జల్‌గావ్: మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో లక్నో నుండి ముంబై వెళ్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు ప్రమాదం బారినపడ్డారు. ఈ దుర్ఘటనకు ఒక చాయ్‌వాలా కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళతే రైలులో మంటలు చెలరేగాయనే వదంతులు వ్యాపించడంతో ఎవరో కోచ్‌లోని చైన్ లాగారు. వెంటనే ప్రయాణికులు రైలు దిగే ప్రయత్నంలో పక్కనే ఉన్న ట్రాక్‌పైకి చేరుకున్నారు. అయితే అదే ట్రాక్‌పై వస్తున్న రైలు పలువురు ప్రయాణికులను ఢీకొంది. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
రైలులో ఉన్న ఒక చాయ్‌వాలా ఇతర ప్రయాణికులతో రైలులో మంటలు చెలరేగాయని చెప్పాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దీంతో రైలు బోగీలో గందరగోళం చెలరేగింది. వెనువెంటనే ఆ చాయ్‌వాలా రైలు చైన్ లాగాడు. దీంతో రైలు నిలిచిపోయింది. ప్రయాణికులు తోసుకుంటూ కిందకు దిగి, పక్కనే ఉన్న పట్టాలపైకి చేరుకున్నారు. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ‘బోగీలో మంటలు చెలరేగాయనే మాట వినిపించడంతో ప్రయాణికులు తోసుకుంటూ కిందకు (అక్కడే ఉన్న పట్టాలపైకి) దిగారు. అయితే ఆ ట్రాక్ మీదుగా బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వేగంగా వస్తోంది. దీంతో పట్టాలపై ఉన్నవారంతా ప్రమాదం బారిన పడ్డారు. బోగీ నుంచి మరోవైపు దూకినవారు సురక్షితంగా ఉన్నారు’ అని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కమలా భండారి కోడలు రాధా భండారి మీడియాతో మాట్లాడుతూ ‘అత్తమ్మ నాతో బోగీలో మంటలు చెలరేగుతున్నాయని, వెంటనే బయటకు వెళ్లిపొమ్మని చెప్పింది. అదే సమయంలో బోగీలో తొక్కిసలాట జరిగింది. నేను కూడా జనాన్ని తోసుకుంటూ కిందకు దిగాను. అయితే ఎక్కడా మంటలు లేవు. నేను పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ పట్టాలపై రక్తమోడుతున్న స్థితిలో అత్తమ్మ మృతదేహం కనిపించింది’ అని రోదిస్తూ తెలిపింది.
ఇది కూడా చదవండి: డోన్లతో ఉత్తరాల బట్వాడా.. 10 నిముషాల్లో డెలివరీ
Comments
Please login to add a commentAdd a comment