తెలంగాణ మున్సిపల్ , ఐటీ శాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సమయం మరికాస్త దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. శాసనసభలో ఆయన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి జవాబు ఇచ్చిన తర్వాత పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి అభినందించారు. ఆ నేపధ్యంలో కేటీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారేమోనని ఆ పార్టీలో చర్చలు సాగుతున్నాయి. ఒకటి, రెండు ఆంగ్ల పత్రికలు సైతం ఆ కోణంలో విశ్లేషణలు ఇచ్చాయి.
ఈ ఏడాది డిసెంబర్‌లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లోగానే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? లేక వచ్చే ఎన్నికలలో గెలిస్తే సీఎం అవుతారా? అన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగే చర్చకు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు జవాబు ఇస్తారు. కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబు ఇవ్వకుండా కేటీఆర్‌తో మాట్లాడించారు. గతంలో ఎన్నడూ ఇలా జరిగిన సందర్భం లేదు. ఎప్పుడైనా అరుదుగా ఉంటే, ఉందేమో తెలియదు కానీ.. ముఖ్యమంత్రులు ఈ జవాబు ఇవ్వడాన్ని ప్రతిష్టగా తీసుకుంటారు. తద్వారా తన ప్రభుత్వ విజయాలను చెప్పుకోవడానికి దీనిని ఒక అవకాశంగా భావిస్తారు. గత సంవత్సరం అసలు గవర్నర్ ప్రసంగం లేదు కనుక సమాధానం ఇవ్వాల్సిన అవసరం రాలేదు. అయినా ఆయా సమయాలలో కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగాలు చేశారు.
ఈసారి గవర్నర్ తమిళిసైకి, కేసీఆర్‌కు మధ్య విబేధాలు బాగా పెరగడం, చివరికి బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం ఇవ్వకుండా నిలపడం, ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడం, తదుపరి రెండు వర్గాలు రాజీపడటం జరిగాయి. ఆ తర్వాత గవర్నర్‌ను కేసీఆర్ సగౌరవంగానే ఆహ్వానించి, స్పీచ్ తర్వాత మర్యాదగానే వీడ్కోలు పలికారు. గవర్నర్ కూడా స్పీచ్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కానీ, ఇప్పుడు కేసీఆర్ కాకుండా కేటీఆర్ సంబంధిత తీర్మానంపై జవాబు ఇవ్వడం సహజంగానే చర్చకు దారి తీస్తుంది. కేసీఆర్‌కు ఈ అంశంపై సభలో మాట్లాడడం ఇష్టం లేదని, అందువల్లే కేటీఆర్‌కు అవకాశం ఇచ్చారని కొందరు అంటున్నారు. ఒకవేళ సీఎం ప్రసంగించకపోతే, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి మాట్లాడవచ్చు. లేదా ఆర్ధిక మంత్రి, సీనియర్ అయిన హరీష్ రావుకు అప్పగించవచ్చు. కానీ.. కేటీఆర్‌తో మాట్లాడించడం ద్వారా కాబోయే సీఎం ఆయనే.. అన్న సంకేతాన్ని బలంగా ఇప్పించినట్లు అనుకోవచ్చు.
ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా ఇచ్చి పార్టీ పగ్గాలు ఇచ్చారు. పార్టీలో ఆయనకు పెద్దగా పోటీ లేకుండా వాతావరణం ఏర్పాటు చేశారు. కేటీఆర్ కూడా సమర్ధంగానే డీల్ చేస్తుంటారు. ప్రత్యేకించి తెలుగుతో పాటు, ఆంగ్లం, హిందీలలో అనర్గళంగా మాట్లాడగలరు. కేసీఆర్ కుటుంబానికి ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కేటీఆర్ తమది కుటుంబ పాలన అంటూ, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబం అని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఒక చిక్కు ఉంది. ప్రత్యర్దులు ఇకపై కేటీఆర్ తమది కుటుంబ పాలన అని ఒప్పుకున్నారు అనే వరకే తీసుకుని ప్రచారం చేసే అవకాశం ఉంది. అది వేరే విషయం. కేటీఆర్ తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ అబివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించడంతో పాటు, ప్రధాని మోడీపై, పారిశ్రామికవేత్త ఆదానీలపైన కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశం అంటే మోదీ, అదానీలేనా అని ప్రశ్నల వర్షం కురిపించారు.
బీజేపీపై ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ దాడి చేస్తున్న నేపథ్యంలో సహజంగానే కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. కాగా, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీతో సంవాదం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి బీఆర్ఎస్, ఎంఐఎంలు మిత్రపక్షాలుగానే ఉన్నాయి. 19 మంది ఉన్న కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రతిపక్షనేత హోదాను బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది. ఆయా ఎన్నికలలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ రెండు పార్టీలు సహకరించుకుంటుంటాయి. అలాంటిది వచ్చే ఎన్నికలలో 50 సీట్లలో పోటీచేస్తామని, పదిహేను సీట్లతో శాసనసభలోకి వస్తామని అక్బర్ చెప్పినా అది నమ్మశక్యంగా లేదు. ఎంఐఎంకు హైదరాబాద్‌లో అది కూడా పాతబస్తీలోని ఏడు సీట్లలో తప్ప, మిగిలిన చోట్ల పెద్దగా బలం లేదు. కాకపోతే, ఆయా నియోజకవర్గాలలో కొంతమేర ఆ పార్టీకి ఓటర్లు ఉన్నారు. ఒకవేళ 50 సీట్లలో పోటీచేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న చర్చ కూడా జరుగుతోంది. కానీ, ఈ పరిణామానికి పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అంగీకరించవలసి ఉంటుంది.
కేసీఆర్, అసద్‌ల మధ్య మంచి రాజకీయ ఈక్వేషన్ ఉంది. అసలు అక్బర్ విద్వేష ప్రసంగం కేసు నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఎంతగా సాయపడిందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య వివాదం వస్తుందా అన్నది సందేహమే. పైకి ఇలా మాట్లాడినా.. లోపల అంతా బాగానే ఉండవచ్చన్న అభిప్రాయం ఉంది. అందువల్లే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉందని కొందరు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకన్నా ఎంఐఎం పార్టీనే ప్రతిపక్షం అన్న భావన కల్పించడం ఇందులోని అంతరార్ధం కావచ్చేమో. కేసీఆర్ దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభివృద్దికి పర్యటించాలని భావిస్తున్నారు. ఒకవేళ కేంద్రానికి ఆయన వెళ్లాలనుకుంటే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కేటీఆర్ తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారని అనుకోవచ్చు. వచ్చే శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిస్తే ఈ పరిణామం జరగడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు.
- హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్.
Comments
Please login to add a commentAdd a comment