- హుదూద్‌తో చెదిరిన ‘మహా’ అందం
- తొలగిస్తున్నా తరగని వృక్ష శకలాలు
- పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ అందం చెదిరిపోయింది. నిన్నటి వరకు పచ్చదనంతో పరిఢవిల్లిన మహానగరం ఇప్పుడు మోడువారింది. ఎటు చూసినా నిర్జీవమైన చెట్లే అగుపిస్తున్నాయి. జాతీయ రహదారితో పాటు నగరంలో అంతర్గత రహదారుల్లో నేలకొరిగిన చెట్లన్నీ మాడిమసైపోయినట్టు కన్పిస్తున్నాయి. హుదూద్ దెబ్బకు మహానగరంలో వేలాది వృక్షాలు నేలకొరిగాయి. ఇక చుట్టుపక్కల కొండలపై నేలకొరిగిన వృక్షాలకైతే లెక్కేలేదు. వీటి సంఖ్య లక్షకు పైగానే ఉంటుందని అంచనా.
నగరంలో తలలు తెగిపడినట్టుగా కనిపిస్తున్న వృక్షాలను మూడురోజులుగా తొలగిస్తూనే ఉన్నారు. మోడుగా మిగిలిన చెట్ల మానులు మళ్లీ చిగురుస్తాయేమోనని నగర వాసులు ఆశించారు. కానీ గురువారం నగరంలో ఏ చెట్టుచూసినా మాడిపోయినట్టుగా దర్శనమించడంతో వాటిని చూసిన నగరవాసులు కలత చెందుతున్నారు. నగరం చుట్టూ పచ్చదనంతో సుందర వనంగా కన్పించే కొండలపై ఉండే చెట్లు కూడా మాడిపోవడంతో బోడిగా దర్శనమిస్తున్నాయి.
కొండవాలు ప్రాంతాల్లో ఉండే ప్రజలు రాళ్లు..రప్పలతో కన్పించిన కొండలను చూసి వ్యధా భరితులవుతున్నారు. పైనుంచి చూస్తే గ్రీన్‌సిటీగా కన్పించే మహానగరం నేడు కాంక్రీట్ జంగిల్‌గా క న్పిస్తోంది. నగరంలో పచ్చదనం మచ్చుకైనా కానరావడం లేదు. మహా నగరాన్ని ఇలా చూస్తామని మేమెప్పుడూ అనుకోలేదని ఎంవీపీ కాలనీకి చెందిన రిటైర్డు ఉద్యోగి సుందర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క గత రెండురోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇటు విద్యుత్ లేక, అటు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.