ఇప్పటివరకు సినీతారలు, క్రీడాకారులు, సెలబ్రిటీలే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు ఐఐటియన్లు, పైలట్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒడిషా నుంచి ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నవారిలో ఐఐటీ పట్టభద్రుడు సత్యబ్రత ప్రుస్తి ఒకరు. 1999లో ఐఐటీ ఢిల్లీ నుంచి పట్టా తీసుకున్న ఆయన ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కొరై అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో తనకు వస్తున్న ఆరంకెల జీతాన్ని వదులుకుని మరీ కేజ్రీవాల్ స్ఫూర్తితో గత సంవత్సరమే ఆప్లో చేరారు. గడిచిన 14 ఏళ్లలో రాష్ట్రంలో తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, రోడ్ల లాంటి ప్రాథమిక సదుపాయాలను కూడా బీజేపీ కల్పించలేకపోయిందని మండిపడ్డారు. మేధావులు, వృత్తినిపుణులు రాజకీయాల్లోకి వచ్చి వీటిని శుభ్రం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రుస్తి పిలుపునిచ్చారు.
ఇక రాజ్నారాయణ్ మొహాపాత్ర అనే పైలట్ కూడా ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా ఒడిషా బరిలో దిగుతున్నారు. అమెరికాలోని నాసాలో చదువుకుని నాలుగేళ్ల పాటు స్ప్రింగ్ టెక్స్లా అమెరికాలో పైలట్గా పనిచేశారు. ఇంకా ఎయిర్ డెక్కన్, కింగ్ఫిషర్, ఇండిగో లాంటి ప్రైవేటు విమానయాన సంస్థల్లో పదేళ్లపాటు సేవలందించారు. ఆయన తండ్రి సీతాకాంత మొహాపాత్ర గతంలో బారాచనా స్థానం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. గత నెలలో పైలట్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో ప్రవేశించారు. ఆయన తండ్రికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో స్వంతంత్రుడిగా బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గానికి తన తండ్రి ఎంతో చేశారని, ఆయన సేవలే తనను గెలిపిస్తాయని నమ్మకంగా చెబుతున్నారు.ఇలా విభిన్న నేపథ్యాలున్నవాళ్లు ఈ సారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
ఎన్నికల బరిలో ఓ ఐఐటీ పట్టభద్రుడు, పైలట్
Published Tue, Apr 15 2014 3:59 PM | Last Updated on Tue, Aug 14 2018 4:39 PM
Advertisement