మతసామరస్య అంబాసిడర్
కాకి అంత బద్నామ్ అయిన పక్షి మరోటి లేదు. కానీ దానంతటి ఉదాత్తమైన జీవి కూడా ఇంకోటి లేదని నా అభిప్రాయం. ‘ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలకూడదం’టూ పలుకుబళ్లు గలవాళ్లు సామెతలు సృష్టించి విరోధాలకూ, వివాదాలకూ, శత్రుత్వాల సూచనలకూ గల నుడి‘కారాల’ ఘాటును అమాయకమైన కాకులకు ఆపాదించారు. కానీ హైదరాబాద్ నగరం మాత్రం కాకిని నెత్తిన పెట్టుకుంది.
నగరంలో ప్రధానమైన అన్ని వర్గాల వారికీ అత్యంత ప్రియమైన పక్షి కాకి. ‘పితరుడని తలపోసి పిండాలను కాకులకు పెడతారా’ అంటూ ప్రజాకవి వేమన గద్దించినా సరే... మనం నివాళులర్పిస్తూ చనిపోయినవారికి తినిపించాలనుకున్న భోజ్యాలూ, ఖాద్యాలూ, అన్నాల వంటి వాటికి పిండాలని పేరు పెట్టి, వాయసానికి వాయనాలందించి, వాటిని అవి ముట్టితే చాలు... సాక్షాత్తూ పెద్దలకే వాటిని రుచి చూపించినట్లు భావిస్తారు ఒక వర్గానికి చెందిన ప్రజలు.
మరి ఇంకో వర్గానికి చెందినవారు కూడా కాకిని సేమ్ టు సేమ్ గాకపోయినా దాదాపు అదే లైన్స్‌లో గౌరవిస్తుంటారు. తమ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోయినా, చిన్న పిల్లలకు జబ్బు చేసినా, వాళ్లు మంకుపట్టు పట్టి చికాకు పెడుతున్నా వాటిని వదిలించేది వాయసమేనంటూ మన డాక్టర్ కాకి సహాయం తీసుకుంటుంటారు. చార్మినార్ పక్కనే ఉన్న చౌక్‌లో కాకుల్ని అమ్ముతుంటారు. ఇలా జబ్బు చేసినవాళ్లూ, చిన్నపిల్లల మితిమీరిన మంకుపట్టును భరించేలేనివాళ్లూ, తమ పిల్లాడికి దిష్టిఘాతం ముష్టిఘాతమంత పవర్‌ఫుల్‌గా తగిలిందేమోనంటూ ఆందోళనపడేవాళ్లంతా ఈ కాకుల్ని కొనుక్కుంటారు.
పిల్లాడి చేతిని కాకికి తాకించి లేదా ఆ కాకిని దిష్టితీసినట్లుగా పిల్లాడిపైనుంచి తిప్పేసి మళ్లీ స్వేచ్ఛగా గాల్లోకి వదిలేస్తుంటారు. దాంతో ఆ అనారోగ్యం, ఆ మంకుపట్లు, ఆ దిష్టిఘాతాలన్నీ వయా కాకిద్వారం ద్వారా గాల్లో కలిసిపోతాయని మరోవర్గం వారి బలమైన నమ్మకం. నల్లటి దాని వర్ణంతో మొబైల్ దిష్టి చుక్కలా అది ఎగురుతూ అన్ని అనారోగ్యాలనూ ఆవలకు తోలేస్తుందని ఈ వర్గం వారి విశ్వాసం.
ఇలా నగరంలోని రెండు ప్రధాన వర్గాల మధ్యా వైషమ్యాలవీ ఉన్నాయంటూ పొడుగు పొడుగు నిట్టూర్పులు విడుస్తూ, భారంగా డైలాగులు చెబుతూ జాతీయ సమగ్రతా, మతసహనం, ఇరుమతాల మధ్య సయోధ్యకు కృషి అంటూ చాలా సంస్థలు మీటింగులు పెట్టి మరీ ఊకదంపుడుగా ఉపన్యాసాలెన్నో ఇస్తుంటాయి. కానీ.. మా కాకిమాత మాత్రం సెలైంట్‌గా సామరస్యం కోసం ఇరువర్గాల కోసం ఒకే లైన్‌లో తన వంతు కృషి చేస్తోంది. ఎందరెందరో ఫిల్మ్ స్టార్లూ, స్పోర్ట్ స్టార్లూ, క్రికెట్టూ, టెన్నిస్సూ గిన్నీస్సూ ఇత్యాది ప్లేయర్లూ కోట్లకొద్దీ రూపాయలు తీసుకుని బ్రాండ్ అంబాసిడర్ పనులు చేస్తుంటారేమోగానీ... పైసా పారితోషికం తీసుకోకుండా హైదరాబాద్‌లో మతసామరస్యపు బ్రాండ్ అంబాసిడర్ విధులు నిర్వహిస్తున్న ఏకైక పక్షి... మా కాకి మాతల్లి.
- యాసీన్