Centre for Science and Environment
-
ఎడారి కమ్ముకొస్తోంది
భారత దేశంలో నేలతల్లి నెర్రలు విచ్చుకుంటోంది. పచ్చదనంతో కళకళలాడుతూ వ్యవసాయానికి ఉపయోగపడాల్సిన భూమి ఎందుకూ పనికి రాకుండా ఎడారిగా మారిపోతోంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ తాజా అంచనాలు, ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ నివేదిక ప్రకారం భారత్‌లో 90 శాతం రాష్ట్రాల్లో ఎడారీకరణ విస్తరించింది. దీంతో వ్యవసాయ రంగం కుదేలైపోతోంది. భారత్‌లో 328.72 మిలియన్ హెక్టార్ల భౌగోళిక ప్రాంతం ఉంటే అందులో 96.4 మిలియన్ హెక్టార్ల ప్రాంతం ఎడారిగా మారిపోయింది.అంటే 30శాతం భూమి ఎందుకూ పనికి రాకుండా పోయిందన్న మాట. మొత్తం 29 రాష్ట్రాలకు గాను 26 రాష్ట్రాల్లో గత పదేళ్లలో ఎడారి ప్రాంతం బాగా పెరిగింది. ఎనిమిది రాష్ట్రాలో పరిస్థితి మరీ ఘోరం. 40–70% ఎడారిగా మారిపోయిందని ఆ నివేదిక వెల్లడించింది.. రాజస్థాన్, ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రోజురోజుకీ సారవంతమైన భూములు తగ్గిపోతున్నాయి. ఇక మిజోరంలో లంగ్లే ప్రాంతంలో నేల పెళుసుబారడం మరీ ఎక్కువగా పెరిగిపోతోంది. 5.8శాతంగా ఇది ఉంది. 2003–2011 మధ్యలో అత్యధికంగా1.8 మిలియన్ హెక్టార్ల భూమి ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ 14.35 శాతం , తెలంగాణలో 31.40 శాతం భూములు నిరుపయోగంగా మారాయి. ఏపీలో అనంతపురం జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దేశం మొత్తం మీద అతి తక్కువ వర్షపాతం కురిసిన జిల్లాల్లో అనంతపురం ఒకటి. తెలంగాణలో నల్లగొండ జిల్లాలో అధికంగా ఎడారీకరణ జరుగుతోంది. ఎందుకీ పరిస్థితి ? నీటి వనరుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, అతివృష్టి అనావృష్టి పరిస్థితుల కారణంగా ఉత్పాదక భూమి పంటలు పండడానికి అనుగుణంగా లేకపోవడాన్నే ఎడారీకరణ అంటారు. దీని కారణంగా నీటి వనరులు తగ్గిపోతాయి. మొక్కలు పెరగవు. వన్యప్రాణులకు స్థానం ఉండదు. ఎడారిలో పూలు పూస్తాయా ! దేశంలో ఎడారీకరణ తగ్గిస్తామని భారత్ ఐక్యరాజ్య సమితి సదస్సులో 1994లోనే సంతకాలుచేసింది. 2030 నాటికి వ్యర్థంగా మారిన భూముల్ని సాగుకు అనుగుణంగా చేయాలన్న లక్ష్యంతో ఉంది. ఈ సెప్టెంబర్‌లో భారత్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ పద్నాలుగో సదస్సు (కాప్–14)కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సు సందర్భంగా వచ్చే మూడున్నరేళ్లలోనే ఎంపిక చేసిన రాష్ట్రాలైన హర్యానా, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర, నాగాలాండ్ అటవీభూముల్ని పెంచుతామని హామీ ఇవ్వనుంది. నీటి వనరుల సంరక్షణ, పచ్చదనం పెంపు, భూ సార పరిరక్షణ, జీవవైవిధ్యం పెంపు వంటి చర్యల ద్వారా భారత్ ఎడారిలో పూలు పూయించనుంది. -
ఆ విషాలను కడుగుదాం రండి!!
జీవఫలం – చేదు విషం! ఒకప్పుడు చందమామ కథల్లో కొన్ని పండ్లు చాలా ఆకర్షణీయంగా కనిపించేవి. కానీ అవి తినగానే చనిపోవడమో లేదా కురూపులైపోవడమో జరుగుతుందని అరణ్యంలో మారువేషాల్లో సంచరించే రాజులనూ, రాకుమారులనూ హెచ్చరించేది పేదరాసి పెద్దమ్మ. ఇప్పుడు అడవుల్లోకి పోయి... ఆకర్షణీయమైన వింతపండ్లను వెతకనక్కర్లేదూ... పేదరాసి పెద్దమ్మతో చెప్పించుకోనవసరం లేదు. మన మార్కెట్లోకి వచ్చే ద్రాక్ష పండ్లను చూస్తే చాలు. దూరం నుంచి చూసినా పండుపై ఏదో మందులు చిమ్మిన పొరలు కనిపిస్తాయి. ముట్టుకొని చూస్తే పండు జిడ్డు జిడ్డుగా చేతికి తగులుతూ ఉంటుంది. ఆ చేతిని ఎప్పుడెప్పుడు కడుక్కుందామా అని ఫీలింగ్‌తో చేతులు కడుక్కునేవరకూ అంతా అస్థిమితంగా ఉంటుంది. గుత్తి నుంచి అప్పుడో, ఇప్పుడో ఒకటో రెండో పండ్లను తీసుకొని తినాలన్న ఇచ్ఛ ఇగిరిపోతుంది. మనసు చచ్చిపోతుంది. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ద్రాక్షల్లో నల్లద్రాక్ష, పచ్చద్రాక్ష, క్యాప్సూల్ ద్రాక్ష వంటి గుత్తులు వినియోగదారులను ఆకర్షిస్తున్నా... వాటిపై పేరుకుపోయి కనిపిస్తున్న రసాయన మందులు, క్రిమిసంహార మందులతో వెంటనే వాటి నుంచి దృష్టి మళ్లుతోంది. అత్యాధిక మోతాదులో వాడే ఎండోసల్ఫాన్ వంటి మందులు... పండ్లు తినేవారి ఆరోగ్యంపై దీర్ఘకాలిక దుష్ప్రభావాలకు కారణమవుతున్నాయి. అంతేకాదు... గతంలోలా ఒకసారో, రెండోసార్లో ద్రాక్షపండ్లను కడిగినా ఇప్పుడు ప్రయోజనం లేదు. క్రిమిసంహారకమందుల అవశేషాలు అన్నో, ఇన్నో పండ్లపై మిగిలిపోతున్నాయి. ఈ విషయాన్ని ఆహారం, మందుల భద్రతపై అత్యున్నత సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)తో పాటు మన దేశానికి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) వేర్వేరుగా పేర్కొంటున్నాయి. ఇటీవలే సీఎస్ఈ సమర్పించిన నివేదిక ప్రకారం... ద్రాక్షను కడిగాక కూడా వాటిపై మిగిలిపోతున్న క్రిమిసంహారక మందుల అవశేషాలు (కెమికల్ రెసిడ్యూస్) వల్ల క్యాన్సర్, ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసేలా నరాలకు సంబంధించిన వ్యాధులు, పిల్లల్లో పుట్టుకతో వచ్చే వ్యాధులు కనిపిస్తున్నాయని పేర్కొంది. అంతేకాదు. ఇలాంటి పండ్ల వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా దెబ్బతింటోందని చెబుతోంది సీఎస్ఈ. సాంప్రదాయిక పద్ధతుల్లో ఇప్పటివరకూ మనం ఒక లీటర్ నీళ్లలో రెండు చెంచాల ఉప్పు కలిపి, రెండుసార్లు కడిగినా రసాయన మందుల అవశేషాలు పూర్తిగా పోవడం లేదని సీఎస్ఈ పేర్కొంది. అందుకే ద్రాక్ష, ఆపిల్స్, జామ, రేగుపండ్లు, మామిడి , పీచ్, పియర్ వంటి పండ్లనూ, వాటితో పాటు కొన్ని కూరగాయలను కడిగే విధానాన్ని అది సూచిస్తోంది. పండ్లను ఆరోగ్యకరంగా కడగటం ఎలాగంటే... నీళ్లు 90 శాతం, తెల్ల వెనిగర్ 10 శాతం తీసుకుని, అందులో మనం తినదలచుకున్న పండ్లను కాసేపు ఉంచి, ఆ తర్వాత నల్లానుంచి జారుతూ ఉన్న ఫ్రెష్ వాటర్ ప్రవాహంలో వాటిని కడగడం వల్ల చాలావరకు రసాయనాలు శుభ్రం అవుతాయని పేర్కొంటోంది సీఎస్ఈ. అంతేకాదు... ఇలా నల్లా నుంచి జారే నీటి వల్ల (అంటే రన్నింగ్ వాటర్ కింద) పండ్లను కడిగే సమయంలో పండుపై ఏదైనా గుంటలు, ఇరుకు చారల వంటి ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన రసాయనాలూ, కడుక్కుపోయి, కొట్టుకుపోతాయని పేర్కొంటోంది ఆ సంస్థ. మరో మార్గం ఇలా... ఒక బౌల్లో నాలుగు వంతుల నీరు, ఒక వంతు వెనిగర్ తీసుకొని అప్పటికే కచ్చాపచ్చాగా కడిగిన పండ్లను, కూరగాయలను అందులో ఉంచాలి. మనం తినాలనుకున్న పండ్లను అందులో దాదాపు 30 – 60 నిమిషాల పాటు ఉంచి మళ్లీ వాటిని రుద్దుతూ (రిన్సింగ్ చేస్తూ) కడగాలి. ఆ తర్వాత జర్రున జారుతున్న నీటి ప్రవాహంలో మళ్లీ కడగడం సురక్షితం అంటున్నారు నిపుణులు. కొన్ని పెద్దసైజు పండ్ల మీద మరి ఎక్కువ రసాయన అవశేషాలు ఉన్నాయని అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్సోడాలను ఒక కప్పు నీళ్లలో కలిపి... ఆ మిశ్రమాన్ని పండుపై వేసి రుద్దుతూ శుభ్రం చేయాలి. అలా రుద్దిన ఆ పండును నీటి ప్రవాహం కింద ఉంచి, పండుపై పేరుకున్న లెమన్‌జ్యూస్, బేకింగ్‌సోడాల జడ్డిమిశ్రమం కొట్టుకుపోయే వరకు కడగాలి. ఇలా చేయడం వల్ల పండుపై ఉన్న రసాయనాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. మొత్తం ఒకే కట్టగా ఉపయోగించే వాటిని కడగడం ఇలా... కొత్తిమీర, కర్వేపాకులను సాధారణంగా మొత్తం కట్టకట్టనంతా ఒకేసారి కడుగుతుంటారు. ఇలా కడిగే వాటిని నీరు నిండి ఉన్న బౌల్లో రెండు మూడుసార్లు తిప్పుతూ కడగాలి. ఆ తర్వాత పేపర్ టవల్‌తో తుడవాలి. కొలరాడో స్టేట్ యూనివర్సిటీ వారి అధ్యయనం ప్రకారం ఇలాంటి వాటిని కడగడానికి ఉపయోగించే నీటిలో కాస్తంత నిమ్మరసం, కొంత వెనిగర్ వేయడం వల్ల కట్ట మీది బ్యాక్టీరియా, ఈ–కొలై శుభ్రంగా కడుక్కుపోవడంతో పాటు కట్టకు కాస్తంత కొత్త రుచి కూడా వస్తుంది. ఇక నేరేడు, బెర్రీపండ్ల వంటి వాటిని వెనిగర్ సొల్యూషన్‌లో కడగాలి. మనం షాపింగ్ చేస్తున్నప్పుడే పండుపై దెబ్బలేని వాటిని ఎంపిక చేయాలి. గిన్నెలను కడగడం ఎలా? మనం ఆహారపదార్థాలు, కూరగాయలు, ఆకుకూరలను పెట్టుకునే గిన్నెలు, బౌల్స్‌ను వేడినీళ్లతోనూ, డిటెర్జెంట్తోనూ మొదట కడగాలి. ఆ డిటర్జెంట్ తాలూకు సబ్బు పూర్తిగా కడుక్కుపోయేలా మళ్లీ మంచినీళ్లతో ఈసారి చల్లటి నీళ్లతో కడగాలి. ఆ తర్వాతే మనం శుభ్రం చేసుకున్న కూరగాయలను ఆ గిన్నెలలో పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు గిన్నెలు లోహంతో చేసినవి కాకుండా, పింగాణీవి అయితే అవీ శుభ్రంగా ఉంటాయి. శుభ్రపరచిన, కోసిన కూరగాయలూ మళ్లీ అపరిశుభ్రమయ్యే అవకాశాలు తక్కువ. మట్టి కింద ఉండే దుంపల్ని శుభ్రం చేయడమిలా... ∙మట్టి కింద ఉండే బంగాళదుంప (ఆలుగడ్డ), క్యారట్ వంటి వాటని వెంటనే శుభ్రపరచకుండా కొద్దినిమిషాల పాటు నీళ్లలో నాననివ్వాలి. వాటిని ఎలాగూ చెక్కుతీసి వాడినప్పటికీ, నాననిచ్చిన తర్వాత కోసే ముందుగా ధారగా పడే నీళ్లలో కడగాలి. ∙కాలిఫ్లవర్, బ్రకోలీ లాగా ముడుతలు ముడుతలుగా ఉండి, ఆ ముడుతల్లో మట్టి చేరే అవకాశమున్న పువ్వుకూరలను కాసేపు నీళ్లలో నాననివ్వాలి. ఆ తర్వాత నీళ్లు కారిపోయేలా రంధ్రాలుండే పాత్ర (కొలాండర్)లోకి వాటిని తీసుకోవాలి. ∙కాయగూరల పైపొర చెక్కు తీసేలా ఉండే పొట్లకాయ, బీరకాయ, సొరకాయ వంటివాటిని పైనుంచి ధారగా పడుతున్న నీటిలో ఒకటికి రెండుసార్లు కడిగిన తర్వాతే కోయాలి. ∙ఇటీవల పుట్టగొడుగులను కూరగాయలుగా వాడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. వీళ్లకోసం మష్రూమ్ బ్రష్ అనే ఉపకరణం అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని చల్లటి నీటిలో కడగాలి. ఆ తర్వాత పేపర్ టవల్‌తో శుభ్రం చేయాలి. ∙కూరగాయలలో వంకాయలను కోసే పద్ధతి కాస్త వేరుగా ఉంటుంది. ముందుగా వంకాయలను ధారగా పడుతున్న నీటిలో కలగాలి. ఆ తర్వాత కాస్తంత వాటిని కాస్తంత నిమ్మనీరు, కాస్తంత ( 2 శాతం) చింతపండు నానేసిన నీరు, కాస్తంత ఉప్పు, 4 శాతం అసిటిక్ ఆసిడ్ ద్రవాలను ఒక పెద్ద పాత్రలోని నీళ్లలో కలిపి, ఆ ద్రవంలో ఒక్కొక్క వంకాయను విడివిడిగా కడగాలి. దీనివల్ల వంకాయల మీద చల్లి ఉన్న క్రిమిసంహారకాలు కడుక్కుపోతాయి లేదా నిర్వీర్యమవుతాయి. ∙పుచ్చకాయ, కర్బూజకాయ లాంటి వాటిని ధారగా పడుతున్న నీటికింద కడుగుతూ మెత్తటి కుచ్చులున్న వెజిటబుల్ బ్రష్‌తో శుభ్రంగా కడిగాకే, ముక్కలుగా కోయాలి. మరికొన్ని పండ్లు/కూరగాయలు.... వాటిని శుభ్రపరిచే విధానాలు వేర్వేరు వెజిటబుల్స్ శుభ్రపరిచే పద్ధతులివి... ∙చిన్న కాడకు అంటి ఉండే పండ్లను బాగా శుభ్రం చేశాక... మురికి పేరుకునే అవకాశాలు ఎక్కువగా కాడ వద్ద ఉంటాయి. కాబట్టి ఇలా కాడ ఉన్న పండ్లను శుభ్రం చేశాక అటు కాడ, ఇటు కాడకు రెండోవైపున చెక్కు తీసినట్లుగా కత్తితో కోయడం మేలు. ఈ నియమం ఆపిల్, పియర్ పండు, పీచ్ పండ్లకు వర్తిస్తుంది. ∙మందంగా ఉండే తోలు ఉన్న పండ్లు (ఉదాహరణకు నారింజ, కమలాలు) తినబోయే ముందు, మనం ఎలాగూ పండు తోలును తినకపోయినా.. ఒక్కసారి తేలిగ్గా కడగడం మేలు. ∙ఇక పాలకూర, లెట్యూజ్, కొత్తిమీర, కరివేపాకు, క్యాబేజీ లాంటి వాటిని శుభ్రం చేసే ముందర వాటిని నల్లా/కొళాయి కింద ప్రవహించే నీళ్ల కింద కాసేపు ఉంచి, శుభ్రం చేయడం మంచిది. క్యాబేజీ లాంటివి శుభ్రం చేసే సమయంలో వాటి పైన ఉన్న ఆకులు ఒకటి రెండు పొరలను తీసేయడం వల్ల మిగతాదంతా శుభ్రంగా ఉంటుంది. ∙ఆకుకూరల్ని శుభ్రంగా కడిగాక వాటిపై నీళ్లు ఆరేలా కాసేపు ఆగాలి. ఆ తర్వాత శుభ్రమైన టీ టవల్‌తో వాటిని తుడవాలి. అప్పుడే వాటిని కోయాలి. అంతేగానీ ఆకుకూరల్ని కోశాక వాటిని కడగడం సరికాదు. అలా చేయడంవల్ల పోషకాలు కోల్పోతాం. సలాడ్స్‌గా చేయదలచిన ఆకుకూరలను, కాయగూరలను ఇంటికి తెచ్చిన వెంటనే కడిగి సలాడ్స్‌గా కోసుకోవాలి. – సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్ -
బ్రెడ్డు తింటే కేన్సర్ ఫ్రీ!
- ప్రముఖ రెస్టారెంట్ల బ్రెడ్ ఉత్పత్తుల్లో కేన్సర్ కారకాలు - సీఎస్ఈ పరిశీలనలో వెల్లడి న్యూఢిల్లీ: భారత మార్కెట్లో ప్రముఖ సంస్థలు అందిస్తున్న బ్రెడ్ సంబంధ ఆహార పదార్థాల్లో కేన్సర్ కారకాలు ఉన్నట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) పరీక్షల్లో తేలింది. బ్రిటానియా, కేఎఫ్‌సీ, పిజ్జాహట్, డొమినోస్, మెక్‌డొనాల్డ్స్, సబ్వే, స్లైస్ ఆఫ్ ఇటలీ వంటి అనేక ఫుడ్ చైన్ రెస్టారెంట్లు అందిస్తున్న ఆహార పదార్థాల్లో పొటాషియం బ్రొమేట్, పొటాషియం అయొడేట్లు ఉన్నట్లు సీఎస్ఈ సోమవారం విడుదల చేసిన నివేదిక ద్వారా తెలిసింది. ఢిల్లీలోని అన్ని ప్రముఖ రెస్టారెంట్లు, బ్రాండ్ల ఆహార ఉత్పత్తులను సీఎస్ఈ పరిశీలించింది. ప్యాక్ చేసిన బ్రెడ్లు, బ్రెడ్డుతో తయారైన పావ్‌లు, బన్లు, బర్గర్లు, పిజ్జాలు వంటి 38 నమూనాలను సీఎస్ఈ పరీక్షించింది. వీటిలో 84 శాతం పదార్థాల్లో కేన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పేర్కొంది. ఈ రసాయనాలను అనేక దేశాలు ఇప్పటికే నిషేధించాయి. కానీ భారత్‌లో నిషేధం లేదు. బ్రిటానియా, కేఎఫ్‌సీ, డొమినోస్, మెక్‌డొనాల్డ్స్, సబ్‌వేలు ఈ హానికర పదార్థాలను తాము వాడడం లేదన్నాయి. నమూనాలను తమ పొల్యూషన్ మానిటరింగ్ ల్యాబోరేటరీ (పీఎంఎల్)లో పరీక్షించిన అనంతరం, బయటి ప్రయోగశాలల్లో కూడా పరిశీలించాకే ఈ నివేదిక విడుదల చేశామని సీఎస్ఈ ఉప డెరైక్టర్ జనరల్ చంద్రభూషణ్ తెలిపారు. 38 నమూనాలను పరీక్షించగా 32 ఉత్పత్తుల్లో 1.15 నుంచి 22.54 పీపీఎం వరకు పొటాషియం బ్రొమేట్,పొటాషియం అయొడేట్లు ఉన్నట్లు తేలిందన్నారు. కాగా, సీఎస్ఈ నివేదికలోని అంశాలపై విచారణ జరిపినివేదిక ఇవ్వాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధికారులను ఆదేశించారు. -
ఢిల్లీలో మళ్లీ పెరిగిన కాలుష్యం
సరి-బేసి ముగిసిన 3రోజుల్లో 57 శాతం పెరుగుదల ♦ సుప్రీం కోర్టు సూచనలు అమలు చేయాలని ఢిల్లీ సర్కారుకు ♦ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వినతి న్యూఢిల్లీ: సరి-బేసి పథకం పైలట్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తొలి మూడు రోజుల్లోనే ఢిల్లీ వాతావరణంలో త్రీవమైన మార్పులు కనిపించాయి. ‘సరి-బేసి పథకం తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యంలో కనిపించిన మార్పు.. పథకం పైలట్ ప్రాజెక్టు ముగిసిన తొలి మూడు రోజుల్లోనే కాలుష్యం 57 శాతం పెరిగింది’ అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ - సీఎస్ఈ వెల్లడించింది. కాలుష్యం మరింత విస్తరించకుండా అవసరమైన కార్యాచరణ చేపట్టాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సీఎస్ఈ కోరింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బస్సులు, మెట్రో రైళ్లను పెంచటంతో పాటు.. కాలుష్యాన్ని వెదజల్లుతున్న ట్రక్కులపైనా దృష్టి పెట్టాలని సూచించింది. ఢిల్లీల్లో సాధారణంగా 277 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్లుండే కాలుష్యం.. సరిబేసి విధానంతో 155కు తగ్గింది. అయితే తాజాగా మళ్లీ అన్ని వాహనాలు రోడ్లపైకి రావటంతో.. ఇది 281 చేరింది. కాగా, గురువారం ఉత్తర ఢిల్లీలో కార్-ఫ్రీ డేను పాటించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నాయకత్వంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అయితే.. ఇలాంటి కార్యక్రమాలకు ఢిల్లీ పోలీసులు సహకరించటం లేదని సిసోడియా విమర్శించారు. బీజింగ్‌లోనూ ‘సరి-బేసి’కి సన్నద్ధం బీజింగ్: చైనా రాజధాని నగరం బీజింగ్‌లోనూ కార్ల వినియోగదారుల ద్వారా ‘సరి-బేసి’ పద్ధతిని అమలు చేయించేందుకు స్థానిక యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యనగరంగా రికార్డుల్లోకి ఎక్కిన బీజింగ్‌లో రోజుకు 5.6 మిలియన్ల కారులు రాకపోకలు సాగిస్తున్నాయి. దీనికి పరిష్కారంగా శీతకాలంలో కార్ల వినియోగాన్ని కుదించే యోచనను అక్కడి పాలనా యంత్రాంగం చేస్తున్నట్లు అధికార మీడియా ఏజెన్సీ తెలిపింది. -
వాతావరణ మార్పులతోనే తీవ్ర వడగాలులు
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వె ల్లడి దేశవ్యాప్తంగా 2,000 మంది మృత్యువాత.. అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలే కారణం హైదరాబాద్: ఈ ఏడాది మండిపోతున్న వేసవికి ప్రజలు పిట్టల్లా రాలి పోతున్నారు.. వడగాల్పుల ప్రభావానికి దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు రెండు వేల మంది మృత్యువాత పడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ దారుణ విపత్తుకు వాతావరణంలో తీవ్రమైన మార్పులే కారణమని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పర్యావరణ పరిరక్షణ సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తెలిపింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయని, ఈ మార్పు అకస్మాత్తుగా చోటు చేసుకోవడం వల్లే మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని సీఎస్ఈ పేర్కొంది. ముఖ్యంగా పచ్చదన లేమి, తారు, సిమెంట్ రోడ్డులు ఉన్న కాస్త ఖాళీ స్థలాన్ని కప్పివేయడంతో నగరాల్లోనే ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని వెల్లడించింది. వేడి మొత్తం రహదారుల ఉపరితలంపైనే ఉండిపోవడం వల్ల నగరాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఫలితంగా ఉష్ణోగ్రతలు మరో మూడు, నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉన్న అనుభూతి కలుగుతుందని సీఎస్ఈ క్లైమేట్ చేంజ్ విభాగం ప్రోగ్రామ్ మేనేజర్ అర్జున శ్రీనిధి తెలిపారు. ‘‘2010తో పోలిస్తే ఈ ఏడాది వడగాల్పులు చాలా తక్కువ. కానీ మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చిల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసిన తరువాత కూడా ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరిగిపోవడానికి నగరాలలోని పరిస్థితులే కారణం’’ అని ఆయన వివరించారు. రుతు పవనాలపై ప్రభావం వేసవిలో ఎండలు బాగా ఉంటే ఆ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని అంటుంటారు. కానీ, ఈ రోజుల్లో దీన్ని కూడా నమ్మే అవకాశం లేదు. వడగాల్పుల కారణంగా నేల వేడెక్కిన కారణంగా వెస్టర్లీ డిస్టర్బెన్సెస్ (పసిఫిక్, ఆర్కిటిక్ ప్రాంతాల నుంచి వీచే గాలులు)లో తేడాలు వస్తాయని, రుతు పవనాలపై వీటి ప్రభావం ఉండే అవకాశముందని సీఎస్ఈ శాస్త్రవేత్త గీతికా సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. అతి నీలలోహిత కిరణాల ముప్పు మానవ చర్యల కారణంగా భూమి సగటు ఉష్ణోగ్రతలు ప్రతిఏటా పెరుగుతున్నాయి. 2001 నుంచి 2010 మధ్యలో భారత్‌లోనే సగటు ఉష్ణోగ్రతలు దాదాపు అర డిగ్రీ సెల్సియస్ వరకూ పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వందేళ్లలో ఉష్ణోగ్రత పెరుగుదల 0.8 డిగ్రీలుగా ఉంది. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో వడగాల్పుల ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని సీఎస్ఈ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం వడగాల్పులు వీచే సమయం అయిదు రోజులు మాత్రమే ఉండగా భవిష్యత్తులో ఇది 30 నుంచి 40 రోజులకు పెరుగుతుందని అభిప్రాయపడింది. దీని వల్ల నగరాల్లో చర్మ కేన్సర్‌కు కారణమయ్యే అతి నీలలోహిత కిరణాల ప్రభావమూ పెరుగుతోందని తెలిపింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటిరియాలజీ లెక్కల ప్రకారం కొన్ని నగరాల యూవీ ఇండెక్స్ (అతి నీలలోహిత కిరణాల సూచీ) ప్రమాదకర స్థాయిలో ఆరు నుంచి తొమ్మిది మధ్యలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో వడగాల్పులకు సంబంధించిన అవగాహన పెంచడంతోపాటు, హెచ్చరిక వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, తగిన సంఖ్యలో వైద్య, ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సీఎస్ఈ సూచించింది. -
ఈ కోళ్లు ఖతర్నాక్
- విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడకం - 40 శాతం కోళ్లలో మందుల అవశేషాలు - శరీరానికి ముప్పు తప్పదంటున్న ఐఎంఏ సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), ఢిల్లీలోని పౌల్ట్రీఫారాల నిర్వాహకులు కోళ్లకు భారీ ఎత్తున యాంటీబయాటిక్స్‌ను భారీ మోతాదులో వాడుతున్నారని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) అధ్యయనంలో తేలడం చర్చకు దారితీసింది. యాంటీబయాటిక్స్ వాడిన చికెన్ తినడం వలన మానవ శరీరంలో క్రమంగా రోగనిరోధక శక్తి తగ్గి, విషక్రిముల ప్రభా వం పెరుగుతుందని హెచ్చరించింది. కోళ్లు రోగాల బారిన పడకుండా ఉండేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఇలాంటి కోళ్ల మాంసాన్ని తినడం వల్ల మానవశరీరానికి బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి తగ్గుతుంది. ఫలితంగా రోగాల బారిన పడడం ఖాయమని, అప్పుడు యాంటీబయాటిక్స్‌తోనూ ప్రయోజనం ఉండకపోవచ్చని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రధాన కార్యదర్శి సెక్రటరీ జనరల్ డాక్టర్ నరేంద్ర సైనీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్స్‌ను జాగ్రత్తగా వాడడంపై అవగాహన పెంచాలని ఐఎంఏ నిర్ణయించింది. ఢిల్లీ, ఎన్సీఆర్లో పెంచుతున్న కోళ్లలో ఆరు యాంటీబయాటిక్స్ మందుల అవశేషాలు అధికంగా ఉన్నాయని సీఎస్ఈ వెల్లడించింది. ఢిల్లీ, ఎన్సీఆర్లో దొరికే 70 చికెన్ నమూనాలను పరీక్షించగా, 40 శాతం కోళ్లలో యాంటీ బయాటిక్స్ అవశేషాలు ఉన్నట్టు నిర్ధారించారు. 17 శాతం నమూనాల్లో ఒకటి కన్నా ఎక్కువ యాంటీబయాటిక్స్ అవశేషాలున్నాయని సీఎస్ఈ ఇటీవల జరిపిన అధ్యయనం వెల్లడించింది. కోళ్లు వేగంగా పెరిగి, వాటిలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి పెంపకందారులు యాంటీబయాటిక్స్‌ను వాడుతున్నారు. ఇలాంటి కోళ్ల మలమూత్రాలు భూమి, నీటిలో కలవడంవల్ల వాటి దేహాల్లోని యాంటీబయాటిక్స్ అవశేషాలు క్రమేణా మానవశరీరంలో చేరవచ్చు. కోడి మాంసాన్ని బాగా ఉడికించినప్పటికీ ఈ బ్యాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి చికెన్ తినడం వల్ల క్రమేణా మనిషి శరీరానికి బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి తగ్గుతుంది. మానవులలో అనేక రకాల ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాకు శక్తి పెరిగిన తరువాత యాంటీబయాటిక్స్ ఎన్ని వాడినా ఫలితం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనదేశంలో సిప్రోఫ్లోక్సీసిన్, టెట్రాసైక్లీన్, డాక్సీసైక్లిన్ వంటి యాంటిబయాటిక్స్‌కు బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి తగ్గుతోందని డాక్టర్లు అంటున్నారు. ఏ కోడికి యాంటిబయాటిక్స్ వాడారో తెలుసుకోవడం కష్టం కాబట్టి పౌల్ట్రీల్లో యాంటీబయాటిక్స్ వాడకాన్ని నిషేధిస్తూ చట్టాలు చేయడం మేలన్నది డాక్టర్ల అభిప్రాయం. -
రోడ్డు ప్రమాదాల బాధితుల్లో 40% యువతే!
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 40 శాతానికి పైగా 24 ఏళ్ల వయసున్న యువతే బాధితులుగా మిగులుతున్నారని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) తన నివేదికలో స్పష్టం చేసింది. 2012లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 5,879 మంది చిన్నారులు(0-14 ఏళ్లు) బాధితులు కాగా, 26,709(15-24 ఏళ్లు) మంది యువత అంగ వికలురుగా మిగిలారని నివేదిక స్పష్టం చేసింది. ఇదిలావుంటే, ఏటా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి శాతంతో పోల్చుకుంటే మన దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోతున్న వారు 11శాతంగా ఉన్నారని వివరించింది. 2003లో 18 శాతంగా ఉన్న రోడ్డు ప్రమాదాలు 2012 నాటికి 25 శాతానికి పెరిగాయని ప్రభుత్వ అధికారిక నివేదికే స్పష్టం చేస్తోందని సీఎస్ఈ పేర్కొంది. రహదారులపై మితిమీరుతున్న వేగమే ప్రమాదాలకు ప్రధాన కారణంగా గుర్తించినట్టు తెలిపింది. రోడ్డు ప్రమాద బాధితుల్లో ఏటా కనీసం 5 వేల మందికి మేజర్ ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోందని, మోటారు వాహనాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో జరుగుతున్న ప్రమాదాల సంఖ్య భారీగా ఉందని, ఈ విషయాన్ని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ గుర్తించిందని నివేదిక స్పష్టం చేసింది.