సాక్షి, నిర్మల్ : అటవీశాఖ బ్లాకుల్లో అర్బన్ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, పట్టణ ప్రాంతాలకు సమీపంలోని అటవీ భూముల్లో వీటి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణ శివారు చించోలి (బి) గ్రామ అటవీ ప్రాంతంలో రూ.1.32 కోట్ల వ్యయంతో 60 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గండిరామన్న హరిత వనంను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అటవీ క్షేత్రంలో మొక్కలు నాటారు. హరితవనంలో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్,కానోఫి వాక్, పాత్ వే, చిల్డ్రన్ ప్లే ఏరియాలో కలియ తిరిగారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ...అడవులు క్షీణించడం వల్ల పచ్చదనం తగ్గిపోయి పర్యావరణ సమస్యలు తీవ్రమతున్నాయన్నారు.
రాష్ట్రంలో 33% అడవులను పెంచాలనే ఉద్దేశ్యంతో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు 113 కోట్ల మొక్కలు నాటామని, 5వ విడత హరిత హారం కార్యక్రమంలో83 కోట్ల మొక్కలు నాటాలని నిర్ధేశించినట్లు చెప్పారు. నాటిన వాటిలో 85% మొక్కలను సంరక్షించుకునేలా ప్రభుత్వం కఠిన చట్టాలను అమలులోకి తెచ్చిందన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే భాద్యతలను కూడా అధికారులు, ప్రజాప్రతినిదులు తీసుకోలని కోరారు. వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా దాన్ని కాపాడేందుకు మొక్కలను పెంచి భావితరాలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.
నగరీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అందించడంతోపాటు ఎకో టూరిజంపై ప్రత్యేక శ్రద్ధ వహించేంచినట్లు వెల్లడించారు. జిల్లా ఎకో పార్కుల్లో
2 కి.మీ నంచి నుంచి 3 కి.మీటర్లలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. బాసర, కడెం, జన్నారం, ఎస్సారెస్పీ, కుంటాల, నిర్మల్ లను టూరిస్ట్ హబ్ లుగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు రూ.1.90 కోట్లతో నిర్మించిన జిల్లా ఎఫ్‌డీపీటీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.
అడెల్లి పోచమ్మ ఆలయానికి వచ్చే భక్తుల కోసం కార్తీక వనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చించోలి (బి) వద్ద ఏర్పాటు చేసిన కోతుల పునరావస కేంద్రాన్ని ఆగస్టు 15 ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, పీసీసీఎఫ్ పీకే ఝా, జడ్పీ చైర్ పర్సన్ కే.విజయలక్ష్మి, కలెక్టర్ యం.ప్రశాంతి, ఎస్పీ శశిధర్ రాజు, సీఎఫ్ వినోద్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్, మంచిర్యాల జిల్లా అటవీ శాఖ అధికారి శివానీ డోగ్రా, ఆదిలబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి ప్రభాకర్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, జిల్లా రైతు సమన్వయ సమతి కన్వీనర్ నల్లా వెంకట్రామ్ రెడ్డి ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment