పాత బస్తీ.. బైకర్స్‌ మస్తీ.. | City Bikers Night Out In Old City Hyderabad | Sakshi
Sakshi News home page

పాత బస్తీ.. బైకర్స్‌ మస్తీ..

Published Tue, Sep 24 2024 7:04 AM | Last Updated on Tue, Sep 24 2024 7:04 AM

City Bikers Night Out In Old City Hyderabad

బైకర్‌ క్లబ్స్‌ నైట్‌ అవుట్స్‌కు అడ్డాగా ఓల్డ్‌ సిటీ 

చారిత్రక నేపథ్యంలో చాయ్, బిస్కెట్‌లతో చిట్‌చాట్‌ 

ఇతర ప్రాంతాల బైకర్స్‌కూ అక్కడే ఆతిథ్యం 

ఫుడ్‌ అండ్‌ కల్చర్‌పై ప్రచారానికి వీలుగా 

అడ్వెంచర్‌ ఫీల్‌ కోసం నైట్‌ రైడ్స్‌

చార్మినార్ సమీపంలో జనసంచారం అరకొరగా ఉండే ప్లేస్‌ను వెదకాలంటే.. అది కేవలం అర్ధరాత్రుళ్లు తప్ప అసాధ్యం. అందుకే సిటీ బైకర్స్‌ తమ చిట్‌చాట్‌కు అదే టైమ్‌ను ఎంచుకుంటున్నారు. పబ్స్, కేఫ్స్‌లో చిల్‌ అవుట్‌ అవడం ఎలా ఉన్నా ఓల్డ్‌ సిటీలో నైట్‌ అవుట్‌ మజాయే వేరు అంటున్నారీ బైకర్స్‌. 

 నగరంలో విభిన్న రకాల పేర్లతో పదుల సంఖ్యలో బైకర్స్‌ క్లబ్స్‌ ఉన్నాయి. జాయ్‌ రైడ్స్‌ నుంచి లాంగ్‌రైడ్స్‌కు, ప్రత్యేక సందర్భాల్లో సందేశాత్మక రైడ్స్‌కు సైతం పేరొందిన ఈ క్లబ్స్‌.. తరచూ తమ ఓల్డ్‌సిటీని చుట్టి వస్తుంటారు. ‘ఓల్డ్‌ సిటీలో కూర్చుని ముచ్చట్లు పెట్టుకోవడం అనేది నగరంలోని బైకర్స్‌కు ఒక సంప్రదాయంగా మారుతోంది. దీనికి తొలిసారి నగరంలో ఈ తరహా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన క్లబ్స్‌ కారణం’అంటూ చెప్పారు నగరంలోని ఓ బైకర్స్‌ క్లబ్‌కు చెందిన శ్రీకాంత్‌.

గరమ్‌ చాయ్‌.. బన్‌ మస్కా..
సిటీలో ఎక్కడ చాయ్‌ తాగినా రాని కిక్‌ ఓల్డ్‌ సిటీలో ముచ్చట్లతో కలిపి పంచుకుంటే వస్తుందంటారు వాండరర్స్‌ క్లబ్‌కి చెందిన లలిత్‌ జైన్‌. నగరంలోని అత్యంత పాత క్లబ్స్‌లో ఒకటైన వాండరర్స్‌ తరపున పర్యాటక రంగ ప్రమోషన్స్‌ కోసం పాత బస్తీలో తరచూ రైడ్స్‌ నిర్వహిస్తుంటామని చెప్పారాయన. చాయ్‌తో పాటు ఉస్మానియా బిస్కెట్, బన్‌ మస్కా వంటివి ఓల్డ్‌సిటీకి మాత్రమే ఫేమస్‌ అయిన పలు హైదరాబాదీ ఫుడ్‌ ఐటమ్స్‌ను ఎంజాయ్‌ చేసేందుకు రద్దీ లేని వేళల్లో రైడ్స్‌ వేస్తుంటారు బైకర్స్‌. వెజ్, నాన్‌ వెజ్‌రైడర్స్‌ అందరూ ఎంజాయ్‌ చేసేందుకు అవసరమైన ఫుడ్‌ అక్కడ దొరుకుతుందని, దీంతో ఓల్డ్‌ సిటీ రైడ్‌ అంటే రైట్‌ అంటామని బైకర్‌ సిద్ధు చెబుతున్నాడు.

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌.. 
పాత బస్తీ అనేది ప్రతి హైదరాబాదీకి ఒక ఎమోషన్‌ అంటారు రాజ్‌దూత్‌ బైక్‌ మీద రైడ్స్‌ చేసే నగరవాసి ఛటర్జీ. సాధారణ సమయాల్లో విపరీతమైన రద్దీ వల్ల ఆ ప్రాంతాన్ని సరిగా ఆస్వాదించలేమని, అదే బాగా పొద్దుపోయాక వెళితే.. బైక్‌ లైట్స్‌ వెలుగులో మిలమిల మెరిసే చార్మినార్‌ పరిసరాల్ని వదిలి రాలేమని అంటున్నారాయన. ఆయన లాగే అనేక మంది నగరానికి చెందిన మధ్య వయసు్కలు తమ యుక్త వయసులోని పిల్లల్ని తీసుకుని మరీ రాత్రుళ్లు.. బైక్స్‌ మీద ఓల్డ్‌ సిటీ టూర్‌ వేస్తుండడం సర్వసాధారణం.

అతిథి దేవోభవ..
దేశ విదేశాల్లో పర్యటించే బైకర్స్‌.. కొన్ని నగరాలు, ప్రాంతాలకు తాము వస్తున్న సమాచారాన్ని తరచూ ఇచ్చి పుచ్చుకుంటుంటారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో, ఊర్లలో ఉన్న బైకర్స్‌ వెంటనే వారికి ఎదురేగి స్వాగతాలు పలకడం, తమ ప్రాంత విశేషాలను గురించి వారికి వివరించడం చేస్తుంటారు. అదే క్రమంలో నగరానికి వచ్చే ఇతర ప్రాంతాల బైకర్స్‌కు తప్పకుండా సందర్శనీయ స్థలం పాత బస్తీయే అవుతుంటుంది. అలా తరచూ వచ్చే బైకర్స్‌ను స్వాగతించి వారు కోరిన విందు విహారాలతో అతిథి మర్యాదలకు స్థానిక బైకర్స్‌ పాత బస్తీనే ఎంచుకుంటారు.

తెల్లవారు ఝాము దాకా.. 
అర్ధరాత్రి ప్రారంభించి తెల్లవారుఝామున బ్రేక్‌ఫాస్ట్‌తో ముగించడం దాకా అక్కడే గడిపే బైకర్స్‌ కూడా ఉన్నారు.. బిర్యానీ, క్యారామెల్‌ పుడ్డింగ్, జఫ్రాన్‌ టీ వంటి వెరైటీలకు పేరొందిన నయాబ్‌ హోటల్, మసాలా బ్లాక్‌ టీ, జిందా తిలిస్మాత్‌ బ్లాక్‌ టీలు లభించే చౌక్‌ ఏరియాలోని డికాక్షన్‌ పాయింట్, నిహారీ, పాయా, షోర్బాలకు పేరొందిన చౌహాముల్లా ప్యాలెస్‌ సమీపంలోని  అల్హాముదులైలాహ్‌ హోటల్, జ్యూస్‌లు, సలాడ్స్‌ అంటే గుర్తొచ్చే చారి్మనార్‌ దగ్గర్లోని మిలాన్‌ జ్యూస్‌ సెంటర్, సిద్ధి అంబర్‌ బజార్‌లో ఇడ్లీ దోశలతో ఆహా్వనించే ప్రహ్లాద్, అన్నపూర్ణ టిఫిన్స్‌.. ఇంకేం కావాలి చెప్పండి అంటున్న బైకర్స్‌కు ఆయా హోటల్స్‌ యజమానులు అంతా చిరపరిచితులే. దీంతో కాస్త ముందుగా చెబితే చాలు వచ్చేవారి సంఖ్యకు తగ్గట్టు ఐటమ్స్‌ రెడీ చేసేస్తారు.

నురానీ కేఫ్‌ నుంచి నాసిక్‌ హైవేకి.. 
రాత్రి 12 దాటిన తర్వాత పాతబస్తీలోని నురానీ కేఫ్‌లో చాయ్‌ తాగి కాసేపు ముచ్చట్లు పెట్టుకోవడం రొటీన్‌. మరింత లాంగ్‌రైడ్‌ కోసం అక్కడ నుంచి నాసిక్‌ హైవే పై 100 నుంచి 120 కిమీ, అలాగే అక్కడి నిమ్రా కేఫ్‌ కూడా తరచూ మా మీటింగ్‌ పాయింట్‌ అవుతుంటుంది. రాత్రి పూట బైక్‌ మీద చారి్మనార్‌కు అత్యంత సమీపానికి వెళ్లడం, అక్కడి చాయ్, చాట్‌ ఆస్వాదించడం బాగుంటుంది. బయట నుంచి వచి్చన బైకర్స్‌ను తప్పకుండా పాత బస్తీకి తీసుకువెళతాం.  – అమర్, 
హిందూస్థాన్‌ రాయల్స్‌ బుల్లెటీర్స్‌ క్లబ్స్‌

అడ్వెంచర్‌ ఫీల్‌ కోసం.. 
రైడ్స్‌ మధురమైన జ్ఞాపకాలను పోగు చేసుకోడానికే. అందులో రాత్రి పూట రైడ్స్‌ ప్రత్యేకమైనవి. నైట్‌ రైడ్‌ అడ్వెంచర్‌ ఫీల్‌ వస్తుంది. మా వాండరర్స్‌ తరచూ ఫుడ్‌ రైడ్స్‌ నిర్వహిస్తుంటాం. రాత్రి పూట హైవే మీది దాబాల లాగే పాత బస్తీలో వెరైటీ ఫుడ్‌ అందించే ప్రాంతాల్లో రైడ్స్‌ వేస్తుంటాం. నగరం మీదుగా పర్యటించే బైకర్స్‌ గురించి తెలుసుకుని ఆహా్వనిస్తాం. పాతబస్తీ చరిత్రతో పాటు ఆహారాన్ని రుచిచూపిస్తాం. మళ్లీ మళ్లీ ఓల్డ్‌సిటీకి రావాలని అనిపిస్తుందంటారు.  – రాహుల్‌.వాండరర్స్‌ క్లబ్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement