Concrete jungle
-
పచ్చగా.. రెక్కలొచ్చెనా..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన హరితహారం తోపాటు జీహెచ్ఎంసీలో చేపట్టిన వివిధ కార్యక్రమాలతో పచ్చదనం పరిఢవిల్లుతోంది. వీటిని కొనసాగిస్తూనే మరిన్నింటితో ప్రజలకు మంచి వాతావరణం తోపాటు కాలుష్యాన్ని తగ్గించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఇందులో భాగంగా థీమ్, ట్రీ పార్కులతో పాటు ప్రధాన రహదారుల మార్గాల్లోని సెంట్రల్ మీడియన్లలోనూ పచ్చదనం కార్యక్రమాలను తలపెట్టింది. రూ.137 కోట్లు వెచ్చింది 57 థీమ్ పార్కుల ఏర్పాటు లక్ష్యంగా చేపట్టిన పనుల్లో 6 పార్కుల పనులు పూర్తయ్యాయి. ట్రీపార్కులు.. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో ప్రజలకు ప్రకృతిని ఆస్వాదించే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ట్రీపార్కుల ఏర్పాటు చేపట్టారు. ఇప్పటి వరకు 406 ట్రీ పార్కుల్ని ఏర్పాటు చేశారు. వీటిలో ఎల్బీనగర్ జోన్లో 104, చార్మినార్ జోన్లో 23, ఖైరతాబాద్ జోన్లో 86, శేరిలింగంపల్లి జోన్లో 97, కూకట్పల్లి జోన్లో 56, సికింద్రాబాద్ జోన్లో 40 ఉన్నాయి. సెంట్రల్ మీడియన్లలో సైతం.. వివిధ రకాల పార్కులతో పాటు రోడ్ల మధ్యన సెంట్రల్ మీడియన్లలో ఇతరత్రా ఖాళీ ప్రదేశాల్లోనూ మొక్కలు పెంచి పచ్చదనం పెంపు చర్యలు చేపట్టారు. వీటిలో పూలమొక్కలు సైతం పెంచుతున్నారు. మొక్కలతో వాహన కాలుష్యం తగ్గడంతో పాటు ఎదురుగా వచ్చే వాహనాల లైట్లు గ్లేర్ కొట్టకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 186 సెంట్రల్ మీడియన్ల లొకేషన్లలో 176 కిలోమీటర్ల మేర పచ్చదనం పెంచి అందంగా కనిపించేలా చేసినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. గత సంవత్సరం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా దశాబ్ద కాలానికి (2011–21) సంబంధించి వెల్లడించిన నివేదికలో దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే పచ్చదనం విస్తీర్ణం అత్యధికంగా 48.66 చదరపు కిలోమీటర్లు పెరిగింది. నగరంలో పచ్చదనం 5.23 శాతం నుంచి దాదాపు 13 శాతానికి పెరిగింది. ట్రీసిటీగా కూడా గుర్తింపు పొందడం తెలిసిందే. ఆ నివేదిక స్ఫూర్తితో పచ్చదనం పెంపునకు బల్దియా పాటుపడుతోంది. (చదవండి: పని మీది.. పరిష్కారాలు నావి!) -
కాంక్రీట్ జంగిల్లో అటవీ వనం!
రణగొణ ధ్వనులు, రోజువారీ ఉద్యోగం, ఇతర టెన్షన్లతో బిజీ జీవితం గడుపుతున్న నగర, పట్టణ వాసులకు మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులు (అటవీ ఉద్యానవనాలు) సిద్ధ మవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 76 పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణ యించగా, 25 పార్కులు ఇప్పటికే నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ చుట్టూ ఏడు జిల్లాల పరిధిలో ఈ పార్కుల అభివృద్ధి జరుగుతున్నందున ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారి, సంబంధిత శాఖల సమన్వయంతో వీటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటు న్నారు. రాష్ట్ర జనాభాలో మూడోవంతుపైగా హైదరాబాద్‌లో నివసిస్తుండడంతో ప్రధానంగా నగర శివార్ల లోనే అత్యధికంగా అంటే, దాదాపు 50కు పైగా ఇక్కడే అర్బన్ పార్కులు ఏర్పాటవుతున్నాయి. అంతర్జాతీ యంగా ఖ్యాతి పొందుతున్న హైదరాబాద్‌ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో కొన్ని ఇప్పటికే అందుబాటులోకి రాగా, మరో అయిదింటిని సోమవారం మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తున్నారు. ఈ పార్కులు ఎక్కడెక్కడ... ఈసీఐఎల్‌కు సమీపంలోని నాగారం ఆరోగ్యవనంలో ఒకటి, ఉప్పల్‌కు దగ్గరలోని నారాపల్లి జఠాయువు అర్బన్ ఫారెస్ట్ పార్క్ రెండోది, యాదాద్రి సమీపంలోని రాయగిరి వద్ద నర్సింహ అరణ్యం మూడోది, చౌటుప్పల్ సమీపంలోని లక్కారం అర్బన్ ఫారెస్ట్ వద్ద నాలుగోది, శంషాబాద్ సమీపంలోని మసీదుగడ్డ వద్ద ఐదో అర్బన్ పార్కు ప్రారంభం కానున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్న 59 పార్కులను వీలైనంత త్వరగా దశల వారీగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని, నవంబర్ నెలాఖరు డైడ్లైన్గా పెట్టుకున్నారు. 59 పార్కులకు సంబంధించిన ప్రత్యేకతలు, సమాచారంతో విడివిడిగా బుక్ లెట్లను ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రతి పార్కులో సహజమైన అటవీ సంపద దెబ్బతినకుండా, సందర్శకులకు తగిన సౌకర్యాలు ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. అందుబాటులోకి అటవీ భూములు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఇతర నగరాలు, పట్టణాలు క్రమక్రమంగా కాంక్రీట్ జంగళ్లుగా మారుతూ వనాలు, తోటలు, పార్కులు కనుమరుగవుతున్నాయి. హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణ శివార్లలో వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ భూములను ప్రజలకు అందు బాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్, చుట్టుపక్కల హెచ్ఎండీఏ, అటవీ శాఖ సంయుక్తంగా అర్బన్ ఫారెస్ట్ బ్లాకులను అభివృద్ధి చేస్తున్నాయి. అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఆహ్లాదకరంగా, అందంగా తీర్చిదిద్దుతుండడంతో ఇప్పటికే ప్రారంభించిన పలు అర్బన్ పార్కుల్లో వారాంతాలు, సెలవు రోజుల్లో ప్రజలు ప్రశాంతంగా గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని పార్కుల్లో వాకింగ్ ట్రాక్, కానోఫి వాక్, పాత్ వే, చిల్డ్రన్ ప్లే ఏరియా వంటి సౌకర్యాలు కూడా కల్పించారు. – సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్లు ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు సూక్ష్మ పోషక విలువలపై అవగాహనతోపాటు మధ్యాహ్న భోజనంలోకి తాజా కూరగాయలు అందించవచ్చని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. శనివారం విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్‌కుమార్, ఉద్యానశాఖ సంచాలకులు వెంకట్రామిరెడ్డి తదితరులు సచివాలయంలో సమావేశమయ్యారు. పాఠశాలలు, కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్ల ఆవశ్యకతపై చర్చించి నిర్ణయించిన అనంతరం పలు సూచనలు చేశారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల, కేజీబీవీలో తప్పకుండా కిచెన్ గార్డెన్లు నిర్వహించాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంలో కనీసం 10 శాతంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలన్నారు. స్థలాభావం ఉన్న చోట చిన్నపాటి తొట్లు, కుండీలు కొనుగోలు చేసి ఆ మేరకు నిర్వహణ చేపట్టాలన్నారు. కిచెన్ గార్డెన్ల నిర్వహణలో విద్యార్థులను సైతం భాగస్వామ్యం చేయాలని, దీంతో వారికి ప్రకృతితోపాటు తోటల పెంపకంపై అవగాహన వస్తుందన్నారు. సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాల ప్రతులను జిల్లా విద్యాశాఖ అధికారుల ద్వారా అన్ని పాఠశాలలకు పంపించాలని సూచించారు. చెట్టుకు పుట్టిన రోజు.. మహబూబాబాద్: ప్రాణ వాయువునిచ్చే చెట్లను పెంచడమే గగనమైన ఈ రోజుల్లో ఓ మొక్కను పెంచడమే గాక దాని జన్మదిన వేడుకలూ జరుపుతూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడో వ్యక్తి. వివరాలు.. మానుకోట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో టీస్టాల్ నిర్వహిస్తున్న గుగులోతు శంకర్ మూడు సంవత్సరాల కింద వేపమొక్కను నాటి, దాన్ని సంరక్షిస్తున్నాడు. ప్రతి ఏడాది ఆ మొక్క జన్మదిన కార్యక్రమంలో దానిని బెలూన్లతో అలంకరించి కేక్ కట్ చేయడాన్ని ఆనవాయితీగా మార్చుకున్నాడు. శనివారం ఆ మొక్క పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ కమిషనర్ బి.ఇంద్రసేనారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొని కేక్ కట్ చేశారు. -
నగరంలో అందాలు
సాక్షి,సిటీబ్యూరో: కాంక్రీట్ జంగిల్లో తిరుగాడే మనుషులకు కాస్త పచ్చదనం కనిపిస్తే మనసు ఆగిపోతుంది. అక్కడే ఉండాలనిపిస్తుంది. మరి ప్రకృతిలో పుట్టిపెరిగే పక్షులు ఎంత ఆనందిస్తాయో..! నగరం నాలుగు దిశలా విస్తరిస్తున్న వెలస్తున్న ఆకాశ హర్మా్యలు బతుకును దుర్భరం చేస్తున్నాయి. అక్కడక్కడా ఉన్న తోటలు పక్షులకు ఆవాసం కల్పిస్తున్నాయి. అలాంటి వాటిలో కుత్బుల్లాపూర్ హెచ్ఎంటీ ప్రాంతం ఒకటి. చిన్నపాటి అడవిని తలపించే ఈ ప్రాంతంలో రకరకాల పక్షుల కిలకిల రావాలు పలుకుతున్నాయి. నెమళ్లు, గువ్వలు, కింగ్ ఫిషర్, టిట్లక్ పిట్ట, గుడ్లగూబ, గోరింకలు.. కొన్ని విదేశీ పక్షలు సైతం ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుని సందడి చేస్తున్నాయి. బుధవారం ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన దృశ్యాలివి. -
వానే వనరు...
♦ కాంక్రీట్ జంగిల్లో రెండు దశాబ్దాలుగా అదే ఆధారం ♦ వర్షపు నీటి సంరక్షణకు ఆదర్శం... సత్యభూపాల్ కుటుంబం ఎండలు మండుతున్నాయి. నేలలు నైబారుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి.. జలాశయాలు బీడువారి.. కాంక్రీట్ జంగిల్ గొంతు తడవక గగ్గోలు పెడుతోంది. కుళాయిలున్నా.. బోరులు తవ్వుకున్నా.. చుక్క నీరు లేక సిటీజనుడు విలవిల్లాడుతున్నాడు. కానీ ఈ దాహార్తికి నగరంలోని ఓ ఇల్లు మాత్రం దూరం. ఎప్పుడు కావాలంటే అప్పుడు పుష్కలంగా నీళ్లు... అదీ స్వచ్ఛంగా... నల్లా కనెక్షన్ లేకుండా... రెండు దశాబ్దాలుగా! నమ్మలేకపోయినా ఇది వాస్తవం. ఆ కుటుంబానికి వానే నీటి వనరు. వర్షపు నీటిని ఒడిసిపట్టి... నిల్వచేసి... అన్ని అవసరాలనూ తీర్చుకొంటోంది చంపాపేట గ్రీన్‌పార్క్ కాలనీలో నివసించే సత్యభూపాల్‌రెడ్డి కుటుంబం. సిటీ క‘న్నీటి’ వ్యధల మధ్య ఆ వాన నీటి కథేమిటో మనమూ తెలుసుకొందాం రండి... సాక్షి, హైదరాబాద్: రీసెర్చ్ ఇన్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ (రీడ్స్) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వి.సత్యభూపాల్‌రెడ్డి, తులసి దంపతులది కర్నూలు జిల్లా. పిల్లల చదువులు, జీవనోపాధి కోసం నగరానికి వచ్చి స్థిరపడ్డారు. చంపాపేటలోని గ్రీన్‌పార్క్ కాలనీలో 1989లో సొంతింటిని నిర్మించుకున్నారు. ఆ సమయంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరం నుంచి ఆయన ఇద్దరు కూతుళ్లు అర్ధరాత్రి సైకిల్‌పై వెళ్లి క్యాన్లలో తెచ్చేవారు. ఇంట్లోని బోరుబావిలో నీళ్లు పసుపురంగులో వచ్చేవి. ఇవి తాగలేక... అన్నేసి కిలోమీటర్లు వెళ్లి నీరు తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో భూపాల్‌కు ఓ ఆలోచన వచ్చింది. అదే వాన నీటి సంరక్షణ. మూడు దఫాలుగా వడపోత... మొదటగా 1995లో 5,400 లీటర్ల సామర్థ్యం గల మూడు సిమెంట్ ట్యాంకులు నిర్మించారు. వీటిలో వాన నీటిని మూడు దఫాలుగా వడపోసి రెండు నెలలపాటు తాగడానికి, వంటకు వాడారు. సిమెంటు ట్యాంకుల్లో అడుగుభాగాన 4 అంగుళాల మందంలో లావు రాళ్లు, దానిపై 40 మిల్లిమీటర్ల సైజు గల కంకర, ఆపై వరుసలో దొడ్డు ఇసుక, దీనిపై మెత్తటి ఇసుక 5 అంగుళాల మందం చొప్పున పోశారు. దీనిపై 5 అంగుళాల ఎత్తు వరకు కట్టె బొగ్గు, 3 అంగుళాల ఎత్తున మెత్తటి ఇసుక, రెండు అంగుళాల ఎత్తు వరకు కంకర నింపారు. పై భాగంలో మిగిలిన ఖాళీ స్థలంలోకి వర్షపు నీటిని నింపుతారు. మొదటి అంతస్తుకు పై కప్పుగా ఉన్న రేకులపై పడిన వర్షపు నీరు.. ప్రత్యేకంగా బిగించిన పైపుల ద్వారా ఈ ట్యాంక్‌లోకి చేరుతుంది. ఇక్కడ ఫిల్టర్ అయిన నీటిని నేలపై ఏర్పాటు చేసిన మూడు ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. వీటి నుంచి రోజువారీ తాగడానికి, వంటకు వినియోగిస్తున్నారు. ‘మేం వినియోగిస్తున్న నీరు సురక్షితమేనా అని చాలా మంది ప్రశ్నించారు. దీంతో నీటిని పరీక్ష చేయించాం. నిర్దేశిత ప్రమాణాల మేరకు నీటిలో లవణాలు, జపాన్ తాగునీటి నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టు ఉన్నట్లు తేలింది’ అని చెప్పారు భూపాల్. ఇంటి పెరడు ఇంకుడుగుంత... భూపాల్ ఇంటి పెరడు కూడా ఇంకుడు గుంతలా పనిచేస్తుంది. తాగడానికి అవసరమయ్యే నీరు తప్ప మిగిలిన వర్షపు నీరంతా ఆ పెరటిలో ఇంకిపోతుంది. ఇక్కడి మట్టి.. మెత్తగా, వదులుగా ఉంటుంది. చెట్ల ఆకులన్నింటినీ సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. ప్రహరీని ఆనుకుని లోపలివైపు వర్షం నీరు భూమిలోకి ఇంకిపోయేలా... 4 అడుగుల లోతున 4 వరుసల్లో మట్టి ఇటుకలు పేర్చి.. దానిపై ఇసుకను బెడ్‌లా పోశారు. దీంతో వర్షపు నీరంతా బయటికి పోకుండా నేలలోకి ఇంకుతుంది. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో వెయ్యి అడుగుల లోతున నీటి లభ్యత ఉంది. కానీ వీరి ఇంట్లో 90 అడుగుల లోతున్న బోరుబావిలో 60 అడుగుల లోతులో నీరు లభిస్తుండడం విశేషం. ఇల్లు కట్టినప్పుడు 8.5 శాతం ఉన్న ఫ్లోరైడ్... ఇప్పుడు 1.5 శాతానికి తగ్గింది. ఈ పద్ధతిని చూసి 38 మంది శాస్త్రవేత్తలు తమ ఇళ్లలో అమలు చేస్తున్నారు. ‘డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం లేక వాననీటి తాగుతున్నారని చాలామంది ఎగతాళి చేసేవారు’ అని గుర్తుచేసుకున్న సత్యభూపాల్ కుటుంబం ఇప్పుడు నీటి కటకట ఎదుర్కొంటున్న సిటీకి ఆదర్శం. -
వరదలా వచ్చే నీళ్లను ఇట్టే పీల్చేస్తుంది!
♦ కొత్త ఫార్ములా కాంక్రీట్ రోడ్లకు రూపకల్పన ♦ 60 ఏళ్లు మన్నికతో ఉండే కాంక్రీట్ రోడ్లు సాక్షి సెంట్రల్ డెస్క్: నగరం ఒక కాంక్రీట్ జంగిల్. భారీ అపార్ట్మెంట్లు.. రోడ్లన్నీ కాంక్రీట్ మయం. దీంతో కురిసిన వర్షంలో చినుకు కూడా లోపలకు ఇంకే పరిస్థితి లేదు. చిన్న వర్షాలకే రోడ్లపై నీళ్లు పారతాయి. భారీగా కురిసే వాన వరద అవుతోంది. ఇదే అంతిమంగా పెనుముప్పుగా మారుతోంది. ఇలా ఇప్పుడు చెన్నైకి తలెత్తిన వరదముప్పు మొదలూ కాదు తుదీ కాదు. మరి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనడంలో భవిష్యత్తులో అయినా సాధ్యమా? కాంక్రీట్ రోడ్లను వాగులుగా మార్చేస్తున్న వరదలను నియంత్రించడం సాధ్యమా? అంటే.. ఎప్పుడో ‘ఔను’ అనేశారు యూరోపియన్ ఇంజనీరింగ్ నిపుణులు. కురిసిన వర్షపు నీటిని కురిసిట్టుగానే ఇముడ్చేసుకుని భూమిలోకి పంపించే టెక్నాలజీతో వారు రోడ్లను నిర్మించారు. నగరాల్లో వరద సమస్యలేకుండా చూసుకోవడంతో పాటు, భూగర్భ జలాన్ని పెంపొందించుకునే ప్రణాళికను కూడా వారు అమలు పెట్టారు. ఆ కాంక్రీట్‌కు దాహం ఎక్కువ...: వేడిగా ఉన్న పెనం మీద నీళ్లను విదిలిస్తే అవి ఎలా ఆవిరయిపోతాయో టాప్‌మిక్స్ పర్మియబుల్ కాంక్రీట్‌తో నిర్మించిన రోడ్లు మీద పడే వర్షపు చినుకుల పరిస్థితి అలాగే ఉంటుంది. చిన్న చిన్న చినుకులు.. కుండ పోత వాననే కాదు.. ఒక వాటర్ ట్యాంకర్ పంపు నుంచి ధారాపాతంగా నీళ్లను రోడ్డుపై వదిలినా.. అవి కొన్ని సెంటీమీటర్ల దూరం కూడా ముందుకు ప్రవహించవు. పడ్డచోటే ఇంకిపోతూ ఉంటాయి. అలా పీల్చేసుకునే తత్వం ఉంటుంది ఈ రోడ్డుకు. టాప్‌మిక్స్ పెర్మియబుల్గా వ్యవహరించే కాంక్రీట్‌కు దాహం ఆ స్థాయిలో ఉంటుంది. గణాంకాల ప్రకారం చెప్పాలంటే 60 సెకన్లలో 880 గేలన్ల నీటిని పీల్చేసుకోగలవు ఈ రోడ్లు. దీంతో ఎంత భారీ వర్షం వచ్చినా వరదనీరు కాదు కదా.. రోడ్లపై తడి కూడా ఉండదు. డ్రైనేజ్ సిస్టమ్‌కు అనుసంధానం..: ఒక డచ్ నిర్మాణరంగ సంస్థ ఈ రోడ్డును డిజైన్ చేసింది. ఈ ఫార్ములా ప్రకారం నీటిని పీల్చుకునే తత్వం ఉన్న కాంక్రీట్‌తో, పీల్చుకున్న నీటిని డ్రైనేజ్ సిస్టమ్‌కు అనుసంధానిస్తూ రోడ్లను నిర్మించుకోవచ్చు. భూమిలోకి ఇంకే నీటి శాతం కూడా చాలా వరకూ పెరుగుతుంది. ఈ రోడ్డు కనీసం 60 సంవత్సరాల పాటు మన్నుతుందని ఆ సంస్థ హామీ ఇస్తోంది. డచ్ గడ్డపై ఇళ్ల మధ్య, పార్కుల్లోనూ, గోల్ఫ్ కోర్టుల్లోనూ... ఈ తరహా రోడ్లు నిర్మితమయ్యాయి. వ రద ప్రభావిత ప్రాంతాల్లో ఇలాంటి రోడ్ల నిర్మాణం చాలా ఉపయుక్తమని రూపకర్తలు చెబుతున్నారు. -
పచ్చదనం హరీ!
హుదూద్‌తో చెదిరిన ‘మహా’ అందం తొలగిస్తున్నా తరగని వృక్ష శకలాలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సాక్షి, విశాఖపట్నం : విశాఖ అందం చెదిరిపోయింది. నిన్నటి వరకు పచ్చదనంతో పరిఢవిల్లిన మహానగరం ఇప్పుడు మోడువారింది. ఎటు చూసినా నిర్జీవమైన చెట్లే అగుపిస్తున్నాయి. జాతీయ రహదారితో పాటు నగరంలో అంతర్గత రహదారుల్లో నేలకొరిగిన చెట్లన్నీ మాడిమసైపోయినట్టు కన్పిస్తున్నాయి. హుదూద్ దెబ్బకు మహానగరంలో వేలాది వృక్షాలు నేలకొరిగాయి. ఇక చుట్టుపక్కల కొండలపై నేలకొరిగిన వృక్షాలకైతే లెక్కేలేదు. వీటి సంఖ్య లక్షకు పైగానే ఉంటుందని అంచనా. నగరంలో తలలు తెగిపడినట్టుగా కనిపిస్తున్న వృక్షాలను మూడురోజులుగా తొలగిస్తూనే ఉన్నారు. మోడుగా మిగిలిన చెట్ల మానులు మళ్లీ చిగురుస్తాయేమోనని నగర వాసులు ఆశించారు. కానీ గురువారం నగరంలో ఏ చెట్టుచూసినా మాడిపోయినట్టుగా దర్శనమించడంతో వాటిని చూసిన నగరవాసులు కలత చెందుతున్నారు. నగరం చుట్టూ పచ్చదనంతో సుందర వనంగా కన్పించే కొండలపై ఉండే చెట్లు కూడా మాడిపోవడంతో బోడిగా దర్శనమిస్తున్నాయి. కొండవాలు ప్రాంతాల్లో ఉండే ప్రజలు రాళ్లు..రప్పలతో కన్పించిన కొండలను చూసి వ్యధా భరితులవుతున్నారు. పైనుంచి చూస్తే గ్రీన్‌సిటీగా కన్పించే మహానగరం నేడు కాంక్రీట్ జంగిల్‌గా క న్పిస్తోంది. నగరంలో పచ్చదనం మచ్చుకైనా కానరావడం లేదు. మహా నగరాన్ని ఇలా చూస్తామని మేమెప్పుడూ అనుకోలేదని ఎంవీపీ కాలనీకి చెందిన రిటైర్డు ఉద్యోగి సుందర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క గత రెండురోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇటు విద్యుత్ లేక, అటు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. -
రింఝిం రింఝిం హైదరబాద్...!
ఇస్కీ ఆబాదీకీ.. జిందాబాద్!! హైదరాబాద్‌ను అందరూ కాంక్రిట్ జంగిల్ అంటూ ఆడిపోసుకుంటారు. కానీ... అదేమీ ప్రతికూల కామెంట్ కానే కాదు. అవును... జంగిల్ అంటే అడవి. అడవులను సంరక్షించుకోవాలి, పెంచుకోవాలి అనే మాటే నిజమైతే మన కాంక్రీట్ జంగిల్ కూడా చాలా విశిష్టమైనదే. దాన్లోనూ ఒక సౌందర్యముందీ, సంస్కృతి ఉంది. అందుకే అడవిని రక్షించుకున్నంత పదిలంగా హైదరాబాద్‌నూ కనిపెట్టుకోవాలీ, కాపాడుకోవాలి. జంగిల్లో కొన్ని పెద్ద పెద్ద వృక్షాలుంటాయి. అలాంటివే ఇక్కడి భవనాలు. దేవదారు వృక్షాల్లా ఆకాశ హర్మ్యాలు. ఆ వృక్షరాజాలను అల్లుకునే మరికొన్ని తీగల్లాంటివే కాస్త చిన్న భవనాలు. ఆ భవనాల పక్కనే వెలిసే చాయ్ దుకాణాలూ, చిల్లర కొట్లు, సిగరెట్లూ, గిగరెట్లూ అమ్మే పాన్‌డబ్బాలు. నిజం... హైదరాబాద్ కాంక్రీటు అడవే. జనవనమే. వనజీవనమే. ‘క్యామియా’... కైసేహో... హాయ్బాస్... హౌఆర్యూ...’ పలకరింపులన్నీ పిట్టల కిచకిచలూ, జంతుజాలాల అరుపులూ... ‘క్యాబే... క్యూ’ రే... జారే... హౌలే’ లాంటివి రఫ్గాళ్ల రోరింగ్లూ, హౌలాల హౌలింగ్లూ!! మరి అడవి అన్నప్పుడు ఒక ఎర జంతువూ, దాన్ని వేటాడే వేట జంతువూ ఉండాలా వద్దా...? ఆ దృశ్యం చూస్తున్నప్పుడు ఏ డిస్కవరీ చానెల్‌లోనో, ఏ యానిమల్ ప్లానెట్లోనో ఎరజంతువును ఓ క్రూరమృగం వెంటాడుతూ, వేటాడుతూ చూసేవారందరిలో ఉత్కంఠత ఉండేలా, ఉద్విగ్నత నిండేలా, ఊపిరిబిగబట్టి చూసేలా చిత్తరువులా చేసేలా కళ్లప్పగించేస్తాం. హైదరాబాద్‌లో ఇలాంటి దృశ్యం ఎలా సాధ్యమంటారా...? జాగ్రత్తగా చూడండి. రన్నింగ్బస్ను వెంటాడుతున్న యూత్ అచ్చం జీన్స్ తొడిగిన చిరుతల్లా లేరూ! వాళ్లబారిన పడే ఆ బస్సు జీబ్రాలగానో, వెర్రిముఖం వైల్డర్బీస్ట్ లాగానో కనిపించడం లేదూ!! ఎట్టకేలకు వాళ్లకు బస్సు ఫుట్‌బోర్డు చిక్కేలా, బస్సుచక్రం మడ్గార్డును తొక్కేలా ఒకవైపునకు పూర్తిగా వాలిపోయి, సోలిపోయి కనిపిస్తుంటే... అచ్చం చురుకైన చిరుతలకు చిక్కిపోయి, సొక్కిపోయి, పక్కకొరుగుతున్న పెద్ద వేటజంతువులా అనిపించకమానదు. ఇక బస్సు ఆగినప్పుడు చుట్టూ ముట్టేసే జనాన్ని చూడండి. కీటక కళేబరాన్ని చుట్టుముట్టిన చీమల్లా అనిపిస్తుందా దృశ్యం. ఏం చూసినా అడవి కళే. ఎలా వీక్షించినా వనోత్సాహమే. డబుల్‌డెక్కర్ అనే బస్సు ఈ కాంక్రీట్ జంగిల్లో అంతరించిపోయింది గానీ... ఒకవేళ ఉంటేనా... ఆ రోజుల్లో అది మోడ్రన్ డ్రెస్సుల సీటీ ప్రిడేటర్స్- సింహాల ప్రైడ్కు చిక్కిన ఏనుగులా కనిపించేదది! ఇలా అడవిలో ఆవిష్కృతమయ్యే అంతరించిపోయే జంతువుల జాబితాలోకి వచ్చేసింది ఒకనాడు గర్వంగా చక్కర్లు కొట్టిన డబుల్‌డెక్కర్. కాబట్టి.. అవును ఇది కాంక్రీట్ జంగిలే. కాకపోతే అందమైన చెట్లలాంటి భవనాల అడవి. పూలపూల మొక్కల్లాంటి రెండూమూడంతస్తుల డాబాల వనం. దాన్నిండా జంతుజాలంలా కిటకిటలాడే జనం. ఎస్... వి ఆల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ హైదరాబాద్! రింఝిం రింఝిం హైదరబాద్...! ఇస్కీ ఆబాదీకీ జిందాబాద్!! - యాసీన్