సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయ ప్రాంగణాన్ని పర్యావరణ సమతుల్య సముదాయంగా మార్చేందుకు రాష్ట్ర అటవీ శాఖ కసరత్తు చేస్తోంది. కాలానుగుణంగా పుష్పించే మొక్కలు, ఔషధ వృక్షజాతులు, పొదలు, గుల్మాలతో ప్రకృతి రమణీయత ఉట్టిపడే తోటల సమాహారంగా తీర్చిదిద్దేందుకు సమాయత్తం అవుతోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్వయంగా రాష్ట్రపతి నిలయం హరిత రక్షణ బాధ్యతలు తీసుకోవాలని కోరటంతో.. అందుకు అనుగుణంగా పనుల్లో నిమగ్నమైంది. ఈ మేరకు అటవీ సంరక్షణ ప్రధానాధికారి పీకే ఝా.. అటవీ శాఖ అధికారులతో కలసి రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించి అక్కడ నాటాల్సిన మొక్కలపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పర్యవేక్షణ కోసం మేడ్చల్ డీఎఫ్‌ఓ సుధాకర్‌రెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమించనున్నారు.
హరితహారానికి ప్రశంస
ఇటీవల హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రంలో జరుగుతున్న హరితహారం పథకాన్ని పరిశీలించారు. అర్బన్ పార్కుల ఏర్పాటు లో అటవీ శాఖ కీలకంగా పని చేసిందని ప్రశంసించారు. అనంతరం ఆయనే స్వయంగా అటవీ శాఖ అధికారులను పిలిపించుకుని రాష్ట్రపతి నిలయం హరిత సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని కోరారు. ఇదే విషయాన్ని పీకే ఝా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో అధికారులు కార్యాచరణకు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment