chai wala
-
దేశమంతా...‘దక్కన్ చాయ్’
సాక్షి, హైదరాబాద్: విభిన్న రుచుల చాయ్లున్నా హైదరాబాద్ చాయ్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. టీ కొట్టు నుంచి స్టార్ హోటళ్ల వరకూ హైదరాబాద్ ఫ్లేవర్ చాయ్‌కు ప్రత్యేక ఆదరణ ఉంది. ఈ హైదరాబాదీ చాయ్‌ను విశ్వవ్యాప్తం చేయనున్నామని, మొదట దక్షిణాది రాష్ట్రాలకు పరిచయం చేయనున్నామని ప్రముఖ శ్రేయాస్ గ్రూప్ చైర్మన్ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఇప్పటికే సినిమా, ఈవెంట్, ఫ్యాషన్ రంగాల్లో తమదైన గుర్తింపు పొందిన శ్రేయాస్ గ్రూప్ ‘దక్కన్ చాయ్’తో మార్కెట్లోకి ప్రవేశించింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని శుక్రవారం బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఏర్పాటు చేశారు. దేశంలో చాయ్ వ్యాపారం 11 వేల మిలియన్ డాలర్ల మార్కెట్‌కు కలిగి ఉందని, మరో పదేళ్లలో ఇది 18 వేల మిలియన్ డాలర్లకు చేరుకోనుందని తెలిపారు. ఇందులో హైదరాబాదీ చాయ్‌ను మరింత ప్రాచూర్యంలోకి తీసుకురావడంలో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహా రాష్ట్రలో దాదాపు వెయ్యి ఔట్లెట్లను ప్రారంభించనున్నామని శ్రీనివాస్ రావు అన్నారు. ఇలా వెయ్యి మంది ఎంటర్ప్రూనర్స్తో పాటు 2 వేల మందికి హైదరాబాదీ చాయ్ తయారీ పై శిక్షణ అందించి ఉద్యోగావకాశాలను కలి్పస్తామన్నారు. ‘దక్కన్ చాయ్’ వ్యవస్థాపకులు వీరన్న మాట్లాడుతూ.. ఇప్పటికే 250 ఔట్లెట్లతో దక్కన్ చాయ్ తేనీటి విందును అందిస్తున్నాయని, శ్రేయాస్ మీడియా భాగస్వామ్యంతో ఈ సేవలు మరింత పెరగనున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఆర్ట్ ఆఫ్ టీ మేకింగ్ కోర్సుతో యువతకు శిక్షణ అందించనున్నామని, కొత్తవాళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తామే స్టాల్ వేదికగా డిజిటల్ యాడ్స్, వాల్ మార్ట్ రూపంలో అదనంగా ఆదాయం వచ్చేలా రూపకల్పన చేశామన్నారు. -
కరోడ్‌పతి చాయ్‌వాలా: ఐఐ‘టీ’యన్ చాయ్ కహానీ..
దేశంలో ఉన్నత చదువులు చదివిన కొంత మంది యువత ఉద్యోగాలు దొరక్క టీ దుకాణాలు ప్రారంభించి ఉపాధి పొందడం చూస్తున్నాం. ఇలా లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ల గురించి వింటున్నాం. అయితే లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం అదీ అమెరికన్ జాబ్ మానేసి మరీ చాయ్ బిజినెస్ పెట్టిన వాళ్ల గురించి ఎప్పుడైనా విన్నారా? అమెరికాలో ఉద్యోగం చాలా మందికి కల. కానీ అది కొందరికే దక్కుతుంది. ఇంతటి క్రేజ్ ఉన్న యూఎస్ ఉద్యోగాన్ని ఎవరైనా వదులుకుంటారా? ఐఐటీయన్ నితిన్ సలూజా (Nitin Saluja) వదులుకున్నాడు. చాయోస్ (Chaayos) అనే పేరుతో టీ బిజినెస్‌ను ప్రారంభించాడు. నితిన్ సలూజా ప్రారంభించిన చాయోస్ వ్యాపారంలో మొదట్లో అనేక ఒడిదుడుకులు వచ్చాయి. కానీ నితిన్ పట్టుదల, సంకల్పంతో కంపెనీని విజయ శిఖరాగ్రానికి తీసుకెళ్లాడు. స్టార్‌బక్స్, కేఫ్ కాఫీ డే, కేఫ్ మోచా, బరిస్టా వంటి కాఫీ షాపుల ఆధిపత్యంలో ఉన్న దేశంలో చాయోస్ తనకంటూ ఒక పేరును సంపాదించుకుంది. భారతదేశంలోని ప్రముఖ చాయ్ కేఫ్‌గా మారింది. చాయ్ బిజినెస్‌ను స్థాపించి, రూ. 100 కోట్ల వ్యాపారంగా మార్చిన నితిన్ సలూజా కథను తెలుసుకుందాం. మెకానికల్ ఇంజనీర్ నితిన్ సలూజా ఐఐటీ బాంబేలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. తన చదువు పూర్తయిన తర్వాత, సలుజా అమెరికాలోని ఒక పెద్ద సంస్థలో కార్పొరేట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా చేరారు. రూ.లక్షల్లో జీతం. ఒక రోజు నితిన్, తన భార్యతో కలిసి టీ తాగుదామనుకున్నారు. కానీ కనుచూపు మేరలో టీ షాప్ కనిపించలేదు. అప్పుడే నితిన్ ఓ ఆలోచన వచ్చింది. టీ కేఫ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఉద్యోగాన్ని మానేసి ఇండియాకి తిరిగొచ్చేశాడు. టీ వ్యాపారానికి ప్రణాళికలు రూపొందించడం ప్రారంభించాడు. చాయోస్ పుట్టిందిలా.. నితిన్ అమెరికాలో ఉన్నప్పుడు టీ బూత్‌ల నుంచి టీ కొనడం సవాలుగా ఉందని గమనించాడు. టీ తాగడానికి ఒక హై-ఎండ్ టీ షాప్ ఏర్పాటు చేయగలిగితే అది అద్భుతంగా ఉంటుందని భావించాడు. భారత్‌లో రకరకాల కాఫీని అందించే కేఫ్‌లు చాలా ఉన్నాయి కానీ విభిన్న టీని అందించేవి ఏవీ లేవని గుర్తించాడు. దేశంలో ప్రత్యేకమైన టీ తాగే సంస్కృతి ఉంది. భారతీయులు అనేక రకాల టీలను తయారుచేస్తారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న నితిన్.. ఇండియాలో టీ తాగేవాళ్లకు ఉపయోగపడే టీ కేఫ్‌ను ప్రారంభించాలని భావించాడు. 2012లో తన స్నేహితుడు రాఘవ్‌తో కలిసి చాయోస్ని స్థాపించాడు. గురుగ్రామ్‌లో తమ మొదటి కేఫ్ ప్రారంభించారు. రూ. 100 కోట్ల ఆదాయం ఇంతో ఇష్టంగా చాయోస్ను ప్రారంభించిన నితిన్ కస్టమర్లకు 'మేరీ వాలీ చాయ్' అందించడం మొదలు పెట్టాడు. ప్రారంభంలో కొన్నేళ్లు మూలధనం, పెట్టుబడి సమస్యలతో మనుగడ కోసం కష్టపడ్డాడు. తానే స్వయంగా ఆర్డర్లు తీసుకోవడం, టీ తయారు చేయడం, సర్వ్ చేయడం వంటివి చేసేవాడు. ప్రతి కస్టమర్‌కూ ప్రత్యేకమైన టీని అందిస్తూ ఆకట్టుకునేవాడు. ఇలా వ్యాపారం వేగం పుంజుకుంది. అవుట్లెట్లు విస్తరించాయి. కాగా కోవిడ్ సమయంలో అన్ని వ్యాపారాల లాగే చాయోస్ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. తర్వాత 2020లో మళ్లీ పుంజుకుంది. తొలినాళ్ల కష్టాల తర్వాత నితిన్ శ్రమకు ప్రతిఫలం దక్కింది. కంపెనీ 2020లో రూ. 100 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. చివరికి ముంబై, బెంగళూరు, చండీగఢ్, పుణేలలో చాయోస్ స్టోర్లు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200కి పైగా చాయోస్ కేఫ్‌లు ఉన్నాయి. -
ఎంబీఏ చదవలేకపోయాడు.. టీ కొట్టుతో కోట్లు సంపాదించాడు..
అహ్మదాబాద్: జీవితంలో సక్సెస్ ఎవరికీ అంత ఈజీగా రాదు. కానీ వినూత్న ఆలోచన, పట్టుదల ఉంటే అదే సక్సెస్ వెతుక్కుంటూ మన ఇంటి తలుపు తడుతుందని నిరూపించాడు మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రపుల్ బిల్లోర్. మొదట్లో ఈ పేరు కూడా పలకడం రాని వాళ్లకు, అలాంటి పేరుని ఇప్పుడు పది మంది నోళ్లలో నానేలా చేశాడు. ఓ చిన్న టీ కోట్టుతో మొదలై దేశవ్యాప్తంగా 22 స్టాల్స్‌ను ప్రారంభించే స్థాయికి వెళ్లాడు. అలాంటి ప్రపుల్ విజయగాథ వివరాలను ఓ సారి చూసేద్దాం. మధ్యప్రదేశ్‌లోని లాబ్రవదా గ్రామానికి చెందిన రైతు కుమారుడు ప్రఫుల్ బిల్లోర్. అయితే వ్యాపారవేత్త కావాలని మొదటి నుంచి కలలు కనేవాడు. అందుకు ప్రతిష్ఠాత్మక ఐఐఎం విద్యాసంస్థల్లో ఎంబీఏ చేద్దామనుకున్నాడు కానీ క్యాట్ పరీక్షలో మూడు సార్లు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకోయాడు. కానీ అదే తన జీవితాన్ని మార్చేయబోతోందని ఆ రోజు అతనికి తెలీదు. మధ్య తరగతి కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులు కారణంగా చదువు పక్కన పెట్టి మెక్‌డొనాల్డ్స్‌లో చేరాడు. అలా కొన్ని నెలల తరువాత, అతను ఉద్యోగం చేస్తునే సొంతంగా చిన్న కొట్టు ప్రారంభించాడు. అయితే వ్యాపారానికి డబ్బులు సరిపోయేవి కావు, దీంతో చదువు కోసం రూ.10,000 కావాలని తండ్రి దగ్గర తీసుకుని వాటిని టీ సామాగ్రిని కొనుగోలుకి ఉపయోగించాడు. అలా సెట్ అయిన వ్యాపారంతో ప్రపుల్ డ్రీమ్ కాలేజ్ అయిన, ఐఐఎం అహ్మదాబాద్ వెలుపల తన టీ అమ్మడం మొదలుపెట్టాడు. మొదటగా మిస్టర్ బిల్లోర్ అహ్మదాబాద్ అనే పేరు పెట్టినప్పటికీ, అతని కస్టమర్లకి ఆ పేరు పిలవడం కష్టంగా ఉండడంతో దానిని ‘ఎంబీఏ చాయ్’ వాలాగా మార్చాడు. ఆ వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో వ్యయ ప్రయాసలు, కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాడు. తన షాపుకి వచ్చే ఎంబీఏ విద్యార్థులు, స్టాఫ్‌తో ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ కస్టమర్ బేస్‌ను క్రమంగా పెంచుకుంటూ పోయాడు. గతేడాది అతని వ్యాపారం టర్నోవర్ 3 కోట్లు చేరినట్లు తెలిపాడు ప్రపుల్. ఇలా కొద్దికాలంలోనే దేశవ్యాప్తంగా 22 టీస్టాల్స్‌ను ప్రారంభించి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. చదవండి: A Man Sends Mail TO Paytm CEO: "నా స్టార్ట్ప్ బిజినెస్‌కి పెట్టుబడి పెట్టండి ప్లీజ్" -
ఐఏఎస్ కల చెదిరి.. చాయ్‌వాలాలుగా మారి.. ఏడాదికి రూ. 100కోట్లు
సాక్షి, వెబ్‌డెస్క్: ఆ ముగ్గురు మిత్రులకు సివిల్ సర్వెంట్ జాబ్ అంటే పిచ్చి. దాని కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివారు. కానీ దురదృష్టం కొద్ది కోరుకున్న కొలువు చేజారింది. తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. కానీ ఎన్నాళ్లిలా ఉంటాం.. జీవితం అంటే ఇదే కాదు కదా అని వారికి వారే ధైర్యం చెప్పుకున్నారు. మరోసారి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే ఆలోచన లేదు.. అలాగని.. ప్రైవేట్ కొలువు చేసే ఉద్దేశం కూడా వారికి లేదు. ఆ సమయంలో తట్టిన ఆలోచన వారి జీవితాలను మార్చేసింది. వంద కోట్ల రూపాయల వ్యాపారవేత్తలుగా నిలబెట్టింది. ఆ మిత్రత్రయం విజయగాథ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ విరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన అనుభవ్ దూబే, ఆనంద్ నాయక్, మరో మిత్రుడితో కలిసి సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. కానీ దురదృష్టం కొద్ది ఉద్యోగం రాలేదు. ప్రైవేట్ జాబ్ చేయడం వారికి ఇష్టం లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. వారికి ఓ ఐడియా వచ్చింది. ఈ క్రమంలో 2016లో అనుభవ్ దూబే తన స్నేహితులిద్దరితో కలిసి ‘చాయ్ సుత్త బార్’ అనే టీ దుకాణం ప్రారంభించాడు. 3 లక్షల రూపాయలతో ప్రారంభించిన ఈ టీ దుకాణం అనతి కాలంలోనే బాగా ఫేమస్ అయ్యింది. ఈ ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 165 ఔట్‌లెట్స్‌తో ఏడాదికి 100 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించేంతగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం మన దేశంతో పాటు దుబాయ్, ఒమన్లలో కూడా ‘‘చాయ్ సుత్త బార్’’ శాఖలున్నాయి. ప్రత్యేకతలేంటంటే.. ‘‘చాయ్ సుత్త బార్’’ టీ షాప్‌లో పలు రకాల ఫ్లేవర్ల చాయ్‌లు లభిస్తాయి. అది కూడా కేవలం 10 రూపాయలకే. ఇక టీ షాప్ ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ చాయ్‌ని మట్టి కప్పులో సర్వ్ చేస్తారు. ఈ ఆలోచనతో పర్యావరణానికి మేలు చేయడమే కాక కుమ్మరి సామాజిక వర్గానికి ఉపాధి కల్పిస్తుంది చాయ్ సుత్త బార్. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. ఇక్కడ పొగ తాగడం నిషేధం. ఈ సదర్భంగా చాయ్ సుత్త బార్ డైరెక్టర్ అనుభవ్ దూబే మాట్లాడుతూ.. ‘‘మా టీ దుకాణాలలో చాయ్‌ని మట్టి కప్పులో సర్వ్ చేస్తాం. ప్రతిరోజూ మేము దాదాపు 3 లక్షల మట్టి కప్పులను ఉపయోగిస్తున్నాం. దీని వల్ల వేలాది మంది కుమ్మర్లకు ఉపాధి లభిస్తుంది. ఇక మా ‘చాయ్ సుత్త బార్’ బ్రాండ్ దేశవ్యాప్తంగా 165 అవుట్లెట్లను కలిగి ఉంది, దీనిలో రూ .100 కోట్లకు పైగా టర్నోవర్ ఉంది. దీనిలో దాదాపు 2.5 కోట్ల కంపెనీ సొంత అవుట్లెట్ల టర్నోవర్ ఉంది’’ అని తెలియజేశారు. -
నాటి ప్రపంచ ఛాంపియన్.. నేడు ఛాయ్ అమ్ముకుంటున్నాడు
ఆగ్రా: పాతికేళ్లు కూడా నిండక ముందే 60కి పైగా పతకాలు సాధించి, కరాటేలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన హరిఓమ్ శుక్లా.. ప్రస్తుతం మథురలో రోడ్డు పక్కన టీ అమ్ముతున్నాడు. పదునైన పంచ్‌లతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ప్రపంచ ఖ్యాతి గాంచిన శుక్లా.. నేడు కుటుంబ పోషణ నిమిత్తం రోడ్డెక్కాడు. దేశ, విదేశాల్లో జరిగిన అనేక పోటీల్లో పతకాలు సాధించిన ఆయన.. ఇల్లు గడవని ధీన స్థితిలో కాలం వెల్లబుచ్చుతున్నాడు. 2013లో థాయ్‌లాండ్‌లో జరిగిన జూడో కరాటే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ తరఫున స్వర్ణ పతకాన్ని సాధించిన శుక్లా.. ఆరేళ్ల ప్రాయంలోనే కరాటేలో ఓనమాలు దిద్దుకున్నాడు. అతనికి 23 ఏళ్లు వచ్చేసరికి 60కి పైగా పతకాలు సాధించాడు. అయితే, ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందకపోవడంతో అతని ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయి. టోర్నీల్లో గెలుచుకున్న ప్రైజ్ మనీ సైతం అడుగంటి పోయింది. ఈ క్రమంలో ఉద్యోగం కోసం ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొర పెట్టినా ఫలితం లేకుండా పోయింది. రోజు రోజుకూ కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఓ టీ స్టాల్‌ను నడిపిస్తున్నాడు. లాక్‌డౌన్‌కు ముందు వరకు స్కూల్ పిల్లలకు కరాటే పాఠాలు నేర్పిన శుక్లా.. ప్రస్తుతం ఛాయ్ వాలాగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. కరోనా కారణంగా పిల్లలెవరూ క్లాసులకు హాజరు కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీ స్టాల్ నడుపుతున్నాని అతను వాపోతున్నాడు. ప్రస్తుతానికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా.. ఆ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా తన వద్ద డబ్బు లేదని.. ఆ సర్టిఫికేట్ ఉంటే ఏదైనా ఉద్యోగం చూసుకునే వాడినని అంటున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రీడాకారుల కోటాలో తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నాడు. చదవండి: బీసీసీఐ పుణ్యమా అని అశ్విన్ బయటపడ్డాడు.. లేకపోతే..? -
‘చాయ్‌లో ఏమేం పదార్థాలు వాడతారు’
కోల్‌కతా: ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే చాలు.. నాయకులు తమలోని అపరిచితులను ప్రజలకు పరిచయం చేస్తారు. నాలుగేళ్ల పాటు జనాల ముఖాలు కూడా చూడని నాయకులకు ఉన్నట్టుండి ప్రజలపై ప్రేమ పొంగుకొస్తుంది. దాంతో జనాలను ఆకట్టుకోవడానికి రకరకాల విద్యలు ప్రదర్శిస్తారు. ఫలితాలు వచ్చి ఎన్నికల తంతు ముగిసాక.. కథ మళ్లీ మొదటికొస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. మరికొన్ని రోజుల్లో పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలను ప్రారభించారు. ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం దీదీ దిఘా ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (చదవండి: ‘వారి లవ్ ఎఫైర్‌తో షాకయ్యా’) పర్యటనలో కాసేపు బ్రేక్ తీసుకున్న దీదీ ఓ చాయ్ దుకాణం వద్ద ఆగారు. అనంతరం టీ స్టాల్ ఓనర్‌తో మాట్లాడుతూ.. కాసేపు చాయ్‌వాలా అవతారం ఎత్తారు దీదీ. చాయ్ తయారీకి కావాల్సిన పదార్థాల గురించి అడుగుతూ.. స్వయంగా తన చేతులతో టీ తయార్ చేశారు దీదీ. అంతటితో ఊరుకోక దాన్ని పేపర్ కప్పులో పోసి అక్కడే ఉన్న జనాలకు అందించారు. టీ ఎలా ఉందంటూ ప్రశ్నిస్తూ కాసేపు సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేశారు దీదీ. దాంతో పాటు ‘జీవితంలో ఇలాంటి చిన్న చిన్న సంతోషాలే ఎంతో ఆనందాన్ని కలగజేస్తాయి. టీ తయారు చేసి దాన్ని ఇతరులతో పంచుకోవడం అలాంటి వాటిల్లో ఒకటి. ఈ రోజు దిఘలో నేను అదే పని చేశాను’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. అంతేకాక వంటచేయడం అన్నా, కిచెన్‌లో గడపడం అన్నా తనకెంతో ఇష్టమని.. కానీ సమయం లేకపోవడం వల్ల వంట చేయడానికి వీలు చిక్కడం లేదని తెలిపారు దీదీ. అయితే ఈ వీడియోపై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘నిన్న మోదీ చాయ్.. నేడు దీదీ చాయ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. Sometimes the little joys in life can make us happy. Making and sharing some nice tea (cha/chai) is one of them. Today, in Duttapur, Digha | কখনো জীবনের ছোট ছোট মুহূর্ত আমাদের বিশেষ আনন্দ দেয়। চা বানিয়ে খাওয়ানো তারমধ্যে একটা। আজ দীঘার দত্তপুরে। #Bangla pic.twitter.com/cC1Bo0GuYy — Mamata Banerjee (@MamataOfficial) August 21, 2019 -
చాయ్‌వాలాగా మారిన సీఎం
ఉజ్జయిని: వెళ్లిన ప్రాంతాన్ని బట్టి, ఆయా సందర్భాలను బట్టి తగిన విధంగా ప్రవర్తిస్తుండటం, దుస్తులు ధరించడం రాజకీయ నేతలకు అలవాటే. ఉజ్జయినిలో జరుగుతోన్న మహా కుంభమేళాలోమధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా అదే పనినిచేశారు. సింహస్థ కుంభమేళా సందర్భంగా సిప్రా నదీ తీరంలో భక్తుల కోసం ఏర్పాటుచేసిన తాత్కాలిక క్యాంప్ లను శుక్రవారం తెల్లవారుజామన సందర్శించిన ఆయన చాయ్ వాలా అవతారం ఎత్తారు. కెటిల్ చేతబట్టుకుని అక్కడున్న భక్త పరివారానికి చాయ్ పోసి సంతోషింపజేశారు శివరాజ్ సింగ్ చౌహాన్. ఏప్రిల్ 22న మొదలై మే 21 వరకు కొనసాగే సింహస్థ కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి కోటి మంది భక్తులు వస్తారని అంచనా. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రత్వం భారీ ఏర్పాట్లు చేసింది. కాగా, సిప్రా నదీ తీరంలో గురువారం భారీ వర్షం, ఈదురు గాలులు చోటుచేసుకోవడంతో గుడారాలు కూలి ఏడుగురు భక్తులు మృత్యువాతపడ్డారు. (చదవండి: కుంభమేళాలో అపశ్రుతి)