Urban Park
-
దుప్పి.. కళ్లుగప్పి
సత్తుపల్లి(ఖమ్మం) : తాళం వేసితిని.. గొళ్లెం మరిచితిని’అన్న చందంగా మారిన అటవీ శాఖాధికారుల వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రూ.1.7 కోట్లతో అర్బన్ పార్కును అభివృద్ధి చేశామని.. వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నా ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి లోపించిందనే ఆరోపణలున్నాయి. సత్తుపల్లిలో అర్బన్ పార్కు ఏర్పాటు ప్రాంతంలో సహజ సిద్ధంగానే దుప్పులు, పునుగులు, కుందేళ్లు, తాబేళ్లు ఉన్నాయి. వీటిని సంరక్షించేందుకు అటవీశాఖ 375 ఎకరాల్లో కంచె, గోడల నిర్మాణం చేపట్టారు. ఇటీవల కొత్తూరు వైపు దుప్పి కంచె దాటుకుని సమీప ఇళ్లల్లోకి వెళ్లగా స్థానికులు పట్టుకుని అటవీశాఖకు అప్పగించారు. మరికొన్ని దుప్పులు కంచె దాటే క్రమంలో తీగలు తగిలి మృత్యువాత పడగా, రేజర్ల గ్రామానికి చెందిన ఒక దుప్పిని హతమార్చి మాంసం విక్రయించడంతో కేసులు నమోదయ్యాయి. గురువారం అర్ధరాత్రి కూడా జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైపు నుంచి దుప్పులు రోడ్లపై పరుగులు తీస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇటీవల పార్కు నిర్వహణ పేరిట రుసుము కూడా వసూలు చేయడం ఆరంభించిన అటవీ అధికారులు వన్య ప్రాణుల సంరక్షణపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. -
తెలంగాణలో అడవులు, పచ్చదనం భేష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అటవీ శాఖ నిబంధనల మేరకు ప్రత్యామ్నాయ అటవీకరణ నిధులను వినియోగిస్తూ మంచి ఫలితాలు రాబడుతోందని నేషనల్ కంపా సీఈవో సుభాష్‌చంద్ర ప్రశంసించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు ప్రస్తుత పట్టణీకరణ పరిస్థితుల్లో చాలా ఉపయోగకరమైన కార్యక్రమమని పేర్కొన్నారు. జాతీయ అటవీ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర పర్యటనలో సుభాష్‌చంద్ర, వివిధ రాష్ట్రాల అటవీ సంరక్షణ ప్రధాన అధికారు (పీసీసీఎఫ్)లు శనివారం క్షేత్ర స్థాయి సందర్శనలో పాల్గొన్నారు. హైదరాబాద్ శివారు కండ్లకోయ అక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్కుతోపాటు, ఔటర్‌రింగ్ రోడ్డు పచ్చదనం, ఎవెన్యూ ప్లాంటేషన్లను పరిశీలించారు. తెలంగాణలో అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపు చాలా బాగుందని మెచ్చుకున్నారు. తెలంగాణ అటవీశాఖ చొరవ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని యూపీ పీసీసీఎఫ్ సంజయ్ శ్రీవాత్సవ అన్నారు. కార్యక్రమంలో మణిపూర్ పీసీసీఎఫ్ ఆదిత్య జోషి, పీసీసీఎఫ్(కంపా) లోకేశ్ జైస్వాల్, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎం.జె. అక్బర్ పాల్గొన్నారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ పర్యాటక రంగాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారని, ఇక్కడ ఎన్నో అద్భుత పర్యాటక ప్రదేశాలున్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టూరిజంలో విశేష సేవలను అందించిన స్టేక్ హోల్డర్లకు టూరిజం ఎక్సలెన్స్ అవార్డులను మంత్రి అందించారు. చదవండి: దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే! అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రపంచస్థాయి గుర్తింపు లభించే పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, సీఎం కేసీఆర్ కృషితో రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాను ఒక టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాళేశ్వరం పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద కేసీఆర్ ఎకో అర్బన్ టూరిజం పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కార్పొరేషన్ ఎండీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘డ్రోన్ డెలివరీ’ అద్భుతం: వరద ప్రాంతాలకు మందులు -
అర్బన్ పార్కుల అభివృద్ధికి కృషి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్బన్ పార్కుల అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా అర్బన్ పార్కుల అభివృద్ధిపై సభ్యులు బాల్క సుమన్, వివేకానందరెడ్డి, సుభాష్‌రెడ్డి, గువ్వల బాలరాజు తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,893 అర్బన్ పార్కులు ఉన్నాయని తెలిపారు. వీటికి అదనంగా ఈ ఏడాది 1,799 పార్కులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించామన్నారు. ఇప్పటివరకు 797 అర్బన్ పార్కులను అభివృద్ధి చేశామని, జీహెచ్ఎంసీలో 587, ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 1,109, హెచ్ఎండీఏ పరిధిలో 103 అర్బన్ పార్కులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించామని తెలిపారు. కొన్నింటిని ట్రీ, ల్యాండ్‌స్కేప్ పార్కులుగా, ఇంకొన్నింటిని అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా, మరికొన్నింటిని పంచతత్వ పార్కులుగా అభివృద్ధి చేస్తామని మంత్రి వివరించారు. గ్రీన్ నిధులు వాడుకోవచ్చు.. చెన్నూరు నియోజకవర్గంలో కాంపా నిధులు, మున్సిపల్ నిధులతో కలిసి సంయుక్తంగా ఒక అర్బన్ లంగ్ స్పేస్ అభివృద్ధి చేయాలని సభ్యుడు బాల్క సుమన్ కోరారని, దాన్ని చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కాంపా నిధులే కాదు, పట్టణ ప్రగతిలో ఏర్పాటు చేసిన గ్రీన్ నిధులు వీటి కోసం వాడుకోవచ్చన్నారు. ‘జీహెచ్ఎంసీ పరిధిలో పార్కుల్లోని ఖాళీ స్థలాల్లో ఓపెన్ జిమ్‌లు పెడుతున్నాం. అక్కడే పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నాం. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేసి వర్షపు నీళ్లు భూమిలోకి ఇంకేలా చేస్తున్నాం. రీ యూజింగ్ ఆఫ్ రీసైక్లింగ్ వాటర్ చేస్తాం. ఆక్సిజన్, నందనవనం తదితర పార్కులు ఏర్పాటు చేశాం. హైకోర్టు సీజే కూడా ఒక పార్కును చూసి చాలా బ్రహ్మాండంగా ఉందన్నారు. హైదరాబాద్ చుట్టూ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. సైక్లింగ్ చేసేవారి కోసం కొండాపూర్‌లో పాలపిట్ట పార్కు ఏర్పాటు చేశాం. మిగతా పార్కుల్లోనూ సైక్లింగ్, స్కేటింగ్‌లు పెడతాం. అచ్చంపేటలో 20 ఎకరాల్లో పార్కులు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో గ్రీన్ కవర్ 29 శాతానికి పెరిగింది. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. పచ్చదనం పెంపులో రాజకీయాలు ఉండవు’అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద అర్బన్ ఎకో పార్కు మహబూబ్‌నగర్ జిల్లాలో 287 ఎకరాల్లో కేసీఆర్ పేరిట మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏర్పాటు చేశారని కేటీఆర్ తెలిపారు. సీఎంను మించిన హరిత ప్రేమికుడు ఎవరూ లేరు.. సీఎం కేసీఆర్‌ను మించిన హరిత ప్రేమికుడు ప్రపంచంలో ఎక్కడా లేరని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘వర్షాకాలం వచ్చిందంటే కోట్ల మొక్కలు నాటాలన్న భావన ఆయనకు వచ్చింది. పట్టణాల విషయంలో సీఎం పట్టుదల వల్ల వెయ్యి నర్సరీలు ఏర్పాటు చేసుకోబోతున్నాం. కొత్త మున్సిపల్ చట్టంలో 10 శాతం బడ్జెట్‌ను గ్రీన్ బడ్జెట్‌గా పెట్టారు. ప్రతీ మున్సిపాలిటీలో పెట్టే బడ్జెట్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ పెడతారు. దీన్ని గ్రీన్ యాక్షన్ ప్లాన్‌గా తీసుకొచ్చారు. చట్టంలో 10 శాతం బడ్జెట్‌ను గ్రీన్ యాక్షన్ ప్లాన్‌గా తీసుకురావడం దేశంలో ఎక్కడా జరగలేదు. రాష్ట్రం రాకముందు ఒక్క నర్సరీ కూడా ఉండేది కాదు. ఇప్పుడు వెయ్యి నర్సరీలు ఏర్పాటు చేసుకోబోతున్నాం’అని పేర్కొన్నారు. -
ప్రాణవాయువు కొనుక్కునే దుస్థితి రావొద్దు: ఇంద్రకరణ్
సాక్షి, హైదరాబాద్: మనుషులకు ప్రాణాధారమైన గాలిని (ఆక్సిజన్) కొనుక్కోవాల్సిన దుస్థితి రాకుండా ఉండేందుకు అడవులను పరిరక్షించుకుని జాగ్రత్త పడాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో అర్బన్‌పార్కు ప్రారంభంతో పాటు వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొ ని మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న అటవీ సంరక్షణ చర్యలతో ప్రజల్లో అవగాహన పెరుగుతోందన్నారు. అడవుల రక్షణ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛమైన గాలి లభించడం గగనమైపోతున్న తరుణంలో ప్రభుత్వం ‘అర్బన్ లంగ్ స్పేస్’పేరుతో రిజర్వ్ ఫారెస్టులను అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఇంద్రకరణ్ తెలిపారు. -
కాంక్రీట్ జంగిల్లో అటవీ వనం!
రణగొణ ధ్వనులు, రోజువారీ ఉద్యోగం, ఇతర టెన్షన్లతో బిజీ జీవితం గడుపుతున్న నగర, పట్టణ వాసులకు మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులు (అటవీ ఉద్యానవనాలు) సిద్ధ మవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 76 పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణ యించగా, 25 పార్కులు ఇప్పటికే నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ చుట్టూ ఏడు జిల్లాల పరిధిలో ఈ పార్కుల అభివృద్ధి జరుగుతున్నందున ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారి, సంబంధిత శాఖల సమన్వయంతో వీటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటు న్నారు. రాష్ట్ర జనాభాలో మూడోవంతుపైగా హైదరాబాద్‌లో నివసిస్తుండడంతో ప్రధానంగా నగర శివార్ల లోనే అత్యధికంగా అంటే, దాదాపు 50కు పైగా ఇక్కడే అర్బన్ పార్కులు ఏర్పాటవుతున్నాయి. అంతర్జాతీ యంగా ఖ్యాతి పొందుతున్న హైదరాబాద్‌ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో కొన్ని ఇప్పటికే అందుబాటులోకి రాగా, మరో అయిదింటిని సోమవారం మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తున్నారు. ఈ పార్కులు ఎక్కడెక్కడ... ఈసీఐఎల్‌కు సమీపంలోని నాగారం ఆరోగ్యవనంలో ఒకటి, ఉప్పల్‌కు దగ్గరలోని నారాపల్లి జఠాయువు అర్బన్ ఫారెస్ట్ పార్క్ రెండోది, యాదాద్రి సమీపంలోని రాయగిరి వద్ద నర్సింహ అరణ్యం మూడోది, చౌటుప్పల్ సమీపంలోని లక్కారం అర్బన్ ఫారెస్ట్ వద్ద నాలుగోది, శంషాబాద్ సమీపంలోని మసీదుగడ్డ వద్ద ఐదో అర్బన్ పార్కు ప్రారంభం కానున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్న 59 పార్కులను వీలైనంత త్వరగా దశల వారీగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని, నవంబర్ నెలాఖరు డైడ్లైన్గా పెట్టుకున్నారు. 59 పార్కులకు సంబంధించిన ప్రత్యేకతలు, సమాచారంతో విడివిడిగా బుక్ లెట్లను ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రతి పార్కులో సహజమైన అటవీ సంపద దెబ్బతినకుండా, సందర్శకులకు తగిన సౌకర్యాలు ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. అందుబాటులోకి అటవీ భూములు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఇతర నగరాలు, పట్టణాలు క్రమక్రమంగా కాంక్రీట్ జంగళ్లుగా మారుతూ వనాలు, తోటలు, పార్కులు కనుమరుగవుతున్నాయి. హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణ శివార్లలో వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ భూములను ప్రజలకు అందు బాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్, చుట్టుపక్కల హెచ్ఎండీఏ, అటవీ శాఖ సంయుక్తంగా అర్బన్ ఫారెస్ట్ బ్లాకులను అభివృద్ధి చేస్తున్నాయి. అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఆహ్లాదకరంగా, అందంగా తీర్చిదిద్దుతుండడంతో ఇప్పటికే ప్రారంభించిన పలు అర్బన్ పార్కుల్లో వారాంతాలు, సెలవు రోజుల్లో ప్రజలు ప్రశాంతంగా గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని పార్కుల్లో వాకింగ్ ట్రాక్, కానోఫి వాక్, పాత్ వే, చిల్డ్రన్ ప్లే ఏరియా వంటి సౌకర్యాలు కూడా కల్పించారు. – సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్లు ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు సూక్ష్మ పోషక విలువలపై అవగాహనతోపాటు మధ్యాహ్న భోజనంలోకి తాజా కూరగాయలు అందించవచ్చని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. శనివారం విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్‌కుమార్, ఉద్యానశాఖ సంచాలకులు వెంకట్రామిరెడ్డి తదితరులు సచివాలయంలో సమావేశమయ్యారు. పాఠశాలలు, కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్ల ఆవశ్యకతపై చర్చించి నిర్ణయించిన అనంతరం పలు సూచనలు చేశారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల, కేజీబీవీలో తప్పకుండా కిచెన్ గార్డెన్లు నిర్వహించాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంలో కనీసం 10 శాతంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలన్నారు. స్థలాభావం ఉన్న చోట చిన్నపాటి తొట్లు, కుండీలు కొనుగోలు చేసి ఆ మేరకు నిర్వహణ చేపట్టాలన్నారు. కిచెన్ గార్డెన్ల నిర్వహణలో విద్యార్థులను సైతం భాగస్వామ్యం చేయాలని, దీంతో వారికి ప్రకృతితోపాటు తోటల పెంపకంపై అవగాహన వస్తుందన్నారు. సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాల ప్రతులను జిల్లా విద్యాశాఖ అధికారుల ద్వారా అన్ని పాఠశాలలకు పంపించాలని సూచించారు. చెట్టుకు పుట్టిన రోజు.. మహబూబాబాద్: ప్రాణ వాయువునిచ్చే చెట్లను పెంచడమే గగనమైన ఈ రోజుల్లో ఓ మొక్కను పెంచడమే గాక దాని జన్మదిన వేడుకలూ జరుపుతూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడో వ్యక్తి. వివరాలు.. మానుకోట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో టీస్టాల్ నిర్వహిస్తున్న గుగులోతు శంకర్ మూడు సంవత్సరాల కింద వేపమొక్కను నాటి, దాన్ని సంరక్షిస్తున్నాడు. ప్రతి ఏడాది ఆ మొక్క జన్మదిన కార్యక్రమంలో దానిని బెలూన్లతో అలంకరించి కేక్ కట్ చేయడాన్ని ఆనవాయితీగా మార్చుకున్నాడు. శనివారం ఆ మొక్క పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ కమిషనర్ బి.ఇంద్రసేనారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొని కేక్ కట్ చేశారు. -
‘అర్బన్ పార్కుల ఏర్పాటుకు ప్రాధాన్యం’
సాక్షి, నిర్మల్ : అటవీశాఖ బ్లాకుల్లో అర్బన్ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, పట్టణ ప్రాంతాలకు సమీపంలోని అటవీ భూముల్లో వీటి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణ శివారు చించోలి (బి) గ్రామ అటవీ ప్రాంతంలో రూ.1.32 కోట్ల వ్యయంతో 60 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గండిరామన్న హరిత వనంను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అటవీ క్షేత్రంలో మొక్కలు నాటారు. హరితవనంలో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్,కానోఫి వాక్, పాత్ వే, చిల్డ్రన్ ప్లే ఏరియాలో కలియ తిరిగారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ...అడవులు క్షీణించడం వల్ల పచ్చదనం తగ్గిపోయి పర్యావరణ సమస్యలు తీవ్రమతున్నాయన్నారు. రాష్ట్రంలో 33% అడవులను పెంచాలనే ఉద్దేశ్యంతో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు 113 కోట్ల మొక్కలు నాటామని, 5వ విడత హరిత హారం కార్యక్రమంలో83 కోట్ల మొక్కలు నాటాలని నిర్ధేశించినట్లు చెప్పారు. నాటిన వాటిలో 85% మొక్కలను సంరక్షించుకునేలా ప్రభుత్వం కఠిన చట్టాలను అమలులోకి తెచ్చిందన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే భాద్యతలను కూడా అధికారులు, ప్రజాప్రతినిదులు తీసుకోలని కోరారు. వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా దాన్ని కాపాడేందుకు మొక్కలను పెంచి భావితరాలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. నగరీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అందించడంతోపాటు ఎకో టూరిజంపై ప్రత్యేక శ్రద్ధ వహించేంచినట్లు వెల్లడించారు. జిల్లా ఎకో పార్కుల్లో 2 కి.మీ నంచి నుంచి 3 కి.మీటర్లలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. బాసర, కడెం, జన్నారం, ఎస్సారెస్పీ, కుంటాల, నిర్మల్ లను టూరిస్ట్ హబ్ లుగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు రూ.1.90 కోట్లతో నిర్మించిన జిల్లా ఎఫ్డీపీటీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అడెల్లి పోచమ్మ ఆలయానికి వచ్చే భక్తుల కోసం కార్తీక వనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చించోలి (బి) వద్ద ఏర్పాటు చేసిన కోతుల పునరావస కేంద్రాన్ని ఆగస్టు 15 ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, పీసీసీఎఫ్ పీకే ఝా, జడ్పీ చైర్ పర్సన్ కే.విజయలక్ష్మి, కలెక్టర్ యం.ప్రశాంతి, ఎస్పీ శశిధర్ రాజు, సీఎఫ్ వినోద్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్, మంచిర్యాల జిల్లా అటవీ శాఖ అధికారి శివానీ డోగ్రా, ఆదిలబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి ప్రభాకర్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, జిల్లా రైతు సమన్వయ సమతి కన్వీనర్ నల్లా వెంకట్రామ్ రెడ్డి ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సొగసు చూడతరమా...
గజ్వేల్ సిద్ధిపేట : గజ్వేల్ అంటే నేడు రాష్ట్రంలో అభివృద్ధికి నమూనా. ఇక్కడి నుంచి సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో అభివృద్ధిలో దూసుకెళుతోంది. అభివృద్ధే కాదు... ఆరోగ్యం, ఆహ్లాదం కూడా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. సీఎం ఆదేశాల మేరకు ఇటీవల దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏకకాలంలో లక్షా116 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. గత 10 నెలల క్రితం రూ.10కోట్ల వ్యయంతో 292.5ఎకరాల్లో ప్రారంభించిన అర్బన్ పార్కు పనులు పూర్తి కావస్తున్నాయి. త్వరలోనే ఈ పార్కును అందుబాటులోకి తెచ్చేందుకు అటవీ శాఖ ముమ్మరంగా శ్రమిస్తోంది. రాష్ట్రంలో ముందెన్నడూ లేనివిధంగా వినూత్న తరహాలో ఈ పార్కులో రాశి వనం, నక్షత్ర వనాలతో పాటు యోగ, ధ్యాన మందిరాలు, ఆటస్థలాలు, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ తదితర కొత్త హంగులను అద్దబోతున్నారు. అదే విధంగా అడవి జంతువుల బొమ్మలు, గజబోన్లతో కొత్త అందాలను సంతరించుకున్నది. నగరానికి ప్రత్యేక ఆకర్షణ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ ప్రాంత రూపురేఖలు మారుస్తానని శపథం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోగా... ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్నారు. ఇప్పటికే వందలాది కోట్లతో రింగు రోడ్డు, ఎడ్యుకేషన్ హబ్, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, డబుల్ బెడ్రూం మోడల్ కాలనీ, వంద పడకల ఆసుపత్రి, ఆడిటోరియం తదితర నిర్మాణాలతో గజ్వేల్ కొత్తరూపును సంతరించుకున్నది. మౌలిక వసతుల కల్పతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని, ఆహ్లాదానికి కూడా పెద్దపీట వేయాలని గట్టిగా విశ్వసించే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటికే పట్టణంలో ఇంటిగేట్రెడ్ ఆఫీస్ క్లాంపెక్స్ నిర్మాణం జరుగుతున్న ప్రదేశం పక్కన హెర్బల్ పార్క్ నిర్మాణానికి ఆదేశాలివ్వగా.. ఆ పార్కు నిర్మాణం కూడా పూర్తయ్యింది. కాకపోతే ఈ పార్కు విశాలంగా లేకపోవడం వల్ల పట్టణ ప్రజల అవసరాలకు సరిపోదని భావించి ‘అర్బన్ పార్కు’ నిర్మాణానికి ఆదేశాలిచ్చారు. ఈ మేరకు అటవీశాఖ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్ అటవీ ప్రాంతంలో గత 10 నెలల క్రితం 292.5 ఎకరాల్లో పనులను సైతం ప్రారంభించింది. అటవీ ప్రాంతంతో కూడుకొని ఉన్న ఈ ప్రదేశంలో స్వచ్ఛమైన గాలి ఉండటమేగాకుండా పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. రాశి మొక్కలు, నక్షత్ర మొక్కలు... పార్కు అంటే చెట్లు, గార్డెనింగే కాకుండా వైవిధ్యంగా ఉండాలని సీఎం సంకల్పించారు. ఎక్కడా లేనివిధంగా ఇక్కడ నిర్మించబోతున్న అర్బన్ పార్కులో రాశి వనం నిర్మించారు. ఇందులో 12 రాశులకు సంబంధించిన చెట్లను నాటి సంరక్షిస్తారు. ఒక్కో రాశికి సంబంధించిన చెట్టు ఒక్కో విభాగంలో దిశలకనుగుణంగా, రాశిఫలాల ఆధారంగా పెంచుతారు. ఆయా రాశులకు సంబంధించిన వ్యక్తులు ఆ చెట్ల వద్దకు వెళ్లి ప్రదక్షిణలు చేయడమేగాకుండా రాశిఫలాల ఆధారంగా సాంప్రదాయబద్ధంగా చేయాల్సిన కార్యక్రమాలను నిర్వహించుకునే అవకాశం కల్పిస్తారు. నక్షత్ర వనం పేరిట మరో ప్రత్యేక నిర్మాణం సైతం ఇక్కడ జరుగుతున్నది. 27 నక్షత్రాలకు సంబంధించిన మొక్కలను ఇక్కడ పెంచుతారు. ఈ చెట్ల వద్ద కూడా ప్రజలు తమ నక్షత్రం ఆధారంగా చేయాల్సిన కార్యక్రమాలను జరుపుకునే వీలుంది. పార్కులో 3 చోట్ల మూడు గజబోన్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక గజబోను వాచ్టవర్గా వాడుకోనున్నారు. యోగ, వ్యాయామం కూడా.. ఈ పార్కులో స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ... యోగ, వ్యాయామం చేసుకునే వసతులను కల్పించనున్నారు. దీంతో పాటు నడకదారులు, సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తారు. వీటన్నింటికీ తోడుగా ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేయడానికి సైతం సంకల్పించారు. పార్కును సందర్శించే వారికోసం ఇక్కడ అన్ని రకాల వసతులను ఏర్పాటు చేయనున్నారు. క్యాంటీన్, బాత్రూమ్లు, టాయిలెట్లను నిర్మించనున్నారు. పార్కులో 9 కిలోమీటర్ల పొడవున సైక్లింగ్, వాకింగ్ చేసుకునేందుకు వీలుగా మట్టి రోడ్లను ఏర్పాటు చేశారు. అంతేగాకుండా 13 ఊట చెరువులు నిర్మించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆగస్టు 1న చేపట్టిన లక్షా116 మొక్కలు నాటే కార్యక్రమంలో ఇందులో ఉన్న అటవీ ప్రాంతానికి మరింత వన్నె తెచ్చేందుకు 40వేల వేప, రావి, జువ్వి, మర్రి, ఇరికి తదితర అటవీ జాతి మొక్కలు నాటారు. పార్కు చుట్టూ నాలుగున్నర కిలోమీటర్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం పూర్తి కాగా... మరో 3 కిలోమీటర్లు చేయాల్సి ఉంది. ముందు భాగంలో 1100 మీటర్ల ప్రహరీ నిర్మాణం జరిగింది. సహజత్వం ఉట్టిపడేలా బొమ్మలు ఈ పార్కులో ప్రతి నిర్మాణం సహజత్వం ఉట్టిపడేలా కర్రలు, చెట్లను తలపించే విధంగా కాంక్రీటు నిర్మాణాలు జరుగుతున్నాయి. పార్కు ముఖద్వారంలో ఏర్పాటు చేసిన ఎలుగుబంటి, చిరుతపులి, హైనా, జింక, తోడేలు, కోతులు తదితర అడవి జంతువుల బొమ్మలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దాదాపుగా పనులు పూర్తి కావస్తున్న ఈ పార్కును త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభింపజేయడానికి అటవీశాఖ సన్నాహాలు చేస్తోంది. అర్బన్ పార్కు గజ్వేల్‌కు వరం గజ్వేల్‌లో వినూత్న తరహాలో నిర్మించిన అర్బన్ పార్కు ఈ ప్రాంతానికి వరం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఈ పార్కును అందంగా తీర్చిదిద్దాం. త్వరలోనే పనులు పూర్తికానున్నాయి. ఇంకా ఈ పార్కులో ఏర్పాటు చేయాల్సిన వసతులపై ఆలోచన జరుగుతోంది. ఈ పార్కు ద్వారా పట్టణానికి కొత్త శోభ రావడమేగాకుండా ఆరోగ్యం, ఆహ్లాదం అందనుంది. – వెంకట రామారావు, గజ్వేల్ రేంజ్ అటవీ శాఖ అధికారి -
2 గంటలు.. 5 కిలోమీటర్లు..
సిద్దిపేట జోన్: ఉదయం ఆరు గంటల సమయం.. ఇంకా చీకటి తెరలు తొలగిపోలేదు.. అంతలో మూడు వాహనాలు రాజీవ్ రహదారి పక్కన ఉన్న చెట్ల మధ్యకు దూసుకెళ్లాయి. వాహనంలో నుంచి దిగిన నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అక్కడి నుంచి 2 గంటల పాటు 5 కిలోమీటర్ల మేర కాలినడకన ముందుకు సాగారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట పట్టణం నాగులబండ శివారులో ఏర్పాటు చేస్తున్న అర్బన్ పార్క్‌ను పరిశీలించారు. నిధుల అవసరం, మొక్కల పెంపకంపై ఆయన వెంట వెంటనున్న డీఎఫ్‌వో శ్రీధర్‌రావును అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ పార్క్, అర్బన్ పార్క్ పనులపై ఆరా తీశారు. -
రాష్ట్రపతి నిలయంలో ‘హరితహారం’!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయ ప్రాంగణాన్ని పర్యావరణ సమతుల్య సముదాయంగా మార్చేందుకు రాష్ట్ర అటవీ శాఖ కసరత్తు చేస్తోంది. కాలానుగుణంగా పుష్పించే మొక్కలు, ఔషధ వృక్షజాతులు, పొదలు, గుల్మాలతో ప్రకృతి రమణీయత ఉట్టిపడే తోటల సమాహారంగా తీర్చిదిద్దేందుకు సమాయత్తం అవుతోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్వయంగా రాష్ట్రపతి నిలయం హరిత రక్షణ బాధ్యతలు తీసుకోవాలని కోరటంతో.. అందుకు అనుగుణంగా పనుల్లో నిమగ్నమైంది. ఈ మేరకు అటవీ సంరక్షణ ప్రధానాధికారి పీకే ఝా.. అటవీ శాఖ అధికారులతో కలసి రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించి అక్కడ నాటాల్సిన మొక్కలపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పర్యవేక్షణ కోసం మేడ్చల్ డీఎఫ్ఓ సుధాకర్‌రెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమించనున్నారు. హరితహారానికి ప్రశంస ఇటీవల హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రంలో జరుగుతున్న హరితహారం పథకాన్ని పరిశీలించారు. అర్బన్ పార్కుల ఏర్పాటు లో అటవీ శాఖ కీలకంగా పని చేసిందని ప్రశంసించారు. అనంతరం ఆయనే స్వయంగా అటవీ శాఖ అధికారులను పిలిపించుకుని రాష్ట్రపతి నిలయం హరిత సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని కోరారు. ఇదే విషయాన్ని పీకే ఝా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో అధికారులు కార్యాచరణకు సిద్ధమయ్యారు. -
పట్టణాల్లో పచ్చపచ్చగా..
- అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం - రాష్ట్రవ్యాప్తంగా 80 పార్కులు.. హైదరాబాద్ పరిధిలో 14 ఏర్పాటు - ఇప్పటికే పూర్తయిన 12 పార్కులు, అభివృద్ధి దశలో మరో 24 సాక్షి, హైదరాబాద్: పట్టణాల్లో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో, ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్‌తోపాటు అన్ని పట్టణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే పార్కులను అటవీ శాఖ ఆధ్వర్యంలో తీర్చిదిద్దుతోంది. పట్టణాలకు దగ్గర్లో ఉండే అటవీ భూములను గుర్తించి వాటిలో కొంత భాగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ గతంలోనే ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్కుల అభివృద్ధికి అటవీ శాఖ కృషి చేస్తోంది. హైదరాబాద్ పరిధిలో 14 పార్కులు..: రాజధాని పరిధిలో ఔటర్‌కు లోపల, వెలుపల మొత్తం 14 ప్రాంతాలను అర్బన్ పార్కులుగా మార్చేందుకు అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గుర్రంగూడ, కండ్లకోయ, మేడ్చల్, దూలపల్లి, గాజుల రామారం తదితర ప్రాంతాల్లో ఉన్న అటవీ బ్లాకుల్లో పార్కుల అభివృద్ధి జరుగుతోంది. 14 ప్రాంతాల్లో మొత్తం 3,345 హెక్టార్ల అటవీ భూమిని పార్కుల అభివృద్ధికి గుర్తించారు. గుర్రంగూడ సంజీవని పార్క్, అజీజ్ నగర్ దగ్గర మృగవని నేషనల్ పార్క్, కండ్లకోయ నేచర్ పార్క్, శంషాబాద్ సమీపంలో డోమ్ నేర్ పార్క్, ఘట్ కేసర్ సమీపంలోని భాగ్య నగర్ సందనవనం పార్కులు ఇప్పటికే పూర్తయి పెద్ద సంఖ్యలో స్థానికులను, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే అభివృద్ధి చేసిన పలు పార్కుల్లో కాటేజీలను కూడా అటవీ శాఖ ఏర్పాటు చేసింది. దీంతో ఎకో టూరిజానికి అవకాశాలు పెరిగాయి. ఒక్కో పార్కు.. ఒక్కో థీమ్‌తో..: ఒక్కో పార్కును ఒక్కో థీమ్‌తో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 80 అర్బన్ పార్కుల ఏర్పాటు లక్ష్యంగా పని చేస్తున్న అటవీ శాఖ.. ఇప్పటికే 24 పార్కులను అభివృద్ధి చేసేందుకు ఫారెస్ట్ బ్లాకులను గుర్తించింది. ఇందుకు రూ.25 కోట్ల నిధుల కేటాయింపు కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం వీటి అభివృద్ధి వివిధ దశల్లో ఉంది. 12 పార్కులు ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అద్భుతంగా పని చేస్తున్న అటవీ శాఖ: కేటీఆర్ హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి చేసిన పార్కులు, వాటి ప్రత్యేకతలను మున్సిపల్ మంత్రి కేటీఆర్ ట్వీటర్ ద్వారా వెల్లడించారు. మంత్రి జోగు రామన్న నేతృత్వంలో అటవీ శాఖ అద్భుతంగా పని చేస్తోందని కొనియాడారు. దీనిపై స్పందించిన మంత్రి జోగు రామన్న, కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ అభినందనలు అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి మరింత స్ఫూర్తిని కలిగించాయని, మిగతా పార్కులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో 33 శాతం పచ్చదనం సాధనే లక్ష్యంగా అటవీ శాఖ పని చేస్తోందని తెలిపారు.