సరి-బేసి ముగిసిన 3రోజుల్లో 57 శాతం పెరుగుదల
♦ సుప్రీం కోర్టు సూచనలు అమలు చేయాలని ఢిల్లీ సర్కారుకు
♦ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ వినతి
న్యూఢిల్లీ: సరి-బేసి పథకం పైలట్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తొలి మూడు రోజుల్లోనే ఢిల్లీ వాతావరణంలో త్రీవమైన మార్పులు కనిపించాయి. ‘సరి-బేసి పథకం తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యంలో కనిపించిన మార్పు.. పథకం పైలట్ ప్రాజెక్టు ముగిసిన తొలి మూడు రోజుల్లోనే కాలుష్యం 57 శాతం పెరిగింది’ అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ - సీఎస్‌ఈ వెల్లడించింది. కాలుష్యం మరింత విస్తరించకుండా అవసరమైన కార్యాచరణ చేపట్టాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సీఎస్‌ఈ కోరింది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బస్సులు, మెట్రో రైళ్లను పెంచటంతో పాటు.. కాలుష్యాన్ని వెదజల్లుతున్న ట్రక్కులపైనా దృష్టి పెట్టాలని సూచించింది. ఢిల్లీల్లో సాధారణంగా 277 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్‌లుండే కాలుష్యం.. సరిబేసి విధానంతో 155కు తగ్గింది. అయితే తాజాగా మళ్లీ అన్ని వాహనాలు రోడ్లపైకి రావటంతో.. ఇది 281 చేరింది. కాగా, గురువారం ఉత్తర ఢిల్లీలో కార్-ఫ్రీ డేను పాటించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నాయకత్వంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అయితే.. ఇలాంటి కార్యక్రమాలకు ఢిల్లీ పోలీసులు సహకరించటం లేదని సిసోడియా విమర్శించారు.
బీజింగ్‌లోనూ ‘సరి-బేసి’కి సన్నద్ధం
బీజింగ్: చైనా రాజధాని నగరం బీజింగ్‌లోనూ కార్ల వినియోగదారుల ద్వారా ‘సరి-బేసి’ పద్ధతిని అమలు చేయించేందుకు స్థానిక యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యనగరంగా రికార్డుల్లోకి ఎక్కిన బీజింగ్‌లో రోజుకు 5.6 మిలియన్ల కారులు రాకపోకలు సాగిస్తున్నాయి. దీనికి పరిష్కారంగా శీతకాలంలో కార్ల వినియోగాన్ని కుదించే యోచనను అక్కడి పాలనా యంత్రాంగం చేస్తున్నట్లు అధికార మీడియా ఏజెన్సీ తెలిపింది.
ఢిల్లీలో మళ్లీ పెరిగిన కాలుష్యం
Published Sat, Jan 23 2016 2:59 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement