కారు ప్రమాదం.. టెకీకి రూ. 2 కోట్ల పరిహారం
గుర్గావ్: ప్రమాదానికి గురైన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్కు మూడున్నర సంవత్సరాల తర్వాత భారీ నష్ట పరిహారం లభించింది. పరిహారం అంటే వెయ్యో, లక్ష రూపాయలో కాదు.. ఏకంగా రూ.2.06 కోట్లు! అంత పరిహారం పొందడమంటే మాటలు కాదు. అయినప్పటికీ ప్రమాదంలో దెబ్బతిన్న వ్యక్తి కాస్త అసంతృప్తిగా ఉన్నాడు. పూర్తి వివరాలిలా ఉన్నాయి.. ఐఐటీలో బీటెక్ చేసిన అన్షుమ్ అగర్వాల్ 2012, జూన్ నెలలో కారు ప్రమాదానికి గురయ్యాడు. అగర్వాల్ ప్రయాణిస్తున్న కారును వేరే కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో అతడు ఓ బహుళజాతి కంపెనీలో రూ. 46.5 లక్షల వార్షిక వేతనం ఆర్జిస్తున్నాడు. ప్రమాదం వల్ల తన కెరీర్ ఇబ్బందులకు గురైందని తనకు న్యాయం చేయాలని అతడు ట్రైబ్యునల్కు వెళ్లాడు.
2.06 కోట్ల రూపాయలు నష్ట పరిహారంగా ఇస్తున్నట్లు మోటారు వాహనాల నష్టపరిహారాల ట్రైబ్యునల్ కు చెందిన అధికారి హర్నామ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, కారు ప్రమాదానికి కారకుడైన వ్యక్తి కలిసి ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్కు ఈ పరిహారాన్ని అందజేయనున్నారు. పరిహారంలో 50 శాతం నగదును ఐదు సంవత్సరాలకు గాను ఓ జాతీయ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామన్నారు. బాధిత ఇంజినీర్ ఈ పరిహారంపై స్పందిస్తూ.. ట్రైబ్యునల్ తనకు ప్రకటించిన పరిహారం తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఏర్పడ్డ లోటును పూడ్చలేదని, ఆ పరిహారం సరిపోదన్నాడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటికీ అతడి ఆరోగ్యం కుదుటపడలేదని, జ్ఞాపకశక్తి పరమైన లోపాలు తలెత్తాయని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తరఫు న్యాయవాది కౌశిక్ తెలిపారు. ట్రీట్ మెంట్ కోసం రూ.50 లక్షలు ఖర్చుపెట్టారని కౌశిక్ వివరించారు.