తోలు ఉన్న పండ్లు (ఉదాహరణకు నారింజ, కమలాలు) తినబోయే ముందు, మనం ఎలాగూ పండు తోలును తినకపోయినా.. ఒక్కసారి తేలిగ్గా కడగడం మేలు. ∙ఇక పాలకూర, లెట్యూజ్, కొత్తిమీర, కరివేపాకు, క్యాబేజీ లాంటి వాటిని శుభ్రం చేసే ముందర వాటిని నల్లా/కొళాయి కింద ప్రవహించే నీళ్ల కింద కాసేపు ఉంచి, శుభ్రం చేయడం మంచిది. క్యాబేజీ లాంటివి శుభ్రం చేసే సమయంలో వాటి పైన ఉన్న ఆకులు ఒకటి రెండు పొరలను తీసేయడం వల్ల మిగతాదంతా శుభ్రంగా ఉంటుంది. ∙ఆకుకూరల్ని శుభ్రంగా కడిగాక వాటిపై నీళ్లు ఆరేలా కాసేపు ఆగాలి. ఆ తర్వాత శుభ్రమైన టీ టవల్‌తో వాటిని తుడవాలి. అప్పుడే వాటిని కోయాలి. అంతేగానీ ఆకుకూరల్ని కోశాక వాటిని కడగడం సరికాదు. అలా చేయడంవల్ల పోషకాలు కోల్పోతాం. సలాడ్స్‌గా చేయదలచిన ఆకుకూరలను, కాయగూరలను ఇంటికి తెచ్చిన వెంటనే కడిగి సలాడ్స్‌గా కోసుకోవాలి.
– సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement