రుచితో పాటు ఉత్తేజాన్నిచ్చే పానీయం
గ్రామీణ ప్రాంతాల్లోనూ వెలుస్తున్న టీ హబ్స్
నేడు అంతర్జాతీయ ‘టీ’ డే
పొద్దునో టీ.. సాయంత్రమో టీ.. దోస్తులతో టీ.. చుట్టాలతో టీ.. పని ఆపి ఒక టీ.. పనయ్యాకో టీ.. తాగాల్సిందే టీ అంటూ టీ ప్రియులు చెబుతున్నారు. చెమటలు కక్కే వేడిలోనూ పొగలుకక్కే చాయ్ తాగుతున్నారు. చాయ్ కలిగించే కిక్కులను పేద, ధనిక వ్యత్యాసం లేకుండా ఆస్వాదిస్తుంటారు. ఎంత పేదలైనా ఇంటికి వెళ్లామంటే.. ఓ గ్లాసు మంచినీళ్లు, ఓ కప్పు టీ ఇవ్వాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలకు టీ అత్యంత ఇష్టమైన పానీయం. అలాంటి టీకి ఒక రోజు ఉంది. 2005 నుంచి ఏటా మే 21న అంతర్జాతీయ ‘టీ’ దినోత్సవం నిర్వహిస్తున్నారు.
1793 నుంచే..
అలిసిన మనసుకు, దేహానికి ఉత్తేజాన్ని ఇచ్చే పానీయం టీ. అరె భాయ్ చటుక్కున తాగరా చాయ్.. అంటూ ఓ సినీగేయ రచయిత టీ గొప్పతనాన్ని వర్ణిస్తూ పాట రాశాడు. ఎంతో చరిత్ర కలిగిన టీని తేనీరు, చాయ్ అని పిలుస్తారు. 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచానికి టీ పరిచయమైంది. మొట్టమొదటగా మన దేశంలో 1793లో కలకత్తాలోని బొటానికల్ గార్డెన్‌లో లార్డ్ మెకార్డి టీ మొక్కలు పెంచడం ప్రారంభించాడు. ఇప్పుడు ఇంటింటికీ టీ చేరింది. ప్రపంచ టీ ఉత్పత్తిలో చైనా తర్వాతి స్థానం భారత్‌దే. అంతర్జాతీయంగా 30శాతం టీ పొడిని ఒక్క భారతీయులే వినియోగిస్తున్నారు.
సహజమైన పానీయం..
టీ సహజమైన పానీయం. ఇంటికి ఎవరు వచ్చినా అతిథి మర్యాదలో మొదట చేరిపోయేది ‘టీ’. స్నేహితులు కాలక్షేపానికి టీ పాయింట్‌కు చేరాల్సిందే. సమావేశాల్లోనూ తేనీటిది ప్రత్యేక స్థానం. ప్రస్తుతం బయట రకరకాల కేఫ్‌లు వెలుస్తున్నాయి. టీలలో కూడా చాలా రకాలు తయారు చేస్తున్నారు. అల్లం టీ, లెమన్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, మసాలా టీ, కరోనా టీ రకరకాల టీలను టీ ప్రియులు ఆస్వాదిస్తున్నారు. మండల కేంద్రాల్లో సైతం ప్రస్తుతం వివిధ కంపెనీలు వివిధ పేర్లతో టీ పాయింట్‌లు ఏర్పాటు చేసి ఒక కప్పు చాయ్‌కు రూ.10లకు తగ్గకుండా విక్రయిస్తున్నారు. కానీ పలువురు టీ వ్యాపారులు ఇప్పటికీ రూ.5లకే టీ విక్రయిస్తున్నారు.
ఇవి చదవండి: నాలుగు మాటల్లో.. ఈ చిత్రకారుడి కథ!
Comments
Please login to add a commentAdd a comment