మన భారతదేశంలో మందార మొక్కకు ఉన్న ప్రాముఖ్యత చాలా పెద్దదే. మందార ఆకులు, పువ్వులు, పువ్వుల నుంచి తీసిన తైలం సౌందర్య ఉత్పత్తుల్లో అనాదిగా వాడుకలో ఉన్నవే. ముఖ్యంగా ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఈ వర్షాకాలంలో ఈ మందార టీ తాగడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటోంది స్టార్ హీరోయన్ నయనతార.
మందార పువ్వుల టీ, లేదా హైబిస్కస్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి .మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు , గుండె సంబంధిత వ్యాధులు,తదితర సమస్యలకు చక్కగా పనిచేస్తోంది. బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది. మొటిమలు, చర్మంపై వేడి కురుపులు రాకుండా కాపాడుతుంది. అలాగే హైబిస్కస్ టీ వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని కాపాడుతుంది. సీజనల్ ఇన్ఫెక్షన్/అనారోగ్యం నుండి రక్షించే యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను కలిగి ఉంటుంది.
రోజూ మందార టీ తాగడం సురక్షితమేనా? అంటే నిక్షేపంలా తాగవచ్చు (మితంగా) మందారతో దాదాపు ఎలాంటి అలెర్జీలు ఉండవు. మందార టీ దేనికి మంచిది? మందార టీ వల్ల కలిగే అనేక ప్రయోజనాలను వివరంగా పరిశీలిద్దాం.
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
హైపోలిపిడెమిక్ లక్షణాల వల్ల మధుమేహం వంటి బ్లడ్ షుగర్ డిజార్డర్స్‌తో బాధపడేవారికి అద్భుతాలు చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి , రక్త నాళాలు దెబ్బతినకుండా కాపాడటానికి దోహదం చేస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మన శరీర కణజాలం, కణాలలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటం ద్వారా ఈ వ్యాధుల నుండి కాపాడుతుంది.
మెరిసే చర్మం కోసం
మందార టీ చర్మానికి కూడా మేలు చేస్తుంది. హైబిస్కస్ టీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇంకా మైరిసెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది, ఇది కొల్లాజెన్ విచ్ఛిన్నతను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా చర్మం వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది కాబట్టి చర్మం మెరుపును కాపాడుతుంది.
ఆరోగ్యకరమైన జుట్టు
మందార టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెలనిన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. జుట్టుకు సహజమైన రంగును అందించి పట్టుకుచ్చులా మెరిసేలా చేస్తుంది. జుట్టు తొందరగా తెల్లగా కావడాన్ని అడ్డుకుంటుంది. ఈ టీలో ఉన్న అమైనో ఆమ్లాలు మీ శరీరంలో ఎక్కువ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. ఇది కుదుళ్లు గట్టి జుట్టు ఒత్తుగా, షైనీ ఉంచేందుకు మ్యాజిక్‌లా పనిచేస్తుంది.
ఇంకా రక్తపోటు నియంత్రణలోనూ మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులోని ఆస్కార్బిక్ యాసిడ్ (విటమిన్ సి) సమృద్ధిగా ఉండటం వల్ల, రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు కూడా ప్రసిద్ది చెందింది, ఇది సాధారణ అనారోగ్యాలను అరికట్టడంలో సహాయపడుతుంది ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం చికిత్సలోనూ పనిచేస్తుంది.
మందార పూల టీ తయారీ
ఎండ బెట్టిన మందార పూలను నీటిలో వేసి కొద్ది సేపు మరిగించాలి.దీంట్లో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా వేసి మరికొద్దిసేపు మరిగించాలి. చక్కటి రంగు వచ్చిన తరువాత ఒక కప్పులోకి ఈ మిశ్రమాన్ని వడబోసుకోవాలి. రుచికోసం ఇందులో తేనె కూడా కలుపుకోవచ్చు. ఇంకా నిమ్మ, పుదీనాతో గార్నిష్ చేసుకొని చల్లగాగానీ, వేడిగా గానీ తాగవచ్చు. రెండు రోజులు ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment