రణగొణ ధ్వనులు, రోజువారీ ఉద్యోగం, ఇతర టెన్షన్లతో బిజీ జీవితం గడుపుతున్న నగర, పట్టణ వాసులకు మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులు (అటవీ ఉద్యానవనాలు) సిద్ధ మవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 76 పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణ యించగా, 25 పార్కులు ఇప్పటికే నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ చుట్టూ ఏడు జిల్లాల పరిధిలో ఈ పార్కుల అభివృద్ధి జరుగుతున్నందున ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారి, సంబంధిత శాఖల సమన్వయంతో వీటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటు న్నారు. రాష్ట్ర జనాభాలో మూడోవంతుపైగా హైదరాబాద్‌లో నివసిస్తుండడంతో ప్రధానంగా నగర శివార్ల లోనే అత్యధికంగా అంటే, దాదాపు 50కు పైగా ఇక్కడే అర్బన్ పార్కులు ఏర్పాటవుతున్నాయి. అంతర్జాతీ యంగా ఖ్యాతి పొందుతున్న హైదరాబాద్‌ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో కొన్ని ఇప్పటికే అందుబాటులోకి రాగా, మరో అయిదింటిని సోమవారం మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తున్నారు.
ఈ పార్కులు ఎక్కడెక్కడ...
ఈసీఐఎల్‌కు సమీపంలోని నాగారం ఆరోగ్యవనంలో ఒకటి, ఉప్పల్‌కు దగ్గరలోని నారాపల్లి జఠాయువు అర్బన్ ఫారెస్ట్ పార్క్ రెండోది, యాదాద్రి సమీపంలోని రాయగిరి వద్ద నర్సింహ అరణ్యం మూడోది, చౌటుప్పల్ సమీపంలోని లక్కారం అర్బన్ ఫారెస్ట్ వద్ద నాలుగోది, శంషాబాద్ సమీపంలోని మసీదుగడ్డ వద్ద ఐదో అర్బన్ పార్కు ప్రారంభం కానున్నాయి. హెచ్‌ఎండీఏ పరిధిలో అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్న 59 పార్కులను వీలైనంత త్వరగా దశల వారీగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని, నవంబర్ నెలాఖరు డైడ్‌లైన్‌గా పెట్టుకున్నారు. 59 పార్కులకు సంబంధించిన ప్రత్యేకతలు, సమాచారంతో విడివిడిగా బుక్ లెట్లను ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రతి పార్కులో సహజమైన అటవీ సంపద దెబ్బతినకుండా, సందర్శకులకు తగిన సౌకర్యాలు ఉండేలా తీర్చిదిద్దుతున్నారు.
అందుబాటులోకి అటవీ భూములు
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఇతర నగరాలు, పట్టణాలు క్రమక్రమంగా కాంక్రీట్ జంగళ్లుగా మారుతూ వనాలు, తోటలు, పార్కులు కనుమరుగవుతున్నాయి. హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణ శివార్లలో వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ భూములను ప్రజలకు అందు బాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్, చుట్టుపక్కల హెచ్‌ఎండీఏ, అటవీ శాఖ సంయుక్తంగా అర్బన్ ఫారెస్ట్ బ్లాకులను అభివృద్ధి చేస్తున్నాయి. అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఆహ్లాదకరంగా, అందంగా తీర్చిదిద్దుతుండడంతో ఇప్పటికే ప్రారంభించిన పలు అర్బన్ పార్కుల్లో వారాంతాలు, సెలవు రోజుల్లో ప్రజలు ప్రశాంతంగా గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని పార్కుల్లో వాకింగ్ ట్రాక్, కానోఫి వాక్, పాత్ వే, చిల్డ్రన్ ప్లే ఏరియా వంటి సౌకర్యాలు కూడా కల్పించారు. – సాక్షి, హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్లు
ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు సూక్ష్మ పోషక విలువలపై అవగాహనతోపాటు మధ్యాహ్న భోజనంలోకి తాజా కూరగాయలు అందించవచ్చని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. శనివారం విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్‌కుమార్, ఉద్యానశాఖ సంచాలకులు వెంకట్రామిరెడ్డి తదితరులు సచివాలయంలో సమావేశమయ్యారు. పాఠశాలలు, కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్ల ఆవశ్యకతపై చర్చించి నిర్ణయించిన అనంతరం పలు సూచనలు చేశారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల, కేజీబీవీలో తప్పకుండా కిచెన్ గార్డెన్లు నిర్వహించాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంలో కనీసం 10 శాతంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలన్నారు. స్థలాభావం ఉన్న చోట చిన్నపాటి తొట్లు, కుండీలు కొనుగోలు చేసి ఆ మేరకు నిర్వహణ చేపట్టాలన్నారు. కిచెన్ గార్డెన్ల నిర్వహణలో విద్యార్థులను సైతం భాగస్వామ్యం చేయాలని, దీంతో వారికి ప్రకృతితోపాటు తోటల పెంపకంపై అవగాహన వస్తుందన్నారు. సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాల ప్రతులను జిల్లా విద్యాశాఖ అధికారుల ద్వారా అన్ని పాఠశాలలకు పంపించాలని సూచించారు.
చెట్టుకు పుట్టిన రోజు..
మహబూబాబాద్: ప్రాణ వాయువునిచ్చే చెట్లను పెంచడమే గగనమైన ఈ రోజుల్లో ఓ మొక్కను పెంచడమే గాక దాని జన్మదిన వేడుకలూ జరుపుతూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడో వ్యక్తి. వివరాలు.. మానుకోట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో టీస్టాల్ నిర్వహిస్తున్న గుగులోతు శంకర్ మూడు సంవత్సరాల కింద వేపమొక్కను నాటి, దాన్ని సంరక్షిస్తున్నాడు. ప్రతి ఏడాది ఆ మొక్క జన్మదిన కార్యక్రమంలో దానిని బెలూన్లతో అలంకరించి కేక్ కట్ చేయడాన్ని ఆనవాయితీగా మార్చుకున్నాడు. శనివారం ఆ మొక్క పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ కమిషనర్ బి.ఇంద్రసేనారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొని కేక్ కట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment