తెలుపు రంగులో ఉండే ఆహారాలు ఎప్పుడూ ప్రమాదం తెచ్చిపెడుతుంటాయని కొందరు ఆహార నిపుణులు అంటుంటారు. కానీ అది పూర్తిగా వాస్తవం కాదు. తెలుపు ఎప్పుడూ డేంజరు అనే మాట కేవలం ‘పాలిష్ చేసిన తెల్లటి బియ్యం, చక్కెర, ఉప్పు’ అనే మూడురకాల ఆహారాలకు మాత్రమే వర్తిస్తుంది. మిగతా తెలుపు రంగు ఆహారాలన్నీ మనకు మేలు చేసేవే. తెల్లగా పాలిష్ చేసిన తెల్లటి బియ్యానికి బదులు బ్రౌన్‌రైస్ ఎప్పుడూ మేలే. అలాగే తెల్లటి రంగులో ఉంటూ కూరలోకి వాడే ఉల్లి, వెల్లుల్లి, కాలీఫ్లవర్, వైట్ క్యాబేజీ, తెల్లవంకాయ, వైట్ మష్రూమ్స్ అనేవి ఆరోగ్యానికి ఎప్పుడూ మేలు చేసేవే. మేలు చేసే తెల్లటి ఆహారాలివి...
ఉల్లి, వెల్లుల్లి
తెల్ల రంగులోనే ఉన్నప్పటికీ, తమలోని ఘాటుదనంతో క్యాన్సర్‌ను అవి తరిమి కొడతాయి. వాటిల్లో ఉండే అలిసిన్ అనే పోషకం (ఫైటో కెమికల్) వల్ల వాటికా ఘాటుదనం వస్తుంది. అలిసిన్ అనేక రకాల క్యాన్సర్లను నివారించడమే కాదు... రక్తంలోని హానికరమైన కొలెస్ట్రాల్ మోతాదులను గణనీయంగా తగ్గిస్తుంది. అందుకే పొట్ట, పెద్దపేగు, మలద్వార క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్లతో పాటు గుండెజబ్బులను సైతం వెల్లుల్లి, ఉల్లి నివారిస్తాయి.
కాలీఫ్లవర్ / వైట్ క్యాబేజీ
వీటిల్లో ఐసోథయనేట్స్, ఐసోఫేవోన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు కూడా అనేక రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. మెదడుకు మంచి చురుకుదనాన్నీ ఇస్తాయి.
తెల్ల ముల్లంగి
ఈ దుంప ఎరుపుతో పాటు తెల్లరంగులోనూ లభ్యమవుతుంది. దీన్ని చాలా శక్తిమంతమైన టీ–టాక్సిఫైయర్‌గా చెబుతారు. అంటే దేహంలో పేరుకున్న విషాలను సమర్థంగా బయటికి పంపుతుందన్నమాట. కాలేయానికి చాలా మేలు చేస్తుందది. కామెర్లు వచ్చిన వాళ్లలో నాశమయ్యే ఎర్రరక్తకణాలను సంరక్షించడంతో పాటు వాటినలా కాపాడటం ద్వారా కణాలన్నింటికీ మరిన్ని పోషకాలూ, ఆక్సిజన్ అందేలా దోహదపడుతుంది. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు దుంపకూరలను తినకూడదు లేదా చాలా పరిమితంగా తినాలంటారు.
కానీ ముల్లంగికి ఆ మాట వర్తించదు. దానిలోని పీచు కారణంగా చక్కెర మెల్లగా విడుదలయ్యేలా చేసే గుణం వల్ల అది రక్తంలోని చక్కెర మోతాదులను అదుపులో ఉంచుతుంది. వీటిల్లో కూడా క్యాన్సర్‌ను ఎదుర్కొనే యాంటీ–క్యాన్సరస్ గుణాలున్నాయి. వీటిలోని యాంటీఫంగల్ ప్రోటీన్ ‘ఆర్‌ఎస్‌ఏఎఫ్‌పీ2’ ఫంగల్ వ్యాధులను నివారిస్తుంది.
అలాగే తెల్లవంకాయ, తెల్ల మష్రూమ్స్ కూడా అంతే ఆరోగ్యకరం. అవి వ్యాధినిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తాయి. బీటా–గ్లూకాన్స్ అని పిలిచే అందులోని పాలీసాకరైడ్స్ తెల్లరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. (మన దేహ రక్షణకు తెల్లరక్తకణాలు ఎంతగానో తోడ్పడతాయన్న సంగతి తెలిసిందే). అంతేకాదు... వాటిల్లో ఎపిగల్లాకాటెచిన్ గ్యాలేట్ (ఈజీసీజీ) అనే పోషకం క్యాన్సర్‌తో పాటు ఎన్నెన్నో వ్యాధుల నుంచి కాపాడుతుంది.
- సుజాతా స్టీఫెన్
సీనియర్ న్యూట్రీషనిస్ట్
Comments
Please login to add a commentAdd a comment