సొగసు చూడతరమా... | Urban Park In KCR Constituency | Sakshi
Sakshi News home page

సొగసు చూడతరమా...   

Published Fri, Aug 31 2018 11:20 AM | Last Updated on Fri, Aug 31 2018 11:20 AM

Urban Park In KCR Constituency - Sakshi

గజ్వేల్‌ సిద్ధిపేట : గజ్వేల్‌ అంటే నేడు రాష్ట్రంలో అభివృద్ధికి నమూనా. ఇక్కడి నుంచి సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో అభివృద్ధిలో దూసుకెళుతోంది. అభివృద్ధే కాదు... ఆరోగ్యం, ఆహ్లాదం కూడా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించారు. సీఎం ఆదేశాల మేరకు ఇటీవల దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏకకాలంలో లక్షా116 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. గత 10 నెలల క్రితం రూ.10కోట్ల వ్యయంతో 292.5ఎకరాల్లో ప్రారంభించిన అర్బన్‌ పార్కు పనులు పూర్తి కావస్తున్నాయి.

త్వరలోనే ఈ పార్కును అందుబాటులోకి తెచ్చేందుకు అటవీ శాఖ ముమ్మరంగా శ్రమిస్తోంది. రాష్ట్రంలో ముందెన్నడూ లేనివిధంగా వినూత్న తరహాలో ఈ పార్కులో రాశి వనం, నక్షత్ర వనాలతో పాటు యోగ, ధ్యాన మందిరాలు, ఆటస్థలాలు, సైక్లింగ్‌ ట్రాక్, వాకింగ్‌ ట్రాక్‌ తదితర కొత్త హంగులను అద్దబోతున్నారు. అదే విధంగా అడవి జంతువుల బొమ్మలు, గజబోన్లతో కొత్త అందాలను సంతరించుకున్నది.  

నగరానికి ప్రత్యేక ఆకర్షణ  

తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ ప్రాంత రూపురేఖలు మారుస్తానని శపథం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోగా... ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్నారు. ఇప్పటికే వందలాది కోట్లతో రింగు రోడ్డు, ఎడ్యుకేషన్‌ హబ్, ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్, డబుల్‌ బెడ్‌రూం మోడల్‌ కాలనీ, వంద పడకల ఆసుపత్రి, ఆడిటోరియం తదితర నిర్మాణాలతో గజ్వేల్‌ కొత్తరూపును సంతరించుకున్నది.

మౌలిక వసతుల కల్పతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని, ఆహ్లాదానికి కూడా పెద్దపీట వేయాలని గట్టిగా విశ్వసించే ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇప్పటికే పట్టణంలో ఇంటిగేట్రెడ్‌ ఆఫీస్‌ క్లాంపెక్స్‌ నిర్మాణం జరుగుతున్న ప్రదేశం పక్కన హెర్బల్‌ పార్క్‌ నిర్మాణానికి ఆదేశాలివ్వగా.. ఆ పార్కు నిర్మాణం కూడా పూర్తయ్యింది. కాకపోతే ఈ పార్కు విశాలంగా లేకపోవడం వల్ల పట్టణ ప్రజల అవసరాలకు సరిపోదని భావించి ‘అర్బన్‌ పార్కు’ నిర్మాణానికి ఆదేశాలిచ్చారు.

ఈ మేరకు అటవీశాఖ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్‌ అటవీ ప్రాంతంలో గత 10 నెలల క్రితం 292.5 ఎకరాల్లో పనులను సైతం ప్రారంభించింది. అటవీ ప్రాంతంతో కూడుకొని ఉన్న ఈ ప్రదేశంలో స్వచ్ఛమైన గాలి ఉండటమేగాకుండా పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఈ స్థలాన్ని ఎంపిక చేశారు.  

రాశి మొక్కలు, నక్షత్ర మొక్కలు...  

పార్కు అంటే చెట్లు, గార్డెనింగే కాకుండా వైవిధ్యంగా ఉండాలని సీఎం సంకల్పించారు. ఎక్కడా లేనివిధంగా ఇక్కడ నిర్మించబోతున్న అర్బన్‌ పార్కులో రాశి వనం నిర్మించారు. ఇందులో 12 రాశులకు సంబంధించిన చెట్లను నాటి సంరక్షిస్తారు. ఒక్కో రాశికి సంబంధించిన చెట్టు ఒక్కో విభాగంలో దిశలకనుగుణంగా, రాశిఫలాల ఆధారంగా పెంచుతారు. ఆయా రాశులకు సంబంధించిన వ్యక్తులు ఆ చెట్ల వద్దకు వెళ్లి ప్రదక్షిణలు చేయడమేగాకుండా రాశిఫలాల ఆధారంగా సాంప్రదాయబద్ధంగా చేయాల్సిన కార్యక్రమాలను నిర్వహించుకునే అవకాశం కల్పిస్తారు.

నక్షత్ర వనం పేరిట మరో ప్రత్యేక నిర్మాణం సైతం ఇక్కడ జరుగుతున్నది. 27 నక్షత్రాలకు సంబంధించిన మొక్కలను ఇక్కడ పెంచుతారు. ఈ చెట్ల వద్ద కూడా ప్రజలు తమ నక్షత్రం ఆధారంగా చేయాల్సిన కార్యక్రమాలను జరుపుకునే వీలుంది. పార్కులో 3 చోట్ల మూడు గజబోన్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక గజబోను వాచ్‌టవర్‌గా వాడుకోనున్నారు.  

యోగ, వ్యాయామం కూడా..  

ఈ పార్కులో స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ... యోగ, వ్యాయామం చేసుకునే వసతులను కల్పించనున్నారు. దీంతో పాటు నడకదారులు, సైక్లింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తారు. వీటన్నింటికీ తోడుగా ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేయడానికి సైతం సంకల్పించారు. పార్కును సందర్శించే వారికోసం ఇక్కడ అన్ని రకాల వసతులను ఏర్పాటు చేయనున్నారు.

క్యాంటీన్, బాత్‌రూమ్‌లు, టాయిలెట్లను నిర్మించనున్నారు. పార్కులో 9 కిలోమీటర్ల పొడవున సైక్లింగ్, వాకింగ్‌ చేసుకునేందుకు వీలుగా మట్టి రోడ్లను ఏర్పాటు చేశారు. అంతేగాకుండా 13 ఊట చెరువులు నిర్మించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ఆగస్టు 1న చేపట్టిన లక్షా116 మొక్కలు నాటే కార్యక్రమంలో ఇందులో ఉన్న అటవీ ప్రాంతానికి మరింత వన్నె తెచ్చేందుకు 40వేల వేప, రావి, జువ్వి, మర్రి, ఇరికి తదితర అటవీ జాతి మొక్కలు నాటారు. పార్కు చుట్టూ నాలుగున్నర కిలోమీటర్ల ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడం పూర్తి కాగా... మరో 3 కిలోమీటర్లు చేయాల్సి ఉంది. ముందు భాగంలో 1100 మీటర్ల ప్రహరీ నిర్మాణం జరిగింది.  

సహజత్వం ఉట్టిపడేలా బొమ్మలు  

ఈ పార్కులో ప్రతి నిర్మాణం సహజత్వం ఉట్టిపడేలా కర్రలు, చెట్లను తలపించే విధంగా కాంక్రీటు నిర్మాణాలు జరుగుతున్నాయి. పార్కు ముఖద్వారంలో ఏర్పాటు చేసిన ఎలుగుబంటి, చిరుతపులి, హైనా, జింక, తోడేలు, కోతులు తదితర అడవి జంతువుల బొమ్మలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దాదాపుగా పనులు పూర్తి కావస్తున్న ఈ పార్కును త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభింపజేయడానికి అటవీశాఖ సన్నాహాలు చేస్తోంది.

అర్బన్‌ పార్కు గజ్వేల్‌కు వరం  

గజ్వేల్‌లో వినూత్న తరహాలో నిర్మించిన అర్బన్‌ పార్కు ఈ ప్రాంతానికి వరం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ఈ పార్కును అందంగా తీర్చిదిద్దాం. త్వరలోనే పనులు పూర్తికానున్నాయి. ఇంకా ఈ పార్కులో ఏర్పాటు చేయాల్సిన వసతులపై ఆలోచన జరుగుతోంది. ఈ పార్కు ద్వారా పట్టణానికి కొత్త శోభ రావడమేగాకుండా ఆరోగ్యం, ఆహ్లాదం అందనుంది.  

 – వెంకట రామారావు, గజ్వేల్‌ రేంజ్‌ అటవీ శాఖ అధికారి   

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

పార్కు ముందు భాగంలో గోడలపై ఏర్పాటు చేసిన బొమ్మలు

2
2/3

పార్కులో రాశీ వనం

3
3/3

పార్కులో గజబోన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement