వరదలా వచ్చే నీళ్లను ఇట్టే పీల్చేస్తుంది! | The design of the new Formula concrete roads | Sakshi
Sakshi News home page

వరదలా వచ్చే నీళ్లను ఇట్టే పీల్చేస్తుంది!

Published Mon, Dec 7 2015 4:43 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM

వరదలా వచ్చే నీళ్లను ఇట్టే పీల్చేస్తుంది!

వరదలా వచ్చే నీళ్లను ఇట్టే పీల్చేస్తుంది!

♦ కొత్త ఫార్ములా కాంక్రీట్ రోడ్లకు రూపకల్పన
♦ 60 ఏళ్లు మన్నికతో ఉండే కాంక్రీట్ రోడ్లు
 
 సాక్షి సెంట్రల్ డెస్క్:
నగరం ఒక కాంక్రీట్ జంగిల్. భారీ అపార్ట్‌మెంట్లు.. రోడ్లన్నీ కాంక్రీట్ మయం. దీంతో కురిసిన వర్షంలో చినుకు కూడా లోపలకు ఇంకే పరిస్థితి లేదు. చిన్న వర్షాలకే రోడ్లపై నీళ్లు పారతాయి. భారీగా కురిసే వాన వరద అవుతోంది. ఇదే అంతిమంగా పెనుముప్పుగా మారుతోంది. ఇలా ఇప్పుడు చెన్నైకి తలెత్తిన వరదముప్పు మొదలూ కాదు తుదీ కాదు. మరి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనడంలో భవిష్యత్తులో అయినా సాధ్యమా? కాంక్రీట్ రోడ్లను వాగులుగా మార్చేస్తున్న వరదలను నియంత్రించడం సాధ్యమా? అంటే.. ఎప్పుడో ‘ఔను’ అనేశారు యూరోపియన్ ఇంజనీరింగ్ నిపుణులు. కురిసిన వర్షపు నీటిని కురిసిట్టుగానే ఇముడ్చేసుకుని భూమిలోకి పంపించే టెక్నాలజీతో వారు రోడ్లను నిర్మించారు. నగరాల్లో వరద సమస్యలేకుండా చూసుకోవడంతో పాటు, భూగర్భ జలాన్ని పెంపొందించుకునే ప్రణాళికను కూడా వారు అమలు పెట్టారు.

 ఆ కాంక్రీట్‌కు దాహం ఎక్కువ...: వేడిగా ఉన్న పెనం మీద నీళ్లను విదిలిస్తే అవి ఎలా ఆవిరయిపోతాయో టాప్‌మిక్స్ పర్మియబుల్ కాంక్రీట్‌తో నిర్మించిన రోడ్లు మీద పడే వర్షపు చినుకుల పరిస్థితి అలాగే ఉంటుంది. చిన్న చిన్న చినుకులు.. కుండ పోత వాననే కాదు.. ఒక వాటర్ ట్యాంకర్ పంపు నుంచి ధారాపాతంగా నీళ్లను రోడ్డుపై వదిలినా.. అవి కొన్ని సెంటీమీటర్ల దూరం కూడా ముందుకు ప్రవహించవు. పడ్డచోటే ఇంకిపోతూ ఉంటాయి. అలా పీల్చేసుకునే తత్వం ఉంటుంది ఈ రోడ్డుకు. టాప్‌మిక్స్ పెర్మియబుల్‌గా వ్యవహరించే కాంక్రీట్‌కు దాహం ఆ స్థాయిలో ఉంటుంది. గణాంకాల ప్రకారం చెప్పాలంటే 60 సెకన్లలో 880 గేలన్ల నీటిని పీల్చేసుకోగలవు ఈ రోడ్లు. దీంతో ఎంత భారీ వర్షం వచ్చినా వరదనీరు కాదు కదా.. రోడ్లపై తడి కూడా ఉండదు.

 డ్రైనేజ్ సిస్టమ్‌కు అనుసంధానం..: ఒక డచ్ నిర్మాణరంగ సంస్థ ఈ రోడ్డును డిజైన్ చేసింది. ఈ ఫార్ములా ప్రకారం నీటిని పీల్చుకునే తత్వం ఉన్న కాంక్రీట్‌తో, పీల్చుకున్న నీటిని డ్రైనేజ్ సిస్టమ్‌కు అనుసంధానిస్తూ రోడ్లను నిర్మించుకోవచ్చు. భూమిలోకి ఇంకే నీటి శాతం కూడా చాలా వరకూ పెరుగుతుంది. ఈ రోడ్డు కనీసం 60 సంవత్సరాల పాటు మన్నుతుందని ఆ సంస్థ హామీ ఇస్తోంది. డచ్ గడ్డపై ఇళ్ల మధ్య, పార్కుల్లోనూ, గోల్ఫ్ కోర్టుల్లోనూ... ఈ తరహా రోడ్లు నిర్మితమయ్యాయి. వ రద ప్రభావిత ప్రాంతాల్లో ఇలాంటి రోడ్ల నిర్మాణం చాలా ఉపయుక్తమని రూపకర్తలు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement