మోడీ చాయ్.. సిక్కోలు హాయ్! | Narendra Modi's 'chai pe charcha' with voters | Sakshi
Sakshi News home page

మోడీ చాయ్.. సిక్కోలు హాయ్!

Published Thu, Feb 13 2014 1:23 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

Narendra Modi's 'chai pe charcha' with voters

 శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. అందునా దేశ ప్రధానమంత్రి అభ్యర్థి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో మిమ్మల్ని పలకరిస్తే ఎలా ఫీలవుతారు.. దేశవ్యాప్త చర్చా కార్యక్రమానికి ఎంపిక చేసిన కొన్ని పట్టణాల్లో మన పట్టణాన్ని చేరిస్తే మన అనుభూతి ఎలా ఉంటుంది?!.. ఆ కార్యక్రమం ఏదైనా.. అది కచ్చితంగా వింత అనుభూతే. శ్రీకాకుళం పట్టణవాసులు బుధవారం సరిగ్గా అదే అనుభూతి పొందారు. కారణం.. చాయ్ పే చర్చా పేరుతో గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ లైవ్‌లో టీ షాపుల నిర్వాహకులతో మాట్లాడటమే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 300 పట్టణాలు, వెయ్యి మంది టీ షాపుల నిర్వాహకులను ఎంపిక చేశారు. వీటిలో మన రాష్ట్రంలోని 19 పట్టణాలు ఉండగా.. అందులో శ్రీకాకుళం కూడా చేరింది. పట్టణంలోని ఆంధ్రా బ్యాంకు మెయిన్ బ్రాంచ్, రిమ్స్, అరసవల్లి, తహశీల్దార్ కార్యాలయం, ఏడు రోడ్ల కూడలి ప్రాంతాల్లోని టీ దుకాణాలను ఎంపిక చేశారు.
 
 మోడీతో చర్చా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వీక్షించేందుకు ఈ షాపుల్లో బీజేపీ నేతలు ఎల్‌సీడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు అహ్మదాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ కార్యక్రమంలో మోడీ 12 రౌండ్లలో పలు రాష్ట్రాలకు చెందిన టీ దుకాణదారులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు తీసిపారేసిన చాయ్‌వాలాల ప్రాధాన్యతను వివరించడంతోపాటు తాను ప్రధాని అయితే చేపట్టే కార్యక్రమాలను విశదీకరించారు. భాష అర్థం కాకపోయినప్పటికీ, స్థానికులకు మోడీతో మాట్లాడే అవకాశం రాకపోయినప్పటికీ ఈ సరికొత్త కార్యక్రమం టీ షాపుల నిర్వాహకుల్లో ఉత్సాహం నింపింది. దీన్ని వీక్షించిన స్థానికుల్లో మంచి స్పందన లభించింది. నరేంద్ర మోడీ ప్రసంగ విశేషాలను బీజేపీ నేతలు స్థానికులకు తెలుగులో వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు, పూడి తిరుపతిరావు, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ఎ.వీరభద్రం, సువ్వారి సన్యాసిరావు, సంపతిరావు నాగేశ్వరరావు, సవ్వాన ఉమామహేశ్వరరావు, జి.భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement