నేడు అంతర్జాతీయ టీ దినోత్సవం
ఒసేయ్.. తల పగిలిపోతుంది కాసింత టీ పొయ్యవే ..గట్టిగా భార్య భారతి మీద అరిచాడు సూర్యం.
రండి..రండి.. చాన్నాళ్ళకు వచ్చారు కూర్చోండి.. టీ తాగుతారా
మామా చికాగ్గా ఉంది అలా వెళ్లి మంచి అల్లం టీ తాగి వద్దాం రా మామా పిలిచాడు రామకృష్ణ
హలో అమీర్ భాయ్ దో చాయ్ దేదో కేకేశాడు లక్ష్మణ్
ఇలా చినుకులు పడుతుండగా అలా నీ కళ్ళలోకి చూస్తూ వేడివేడి టీ పెదాలను తాకుతుంటే అచ్చం నిన్ను ముద్దాడినట్లె ఉంటుంది ప్రియా.. పొయిటిక్ గా చెబుతున్నాడు దీపక్
తెల్లారి ఆరైంది ఇంకా టీ లేకపోతే ఎలాగూ..కోడలు పిల్లా నాకూ మీ మామయ్యకు స్ట్రాంగ్ ఇలాచి టీ తీసుకురామ్మా.. ఆర్థర్ వేసింది అత్త అనసూయ
ఈరోజు బోర్డు మీటింగ్..మంచి టీ ఓ ఇరవై చెప్పండి.. చెక్ లిస్టులో రాసేసాడు ఎండీ
పిల్లాడికి జ్వరం..దగ్గు ఉంది .కాస్త అల్లం టీ ఇవ్వండి గొంతు రిలీఫ్ వస్తుంది.. ఓ డాక్టర్ సూచన
ట్రైనెక్కి అరగంట అయింది ఇంకా టీ కుర్రాడు రాలేదేంటి..కిటికీలోంచి చూస్తూ గొనుక్కున్నాడు రాకేష్
సర్ మీకు ఏ టీ తేమ్మంటారు.. అల్లం టీ..ఇలాచి టీ..గ్రీన్ టీ.. లెమన్ టీ.. హెర్బల్ టీ.. ఏదిమ్మంటారు అడిగింది ఎయిర్ హోస్టెస్..
పొద్దంతా రిక్షా లాగి లాగి తల వాచిపోతోంది.. ఓ టీ పడితే తప్ప ఇంకో ట్రిప్ లోడ్ ఎత్తలేను అంటూ టీ బంక్ వైపు పరుగుతీసాడు నర్సయ్య
దేశంలో ఎక్కడ ఏ స్థాయిలో .. ఏ ఇద్దరు మాట్లాడుకోవాలన్నా వారిమధ్య వారధి టీ.. దేశ రాజకీయాలన్నీ చర్చకు వచ్చేది కూడా టీ బంకుల దగ్గరే
టకీమని మూడ్ మార్చేస్తుంది..
మనసు బాగా లేకపోయినా.. ఒంట్లో బాలేకపోయినా.. ఇంట్లో బాలేకపోయినా ఏ ఇద్దరి మధ్య గొడవ అయినా సరే ...ఇలాంటి ఎన్నో చిన్నచిన్న సమస్యలను టీ చటుక్కున పరిష్కరించేస్తుంది.. అడగ్గానే డబ్బు సరిపోక.. భర్త నక్లెస్ కొనలేదని మూడు రోజులుగా జగడమాడి మాటలు మానేసి అటు తిరిగి మూతి ముడుచుకుని కూర్చున్న ప్రశాంతి సాయంత్రం చిన్నగా వర్షం పడుతున్న వేళ ఎలాగైనా శ్రీమతిని మచ్చిక చేసుకోవాలని మూడు రోజులుగా భర్త శ్రీకాంత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ తనకు ఇష్టమైన యాలకుల టీ చేసి రెండుకప్పుల్లో పోసి ఒక కప్పును ప్రశాంతి ముందుకు జరిపి ఏమంటుందో ఏమో అని కాస్త భయంతో బెదురు చూపులు చూస్తున్న శ్రీకాంత్ కు ఆఫర్ తగిలేసింది.. ఘమాఘమలాడే టీ సువాసనతో ప్రశాంతి కోపం కూడా ఆవిరైపోయింది. భర్తను దగ్గరకు తీసుకుని నెక్లెస్ ఏముంది..డబ్బులున్నపుడు కొందాం లెండి అంటూ అల్లుకుపోయింది.
విద్యార్థులను మేల్కొలిపే ఆత్మీయ హస్తం టీ
ఇప్పటి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయ సాధించేందుకు గంటలు గంటలు.. ఒక్కోసారి నైట్ అవుట్.. అంటే తెల్లార్లు చదవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు నిద్ర మేల్కొని ఉండేందుకు.. శరీరం డస్సిపోకుండా ఉండేందుకు.. కోల్పోయిన శక్తిని మళ్లీ రీచార్జ్ చేసుకునేందుకు. చదివింది మైండ్ లోకి ఎక్కేందుకు .. నిద్ర రాకుండా.. మూత పడిపోకుండా ఉండేందుకు కూడా టీ ఆత్మీయ మిత్రుల పక్కనే నిలబడి ఉంటుంది. ఫ్లాస్క్ లో టీ పెట్టుకుని పుస్తకం పట్టుకుని కూర్చున్నారు అంటే ఇక ఆ సిలబస్ అంతు తేల్చేయాల్సిందే. రెప్పల మూతపడుతున్న తరుణంలో.. లేవయ్యా.. బోలెడు సిలబస్ ఉంది నిద్రపోతే ఎలా.. అంటూ ఆ టీ కప్ మనల్ని నిద్రలేపి పుస్తకం వైపు చూసేలా చేస్తుంది..
సర్జరీలు చేసి అలసిపోయే డాక్టర్లు.. వేల కిలోమీటర్లు ప్రయాణాన్ని అలవోకగా పూర్తిచేసే డ్రైవర్లు.. పరిశోధన విద్యార్థులు శాస్త్రవేత్తలు ఒకరేమిటి,. అన్ని రంగాల వారికి టి అనేది ఒక ఔషధం.. అందమైన వ్యసనం.. ఉదయం పూట సూర్యోదయాన్ని చూస్తూ.. ఆ వెచ్చదనాన్ని టీ కప్పులో ఆస్వాదించడం కొందరికి ఒక ఇష్టమైన దినచర్య. సాయంత్రం వేళ కొండల్లోకి వెళ్లిపోతున్న సూర్యుని చూస్తూ మళ్ళీ ఓ టీ తీసుకోవడం మరికొందరికి ప్రియమైన ప్రక్రియ. ఇలా అన్నివర్గాల వారినీ కలిపి ఉంచే టీ కి కూడా అన్ని సందర్భాల్లో ఓ గౌరవప్రదమైన స్థానం ఉంది. అందరం టీ తాగుదాం.. ఆరోగ్యంగా ఉందాం.
- సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment