IITian
-
కరోడ్‌పతి చాయ్‌వాలా: ఐఐ‘టీ’యన్ చాయ్ కహానీ..
దేశంలో ఉన్నత చదువులు చదివిన కొంత మంది యువత ఉద్యోగాలు దొరక్క టీ దుకాణాలు ప్రారంభించి ఉపాధి పొందడం చూస్తున్నాం. ఇలా లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ల గురించి వింటున్నాం. అయితే లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం అదీ అమెరికన్ జాబ్ మానేసి మరీ చాయ్ బిజినెస్ పెట్టిన వాళ్ల గురించి ఎప్పుడైనా విన్నారా? అమెరికాలో ఉద్యోగం చాలా మందికి కల. కానీ అది కొందరికే దక్కుతుంది. ఇంతటి క్రేజ్ ఉన్న యూఎస్ ఉద్యోగాన్ని ఎవరైనా వదులుకుంటారా? ఐఐటీయన్ నితిన్ సలూజా (Nitin Saluja) వదులుకున్నాడు. చాయోస్ (Chaayos) అనే పేరుతో టీ బిజినెస్‌ను ప్రారంభించాడు. నితిన్ సలూజా ప్రారంభించిన చాయోస్ వ్యాపారంలో మొదట్లో అనేక ఒడిదుడుకులు వచ్చాయి. కానీ నితిన్ పట్టుదల, సంకల్పంతో కంపెనీని విజయ శిఖరాగ్రానికి తీసుకెళ్లాడు. స్టార్‌బక్స్, కేఫ్ కాఫీ డే, కేఫ్ మోచా, బరిస్టా వంటి కాఫీ షాపుల ఆధిపత్యంలో ఉన్న దేశంలో చాయోస్ తనకంటూ ఒక పేరును సంపాదించుకుంది. భారతదేశంలోని ప్రముఖ చాయ్ కేఫ్‌గా మారింది. చాయ్ బిజినెస్‌ను స్థాపించి, రూ. 100 కోట్ల వ్యాపారంగా మార్చిన నితిన్ సలూజా కథను తెలుసుకుందాం. మెకానికల్ ఇంజనీర్ నితిన్ సలూజా ఐఐటీ బాంబేలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. తన చదువు పూర్తయిన తర్వాత, సలుజా అమెరికాలోని ఒక పెద్ద సంస్థలో కార్పొరేట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా చేరారు. రూ.లక్షల్లో జీతం. ఒక రోజు నితిన్, తన భార్యతో కలిసి టీ తాగుదామనుకున్నారు. కానీ కనుచూపు మేరలో టీ షాప్ కనిపించలేదు. అప్పుడే నితిన్ ఓ ఆలోచన వచ్చింది. టీ కేఫ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఉద్యోగాన్ని మానేసి ఇండియాకి తిరిగొచ్చేశాడు. టీ వ్యాపారానికి ప్రణాళికలు రూపొందించడం ప్రారంభించాడు. చాయోస్ పుట్టిందిలా.. నితిన్ అమెరికాలో ఉన్నప్పుడు టీ బూత్‌ల నుంచి టీ కొనడం సవాలుగా ఉందని గమనించాడు. టీ తాగడానికి ఒక హై-ఎండ్ టీ షాప్ ఏర్పాటు చేయగలిగితే అది అద్భుతంగా ఉంటుందని భావించాడు. భారత్‌లో రకరకాల కాఫీని అందించే కేఫ్‌లు చాలా ఉన్నాయి కానీ విభిన్న టీని అందించేవి ఏవీ లేవని గుర్తించాడు. దేశంలో ప్రత్యేకమైన టీ తాగే సంస్కృతి ఉంది. భారతీయులు అనేక రకాల టీలను తయారుచేస్తారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న నితిన్.. ఇండియాలో టీ తాగేవాళ్లకు ఉపయోగపడే టీ కేఫ్‌ను ప్రారంభించాలని భావించాడు. 2012లో తన స్నేహితుడు రాఘవ్‌తో కలిసి చాయోస్ని స్థాపించాడు. గురుగ్రామ్‌లో తమ మొదటి కేఫ్ ప్రారంభించారు. రూ. 100 కోట్ల ఆదాయం ఇంతో ఇష్టంగా చాయోస్ను ప్రారంభించిన నితిన్ కస్టమర్లకు 'మేరీ వాలీ చాయ్' అందించడం మొదలు పెట్టాడు. ప్రారంభంలో కొన్నేళ్లు మూలధనం, పెట్టుబడి సమస్యలతో మనుగడ కోసం కష్టపడ్డాడు. తానే స్వయంగా ఆర్డర్లు తీసుకోవడం, టీ తయారు చేయడం, సర్వ్ చేయడం వంటివి చేసేవాడు. ప్రతి కస్టమర్‌కూ ప్రత్యేకమైన టీని అందిస్తూ ఆకట్టుకునేవాడు. ఇలా వ్యాపారం వేగం పుంజుకుంది. అవుట్లెట్లు విస్తరించాయి. కాగా కోవిడ్ సమయంలో అన్ని వ్యాపారాల లాగే చాయోస్ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. తర్వాత 2020లో మళ్లీ పుంజుకుంది. తొలినాళ్ల కష్టాల తర్వాత నితిన్ శ్రమకు ప్రతిఫలం దక్కింది. కంపెనీ 2020లో రూ. 100 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. చివరికి ముంబై, బెంగళూరు, చండీగఢ్, పుణేలలో చాయోస్ స్టోర్లు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200కి పైగా చాయోస్ కేఫ్‌లు ఉన్నాయి. -
ఇలా చేస్తే జాబ్ పక్కా! ఐఐటీయన్, స్టార్టప్ ఫౌండర్ సూచన..
ఉద్యోగ సాధనలో అత్యంత కీలకమైనది రెజ్యూమ్. ఇది ఎంత ఆకట్టుకునేలా ఉంటే జాజ్ వచ్చే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. అయితే మంచి జాబ్ సాధించాలంటే ఒక్క రెజ్యూమ్ సరిపోదంటున్నారు ఐఐటీయన్, ఢిల్లీకి చెందిన స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ కుమార్. విభిన్నమైన జాబ్లకు విభిన్న రెజ్యూమ్‌లను సిద్ధం చేసుకోవాలని సూచిస్తూ.. ఢిల్లీ ఐఐటీలో ప్లేస్మెంట్ల సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని, విభిన్న రెజ్యూమ్‌లతో తనకు కలిగిన ప్రయోజనాన్ని స్మార్ట్బుక్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ కుమార్ ట్విటర్ ద్వారా ఉద్యోగార్థులకు తెలియజేశారు. ఇదీ చదవండి ➤ లేఆఫ్స్ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి.. మరి భారత్‌లో ఎంత మంది? ఐఐటీలో ఇంటర్న్‌షిప్, ప్లేస్మెంట్ సందర్భంగా వివిధ కంపెనీలు, జాబ్లకు విభిన్న వెర్షన్ల రెజ్యూమ్‌లను రూపొందించుకోవాలని తమకు చెప్పేవారని పేర్కొన్నారు. మీరు కన్సల్టింగ్ జాబ్లకు దరఖాస్తు చేస్తున్నట్లయితే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గురించి, అదే డెవలప్మెంట్కు సంబంధించిన జాబ్‌ల కోసమైతే మీ డెవలప్మెంట్ నైపుణ్యాలను చూపించే ప్రాజెక్ట్‌ల గురించి రెజ్యూమ్‌లలో వైవిధ్యంగా పేర్కొనాలని సూచించారు. విభిన్న రెజ్యూమ్‌లలో ప్రతి అంశమూ విభిన్నంగా ఉండాల్సిన అవసరం లేదు. కీలకమైన అంశాన్ని విభిన్నంగా పేర్కొంటే సరిపోతుందని ఆయన సూచిస్తున్నారు. తమ ఐఐటీలో అలా విద్యార్థులకు అలా సూచించేవారని, మిగిలిన ఐఐటీలు తమ విద్యార్థులకు అలాంటి సలహా ఇచ్చాయో లేదో తనకు కచ్చితంగా తెలియదని సౌరభ్‌కుమార్ అన్నారు. కాగా సౌరభ్‌కుమార్ సూచనలతో పలువురు యూజర్లు ఏకీభవిస్తూ కామెంట్లు చేశారు. In IIT during internship/placement season we were often told to keep multiple versions of our resume Different resume for different kind of company or role you’re applying for For instance, having different resumes for different roles such as Dev based roles Quant based… — Saurabh Kumar (@drummatick) July 16, 2023 -
ఐఐటీయన్‌గా హీరోయిన్.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా బీ టౌన్‌తో పాటు టాలీవుడ్‌కు కూడా సుపరిచితమే. మెగాస్టార్ మూవీ వాల్తేరు వీరయ్యలో స్పెషల్ సాంగ్‌లో అదరగొట్టింది. వేర్ ఈజ్ ది పార్టీ టాలీవుడ్ సినీ ప్రేక్షకులను అలరించింది. ఇటీవలే విడుదలైన అఖిల్ మూవీ ఏజెంట్‌లోనూ స్పెషల్ సాంగ్ వైల్ట్ సాలా అంటూ అభిమానులను ఊర్రూతలుగించింది. అయితే గతంలో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఘనంగా బుల్లితెర నటి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!) సినీ తారలపై ట్రోల్స్ ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. తాజాగా ఊర్వశి రౌతేలా మరోసారి ట్రోల్స్‌కు గురైంది. ఎందుకంటే తన సోషల్ మీడియా ఖాతాలో ఐఐటీయన్ అని పేర్కొనడంపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆమెకు కొత్త కారు, కొత్త ఇల్లు ఉండొచ్చు.. కానీ ఆమె ఐఐటీయన్ అని చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇదంతా ఆమె గతంలో తన ఇన్స్టాగ్రామ్ ఖాతా బయోలో ఐఐటీయన్‌గా పేర్కొంది. ఇది చూసిన కొందరేమో ఆమె అప్పట్లో ఐఐటీలో చేరాలనుకున్నది అంటూ పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఐఐటీయన్ అన్న ట్యాగ్‌ను సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది. కానీ ఆమె అధికారిక వెబ్సైట్లో మాత్రం ఇప్పటికీ ఐఐటీయన్గానే చూపిస్తోంది. కాగా.. గతంలో ఊర్వశి ఓ ఈవెంట్లో మాట్లాడుతూ తాను సైన్స్ గ్రాడ్యుయేట్ అని తెలిపింది. అంతే కాకుండా ఐఐటీ ఎంట్రన్స్‌ను క్లియర్ చేశానని చెప్పింది. ఆ తర్వాత తాను ఐఏఎస్ కోసం కూడా సిద్ధమైనట్లు వివరించింది. చివరికీ ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనుకుంది.. కానీ ఆమె మోడలింగ్ వైపు అడుగులు వేసింది. మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొంది. ఆ తర్వాత సన్నీ డియోల్, అమృతా రావుతో కలిసి సింగ్ సాబ్ ది గ్రేట్‌తో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. (ఇది చదవండి: సుశాంత్ ఆత్మహత్యపై కంగనా సంచలన ఆరోపణలు..!) -
బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు..
బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు ఓ ఐఐటీయన్. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆహార బ్రాండ్లలో ఒకటైన ‘బిర్యానీ బై కిలో’ అనే సంస్థను 2015లో విశాల్ జిందాల్ స్థాపించారు. అప్పటి నుంచి కంపెనీ వార్షిక ఆదాయం పెరుగుతూ వస్తోంది. అయితే దీంతోనే అతను సంతృప్తి చెందలేదు. వచ్చే రెండు మూడేళ్లలో రూ.1000 కోట్ల టర్నోవర్ సాధించబోతున్నాడు. బిర్యానీ బిజినెస్‌తో సక్సెస్ అయిన ఐఐటీయన్ కథ ఇది.. అనేక వ్యాపారాలు ఉన్న విశాల్ జిందాల్ స్వయంగా ఆహార ప్రియుడు. అందుకే ఆయనకు ఎన్ని వ్యాపారాలు ఉన్నా బిర్యానీ వ్యాపారమంటేనే ఆయనకు మక్కువ. ఈ బిరియానీ వ్యాపారం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన భారతదేశంలోని ఖాన్సామా సంప్రదాయాన్ని పునరుద్ధరించడం. అంటే ఇక్కడ ప్రతి ఆర్డర్‌ను విడివిడి వండుతారు. వండిన బిర్యానీని మట్టి పాత్రల్లో కాల్చిన పిండి సహాయంతో ప్యాక్ చేస్తారు. ఇదీ చదవండి: అపరిచితుడికి కిడ్నీ దానం.. అపర దాన కర్ణుడు ఈ బిలియనీర్.. ఐఐటీ నుంచి ఇంజినీరింగ్ చేసిన విశాల్ జిందాల్ ఆ తర్వాత న్యూయార్క్‌లోని సిరక్యూస్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఫైనాన్స్ చదివారు. సింగపూర్‌కు చెందిన ఎకోసిస్టమ్ అడ్వైజరీ బోర్డులో జిందాల్ కూడా ఉన్నారు. ఇది అతని మొదటి కంపెనీ కాదు. గుర్గావ్లో కార్పెడియం క్యాపిటల్ పార్టనర్స్ అనే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌ను స్థాపించారు. ఫిడిలిటీ వెంచర్స్ వ్యవస్థాపకుడు అలాగే ఆ సంస్థకు ఎండీగా, అక్షయం క్యాపిటల్ సీఈవోగా ఉన్నారు. (layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?) భారతీయ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థను ఆయనే స్థాపించి మిలియన్ డాలర్ల కంపెనీగా మార్చారు. ఇది అన్ని మెట్రో నగరాల్లో 100 మంది ఉద్యోగులు, కార్యాలయాలను కలిగి ఉంది. విశాల్ జిందాల్ అమెరికాలో 1994లో అమనో సిన్సినాటి అనే కంపెనీకి మార్కెటింగ్ అసోసియేట్‌గా పనిచేశారు. ‘బిర్యానీ బై కిలో’ సంస్థ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 300 కోట్ల ఆదాయం వస్తుందని ఆశించారు. అయితే ప్రస్తుతం కంపెనీ నష్టాల్లో ఉంది. అయినప్పటికీ జూన్ నాటికి పుంజుకుంటుందని ఆశిస్తున్నారు. కంపెనీకి రూ. 700-750 టిక్కెట్ సైజుతో రోజుకు 10,000 కంటే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. ఈ కంపెనీకి అన్ని మెట్రో నగరాలతో సహా 45 కంటే పైగా నగరాల్లో 100కి పైగా అవుట్లెట్లు ఉన్నాయి. (కండోమ్స్ బిజినెస్: 50లక్షలనుంచి రూ. 43వేల కోట్లతో దడ పుట్టించిన బ్రదర్స్) 2022 ఆర్థిక సంవత్సరంలో వారు రూ. 135 కోట్లు, అంతకుముందు 2021 సంవత్సరంలో రూ. 65.6 కోట్లు ఆర్జించారు విశాల్ జిందాల్. వచ్చే రెండు మూడు ఏళ్లలో రూ.1000 కోట్ల టర్నోవర్‌ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం మార్కెటింగ్ వ్యయాన్ని కూడా పెంచాలనుకుంటున్నట్లు, మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్ కంటే పెద్ద వ్యాపారాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు విశాల్ జిందాల్ టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థతో పేర్కన్నారు. ఇదీ చదవండి: Mukesh Ambani Birthday: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా? -
కారు ప్రమాదం.. టెకీకి రూ. 2 కోట్ల పరిహారం
గుర్గావ్: ప్రమాదానికి గురైన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు మూడున్నర సంవత్సరాల తర్వాత భారీ నష్ట పరిహారం లభించింది. పరిహారం అంటే వెయ్యో, లక్ష రూపాయలో కాదు.. ఏకంగా రూ.2.06 కోట్లు! అంత పరిహారం పొందడమంటే మాటలు కాదు. అయినప్పటికీ ప్రమాదంలో దెబ్బతిన్న వ్యక్తి కాస్త అసంతృప్తిగా ఉన్నాడు. పూర్తి వివరాలిలా ఉన్నాయి.. ఐఐటీలో బీటెక్ చేసిన అన్షుమ్ అగర్వాల్ 2012, జూన్ నెలలో కారు ప్రమాదానికి గురయ్యాడు. అగర్వాల్ ప్రయాణిస్తున్న కారును వేరే కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో అతడు ఓ బహుళజాతి కంపెనీలో రూ. 46.5 లక్షల వార్షిక వేతనం ఆర్జిస్తున్నాడు. ప్రమాదం వల్ల తన కెరీర్ ఇబ్బందులకు గురైందని తనకు న్యాయం చేయాలని అతడు ట్రైబ్యునల్‌కు వెళ్లాడు. 2.06 కోట్ల రూపాయలు నష్ట పరిహారంగా ఇస్తున్నట్లు మోటారు వాహనాల నష్టపరిహారాల ట్రైబ్యునల్ కు చెందిన అధికారి హర్నామ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, కారు ప్రమాదానికి కారకుడైన వ్యక్తి కలిసి ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌కు ఈ పరిహారాన్ని అందజేయనున్నారు. పరిహారంలో 50 శాతం నగదును ఐదు సంవత్సరాలకు గాను ఓ జాతీయ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామన్నారు. బాధిత ఇంజినీర్ ఈ పరిహారంపై స్పందిస్తూ.. ట్రైబ్యునల్ తనకు ప్రకటించిన పరిహారం తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఏర్పడ్డ లోటును పూడ్చలేదని, ఆ పరిహారం సరిపోదన్నాడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటికీ అతడి ఆరోగ్యం కుదుటపడలేదని, జ్ఞాపకశక్తి పరమైన లోపాలు తలెత్తాయని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తరఫు న్యాయవాది కౌశిక్ తెలిపారు. ట్రీట్ మెంట్ కోసం రూ.50 లక్షలు ఖర్చుపెట్టారని కౌశిక్ వివరించారు. -
ఎన్నికల బరిలో ఓ ఐఐటీ పట్టభద్రుడు, పైలట్
ఇప్పటివరకు సినీతారలు, క్రీడాకారులు, సెలబ్రిటీలే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు ఐఐటియన్లు, పైలట్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒడిషా నుంచి ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నవారిలో ఐఐటీ పట్టభద్రుడు సత్యబ్రత ప్రుస్తి ఒకరు. 1999లో ఐఐటీ ఢిల్లీ నుంచి పట్టా తీసుకున్న ఆయన ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కొరై అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో తనకు వస్తున్న ఆరంకెల జీతాన్ని వదులుకుని మరీ కేజ్రీవాల్ స్ఫూర్తితో గత సంవత్సరమే ఆప్‌లో చేరారు. గడిచిన 14 ఏళ్లలో రాష్ట్రంలో తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, రోడ్ల లాంటి ప్రాథమిక సదుపాయాలను కూడా బీజేపీ కల్పించలేకపోయిందని మండిపడ్డారు. మేధావులు, వృత్తినిపుణులు రాజకీయాల్లోకి వచ్చి వీటిని శుభ్రం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రుస్తి పిలుపునిచ్చారు. ఇక రాజ్‌నారాయణ్ మొహాపాత్ర అనే పైలట్ కూడా ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా ఒడిషా బరిలో దిగుతున్నారు. అమెరికాలోని నాసాలో చదువుకుని నాలుగేళ్ల పాటు స్ప్రింగ్ టెక్స్లా అమెరికాలో పైలట్‌గా పనిచేశారు. ఇంకా ఎయిర్ డెక్కన్, కింగ్‌ఫిషర్, ఇండిగో లాంటి ప్రైవేటు విమానయాన సంస్థల్లో పదేళ్లపాటు సేవలందించారు. ఆయన తండ్రి సీతాకాంత మొహాపాత్ర గతంలో బారాచనా స్థానం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. గత నెలలో పైలట్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో ప్రవేశించారు. ఆయన తండ్రికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో స్వంతంత్రుడిగా బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గానికి తన తండ్రి ఎంతో చేశారని, ఆయన సేవలే తనను గెలిపిస్తాయని నమ్మకంగా చెబుతున్నారు.ఇలా విభిన్న నేపథ్యాలున్నవాళ్లు ఈ సారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. -
విశాఖలో హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్‌కు చెందిన ఓ ఐఐటీ విద్యార్థి విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన శివాజీ తేజ(26) ముంబై ఐఐటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇతడు వ్యక్తిగత పనిమీద విశాఖపట్నానికి ఈనెల 16వ తేదీన వచ్చాడు. ఇక్కడి సీతమ్మధార ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న అశ్వనీ లాడ్జిలో గది తీసుకున్నాడు. గురువారం మధ్యాహ్నం వాటర్ బాటిల్ తెచ్చుకోడానికని కిందకి వచ్చాడు. ఆ తర్వాత తలుపు వేసుకుని గదిలోనే ఉండిపోయాడు. భోజనానికి రాలేదని హోటల్ యాజమాన్యం గురువారం సాయంత్రం తలుపు తట్టినా తీయలేదు. మళ్లీ శుక్రవారం ఉదయం కూడా తలుపు తట్టినా తీయలేదు. దాంతో అనుమానం వచ్చిన యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. వారు వచ్చి తలుపు పగలగొట్టి చూడగా, పాలిథిన్ కవర్ ముఖానికి చుట్టుకుని అతడు ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. పోలీసులు హైదరాబాద్ నగరంలో ఉన్న అతడి తల్లిదండ్రులకు ఈ సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడినుంచి బయల్దేరి విశాఖకు వస్తున్నారు. అయితే ఆత్మహత్యకు కారణాలేంటన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన శివాజీ తేజ అసలు విశాఖపట్నం ఎందుకు వచ్చాడు, ఇక్కడ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే కోణాల్లో దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.