Food and Drug Administration
-
చికున్ గున్యాకు తొలి వ్యాక్సిన్
న్యూఢిల్లీ: చికున్ గున్యాకు తొలిసారిగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచి్చంది. ఇక్స్చిక్ పేరిట రూపొందిన ఈ వ్యాక్సిన్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతించింది. 18 ఏళ్లు, ఆ పైబడిన వారికి దీన్ని ఇచ్చేందుకు అనుమతిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘చికున్ గున్యా తీవ్ర వ్యాధికి, దీర్గకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు, అప్పటికే ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన తక్షణావసరాన్ని ఈ వ్యాక్సిన్ తీరుస్తుందని నమ్ముతున్నాం’’ అని వివరించింది. ‘‘ఇక్స్చిక్ వ్యాక్సిన్‌ను ఇప్పటికే 266 మంది రోగులపై ప్రయోగాత్మకంగా పరీక్షించగా మంచి ఫలితాలొచ్చాయి. ఉత్తర అమెరికాలో 3,500 మందికి వ్యాక్సిన్ ఇవ్వగా చక్కని గుణం కనిపించింది. 1.6 శాతం మందిలో మాత్రం తీవ్రమైన తలనొప్పి తదితర గున్యా తాలూకు లక్షణాలు కనిపించాయి. ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చాల్సి వచి్చంది’’ అని ఎఫ్‌డీఏ సెంటర్ ఫర్ బయోలాజిక్స్ ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ పీటర్ మార్క్స్ చెప్పారు. బయోటెక్ కంపెనీ ‘వాల్వెవా ఆ్రస్టియా’ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. -
ఆ టీకా ఒక్క డోసు చాలు
వాషింగ్టన్: కరోనాతో అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యం అమెరికా మూడో వ్యాక్సిన్‌కి అనుమతులు మంజూరు చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేసిన టీకా వినియోగానికి శనివారం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతినిచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా ఒక్క డోసు ఇస్తే సరిపోతుందని, రెండు డోసులు అవసరం లేదని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికా ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లకు అనుమతిచ్చింది. దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పుడు మూడో కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌కి ఎఫ్‌డీఏ అనుమతులు రావడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. కరోనాపై పోరాటం ఇక తుది దశకు చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ప్రజలందరికీ ఇది అత్యంత ఉత్సాహాన్నిచ్చే వార్తని బైడెన్ వ్యాఖ్యానించారు. ‘‘జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌ను అన్ని విధాలుగా పరీక్షించి, రకరకాలుగా ప్రయోగాలు నిర్వహించి సంతృప్తి చెందిన తర్వాతే ఎఫ్‌డీఏ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. కరోనాని తరిమికొట్టడానికి ఈ వ్యాక్సిన్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది’’అని బైడెన్ చెప్పారు. వీలైనంత తొందరగా దేశంలో అత్యధిక మందికి వ్యాక్సిన్ డోసులు ఇస్తేనే కరోనా ఉధృతిని కట్టడి చేయగలమని అన్నారు. ప్రపంచంలోనే కరోనా వైరస్‌తో అత్యధికంగా అమెరికాలోనే 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌ను అడ్డుకోగలదు అమెరికా, లాటిన్ అమెరికా, దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ప్రయోగాల్లో జేఅండ్‌జే వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనది, సామర్థ్యమైనదని తేలింది. కరోనా వైరస్‌పై 85% సామర్థ్యంతో ఈ వ్యాక్సిన్ పని చేస్తుందని వివిధ ప్రయోగాలు వెల్లడించాయి. దక్షిణాఫ్రికా వేరియెంట్‌పైన కూడా ఈ టీకా అద్భుతంగా పని చేస్తోందని ప్రాథమికంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ ఏడాది చివరి నాటికి కోటి డోసుల్ని ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా నిర్ణయించింది. జాన్సన్ వ్యాక్సిన్ నిల్వ చేయడం కూడా చాలా సులభం. ఫైజర్, మోడెర్నా మాదిరిగా అత్యంత శీతల వాతావరణంలో ఉంచాల్సిన పని లేదు. సాధారణ రిఫ్రిజిరేటర్లలో కూడా మూడు నెలల పాటు ఈ టీకా నిల్వ ఉంటుంది. -
మోడెర్నా టీకాకు అత్యవసర అనుమతి!
వాషింగ్టన్: అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా అత్యవసర వినియోగానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఇప్పటికే అనుమతి ఇచ్చింది. 95 శాతం సమర్థంగా పని చేస్తోందని చెబుతున్న ఈ టీకాను కరోనా బాధితులకు అందజేస్తున్నారు. అమెరికాకే చెందిన మోడెర్నా సంస్థ అభివృద్ధి చేసిన టీకా ఎంఆర్ఎన్ఏ–1273కు కూడా అత్యవసర వినియోగ అనుమతి(ఈయూఏ) ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కార్యాచరణను ముమ్మరం చేసినట్లు ఎఫ్‌డీఏ కమిషనర్ స్టీఫెన్ హన్ గురువారం చెప్పారు. మోడెర్నా టీకాకు అనుమతి ఇవ్వొచ్చంటూ నిపుణుల కమిటీ ఎఫ్‌డీఏకు సిఫార్సు చేసింది. 18 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్ సురక్షితమేనని కమిటీ తేల్చింది. అమెరికాలో ఫైజర్ టీకా తర్వాత అందుబాటులోకి రానున్న రెండో కరోనా టీకాగా మోడెర్నా వ్యాక్సిన్ రికార్డుకెక్కనుంది. గత వారం ఇదే నిపుణుల కమిటీ ఫైజర్ టీకాకు అనుమతి ఇవ్వాలంటూ సిఫార్సు చేయగా, ఒక్కరోజులోనే ఎఫ్‌డీఏ నుంచి లభించింది. మోడెర్నా టీకాకు సైతం త్వరలోనే అనుమతివస్తుందంటున్నారు. ఫైజర్ టీకా తీసుకున్న నర్సుకు అస్వస్థత అమెరికాలోని టెన్నెస్సీ నగరంలో ఓ ఆసుపత్రిలో ఫైజర్ టీకా తీసుకున్న నర్సు టిఫానీ డోవర్ కొద్ది సేపటికే అస్వస్థతకు గురయ్యారు. ఆమె చికిత్స అనంతరం కోలుకున్నారని అధికారులు తెలిపారు. టీకా వేయించుకున్న మైక్ పెన్స్ కోవిడ్ టీకా తీసుకున్న ప్రపంచనేతగా అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నిలిచారు. పెన్స్ భార్య కరేన్ కూడా టెలివిజన్ లైవ్‌లో కోవిడ్ టీకా వేయించుకున్నారు. ఊహించిన దానికంటే ముందుగానే వ్యాక్సిన్ రావడానికి అధ్యక్షుడు ట్రంప్ పాలన సాయపడింది. అయితే దేశ చరిత్రలో సుదీర్ఘకాలం నిర్వహించిన 5 రోజుల వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌లో ట్రంప్ ఎక్కడా కనిపించలేదు. ట్రంప్ టీకా తీసుకోలేదు. అయితే టీకా గురించి మాత్రం రెండుసార్లు ట్వీట్ చేశారు. -
అమెరికాలో 11 లేదా 12న వ్యాక్సిన్ ?
వాషింగ్టన్: అమెరికాలో డిసెంబర్ రెండో వారంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వ్యాక్సిన్ తయారీని పర్యవేక్షిస్తున్న ఆపరేషన్ వార్ఫ్ స్పీడ్ అధిపతి డాక్టర్ మోన్సెఫ్ స్లౌయి అంచనా మేరకు డిసెంబర్ 11 లేదా 12న వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు ఇవ్వాలంటూ ఫైజర్–బయోఎన్‌టెక్ కంపెనీలు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10న అడ్మినిస్ట్రేషన్ అడ్వైజరీ కమిటీ కీలక సమావేశం జరగనుంది. వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు లభిస్తే, 24 గంటల్లోగా రాష్ట్రాలకు పంపిణీ చేసి డిసెంబర్ 11న గానీ లేదా 12న గానీ వ్యాక్సినేషన్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అమెరికా వ్యాపంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందుతుందని డాక్టర్ మోన్సెఫ్ అన్నారు. వ్యాక్సిన్ వల్ల రోగనిరోధక పెరిగి, మొత్తం జనాభాలో 70 శాతం నిరోధకత వస్తే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని అన్నారు. అన్ని వయసుల వారిపై తమ వ్యాక్సిన్ దాదాపు 95 శాతం ఫలితం చూపిస్తోందని ఫైజర్–బయోఎన్‌టెక్ కంపెనీలు ఇటీవల ప్రకటించాయి. -
కరోనా చికిత్సకు మందు.. ట్రంప్ ఆనందం!
వాషింగ్టన్: కోవిడ్ బాధితుల చికిత్సలో పనిచేసే ప్రయోగాత్మ ఔషదం రెమ్‌డెసివిర్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అనుమతినిచ్చింది. కోవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన రోగులకు అత్యవసర మెడిసన్‌గా రెమ్‌డెసివిర్ యాంటీ వైరల్ ఇంజక్షన్‌ను వాడొచ్చునని తెలిపింది. ఇక కరోనా పుట్టుకొచ్చిన తర్వాత.. వైరస్ చికిత్సకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ జరుపుకొని బయటికొచ్చిన తొలి మెడిసిన్ ఇదే కావడం విశేషం. కోవిడ్ బాధితులు త్వరగా కోలుకునేందుకు ఈ మెడిసిన్ తోడ్పడుతుందని తయారీ సంస్థ గిలీడ్ సైన్సెస్ వెల్లడించింది. ఇక రెమ్‌డెసివిర్‌కు అనుమతులు వచ్చిన సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇది నిజంగా ఆశాజనక పరిస్థితి’అని పేర్కొన్నారు. (చదవండి: లాక్డౌన్ ఎత్తివేస్తే ఇక అంతే: డబ్ల్యూహెచ్ఓ) వైట్ హౌజ్‌లో గిలీడ్ సైన్సెస్ సీఈఓ డానియెల్ ఓడేతో ఆయన ముచ్చటించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల బాగుకోసం ఇది తొలి అడుగు అని ఓడే పేర్కొన్నారు. నిస్వార్థంగా రెమ్డెసివిర్తో వారికి సేవ చేస్తామని చెప్పారు. కాగా, 1.5 మిలియన్ డోసుల మెడిసిన్‌ను ఉచితంగా అందిస్తామని గిలీడ్ సైన్సెస్ ఇదివరకే చెప్పింది. ఈ మెడిసిన్‌తో బాధితులు 31 శాతం త్వరగా కోలుకుంటారని అమెరికాలోని అలర్జీ అండ్ ఇన్ఫెక్చువస్ డిసీజెస్ వెల్లడించింది. ఇది వైరస్ యొక్క జన్యువులో కలిసిపోయి, దాని ప్రతిరూపణ ప్రక్రియను తగ్గించేస్తుందని తెలిపింది. కాగా, రెమ్‌డెసివిర్‌ను తొలుత ఎబోలాపై పోరుకు తయారు చేశారు. అయితే, మరణాలను తగ్గించడంలో ఈ మెడిసన్ ప్రభావం చూపలేదని వైద్య వర్గాలు తెలిపాయి. (చదవండి: 20 రోజుల తర్వాత కనిపించిన కిమ్) -
ఐదు నిమిషాల్లోనే కరోనా టెస్ట్!
కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే కరోనా వైరస్ వ్యాధిని నిర్ధారించే ‘‘రోగ నిర్ధారణ పరీక్ష కిట్’’ను ఆవిష్కరించినట్లు అబాట్ ల్యాబొరేటరీస్ శుక్రవారం ప్రకటించింది. ID NOW COVID&19 అని పిలిచే ఈ పరీక్షతో అనుమానిత వ్యక్తులకు వ్యాధి సోకిందా లేదా అనే విషయాన్ని 5 నిమిషాల్లో తెలుసుకోవచ్చు. తాజాగా అమెరికా ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) దీనికి అనుమతులిచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ పరీక్షలను అన్ని ఫిజీషియన్స్ ఆఫీసులు, అత్యవసర సంరక్షణ క్లినిక్‌లు, హాస్పిటల్లో సులభంగా జరపవచ్చని పేర్కొంది. ప్రపంచదేశాలను కబళిస్తున్న కరోనా వైరస్ అమెరికాలో తీవ్రరూపం దాల్చింది. ఇక్కడే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో స్థానికులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు వస్తున్నారు. వేలాదిగా వస్తున్న ప్రజలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయలేక వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అబాట్ ల్యాబొరే టరీస్ కిట్‌కు యూఎస్ఎఫ్డీఏ తన అత్యవసర అధికారాలను వినియోగించి ఈ కిట్‌కు వేగంగా అనుమతులిచ్చింది. సోమవారం నుంచి అందుబా టులోకి! వచ్చే వారం సోమవారం నుంచి పరీక్షలను ప్రారంభించే యోచనలో ఉన్నామని, రోజుకు 50 వేల వరకు పరీక్షలను జరిపే అవకాశం ఉంటుందని అబాట్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతానికి ID NOW COVID&19 పరీక్ష అమెరికాకు మాత్రమే పరిమితమవుతుంది. అవసరాన్ని బట్టి భారత్ సహా ఇతర దేశాలకు అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ పేర్కొంది. ‘‘ఇది అత్యుత్తమైన ముందడుగు. 5 నిమిషాల్లోనే పాజిటివ్ ఫలితాన్ని, 13 నిమిషాల్లో నెగిటివ్ ఫలితాన్ని పొందవచ్చు. ప్రస్తుత పరీక్షలకు 1–2 రోజుల సమయంతో పాటు ఖర్చు కూడా ఎక్కువే అవుతోంది. మా కిట్‌తో ఈ సమస్య తగ్గుతుంది’’ అని అబాట్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ జాన్ ఫ్రీల్స్ చెప్పారు. -
టాటూ కాదది ఎర్రటి డేంజర్ మార్క్!
ఒంటినే క్యాన్వాసులాగా మార్చి... సృజనాత్మకమైన అనేక రకాల డిజైన్లను ప్రదర్శించే ‘టాటూ’లను వేసుకోవాలని అనుకుంటున్నారా? టాటూను నేటి ట్రెండ్‌గా, ఫ్యాషన్‌గా భావించి దాన్ని వేసుకోవాలన్నది మీ ఉద్దేశమా? అయితే మరోసారి ఆలోచించుకోండి అని హెచ్చరిస్తుంది అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) సంస్థ. మార్కెట్లోకి రావాల్సిన అన్ని రకాల మందులకు ప్రపంచవ్యాప్తంగా దీని ఆమోదం లభించాల్సి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సంస్థ చేసే హెచ్చరికలు కాబట్టి దీనికి ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎఫ్‌డీఏకు చెందిన ఆఫీస్ ఆఫ్ కాస్మటిక్స్ అండ్ కలర్స్ విభాగానికి చెందిన డైరెక్టర్ డాక్టర్ లిండా కేట్జ్ మాట్లాడుతూ ‘‘టాటూస్ వేసుకున్న వారిలో చాలామంది ఆ తర్వాత తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, చర్మ అలర్జీలకు గురవుతున్నారు. ఇలా టాటూ వేయించుకునే చాలా మందికి దాని వల్ల ర్యాష్, చర్మం ఎర్రబారడం, టాటూ వేసిన చోట ఉబ్బుగా మారడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. టాటూ కోసం వాడే కలుషితమైన సూదులు, కంటామినేటెడ్ సిరా వంటివి ఇందుకు కారణాలు’’ అని పేర్కొంటున్నారామె. పైగా టాటూలు ఎప్పుడూ సురక్షితం కాదని చెబుతున్నారు. ‘‘ఇలా టాటూలు వేయించుకునేవారికి మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. భవిష్యత్తులో వారు ఏదైనా సందర్భంలో ఎమ్మారై చేయించుకోవాల్సి వస్తే... తమకు టాటూ ఉందన్న విషయం డాక్టర్‌కు విధిగా చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రదేశంలో వాపు, మంట వచ్చే అవకాశాలు ఉంటాయి’’ అంటున్నారు డాక్టర్ కాట్జ్. ఇందులో వాడే ఇంకు లేదా రంగు పదార్థం వంటివాటిల్లో ఎఫ్‌డీఏ అనుమతి పొందినదంటూ ఏదీ లేదని ఎఫ్‌డీఏకి చెంది నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
ఆ విషాలను కడుగుదాం రండి!!
జీవఫలం – చేదు విషం! ఒకప్పుడు చందమామ కథల్లో కొన్ని పండ్లు చాలా ఆకర్షణీయంగా కనిపించేవి. కానీ అవి తినగానే చనిపోవడమో లేదా కురూపులైపోవడమో జరుగుతుందని అరణ్యంలో మారువేషాల్లో సంచరించే రాజులనూ, రాకుమారులనూ హెచ్చరించేది పేదరాసి పెద్దమ్మ. ఇప్పుడు అడవుల్లోకి పోయి... ఆకర్షణీయమైన వింతపండ్లను వెతకనక్కర్లేదూ... పేదరాసి పెద్దమ్మతో చెప్పించుకోనవసరం లేదు. మన మార్కెట్లోకి వచ్చే ద్రాక్ష పండ్లను చూస్తే చాలు. దూరం నుంచి చూసినా పండుపై ఏదో మందులు చిమ్మిన పొరలు కనిపిస్తాయి. ముట్టుకొని చూస్తే పండు జిడ్డు జిడ్డుగా చేతికి తగులుతూ ఉంటుంది. ఆ చేతిని ఎప్పుడెప్పుడు కడుక్కుందామా అని ఫీలింగ్‌తో చేతులు కడుక్కునేవరకూ అంతా అస్థిమితంగా ఉంటుంది. గుత్తి నుంచి అప్పుడో, ఇప్పుడో ఒకటో రెండో పండ్లను తీసుకొని తినాలన్న ఇచ్ఛ ఇగిరిపోతుంది. మనసు చచ్చిపోతుంది. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ద్రాక్షల్లో నల్లద్రాక్ష, పచ్చద్రాక్ష, క్యాప్సూల్ ద్రాక్ష వంటి గుత్తులు వినియోగదారులను ఆకర్షిస్తున్నా... వాటిపై పేరుకుపోయి కనిపిస్తున్న రసాయన మందులు, క్రిమిసంహార మందులతో వెంటనే వాటి నుంచి దృష్టి మళ్లుతోంది. అత్యాధిక మోతాదులో వాడే ఎండోసల్ఫాన్ వంటి మందులు... పండ్లు తినేవారి ఆరోగ్యంపై దీర్ఘకాలిక దుష్ప్రభావాలకు కారణమవుతున్నాయి. అంతేకాదు... గతంలోలా ఒకసారో, రెండోసార్లో ద్రాక్షపండ్లను కడిగినా ఇప్పుడు ప్రయోజనం లేదు. క్రిమిసంహారకమందుల అవశేషాలు అన్నో, ఇన్నో పండ్లపై మిగిలిపోతున్నాయి. ఈ విషయాన్ని ఆహారం, మందుల భద్రతపై అత్యున్నత సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)తో పాటు మన దేశానికి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) వేర్వేరుగా పేర్కొంటున్నాయి. ఇటీవలే సీఎస్ఈ సమర్పించిన నివేదిక ప్రకారం... ద్రాక్షను కడిగాక కూడా వాటిపై మిగిలిపోతున్న క్రిమిసంహారక మందుల అవశేషాలు (కెమికల్ రెసిడ్యూస్) వల్ల క్యాన్సర్, ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసేలా నరాలకు సంబంధించిన వ్యాధులు, పిల్లల్లో పుట్టుకతో వచ్చే వ్యాధులు కనిపిస్తున్నాయని పేర్కొంది. అంతేకాదు. ఇలాంటి పండ్ల వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా దెబ్బతింటోందని చెబుతోంది సీఎస్ఈ. సాంప్రదాయిక పద్ధతుల్లో ఇప్పటివరకూ మనం ఒక లీటర్ నీళ్లలో రెండు చెంచాల ఉప్పు కలిపి, రెండుసార్లు కడిగినా రసాయన మందుల అవశేషాలు పూర్తిగా పోవడం లేదని సీఎస్ఈ పేర్కొంది. అందుకే ద్రాక్ష, ఆపిల్స్, జామ, రేగుపండ్లు, మామిడి , పీచ్, పియర్ వంటి పండ్లనూ, వాటితో పాటు కొన్ని కూరగాయలను కడిగే విధానాన్ని అది సూచిస్తోంది. పండ్లను ఆరోగ్యకరంగా కడగటం ఎలాగంటే... నీళ్లు 90 శాతం, తెల్ల వెనిగర్ 10 శాతం తీసుకుని, అందులో మనం తినదలచుకున్న పండ్లను కాసేపు ఉంచి, ఆ తర్వాత నల్లానుంచి జారుతూ ఉన్న ఫ్రెష్ వాటర్ ప్రవాహంలో వాటిని కడగడం వల్ల చాలావరకు రసాయనాలు శుభ్రం అవుతాయని పేర్కొంటోంది సీఎస్ఈ. అంతేకాదు... ఇలా నల్లా నుంచి జారే నీటి వల్ల (అంటే రన్నింగ్ వాటర్ కింద) పండ్లను కడిగే సమయంలో పండుపై ఏదైనా గుంటలు, ఇరుకు చారల వంటి ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన రసాయనాలూ, కడుక్కుపోయి, కొట్టుకుపోతాయని పేర్కొంటోంది ఆ సంస్థ. మరో మార్గం ఇలా... ఒక బౌల్లో నాలుగు వంతుల నీరు, ఒక వంతు వెనిగర్ తీసుకొని అప్పటికే కచ్చాపచ్చాగా కడిగిన పండ్లను, కూరగాయలను అందులో ఉంచాలి. మనం తినాలనుకున్న పండ్లను అందులో దాదాపు 30 – 60 నిమిషాల పాటు ఉంచి మళ్లీ వాటిని రుద్దుతూ (రిన్సింగ్ చేస్తూ) కడగాలి. ఆ తర్వాత జర్రున జారుతున్న నీటి ప్రవాహంలో మళ్లీ కడగడం సురక్షితం అంటున్నారు నిపుణులు. కొన్ని పెద్దసైజు పండ్ల మీద మరి ఎక్కువ రసాయన అవశేషాలు ఉన్నాయని అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్సోడాలను ఒక కప్పు నీళ్లలో కలిపి... ఆ మిశ్రమాన్ని పండుపై వేసి రుద్దుతూ శుభ్రం చేయాలి. అలా రుద్దిన ఆ పండును నీటి ప్రవాహం కింద ఉంచి, పండుపై పేరుకున్న లెమన్‌జ్యూస్, బేకింగ్‌సోడాల జడ్డిమిశ్రమం కొట్టుకుపోయే వరకు కడగాలి. ఇలా చేయడం వల్ల పండుపై ఉన్న రసాయనాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. మొత్తం ఒకే కట్టగా ఉపయోగించే వాటిని కడగడం ఇలా... కొత్తిమీర, కర్వేపాకులను సాధారణంగా మొత్తం కట్టకట్టనంతా ఒకేసారి కడుగుతుంటారు. ఇలా కడిగే వాటిని నీరు నిండి ఉన్న బౌల్లో రెండు మూడుసార్లు తిప్పుతూ కడగాలి. ఆ తర్వాత పేపర్ టవల్‌తో తుడవాలి. కొలరాడో స్టేట్ యూనివర్సిటీ వారి అధ్యయనం ప్రకారం ఇలాంటి వాటిని కడగడానికి ఉపయోగించే నీటిలో కాస్తంత నిమ్మరసం, కొంత వెనిగర్ వేయడం వల్ల కట్ట మీది బ్యాక్టీరియా, ఈ–కొలై శుభ్రంగా కడుక్కుపోవడంతో పాటు కట్టకు కాస్తంత కొత్త రుచి కూడా వస్తుంది. ఇక నేరేడు, బెర్రీపండ్ల వంటి వాటిని వెనిగర్ సొల్యూషన్‌లో కడగాలి. మనం షాపింగ్ చేస్తున్నప్పుడే పండుపై దెబ్బలేని వాటిని ఎంపిక చేయాలి. గిన్నెలను కడగడం ఎలా? మనం ఆహారపదార్థాలు, కూరగాయలు, ఆకుకూరలను పెట్టుకునే గిన్నెలు, బౌల్స్‌ను వేడినీళ్లతోనూ, డిటెర్జెంట్తోనూ మొదట కడగాలి. ఆ డిటర్జెంట్ తాలూకు సబ్బు పూర్తిగా కడుక్కుపోయేలా మళ్లీ మంచినీళ్లతో ఈసారి చల్లటి నీళ్లతో కడగాలి. ఆ తర్వాతే మనం శుభ్రం చేసుకున్న కూరగాయలను ఆ గిన్నెలలో పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు గిన్నెలు లోహంతో చేసినవి కాకుండా, పింగాణీవి అయితే అవీ శుభ్రంగా ఉంటాయి. శుభ్రపరచిన, కోసిన కూరగాయలూ మళ్లీ అపరిశుభ్రమయ్యే అవకాశాలు తక్కువ. మట్టి కింద ఉండే దుంపల్ని శుభ్రం చేయడమిలా... ∙మట్టి కింద ఉండే బంగాళదుంప (ఆలుగడ్డ), క్యారట్ వంటి వాటని వెంటనే శుభ్రపరచకుండా కొద్దినిమిషాల పాటు నీళ్లలో నాననివ్వాలి. వాటిని ఎలాగూ చెక్కుతీసి వాడినప్పటికీ, నాననిచ్చిన తర్వాత కోసే ముందుగా ధారగా పడే నీళ్లలో కడగాలి. ∙కాలిఫ్లవర్, బ్రకోలీ లాగా ముడుతలు ముడుతలుగా ఉండి, ఆ ముడుతల్లో మట్టి చేరే అవకాశమున్న పువ్వుకూరలను కాసేపు నీళ్లలో నాననివ్వాలి. ఆ తర్వాత నీళ్లు కారిపోయేలా రంధ్రాలుండే పాత్ర (కొలాండర్)లోకి వాటిని తీసుకోవాలి. ∙కాయగూరల పైపొర చెక్కు తీసేలా ఉండే పొట్లకాయ, బీరకాయ, సొరకాయ వంటివాటిని పైనుంచి ధారగా పడుతున్న నీటిలో ఒకటికి రెండుసార్లు కడిగిన తర్వాతే కోయాలి. ∙ఇటీవల పుట్టగొడుగులను కూరగాయలుగా వాడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. వీళ్లకోసం మష్రూమ్ బ్రష్ అనే ఉపకరణం అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని చల్లటి నీటిలో కడగాలి. ఆ తర్వాత పేపర్ టవల్‌తో శుభ్రం చేయాలి. ∙కూరగాయలలో వంకాయలను కోసే పద్ధతి కాస్త వేరుగా ఉంటుంది. ముందుగా వంకాయలను ధారగా పడుతున్న నీటిలో కలగాలి. ఆ తర్వాత కాస్తంత వాటిని కాస్తంత నిమ్మనీరు, కాస్తంత ( 2 శాతం) చింతపండు నానేసిన నీరు, కాస్తంత ఉప్పు, 4 శాతం అసిటిక్ ఆసిడ్ ద్రవాలను ఒక పెద్ద పాత్రలోని నీళ్లలో కలిపి, ఆ ద్రవంలో ఒక్కొక్క వంకాయను విడివిడిగా కడగాలి. దీనివల్ల వంకాయల మీద చల్లి ఉన్న క్రిమిసంహారకాలు కడుక్కుపోతాయి లేదా నిర్వీర్యమవుతాయి. ∙పుచ్చకాయ, కర్బూజకాయ లాంటి వాటిని ధారగా పడుతున్న నీటికింద కడుగుతూ మెత్తటి కుచ్చులున్న వెజిటబుల్ బ్రష్‌తో శుభ్రంగా కడిగాకే, ముక్కలుగా కోయాలి. మరికొన్ని పండ్లు/కూరగాయలు.... వాటిని శుభ్రపరిచే విధానాలు వేర్వేరు వెజిటబుల్స్ శుభ్రపరిచే పద్ధతులివి... ∙చిన్న కాడకు అంటి ఉండే పండ్లను బాగా శుభ్రం చేశాక... మురికి పేరుకునే అవకాశాలు ఎక్కువగా కాడ వద్ద ఉంటాయి. కాబట్టి ఇలా కాడ ఉన్న పండ్లను శుభ్రం చేశాక అటు కాడ, ఇటు కాడకు రెండోవైపున చెక్కు తీసినట్లుగా కత్తితో కోయడం మేలు. ఈ నియమం ఆపిల్, పియర్ పండు, పీచ్ పండ్లకు వర్తిస్తుంది. ∙మందంగా ఉండే తోలు ఉన్న పండ్లు (ఉదాహరణకు నారింజ, కమలాలు) తినబోయే ముందు, మనం ఎలాగూ పండు తోలును తినకపోయినా.. ఒక్కసారి తేలిగ్గా కడగడం మేలు. ∙ఇక పాలకూర, లెట్యూజ్, కొత్తిమీర, కరివేపాకు, క్యాబేజీ లాంటి వాటిని శుభ్రం చేసే ముందర వాటిని నల్లా/కొళాయి కింద ప్రవహించే నీళ్ల కింద కాసేపు ఉంచి, శుభ్రం చేయడం మంచిది. క్యాబేజీ లాంటివి శుభ్రం చేసే సమయంలో వాటి పైన ఉన్న ఆకులు ఒకటి రెండు పొరలను తీసేయడం వల్ల మిగతాదంతా శుభ్రంగా ఉంటుంది. ∙ఆకుకూరల్ని శుభ్రంగా కడిగాక వాటిపై నీళ్లు ఆరేలా కాసేపు ఆగాలి. ఆ తర్వాత శుభ్రమైన టీ టవల్‌తో వాటిని తుడవాలి. అప్పుడే వాటిని కోయాలి. అంతేగానీ ఆకుకూరల్ని కోశాక వాటిని కడగడం సరికాదు. అలా చేయడంవల్ల పోషకాలు కోల్పోతాం. సలాడ్స్‌గా చేయదలచిన ఆకుకూరలను, కాయగూరలను ఇంటికి తెచ్చిన వెంటనే కడిగి సలాడ్స్‌గా కోసుకోవాలి. – సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్ -
బ్లడ్‌బ్యాంకుల్లో అపరిశుభ్రత
సాక్షి, ముంబై : నగరంలోని పలు బ్లడ్ బ్యాంక్‌లు పరిశుభ్రతను పాటించడం లేదు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అధికారులు ఆయా బ్లడ్ బ్యాంక్‌లను తనిఖీ చేసినప్పుడు ఇంకా పలు అంశాలు వారి దృష్టికి వచ్చాయి. సీఎస్టీలో ఉన్న కామా, ఆల్బ్లెస్ ఆస్పత్రులలోని బ్లడ్ బ్యాంక్‌లు అన్హైజెనిక్ పరిస్థితిలో ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అధికారులు (బీటీఓ) కూడా అందుబాటులో లేరు. మే 15వ తేదీన ముగ్గురు సభ్యులు గల కమిటీ సభ్యులు ఈ బ్లడ్ బ్యాంక్‌లను పరిశీలించారు. వీరిలో కేం ఆస్పత్రి నిపుణులు కూడా ఉన్నారు. ఈ బృందంతో పాటు ఎఫ్‌డీఏ, సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇన్స్పెక్టర్లు కూడా ఉన్నారు. ఈ బ్లడ్ బ్యాంకులు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అధికారులు లేకుండానే కొనసాగుతున్నాయని గుర్తించారు. ఈ బ్లడ్ బ్యాంక్‌లను కమిటీ పర్యవేక్షించినప్పుడు గోడల నుంచి పేయింటింగ్ తొలగిపోయిందని, రిఫ్రిజిరేటర్ కూడా పాడైపోయిందని, ఏయిర్ కండీషనర్ కూడా పని చేయడం లేదని, బ్లడ్ బ్యాంక్ మొత్తంగా అపరిశుభ్రంగా ఉండడాన్ని ఈ బృందం గమనించింది. సూచన : బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అధికారుల పర్యవేక్షణలో బ్లడ్ సేకరణ, నిల్వ జరగాలని, వీరికి ఎఫ్‌డీఏ అధికారులు ఆమోదం తెలపాలని ఎఫ్‌డీఏ జాయింట్ కమిషనర్ ఎస్.కె.పాటిల్ తెలిపారు. ఇంకా పలు అంశాలను బ్లడ్ బ్యాంక్‌లకు సూచించారు. జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డీన్ డాక్టర్ టి.పి.లహానే మాట్లాడుతూ.. తమ వద్ద ముగ్గురు బీటీవోలు ఉన్నారని, ఇద్దరు సెలవులపై వెళ్లారని తెలిపారు. ఒక్క అధికారి కూడా కుటుంబ సమస్యల వల్ల అందుబాటులోలేరని తెలిపారు. -
సాగరతీరంలో ‘ఆరోగ్యం’
సాక్షి, ముంబై: నగర బీచ్‌లలో ఇకపై పరిశుభ్రమైన, నాణ్యమైన తినుబండారాలు దొరకనున్నాయి. రోజూ కొన్ని వేల మంది సందర్శించే బీచ్‌లలో ప్రస్తుతం విక్రయిస్తున్న తినుబండారాలు అంతనాణ్యమైనవిగా ఉండటం లేదని విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్‌డీఏ) అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రముఖ బీచ్‌లైన జుహూ, గిర్గావ్ చౌపాటీలను సందర్శించేందుకు రోజుకు ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. వీరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తినుబండారాలను విక్రయించే వెండర్లు మరింత ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని పర్యాటకులకు అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకున్నామని ఎఫ్‌డీఏ అధికారి ఒకరు తెలి పారు. ఇందులో భాగంలో ఎఫ్‌డీఏ.. ప్రముఖ రెస్టారెంట్ల సహాయంతో బీచ్‌ల వెంబడి ఉన్న ఫుడ్ స్టాల్స్ యజమానులు, ఇతర తిను బండారాలు విక్రయించే వారికి పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించే విషయమై అవగాహన కల్పించేందుకు నిర్ణయించారు. కాగా, బీచ్ సమీపంలో వెలసిన తినుబండారాల స్టాళ్లను రోజూ దాదాపు 15 వేలు నుంచి 20 వేల మంది వరకు సందర్శకులు ఆశ్రయిస్తుంటారు. ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) యాక్ట్ ప్రకారం.. తిను బండారాలు విక్రయించే చిన్న వ్యాపారుల నుంచి పెద్ద రెస్టారెంట్ల యజమానుల వరకు అందరూ తమ దుకాణాలను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ యాక్ట్ ప్రకారం.. అతి చిన్న తిను బండారాలు విక్రయించేవారు కూడా పరిశుభ్రతను, నాణ్యతను పాటించాల్సి ఉంటుంది. దీంతో తినుబండారాలు విక్రయించే వారు నిబంధనలు తప్పక పాటించాలని బోధించే ప్రక్రియను పెలైట్ ప్రాజెక్టుపై చేపట్టనున్నట్లు ఎఫ్‌డీఏ (ఫుడ్) జాయింట్ కమిషనర్ సురేష్ అన్నపురే వెల్లడించారు. అదేవిధంగా తిను బండారాలు విక్రయించే వారికి శిక్షణ ఇవ్వడంలో తమ సహాయ సహకారాలు అందించాలని ఎఫ్‌డీఏ అధికారులు ’నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (ఎన్ఆర్ఏఐ), ఇతర ఏజెన్సీలను ఆశ్రయించింది. వచ్చే ఏడాది లోపు దాదాపు ఒక మిలియన్ ఆహార పదార్థాలను విక్రయించే వ్యాపారస్తులకు ఆహార భద్రత, నాణ్యత అంశమై అవగాహన కల్పించాలని నిర్ణయించామన్నారు. ఆహార పదార్థాలను తయారు చేయడం, వాటిని నిల్వ ఉంచడం ద్వారా కూడా నాణ్యత పెరిగే దిశలో పరిశీలించి, మార్పులు చేస్తున్నామని ‘ఎక్వినాక్స్ ల్యాబ్’కు చెందిన అధికారి అశ్విన్ భద్రి తెలిపారు. అంతే కాకుండా కస్టమర్లు ఆహారంలో ఏఏ మార్పులు తీసుకురావాలని ఆశిస్తున్నారో తెలుసుకునేందుకు బోర్డులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారి తెలిపారు. పరిశుభ్రమైన పాత్రలు, గ్లవ్స్, అప్రాన్స్లను ఆహారం తయారుచేసేటప్పుడు, అందించేటప్పుడు తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుంది. హోటల్ వ్యాపారస్తులు వీటిలో ఏ ఒక్కటి ఉపయోగించకున్నా కస్టమర్లు ఎఫ్‌డీఏకు ఫిర్యాదు చేయవచ్చు. అయితే ప్రతి రెండు గంటలకైనా గ్లవ్స్‌లను మార్చడంతో ఆహార పదార్థంలో కలుషితాన్ని కొంత వరకు నివారించవచ్చని ఆహార భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.