రింఝిం రింఝిం హైదరబాద్...!
ఇస్‌కీ ఆబాదీకీ.. జిందాబాద్!!
హైదరాబాద్‌ను అందరూ కాంక్రిట్ జంగిల్ అంటూ ఆడిపోసుకుంటారు. కానీ... అదేమీ ప్రతికూల కామెంట్ కానే కాదు. అవును... జంగిల్ అంటే అడవి. అడవులను సంరక్షించుకోవాలి, పెంచుకోవాలి అనే మాటే నిజమైతే మన కాంక్రీట్ జంగిల్ కూడా చాలా విశిష్టమైనదే. దాన్లోనూ ఒక సౌందర్యముందీ, సంస్కృతి ఉంది. అందుకే అడవిని రక్షించుకున్నంత పదిలంగా హైదరాబాద్‌నూ కనిపెట్టుకోవాలీ, కాపాడుకోవాలి.
జంగిల్‌లో కొన్ని పెద్ద పెద్ద వృక్షాలుంటాయి. అలాంటివే ఇక్కడి భవనాలు. దేవదారు వృక్షాల్లా ఆకాశ హర్మ్యాలు. ఆ వృక్షరాజాలను అల్లుకునే మరికొన్ని తీగల్లాంటివే కాస్త చిన్న భవనాలు. ఆ భవనాల పక్కనే వెలిసే చాయ్ దుకాణాలూ, చిల్లర కొట్లు, సిగరెట్లూ, గిగరెట్లూ అమ్మే పాన్‌డబ్బాలు. నిజం... హైదరాబాద్ కాంక్రీటు అడవే. జనవనమే. వనజీవనమే.
‘క్యామియా’... కైసేహో... హాయ్‌బాస్... హౌఆర్‌యూ...’ పలకరింపులన్నీ పిట్టల కిచకిచలూ, జంతుజాలాల అరుపులూ... ‘క్యాబే... క్యూ’ రే... జారే... హౌలే’ లాంటివి రఫ్‌గాళ్ల రోరింగ్‌లూ, హౌలాల హౌలింగ్‌లూ!! మరి అడవి అన్నప్పుడు ఒక ఎర జంతువూ, దాన్ని వేటాడే వేట జంతువూ ఉండాలా వద్దా...? ఆ దృశ్యం చూస్తున్నప్పుడు ఏ డిస్కవరీ చానెల్లోనో, ఏ యానిమల్ ప్లానెట్‌లోనో ఎరజంతువును ఓ క్రూరమృగం వెంటాడుతూ, వేటాడుతూ చూసేవారందరిలో ఉత్కంఠత ఉండేలా, ఉద్విగ్నత నిండేలా, ఊపిరిబిగబట్టి చూసేలా చిత్తరువులా చేసేలా కళ్లప్పగించేస్తాం.
హైదరాబాద్‌లో ఇలాంటి దృశ్యం ఎలా సాధ్యమంటారా...? జాగ్రత్తగా చూడండి. రన్నింగ్‌బస్‌ను వెంటాడుతున్న యూత్ అచ్చం జీన్స్ తొడిగిన చిరుతల్లా లేరూ! వాళ్లబారిన పడే ఆ బస్సు జీబ్రాలగానో, వెర్రిముఖం వైల్డర్‌బీస్ట్ లాగానో కనిపించడం లేదూ!! ఎట్టకేలకు వాళ్లకు బస్సు ఫుట్‌బోర్డు చిక్కేలా, బస్సుచక్రం మడ్‌గార్డును తొక్కేలా ఒకవైపునకు పూర్తిగా వాలిపోయి, సోలిపోయి కనిపిస్తుంటే... అచ్చం చురుకైన చిరుతలకు చిక్కిపోయి, సొక్కిపోయి, పక్కకొరుగుతున్న పెద్ద వేటజంతువులా అనిపించకమానదు. ఇక బస్సు ఆగినప్పుడు చుట్టూ ముట్టేసే జనాన్ని చూడండి. కీటక కళేబరాన్ని చుట్టుముట్టిన చీమల్లా అనిపిస్తుందా దృశ్యం. ఏం చూసినా అడవి కళే. ఎలా వీక్షించినా వనోత్సాహమే.
డబుల్‌డెక్కర్ అనే బస్సు ఈ కాంక్రీట్ జంగిల్‌లో అంతరించిపోయింది గానీ... ఒకవేళ ఉంటేనా... ఆ రోజుల్లో అది మోడ్రన్ డ్రెస్సుల సీటీ ప్రిడేటర్స్- సింహాల ప్రైడ్‌కు చిక్కిన ఏనుగులా కనిపించేదది! ఇలా అడవిలో ఆవిష్కృతమయ్యే అంతరించిపోయే జంతువుల జాబితాలోకి వచ్చేసింది ఒకనాడు గర్వంగా చక్కర్లు కొట్టిన డబుల్‌డెక్కర్. కాబట్టి.. అవును ఇది కాంక్రీట్ జంగిలే. కాకపోతే అందమైన చెట్లలాంటి భవనాల అడవి. పూలపూల మొక్కల్లాంటి రెండూమూడంతస్తుల డాబాల వనం. దాన్నిండా జంతుజాలంలా కిటకిటలాడే జనం.
ఎస్... వి ఆల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ హైదరాబాద్!
రింఝిం రింఝిం హైదరబాద్...!
ఇస్‌కీ ఆబాదీకీ జిందాబాద్!!
- యాసీన్