ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రహదారులపై షికారు చేస్తున్న దుప్పులు
సత్తుపల్లి(ఖమ్మం) : తాళం వేసితిని.. గొళ్లెం మరిచితిని’అన్న చందంగా మారిన అటవీ శాఖాధికారుల వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రూ.1.7 కోట్లతో అర్బన్ పార్కును అభివృద్ధి చేశామని.. వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నా ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి లోపించిందనే ఆరోపణలున్నాయి. సత్తుపల్లిలో అర్బన్ పార్కు ఏర్పాటు ప్రాంతంలో సహజ సిద్ధంగానే దుప్పులు, పునుగులు, కుందేళ్లు, తాబేళ్లు ఉన్నాయి. వీటిని సంరక్షించేందుకు అటవీశాఖ 375 ఎకరాల్లో కంచె, గోడల నిర్మాణం చేపట్టారు.
ఇటీవల కొత్తూరు వైపు దుప్పి కంచె దాటుకుని సమీప ఇళ్లల్లోకి వెళ్లగా స్థానికులు పట్టుకుని అటవీశాఖకు అప్పగించారు. మరికొన్ని దుప్పులు కంచె దాటే క్రమంలో తీగలు తగిలి మృత్యువాత పడగా, రేజర్ల గ్రామానికి చెందిన ఒక దుప్పిని హతమార్చి మాంసం విక్రయించడంతో కేసులు నమోదయ్యాయి. గురువారం అర్ధరాత్రి కూడా జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైపు నుంచి దుప్పులు రోడ్లపై పరుగులు తీస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇటీవల పార్కు నిర్వహణ పేరిట రుసుము కూడా వసూలు చేయడం ఆరంభించిన అటవీ అధికారులు వన్య ప్రాణుల సంరక్షణపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment