Crorepati Chai Wala: Nitin Saluja, IIT Graduate Who Quit American Job To Open Chaayos - Sakshi
Sakshi News home page

Crorepati Chai Wala: తాగుదామంటే టీ దొరకలేదు.. అంతే బిజినెస్‌ పెట్టేశాడు.. కోట్లు సంపాదిస్తున్నాడు!

Published Mon, Aug 21 2023 12:49 PM | Last Updated on Mon, Aug 21 2023 1:08 PM

Crorepati Chai Wala Nitin Saluja IITan Quit American Job Open Chaayos - Sakshi

దేశంలో ఉన్నత చదువులు చదివిన కొంత మంది యువత ఉద్యోగాలు దొరక్క టీ దుకాణాలు ప్రారంభించి ఉపాధి పొందడం చూస్తున్నాం. ఇలా లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ల గురించి వింటున్నాం. అయితే లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం అదీ అమెరికన్‌ జాబ్‌ మానేసి మరీ చాయ్‌ బిజినెస్‌ పెట్టిన వాళ్ల గురించి ఎప్పుడైనా విన్నారా?

అమెరికాలో ఉద్యోగం చాలా మందికి కల. కానీ అది కొందరికే దక్కుతుంది. ఇంతటి క్రేజ్‌ ఉన్న యూఎస్‌ ఉద్యోగాన్ని ఎవరైనా వదులుకుంటారా? ఐఐటీయన్‌ నితిన్ సలూజా (Nitin Saluja) వదులుకున్నాడు. చాయోస్ (Chaayos) అనే పేరుతో టీ బిజినెస్‌ను ప్రారంభించాడు.

నితిన్ సలూజా ప్రారంభించిన చాయోస్ వ్యాపారంలో మొదట్లో అనేక ఒడిదుడుకులు వచ్చాయి. కానీ నితిన్ పట్టుదల, సంకల్పంతో కంపెనీని విజయ శిఖరాగ్రానికి తీసుకెళ్లాడు. స్టార్‌బక్స్, కేఫ్ కాఫీ డే, కేఫ్ మోచా, బరిస్టా వంటి కాఫీ షాపుల ఆధిపత్యంలో ఉన్న దేశంలో  చాయోస్ తనకంటూ ఒక పేరును సంపాదించుకుంది.  భారతదేశంలోని ప్రముఖ చాయ్ కేఫ్‌గా మారింది. చాయ్ బిజినెస్‌ను స్థాపించి,  రూ. 100 కోట్ల వ్యాపారంగా మార్చిన నితిన్ సలూజా కథను తెలుసుకుందాం.

మెకానికల్ ఇంజనీర్‌
నితిన్ సలూజా ఐఐటీ బాంబేలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. తన చదువు పూర్తయిన తర్వాత, సలుజా అమెరికాలోని ఒక పెద్ద సంస్థలో కార్పొరేట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా చేరారు. రూ.లక్షల్లో జీతం.  ఒక రోజు నితిన్, తన భార్యతో కలిసి టీ తాగుదామనుకున్నారు. కానీ కనుచూపు మేరలో టీ షాప్‌ కనిపించలేదు. అప్పుడే నితిన్‌ ఓ ఆలోచన వచ్చింది. టీ కేఫ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఉద్యోగాన్ని మానేసి ఇండియాకి తిరిగొచ్చేశాడు. టీ వ్యాపారానికి ప్రణాళికలు రూపొందించడం ప్రారంభించాడు.

చాయోస్ పుట్టిందిలా..
నితిన్ అమెరికాలో ఉన్నప్పుడు టీ బూత్‌ల నుంచి టీ కొనడం సవాలుగా ఉందని గమనించాడు. టీ తాగడానికి ఒక హై-ఎండ్ టీ షాప్‌ ఏర్పాటు చేయగలిగితే అది అద్భుతంగా ఉంటుందని భావించాడు. భారత్‌లో రకరకాల కాఫీని అందించే కేఫ్‌లు చాలా ఉన్నాయి కానీ విభిన్న టీని అందించేవి ఏవీ లేవని గుర్తించాడు.

దేశంలో ప్రత్యేకమైన టీ తాగే సంస్కృతి ఉంది. భారతీయులు అనేక రకాల టీలను తయారుచేస్తారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న నితిన్.. ఇండియాలో టీ తాగేవాళ్లకు ఉపయోగపడే టీ కేఫ్‌ను ప్రారంభించాలని భావించాడు. 2012లో తన స్నేహితుడు రాఘవ్‌తో కలిసి చాయోస్‌ని స్థాపించాడు. గురుగ్రామ్‌లో తమ మొదటి కేఫ్‌ ప్రారంభించారు.

రూ. 100 కోట్ల ఆదాయం
ఇంతో ఇష్టంగా చాయోస్‌ను ప్రారంభించిన నితిన్ కస్టమర్లకు 'మేరీ వాలీ చాయ్' అందించడం మొదలు పెట్టాడు. ప్రారంభంలో కొన్నేళ్లు మూలధనం, పెట్టుబడి సమస్యలతో మనుగడ కోసం కష్టపడ్డాడు. తానే స్వయంగా ఆర్డర్లు తీసుకోవడం, టీ తయారు చేయడం, సర్వ్‌ చేయడం వంటివి చేసేవాడు. ప్రతి కస్టమర్‌కూ ప్రత్యేకమైన టీని అందిస్తూ ఆకట్టుకునేవాడు. ఇలా వ్యాపారం వేగం పుంజుకుంది. అవుట్‌లెట్‌లు విస్తరించాయి. కాగా కోవిడ్ సమయంలో అన్ని వ్యాపారాల లాగే చాయోస్ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. తర్వాత 2020లో మళ్లీ పుంజుకుంది. 

తొలినాళ్ల కష్టాల తర్వాత నితిన్‌ శ్రమకు ప్రతిఫలం దక్కింది. కంపెనీ 2020లో రూ. 100 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. చివరికి ముంబై, బెంగళూరు, చండీగఢ్, పుణేలలో చాయోస్ స్టోర్‌లు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200కి పైగా చాయోస్ కేఫ్‌లు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement