కోఠీలో పారి... ప్రతి ఊర్లోనూ ఊరి
..ప్రవహించి అంతరించిన... సరస్వతీ నది! గంగా, యమునా, సరస్వతి భారతదేశ సంస్కృతిని ఇనుమడింపజేసే నదులని ప్రస్తుతిస్తాం. గంగా, యమునా మనకు కనిపించే నదులు. కానీ సరస్వతి అక్కడెక్కడో అలహాబాద్‌లో అంతర్వాహినిగా ప్రవహిస్తుందని అందరూ అంటుంటారు. కానీ.. అది అలహాబాద్‌లో లేదనీ.. హైదరాబాద్‌లో ఉందని నా బలమైన నమ్మకం. అలా నమ్మకపోతే.. ఇది చదివాక మీరే నమ్మి తీరుతారు.
అవును.. సరస్వతి నది ఇప్పుడు అంతరించిన అంతర్వాహినే. కానీ కొన్నేళ్ల క్రితం కోఠీ ఉమెన్స్ కాలేజీ పక్క నుంచి ప్రవహించిన జీవనది. చదువరులకు ఓ సజీవ పెన్నిధి. పుష్కరాల నాటి స్నాన ఘట్టాల్లా సదరు సరస్వతీ నది ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ చిన్న చిన్న కొట్లు. వరస పుస్తకాల కొట్లు! ప్రతి కొట్టు ఎదురుగా కొట్టుకుంటున్నట్టుగా పఠితలూ, కొనుగోలుదారులు. గాంధీ జ్ఞానమందిరానికి ఎదురుగా ఉన్న ఆ కొట్లన్నింటిలోనూ ఎన్నో విజ్ఞాన తరంగాలు. భవిష్యత్ కలలను నెరవేర్చేందుకు ఉపకరించే పుస్తకాల పుటల రూపంలో అలరారే అలలు.
కుంభ మేళా నాడు ఎక్కడెక్కడి సాధు పుంగవులంతా గంగకు చేరినట్టు... ఎన్నెన్నో పోటీ పరీక్షల సీజన్లలో దాదాపు ఇరు రాష్ట్రాల ఊళ్ల నుంచి సదరు సరస్వతీ నదీస్నానం కోసం ఇక్కడి సరస్వతమ్మ స్నాన ఘట్టాల్లోకి చేరి పుస్తకాలు కొనేవారూ, చదువుకొనేవారు. అది ఉమెన్స్ కాలేజీ కాబట్టి ఒక ఒడ్డున కనుల పంట. మరో ఒడ్డున విజ్ఞాన అలల పంట. మీ కంట ఏ పంట నాటితే... మీ మనసులో సదరు మొలకల సందడి. ఆ మొలకలు ఎదిగితే మీరు కోరిన దిగుబడి.
ఇప్పుడంటే అంతరించిది కానీ... ఈ సరస్వతీ నది ఆ రోజుల్లో ఎందరికో ఎంతో మేలు చేసింది. సదరు సరస్వతీ తీరంలో లక్ష్మి కోసం బెంగక్కర్లేదు. మీ దగ్గర కొనడానికి డబ్బుల్లేవా? పుస్తకాలను కిరాయికే ఇచ్చేవారు. మీరు చదివాక మళ్లీ తీసుకు పోయి ఇస్తే... కొంత మినహాయించుకుని మీ డబ్బు మీకు వాపస్. చేతిలో పుస్తకం ఉంటే జేబులో డబ్బున్నట్టే. ఆ శంభు దేవుడికి సేవ చేశాక సువర్ణముఖీ తీరాన ఇసుక పట్టుకుంటే చాలు బంగారమయ్యేదట. మీకు దక్కే బంగారమంతా మీరు చేసిన సేవకు అనులోమానుపాతంగా ఉంటుందట. అందుకే ‘చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ’ అన్నది అక్కడి సామెత. అలాగే... ఈ సరస్వతీ తీరంలోనూ ‘చదువుకున్నవాడికి చదువుకున్నంత’ అన్నది ఇక్కడి వాడుక.
కోఠీ తీరాన ఘనాపాటీలెందరో ఈ సరస్వతీ కటాక్ష వీక్షణాది దీవెనలతో అంతరించిన ఈ అంతర్వాహినిలో మునకలేశారు. ఇక్కడ తరంగిణులపై ఓలలాడిన ఎందరో ఈ అలల మీది నుంచే అందలాలెక్కారు. చదువు వంకన నదిలోకి దిగి చదివి గట్టెక్కలేని మరెందరో అంతరించిన ఈ నదిలో మునిగి తాము కోరిన వైపునకు కాక మరో అవతలి ఒడ్డుకు కొట్టుకుపోయారు. ఒక తరం పోటీ పరీక్షలకు చదివినవారంతా ఈ నది ఒడ్డున మూగినవాళ్లే.
నది ఎప్పటికీ అంతరించదు. మళ్లీ తనను తాను ఆవిష్కరించుకుంటూనే ఉంటుంది. కాస్త దారి మార్చుకుంటుంది. ఇవ్వాళ కోఠీ ఉమెన్స్ కాలేజీ ప్రహరీ ఒడ్డున అంతరించిన ఈ నది... ఆ పక్కనే అవతలి వైపున అక్కడా ఇక్కడా కాస్త చెలమలుగా ఊరుతూ పుస్తక ప్రియులతో చెలిమి చేస్తోందట. ఒక్కమాట.. ఎన్నెన్నో కాలుష్యాలతో ముసిముసిగా ‘మూసీ’ ప్రవహిస్తున్నా.. ఆ నది నీళ్లు ఇవ్వాళ చాలామందికి పెద్దగా పనికి రావడం లేదేమోగానీ... పూర్తిగా అంతరించిపోతేనేం! సదరు సరస్వతీ నదిని ఒక తరం వారందరూ గుర్తు పెట్టుకునేవారే! అందలాలకెక్కి ఉన్నవారు ఎప్పటికీ రుణం తీర్చుకోలేనివారే! ఇది కీడులో జరిగిన మేలే కదా!!
- యాసీన్