సామాన్యులకు 'అందని ద్రాక్ష'..! | Man Pays $11,000 for a Bunch of Grapes | Sakshi
Sakshi News home page

సామాన్యులకు 'అందని ద్రాక్ష'..!

Published Fri, Jul 15 2016 10:49 AM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

సామాన్యులకు 'అందని ద్రాక్ష'..!

సామాన్యులకు 'అందని ద్రాక్ష'..!

జపాన్ః మనకు అందని ఎత్తులో ఉన్న ఏ విషయానికైనా  'అందని ద్రాక్ష' సామెతను ఉదహరిస్తుంటాం. కానీ జపాన్ లోని ఓ దుకాణందారుడు నిజంగా సామాన్యులకు అందని ద్రాక్షనే తన దుకాణంలో ప్రదర్శనకు పెట్టాడు. ఓ అరుదైన జాతికి చెందిన ద్రాక్షపళ్ళ గుత్తిని ఏకంగా లక్షల రూపాయలు వెచ్చించి వేలంలో దక్కించుకోవడమే కాదు... వాటిని తన దుకాణంలో ప్రదర్శనకు ఉంచి వచ్చినవారికి రుచి చూపించి ఇప్పుడు జపాన్ లోనే  వార్తల్లో వ్యక్తిగా మారాడు.

పాశ్చాత్య ప్రపంచంలో అరుదైన వైన్ కు ఎటువంటి గుర్తింపు ఉంటుందో అలాగే జపాన్ లో అరుదైన, ప్రత్యేకత కలిగిన పళ్ళను కొనుగోలు చేయడం, వినియోగించడం వారి హోదాకు గుర్తుగా భావిస్తారు. అదే నేపథ్యంలో జపాన్ లోని ఓ కిరాణా దుకాణం యజమాని రూబీ రోమన్ జాతికి చెందిన ద్రాక్షపళ్ళ గుత్తిని సుమారు 8 లక్షల రూపాయలకు వేలంలో దక్కించుకున్నాడు. అది తనకు గౌరవంగా భావించడమే కాదు...  అలా లక్షలు పోసి కొన్న ద్రాక్షను ప్రదర్శనకు పెట్టి, అందరికీ ఉచితంగా రుచి చూపించాడు. ఆస్పత్రులను సందర్శించేప్పుడు, వివాహాలు, వేడుకల సందర్భాల్లో నాణ్యత కలిగిన, అరుదైన, రుచికరమైన పళ్ళను అందించడం జపాన్ సంప్రదాయాల్లో ఒక భాగమే కాక, హోదాగా కూడా భావిస్తారు.  అందుకే అక్కడ అటువంటి ఖరీదైన పళ్ళను అమ్మేందుకు ప్రత్యేక దుకాణాలు కూడ ఉంటాయి.  ప్రత్యేక పద్ధతుల్లో పండించిన, ఉత్పత్తి చేసిన పళ్ళ జాతులను ఆ యా దుకాణాల్లో అందుబాటులో ఉంచుతారు. అటువంటి పళ్ళను కొని, ఇతరులకు బహుమతిగా ఇవ్వడం కొనుగోలుదారులు సైతం హోదాగా భావిస్తారు.  

ఈ సీజన్ లో ప్రత్యేకంగా పండించిన రూబీ రోమన్ జాతికి చెందిన 30 ద్రాక్ష పళ్ళను కొన్నవాళ్ళలో జపాన్ లోనే తకమారూ కొనీషీ మొదటివాడు. పింగ్ పాంగ్ బంతుల సైజులో ఉన్న ఆ ద్రాక్ష.. నిజంగా రూబీ రోమన్ రత్నాల్లా ఉన్నాయని తెగ సంబరపడిపోతున్నాడు. అందుకే తాను సుమారు 8 లక్షల రూపాయలను వెచ్చించానని, తన దుకాణంలో ప్రదర్శనకు ఉంచి, అందరికీ రుచి చూపిస్తున్నానని గర్వంగా చెప్తున్నాడు.

జపాన్ సముద్ర తీరంలోని ఇషికవ ప్రాంతంలో ఈ రూబీ రోమన్ జాతిని ఫిజిమోరీ వెరైటీ విత్తనాలతో మొదటిసారి 1992 లో పండించారు. ఈ ద్రాక్ష ఒక్కోటి కనీస బరువు 20 గ్రాములు ఉండటంతోపాటు, రసంలో 18 శాతం చక్కెర పాళ్ళు కలిగి ఉంటుంది. ఈ అరుదైన జాతి ద్రాక్షను మొదటిసారి 2008 లో జపాన్ పండ్ల మార్కెట్లో వేలానికి పెట్టారు. అయితే అప్పట్లో నిజంగానే అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా దాని ధర కూడ ప్రపంచంలోని ద్రాక్ష పళ్ళ మార్కెట్లలోనే అత్యధిక ధర పలికింది. అంతేకాదు అత్యంత అరుదైన, ఖరీదైన ద్రాక్షగా కొత్త రికార్డు సృష్టించింది.

అయితే వేలంలో రూబీ రోమన్ ద్రాక్షను పొందటం నాకెంతో ఆనందంగా ఉందని, ప్రత్యేక గౌరవం లభించినట్లుగా ఉందని కొనిషీ చెప్తున్నాడు. తన దుకాణానికి వచ్చిన కొనుగోలుదారులు రుచి చూడటంతోపాటు, కొందరు ఇతర వ్యాపారులు శాంపిల్ గా కూడ ఈ ద్రాక్షను తీసుకెళ్ళారని చెప్తున్నాడు. ఒక్కోటి సుమారు 25 వేల రూపాయల ఖరీదు చేసే ఆ పళ్ళను కొనిషీ జనానికి ఎలా ఉచితంగా ఇచ్చాడో తెలియదు కానీ, అతడి దుకాణం దగ్గర శాంపిల్స్ కోసం, రుచికోసం జనం క్యూ కట్టడం మాత్రం పెద్ద ఈవెంట్ గా మారిపోయింది. పత్రికలు, మీడియా లో ప్రత్యేక వార్తా కథనం అయిపోయింది. కాగా మార్కెట్లోకి కొత్తగా వచ్చిన అరుదైన జాతి ద్రాక్షను అందరికీ పరిచయం చేసి, తన అమ్మకాలను పెంచుకొనేందుకు సదరు వ్యాపారి ఆ మార్గం ఎంచుకొన్నాడా అన్న అనుమానం కూడా కలుగుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement