![State government has been alerted about bird flu](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/flu.jpg.webp?itok=klPpgsWv)
బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కాకపోయినా ప్రభుత్వం అప్రమత్తం
భోపాల్‌కు పంపిన శాంపిల్స్ ఫలితాల కోసం ఎదురుచూపులు
ఒకవేళ పాజిటివ్ వస్తే 5 కిలోమీటర్ల పరిధిలోని కోళ్లన్నింటినీచంపేయాల్సిందే
ఖమ్మం జిల్లా శాంపిల్స్‌పైనేఅనుమానాలు.. ఇప్పటికేతూర్పుగోదావరిలో బర్డ్‌ఫ్లూ నోటిఫై
సాక్షి, హైదరాబాద్: ఏపీలో బర్డ్‌ఫ్లూ వ్యాధి నిర్ధారణ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తెలంగాణలో ఈ వ్యాధి ఇంకా నిర్ధారణ కానప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్ల రాకపోకలపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఇతర రాష్ట్రాలతో మనకు ఉన్న సరిహద్దుల్లో మంగళవారం పోలీసులు, పశుసంవర్ధక శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి కోళ్ల వాహనాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ నోటిఫై చేశారు.
మన రాష్ట్రంలో ఇంకా వ్యాధి నిర్ధారణ కాలేదని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రం నుంచి భోపాల్‌లోని హైసెక్యూరిటీ ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్ ఫలితాలు ఒకట్రెండు రోజుల్లో వస్తాయని అంటున్నారు. ఒకవేళ ఈ ఫలితాల్లో బర్డ్‌ఫ్లూ పాజిటివ్ వస్తే మాత్రం తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఖమ్మం జిల్లా నుంచి పంపిన శాంపిల్స్‌పైనే అనుమానాలున్నాయనే చర్చ పశుసంవర్థక శాఖ వర్గాల్లో జరుగుతోంది.
బాగా ఉడికించి తినాలి...
మన రాష్ట్రంలోని కోళ్లలో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయ్యే అవకాశాలు తక్కువ గానే ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఫలితం పాజిటివ్ వస్తే ఏం చేయాలన్న దానిపై కూడా పశుసంవర్థక శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఏ ప్రాంతంలోని కోళ్లకు బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయ్యిందో ఆ ప్రదేశంలోని ఐదు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న కోళ్లన్నింటినీ చంపక తప్పదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
చంపిన కోళ్లను గుంతలు తీసి పూడ్చిపెట్టాలని, ఆ గుంతలపై మంట పెట్టడమే కాకుండా అవసరమైతే సున్నం వేయాల్సి వస్తుందని అంటున్నారు. వ్యాధి సోకిన ఫామ్‌లను పూర్తిస్థాయిలో శుభ్రం చేయడంతోపాటు ఆ ఫామ్‌లలో ఉపయోగిచే వస్తువులనూ మార్చాలంటున్నారు. మొత్తం మీద శాంపిల్స్ ఫలితాలు పాజిటివ్ వస్తే పశుగణనలో బిజీగా ఉన్న తమకు కొత్త తలనొప్పి ప్రారంభమైనట్టేనని వారంటున్నారు. ఇప్పుడు కూడా కోళ్లను తినడంలో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని, కోళ్లు, కోడిగుడ్లు తినేటప్పుడు బాగా ఉడికించి తినాలని వారు సూచిస్తున్నారు.
ఏపీ నుంచి తెలంగాణలోకి కోళ్లు రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర సరిహద్దు అయిన కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్ వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి ఏపీ వైపు నుంచి కోళ్లతో వస్తున్న డీసీఎంను వెనక్కి పంపినట్టు కోదాడ మండల పశువైద్యాధికారి మధు తెలిపారు.
ఖమ్మం జిల్లా సరిహద్దుగా ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీ–ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేస్తూ కోళ్లు దిగుమతి కాకుండా అడ్డుకుంటున్నారు. ఏపీ సరిహద్దుల్లో ఉన్న కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు, పోలీసు, రెవెన్యూ, ఫారెస్ట్ తదితర శాఖల అధికారులతో బుధవారం సమావేశం నిర్వహిస్తున్నామని ఖమ్మం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వి.వెంకటనారాయణ, వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సాలూర, కందకుర్తిచెక్ పోస్టుల వద్ద పశుసంవర్థక, పోలీసు శాఖలు కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి నిజామాబాద్‌లోకి కోళ్లతో పాటు ఏ జీవాలను కూడా రవాణా చేయకుండా నిరోధిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment