సాక్షి, ముంబై: నగర బీచ్‌లలో ఇకపై పరిశుభ్రమైన, నాణ్యమైన తినుబండారాలు దొరకనున్నాయి. రోజూ కొన్ని వేల మంది సందర్శించే బీచ్‌లలో ప్రస్తుతం విక్రయిస్తున్న తినుబండారాలు అంతనాణ్యమైనవిగా ఉండటం లేదని విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్‌డీఏ) అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రముఖ బీచ్‌లైన జుహూ, గిర్గావ్ చౌపాటీలను సందర్శించేందుకు రోజుకు ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. వీరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తినుబండారాలను విక్రయించే వెండర్లు మరింత ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని పర్యాటకులకు అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకున్నామని ఎఫ్‌డీఏ అధికారి ఒకరు తెలి పారు. ఇందులో భాగంలో ఎఫ్‌డీఏ.. ప్రముఖ రెస్టారెంట్ల సహాయంతో బీచ్‌ల వెంబడి ఉన్న ఫుడ్ స్టాల్స్ యజమానులు, ఇతర తిను బండారాలు విక్రయించే వారికి పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించే విషయమై అవగాహన కల్పించేందుకు నిర్ణయించారు. కాగా, బీచ్ సమీపంలో వెలసిన తినుబండారాల స్టాళ్లను రోజూ దాదాపు 15 వేలు నుంచి 20 వేల మంది వరకు సందర్శకులు ఆశ్రయిస్తుంటారు.
‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) యాక్ట్ ప్రకారం.. తిను బండారాలు విక్రయించే చిన్న వ్యాపారుల నుంచి పెద్ద రెస్టారెంట్ల యజమానుల వరకు అందరూ తమ దుకాణాలను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ యాక్ట్ ప్రకారం.. అతి చిన్న తిను బండారాలు విక్రయించేవారు కూడా పరిశుభ్రతను, నాణ్యతను పాటించాల్సి ఉంటుంది. దీంతో తినుబండారాలు విక్రయించే వారు నిబంధనలు తప్పక పాటించాలని బోధించే ప్రక్రియను పెలైట్ ప్రాజెక్టుపై చేపట్టనున్నట్లు ఎఫ్‌డీఏ (ఫుడ్) జాయింట్ కమిషనర్ సురేష్ అన్నపురే వెల్లడించారు. అదేవిధంగా తిను బండారాలు విక్రయించే వారికి శిక్షణ ఇవ్వడంలో తమ సహాయ సహకారాలు అందించాలని ఎఫ్‌డీఏ అధికారులు ’నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (ఎన్‌ఆర్‌ఏఐ), ఇతర ఏజెన్సీలను ఆశ్రయించింది. వచ్చే ఏడాది లోపు దాదాపు ఒక మిలియన్ ఆహార పదార్థాలను విక్రయించే వ్యాపారస్తులకు ఆహార భద్రత, నాణ్యత అంశమై అవగాహన కల్పించాలని నిర్ణయించామన్నారు. ఆహార పదార్థాలను తయారు చేయడం, వాటిని నిల్వ ఉంచడం ద్వారా కూడా నాణ్యత పెరిగే దిశలో పరిశీలించి, మార్పులు చేస్తున్నామని ‘ఎక్వినాక్స్ ల్యాబ్’కు చెందిన అధికారి అశ్విన్ భద్రి తెలిపారు.
అంతే కాకుండా కస్టమర్లు ఆహారంలో ఏఏ మార్పులు తీసుకురావాలని ఆశిస్తున్నారో తెలుసుకునేందుకు బోర్డులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారి తెలిపారు. పరిశుభ్రమైన పాత్రలు, గ్లవ్స్, అప్రాన్స్‌లను ఆహారం తయారుచేసేటప్పుడు, అందించేటప్పుడు తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుంది. హోటల్ వ్యాపారస్తులు వీటిలో ఏ ఒక్కటి ఉపయోగించకున్నా కస్టమర్లు ఎఫ్‌డీఏకు ఫిర్యాదు చేయవచ్చు. అయితే ప్రతి రెండు గంటలకైనా గ్లవ్స్‌లను మార్చడంతో ఆహార పదార్థంలో కలుషితాన్ని కొంత వరకు నివారించవచ్చని ఆహార భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సాగరతీరంలో ‘ఆరోగ్యం’
Published Mon, Aug 19 2013 2:42 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM
Advertisement
Advertisement