ఈ కోళ్లు ఖతర్నాక్
- విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడకం
- 40 శాతం కోళ్లలో మందుల అవశేషాలు
- శరీరానికి ముప్పు తప్పదంటున్న ఐఎంఏ
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), ఢిల్లీలోని పౌల్ట్రీఫారాల నిర్వాహకులు కోళ్లకు భారీ ఎత్తున యాంటీబయాటిక్స్‌ను భారీ మోతాదులో వాడుతున్నారని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) అధ్యయనంలో తేలడం చర్చకు దారితీసింది. యాంటీబయాటిక్స్ వాడిన చికెన్ తినడం వలన మానవ శరీరంలో క్రమంగా రోగనిరోధక శక్తి తగ్గి, విషక్రిముల ప్రభా వం పెరుగుతుందని హెచ్చరించింది. కోళ్లు రోగాల బారిన పడకుండా ఉండేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఇలాంటి కోళ్ల మాంసాన్ని తినడం వల్ల మానవశరీరానికి బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి తగ్గుతుంది.
ఫలితంగా రోగాల బారిన పడడం ఖాయమని, అప్పుడు యాంటీబయాటిక్స్‌తోనూ ప్రయోజనం ఉండకపోవచ్చని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రధాన కార్యదర్శి సెక్రటరీ జనరల్ డాక్టర్ నరేంద్ర సైనీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్స్‌ను జాగ్రత్తగా వాడడంపై అవగాహన పెంచాలని ఐఎంఏ నిర్ణయించింది. ఢిల్లీ, ఎన్సీఆర్‌లో పెంచుతున్న కోళ్లలో ఆరు యాంటీబయాటిక్స్ మందుల అవశేషాలు అధికంగా ఉన్నాయని సీఎస్‌ఈ వెల్లడించింది. ఢిల్లీ, ఎన్సీఆర్‌లో దొరికే 70 చికెన్ నమూనాలను పరీక్షించగా, 40 శాతం కోళ్లలో యాంటీ బయాటిక్స్ అవశేషాలు ఉన్నట్టు నిర్ధారించారు.
17 శాతం నమూనాల్లో ఒకటి కన్నా ఎక్కువ యాంటీబయాటిక్స్ అవశేషాలున్నాయని సీఎస్‌ఈ ఇటీవల జరిపిన అధ్యయనం వెల్లడించింది. కోళ్లు వేగంగా పెరిగి, వాటిలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి పెంపకందారులు యాంటీబయాటిక్స్‌ను వాడుతున్నారు. ఇలాంటి కోళ్ల మలమూత్రాలు భూమి, నీటిలో కలవడంవల్ల వాటి దేహాల్లోని యాంటీబయాటిక్స్ అవశేషాలు క్రమేణా మానవశరీరంలో చేరవచ్చు. కోడి మాంసాన్ని బాగా ఉడికించినప్పటికీ ఈ బ్యాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి చికెన్ తినడం వల్ల క్రమేణా మనిషి శరీరానికి బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి తగ్గుతుంది. మానవులలో అనేక రకాల ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాకు శక్తి పెరిగిన తరువాత యాంటీబయాటిక్స్ ఎన్ని వాడినా ఫలితం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనదేశంలో సిప్రోఫ్లోక్సీసిన్, టెట్రాసైక్లీన్, డాక్సీసైక్లిన్ వంటి యాంటిబయాటిక్స్‌కు బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి తగ్గుతోందని డాక్టర్లు అంటున్నారు. ఏ కోడికి యాంటిబయాటిక్స్ వాడారో తెలుసుకోవడం కష్టం కాబట్టి పౌల్ట్రీల్లో యాంటీబయాటిక్స్ వాడకాన్ని నిషేధిస్తూ చట్టాలు చేయడం మేలన్నది డాక్టర్ల అభిప్రాయం.