వానే వనరు... | Rain was the sourse | Sakshi
Sakshi News home page

వానే వనరు...

Published Wed, Apr 20 2016 3:13 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

వానే వనరు...

వానే వనరు...

♦ కాంక్రీట్ జంగిల్‌లో రెండు దశాబ్దాలుగా అదే ఆధారం
♦ వర్షపు నీటి సంరక్షణకు ఆదర్శం... సత్యభూపాల్ కుటుంబం
 
 ఎండలు మండుతున్నాయి. నేలలు నైబారుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి.. జలాశయాలు బీడువారి.. కాంక్రీట్ జంగిల్ గొంతు తడవక గగ్గోలు పెడుతోంది. కుళాయిలున్నా.. బోరులు తవ్వుకున్నా.. చుక్క నీరు లేక సిటీజనుడు విలవిల్లాడుతున్నాడు. కానీ ఈ దాహార్తికి నగరంలోని ఓ ఇల్లు మాత్రం దూరం. ఎప్పుడు కావాలంటే అప్పుడు పుష్కలంగా నీళ్లు... అదీ స్వచ్ఛంగా... నల్లా కనెక్షన్ లేకుండా... రెండు దశాబ్దాలుగా! నమ్మలేకపోయినా ఇది వాస్తవం. ఆ కుటుంబానికి వానే నీటి వనరు. వర్షపు నీటిని ఒడిసిపట్టి... నిల్వచేసి... అన్ని అవసరాలనూ తీర్చుకొంటోంది చంపాపేట గ్రీన్‌పార్క్ కాలనీలో నివసించే సత్యభూపాల్‌రెడ్డి కుటుంబం. సిటీ క‘న్నీటి’ వ్యధల మధ్య ఆ వాన నీటి కథేమిటో మనమూ తెలుసుకొందాం రండి...
 
 సాక్షి, హైదరాబాద్: రీసెర్చ్ ఇన్ ఎన్విరాన్‌మెంట్, ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ (రీడ్స్) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వి.సత్యభూపాల్‌రెడ్డి, తులసి దంపతులది కర్నూలు జిల్లా. పిల్లల చదువులు, జీవనోపాధి కోసం నగరానికి వచ్చి స్థిరపడ్డారు. చంపాపేటలోని గ్రీన్‌పార్క్ కాలనీలో 1989లో సొంతింటిని నిర్మించుకున్నారు. ఆ సమయంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరం నుంచి ఆయన ఇద్దరు కూతుళ్లు అర్ధరాత్రి సైకిల్‌పై వెళ్లి క్యాన్లలో తెచ్చేవారు. ఇంట్లోని బోరుబావిలో నీళ్లు పసుపురంగులో వచ్చేవి. ఇవి తాగలేక... అన్నేసి కిలోమీటర్లు వెళ్లి నీరు తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో భూపాల్‌కు ఓ ఆలోచన వచ్చింది. అదే వాన నీటి సంరక్షణ.

 మూడు దఫాలుగా వడపోత...
 మొదటగా 1995లో 5,400 లీటర్ల సామర్థ్యం గల మూడు సిమెంట్ ట్యాంకులు నిర్మించారు. వీటిలో వాన నీటిని మూడు దఫాలుగా వడపోసి రెండు నెలలపాటు తాగడానికి, వంటకు వాడారు. సిమెంటు ట్యాంకుల్లో అడుగుభాగాన 4 అంగుళాల మందంలో లావు రాళ్లు, దానిపై 40 మిల్లిమీటర్ల సైజు గల కంకర, ఆపై వరుసలో దొడ్డు ఇసుక, దీనిపై మెత్తటి ఇసుక 5 అంగుళాల మందం చొప్పున పోశారు. దీనిపై 5 అంగుళాల ఎత్తు వరకు కట్టె బొగ్గు, 3 అంగుళాల ఎత్తున మెత్తటి ఇసుక, రెండు అంగుళాల ఎత్తు వరకు కంకర నింపారు. పై భాగంలో మిగిలిన ఖాళీ స్థలంలోకి వర్షపు నీటిని నింపుతారు. మొదటి అంతస్తుకు పై కప్పుగా ఉన్న రేకులపై పడిన వర్షపు నీరు.. ప్రత్యేకంగా బిగించిన పైపుల ద్వారా ఈ ట్యాంక్‌లోకి చేరుతుంది. ఇక్కడ ఫిల్టర్ అయిన నీటిని నేలపై ఏర్పాటు చేసిన మూడు ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. వీటి నుంచి రోజువారీ తాగడానికి, వంటకు వినియోగిస్తున్నారు. ‘మేం వినియోగిస్తున్న నీరు సురక్షితమేనా అని చాలా మంది ప్రశ్నించారు. దీంతో నీటిని పరీక్ష చేయించాం. నిర్దేశిత ప్రమాణాల మేరకు నీటిలో లవణాలు, జపాన్ తాగునీటి నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టు ఉన్నట్లు తేలింది’ అని చెప్పారు భూపాల్.  
 
 ఇంటి పెరడు ఇంకుడుగుంత...
 భూపాల్ ఇంటి పెరడు కూడా ఇంకుడు గుంతలా పనిచేస్తుంది. తాగడానికి అవసరమయ్యే నీరు తప్ప మిగిలిన వర్షపు నీరంతా ఆ పెరటిలో ఇంకిపోతుంది. ఇక్కడి మట్టి.. మెత్తగా, వదులుగా ఉంటుంది. చెట్ల ఆకులన్నింటినీ సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. ప్రహరీని ఆనుకుని లోపలివైపు వర్షం నీరు భూమిలోకి ఇంకిపోయేలా... 4 అడుగుల లోతున 4 వరుసల్లో మట్టి ఇటుకలు పేర్చి.. దానిపై ఇసుకను బెడ్‌లా పోశారు. దీంతో వర్షపు నీరంతా బయటికి పోకుండా నేలలోకి ఇంకుతుంది. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో వెయ్యి అడుగుల లోతున నీటి లభ్యత ఉంది. కానీ వీరి ఇంట్లో 90 అడుగుల లోతున్న బోరుబావిలో 60 అడుగుల లోతులో నీరు లభిస్తుండడం విశేషం. ఇల్లు కట్టినప్పుడు 8.5 శాతం ఉన్న ఫ్లోరైడ్... ఇప్పుడు 1.5 శాతానికి తగ్గింది. ఈ పద్ధతిని చూసి 38 మంది శాస్త్రవేత్తలు తమ ఇళ్లలో అమలు చేస్తున్నారు. ‘డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం లేక వాననీటి తాగుతున్నారని చాలామంది ఎగతాళి చేసేవారు’ అని గుర్తుచేసుకున్న సత్యభూపాల్ కుటుంబం ఇప్పుడు నీటి కటకట ఎదుర్కొంటున్న సిటీకి ఆదర్శం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement