సాక్షి, వెబ్‌డెస్క్: ఆ ముగ్గురు మిత్రులకు సివిల్ సర్వెంట్ జాబ్ అంటే పిచ్చి. దాని కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివారు. కానీ దురదృష్టం కొద్ది కోరుకున్న కొలువు చేజారింది. తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. కానీ ఎన్నాళ్లిలా ఉంటాం.. జీవితం అంటే ఇదే కాదు కదా అని వారికి వారే ధైర్యం చెప్పుకున్నారు. మరోసారి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే ఆలోచన లేదు.. అలాగని.. ప్రైవేట్ కొలువు చేసే ఉద్దేశం కూడా వారికి లేదు. ఆ సమయంలో తట్టిన ఆలోచన వారి జీవితాలను మార్చేసింది. వంద కోట్ల రూపాయల వ్యాపారవేత్తలుగా నిలబెట్టింది. ఆ మిత్రత్రయం విజయగాథ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ విరాలు..
మధ్యప్రదేశ్‌కు చెందిన అనుభవ్ దూబే, ఆనంద్ నాయక్, మరో మిత్రుడితో కలిసి సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. కానీ దురదృష్టం కొద్ది ఉద్యోగం రాలేదు. ప్రైవేట్ జాబ్ చేయడం వారికి ఇష్టం లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. వారికి ఓ ఐడియా వచ్చింది.
ఈ క్రమంలో 2016లో అనుభవ్ దూబే తన స్నేహితులిద్దరితో కలిసి ‘చాయ్ సుత్త బార్’ అనే టీ దుకాణం ప్రారంభించాడు. 3 లక్షల రూపాయలతో ప్రారంభించిన ఈ టీ దుకాణం అనతి కాలంలోనే బాగా ఫేమస్ అయ్యింది. ఈ ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 165 ఔట్‌లెట్స్‌తో ఏడాదికి 100 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించేంతగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం మన దేశంతో పాటు దుబాయ్, ఒమన్‌లలో కూడా ‘‘చాయ్ సుత్త బార్’’ శాఖలున్నాయి.
ప్రత్యేకతలేంటంటే..
‘‘చాయ్ సుత్త బార్’’ టీ షాప్‌లో పలు రకాల ఫ్లేవర్ల చాయ్‌లు లభిస్తాయి. అది కూడా కేవలం 10 రూపాయలకే. ఇక టీ షాప్ ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ చాయ్‌ని మట్టి కప్పులో సర్వ్ చేస్తారు. ఈ ఆలోచనతో పర్యావరణానికి మేలు చేయడమే కాక కుమ్మరి సామాజిక వర్గానికి ఉపాధి కల్పిస్తుంది చాయ్ సుత్త బార్. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. ఇక్కడ పొగ తాగడం నిషేధం.
ఈ సదర్భంగా చాయ్ సుత్త బార్ డైరెక్టర్ అనుభవ్ దూబే మాట్లాడుతూ.. ‘‘మా టీ దుకాణాలలో చాయ్‌ని మట్టి కప్పులో సర్వ్ చేస్తాం. ప్రతిరోజూ మేము దాదాపు 3 లక్షల మట్టి కప్పులను ఉపయోగిస్తున్నాం. దీని వల్ల వేలాది మంది కుమ్మర్లకు ఉపాధి లభిస్తుంది. ఇక మా ‘చాయ్ సుత్త బార్’ బ్రాండ్ దేశవ్యాప్తంగా 165 అవుట్‌లెట్‌లను కలిగి ఉంది, దీనిలో రూ .100 కోట్లకు పైగా టర్నోవర్ ఉంది. దీనిలో దాదాపు 2.5 కోట్ల కంపెనీ సొంత అవుట్‌లెట్‌ల టర్నోవర్ ఉంది’’ అని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment