అర్బన్‌ పార్కుల అభివృద్ధికి కృషి | KTR Says We Efforts For The Development Of Urban Parks | Sakshi
Sakshi News home page

అర్బన్‌ పార్కుల అభివృద్ధికి కృషి

Published Wed, Sep 16 2020 3:35 AM | Last Updated on Wed, Sep 16 2020 3:35 AM

KTR Says We Efforts For The Development Of Urban Parks - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అర్బన్‌ పార్కుల అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా అర్బన్‌ పార్కుల అభివృద్ధిపై సభ్యులు బాల్క సుమన్, వివేకానందరెడ్డి, సుభాష్‌రెడ్డి, గువ్వల బాలరాజు తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,893 అర్బన్‌ పార్కులు ఉన్నాయని తెలిపారు. వీటికి అదనంగా ఈ ఏడాది 1,799 పార్కులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించామన్నారు. ఇప్పటివరకు 797 అర్బన్‌ పార్కులను అభివృద్ధి చేశామని, జీహెచ్‌ఎంసీలో 587, ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 1,109, హెచ్‌ఎండీఏ పరిధిలో 103 అర్బన్‌ పార్కులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించామని తెలిపారు. కొన్నింటిని ట్రీ, ల్యాండ్‌స్కేప్‌ పార్కులుగా, ఇంకొన్నింటిని అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులుగా, మరికొన్నింటిని పంచతత్వ పార్కులుగా అభివృద్ధి చేస్తామని మంత్రి వివరించారు.
 
గ్రీన్‌ నిధులు వాడుకోవచ్చు.. 
చెన్నూరు నియోజకవర్గంలో కాంపా నిధులు, మున్సిపల్‌ నిధులతో కలిసి సంయుక్తంగా ఒక అర్బన్‌ లంగ్‌ స్పేస్‌ అభివృద్ధి చేయాలని సభ్యుడు బాల్క సుమన్‌ కోరారని, దాన్ని చేస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కాంపా నిధులే కాదు, పట్టణ ప్రగతిలో ఏర్పాటు చేసిన గ్రీన్‌ నిధులు వీటి కోసం వాడుకోవచ్చన్నారు. ‘జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్కుల్లోని ఖాళీ స్థలాల్లో ఓపెన్‌ జిమ్‌లు పెడుతున్నాం. అక్కడే పబ్లిక్‌ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నాం. రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ ఏర్పాటు చేసి వర్షపు నీళ్లు భూమిలోకి ఇంకేలా చేస్తున్నాం. రీ యూజింగ్‌ ఆఫ్‌ రీసైక్లింగ్‌ వాటర్‌ చేస్తాం. ఆక్సిజన్, నందనవనం తదితర పార్కులు ఏర్పాటు చేశాం. హైకోర్టు సీజే కూడా ఒక పార్కును చూసి చాలా బ్రహ్మాండంగా ఉందన్నారు. హైదరాబాద్‌ చుట్టూ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. సైక్లింగ్‌ చేసేవారి కోసం కొండాపూర్‌లో పాలపిట్ట పార్కు ఏర్పాటు చేశాం. మిగతా పార్కుల్లోనూ సైక్లింగ్, స్కేటింగ్‌లు పెడతాం. అచ్చంపేటలో 20 ఎకరాల్లో పార్కులు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో గ్రీన్‌ కవర్‌ 29 శాతానికి పెరిగింది. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. పచ్చదనం పెంపులో రాజకీయాలు ఉండవు’అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద అర్బన్‌ ఎకో పార్కు మహబూబ్‌నగర్‌ జిల్లాలో 287 ఎకరాల్లో కేసీఆర్‌ పేరిట మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఏర్పాటు చేశారని కేటీఆర్‌ తెలిపారు.   

సీఎంను మించిన హరిత ప్రేమికుడు ఎవరూ లేరు..  
సీఎం కేసీఆర్‌ను మించిన హరిత ప్రేమికుడు ప్రపంచంలో ఎక్కడా లేరని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘వర్షాకాలం వచ్చిందంటే కోట్ల మొక్కలు నాటాలన్న భావన ఆయనకు వచ్చింది. పట్టణాల విషయంలో సీఎం పట్టుదల వల్ల వెయ్యి నర్సరీలు ఏర్పాటు చేసుకోబోతున్నాం. కొత్త మున్సిపల్‌ చట్టంలో 10 శాతం బడ్జెట్‌ను గ్రీన్‌ బడ్జెట్‌గా పెట్టారు. ప్రతీ మున్సిపాలిటీలో పెట్టే బడ్జెట్‌లో 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ పెడతారు. దీన్ని గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌గా తీసుకొచ్చారు. చట్టంలో 10 శాతం బడ్జెట్‌ను గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌గా తీసుకురావడం దేశంలో ఎక్కడా జరగలేదు. రాష్ట్రం రాకముందు ఒక్క నర్సరీ కూడా ఉండేది కాదు. ఇప్పుడు వెయ్యి నర్సరీలు ఏర్పాటు చేసుకోబోతున్నాం’అని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement