diwali crackers
-
జంటనగరాల్లో మొదలైన దీపావళి సందడి (ఫోటోలు)
-
బాణసంచా నిషేధం ఎత్తివేతపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా నిషేధం ఎత్తివేసేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు. వాతావరణ కాలుష్యం, ఇతర పద్ధతుల్లో దీపావళి జరుపుకొనే అంశాలను చూపుతూ ఈ మేరకు స్పష్టం చేసింది. బీజేపే ఎంపీ మనోజ్ తివారీ అక్టోబర్ 10న సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలో బాణసంచా వినియోగం, విక్రయాలపై ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. అయితే, అప్పుడే ఎలాంటి కొత్త ఆదేశాలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తాజాగా.. తివారీ న్యాయవాది ఈ అంశాన్ని కోర్టు ముందుకు తీసుకొచ్చి లంచ్ బ్రేక్‌లో అత్యవసరంగా విచారించాలని కోరారు. కానీ, కోర్టు మళ్లీ అందుకు నిరాకరించింది. ‘మీ డబ్బులను స్వీట్స్ కొనుగోలు చేసేందుకు ఖర్చు చేయండి.. ప్రజలను స్వచ్ఛమైన గాలి పీల్చుకోనివ్వండి. గ్రీన్ క్రాకర్స్ అయినప్పటికీ ఎలా అనుమతించమంటారు? ఢిల్లీలో కాలుష్యాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా?’ అని పిటిషనర్‌ను ప్రశ్నించింది సుప్రీం కోర్టు. బీజేపీ ఎంపీ తివారీతో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించి ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఢిల్లీ ఆప్ ప్రభుత్వం బాణసంచాపై నిషేదం విధించటంపై బీజేపీ లీడర్ తాజిందర్ పాల్ సింగ్ బగ్గా ఆరోపణలు గుప్పించారు. ‘హిందువులు దీపావళికి క్రాకర్స్ కాలిస్తే కాలుష్యం ఏర్పుడుతుందని, వారిని కేజ్రీవాల్ జైలులో వేస్తామని బెదిరిస్తున్నారు. కానీ, ఢిల్లీ మంత్రి ఫైర్ క్రాకర్స్ కాలిస్తే ఆక్సిజన్ వస్తుందా?’ అని ప్రశ్నించారు. ఢిల్లీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ బాణసంచా కాల్చుతున్న వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఫలితాలు: ఎప్పుడూ ఏకగ్రీవమే, కానీ.. ఇప్పుడే ఇలా! -
ఆ గ్రామాల్లో ‘నిశ్శబ్ధ’ దీపావళి..
దీపావళి అనగానే అందరికీ గుర్తొచ్చేది టపాసులు. ఇటీవలి కాలంలో చాలా మందికి ఎక్కువ టపాసులు కాల్చడమనేది గొప్పదిగా మారింది. వాస్తవానికి దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. మంచిపై చెడు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటామనే సంగతి అందరికి తెలిసిందే. పండగ సందర్భంగా లక్ష్మి పూజ నిర్వహిస్తారు. అయితే దీపావళిని ఉత్తరాదిన ఐదు రోజులు జరుపుకుంటుంగా.. దక్షిణాదిన మాత్రం ఒకటి, రెండు రోజులు మాత్రమే పండగ సందడి ఉంటుంది. కానీ దేశం మొత్తం పండగలో కనిపించేది బాణాసంచా. ఇటీవల దీపావళి రోజున బాణాసంచా కాల్చడంపై సుప్రీం కోర్టు నియంత్రణ విధించింది. కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను చాలా చోట్ల ఉల్లంఘిస్తూనే ఉన్నారు. అయితే ఇందుకు భిన్నంగా తమిళనాడులో శివగంగ జిల్లాలోని కొల్లుకుడిపట్టి, సింగంపునారి గ్రామాలు మాత్రం టపాకాయలు కాల్చడానికి దూరం. వీరు సుప్రీం ఆదేశాలకు పాతికేళ్ల ముందు నుంచే బాణాసంచా కాల్చకూడదనే తీర్మానం చేసుకున్నారు. ఈ రెండు గ్రామాలు కూడా వెట్టంగుడి బర్డ్ సాంక్చురీలో భాగంగా ఉన్నాయి. అయితే ఇక్కడికి చలికాలం కొన్ని రకాల పక్షులు వలస వస్తుంటాయి. సైబీరియా, న్యూజిలాండ్ నుంచి వచ్చిన పక్షులు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని మళ్లీ ఎండకాలం ప్రారంభం కాగానే వాటి ప్రదేశాలకు వెళ్లిపోతాయి. ఇక్కడే గుడ్లు పెటి పొదిగి పిల్లలకు రెక్కలు వచ్చిన తర్వాత తమ ప్రాంతాలకు తీసుకెళ్లిపోతాయి. గతంలో కూడా ఈ ప్రాంతంలో టపాసులు కాల్చేవారు. అయితే బాణాసంచా మోతకు వలస వచ్చిన పక్షలు భీతిల్లిపోయేవి. పక్షులు పొదిగే గుడ్ల నుంచి పిల్లలు కూడా సరిగా బయటికి వచ్చేవి కావు. కొన్ని సార్లు పక్షులు అక్కడి నుంచి ఎగిరి వెళ్లిపోయేవి. ఈ పరిస్థితులను గమనించిన రెండు గ్రామాల ప్రజలు తమ గ్రామాల్లో బాణాసంచా కాల్చకూడదనే నిర్ణయం తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆ గ్రామాల్లో ఏ దీపావళికి కూడా బాణాసంచా కాల్చడం లేదు. కొల్లుకుడిపట్టి, సింగంపునారి గ్రామాల్లో ఎప్పుడూ బాణాసంచా కాల్చడం చూడలేదని ఆ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న అటవీ అధికారులు తెలిపారు. బాణాసంచా కాల్చకూడదనే నిబంధనపై గ్రామస్తులు కూడా బలమైన సంకల్పంతో ఉన్నారు. ‘మనుషులమైతే బాణాసంచా శబ్దం భరించలేకపోతే ఇంట్లో దూరి తలుపులు వేసుకుంటాం, చెవుల్లో దూది కూరుకుంటాం. మరి ఆ పక్షులు ఈ భయంకరమైన శబ్దాలను ఎలా భరించాలి?’ అని ఆ గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మన ఆనందం కోసం పక్షులను క్షోభ పెట్టడం ఏమిటి అనేది వాళ్ల భావన. దీపావళికే కాక గ్రామాల్లో జరిగే ఏ ఇతర వేడుకల్లో కూడా వారు బాణాసంచా కాల్చరు. పిల్లల సరదా కోసం.. పిల్లలకు టపాసులు కాల్చడమంటే మహా సరదా. అలాంటి వాటిని కాల్చవద్దంటే వాళ్ల మనసులు నోచుకుంటాయి. అందుకే ఆ గ్రామాల్లోని పిల్లలు ఎక్కువ శబ్దం లేని టపాసులను మాత్రమే కాలుస్తారు. అది కూడా... స్కూలు హెడ్మాస్టరు పర్యవేక్షణలో చెట్లు, పక్షులు లేని నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్లి మరీ టపాసుల వేడుక చేసుకుంటారు. -
వెలుగు నింపాలి.. కాలుష్యం కాదు
పండుగలు ఏవైనా అందరం సంతోషంగా జరుపుకోవాలి. పర్యావరణాన్ని కాపాడాలి . ప్రకృతితో మమేకమైన మన జీవన సౌందర్యాన్ని సంతోషంగా ఆస్వాదించాలి. కానీ రోజు రోజుకీ మనం కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాం. పర్యావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది. ఇక దీపావళి సమయంలో ఇది మరింతగా పెరుగుతుంది. ఆనందం కోసం పటాసులు పేలుస్తూ.. పర్యావరణానికి హాని చేస్తున్నాం. దీపావళి పండగ అంటే వెలుగు నింపాలి కానీ కాలుష్యాన్ని కాదు. దీపావళి పండుగ రోజున పెల్చే బాణాసంచాల వలన పర్యావరణానికి పెద్ద ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ స్థాయిలో ఉండాల్సిన కాలుష్య తీవ్రత పండుగ సమయంలో తీవ్రంగా పెరుగుతుంది. .ఒక్క టపాసు పేలితే వచ్చే పొగ అయిదువందల సిగరెట్లకు సమానం అన్నది పుణె పరిశోధకుల మాట. పటాకుల వలన వచ్చే శబ్దం వలన ధ్వని కాలుష్యం, పోగ వలన వాతవరణం కలుషితమవుతుంది. టపాసుల నుంచి వెలువడే పొగ పండగ తరవాత కూడా కొన్ని రోజుల పాటు మన పరిసర వాతావరణంపై ప్రభావం చూపుతుంది. ఇది చాలా మందిలో శ్వాస సంబంధిత రుగ్మతలకు దారితీస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పర్యావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇక దీపావళి సమయంలో ఇది మరింతగా పెరుగుతుంది. పెద్ద శబ్దాలతో వినికిడి లోపం బాణాసంచా కాల్చడం వలన వాతవరణ కాలుష్యంతో పాటు ధ్వని కాలుష్యం కూడా ఏర్పడుతుంది. పండుగ రోజున విరజిమ్మె క్రాకర్స్ పెద్ద పెద్దగా శబ్దాలు చేయడం వలన చిన్నపిల్లలో వినికిడి లోహం ఏర్పడుతుంది. గుండె సంబంధ వ్యాధులకు లోనయ్యె అవకాశం ఉంటుంది. బాణాసంచాలోని టాక్సిక్ పదార్ధాల వలన ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటితో పాటు పక్షులు జంతువులకు కూడా ముప్పు వాటిలే ప్రమాదముంది. 125డెసిబుల్స్ దాటకూడదని నియమం ఉన్న అంత కు మించిన శబ్దాలు రావడంతో నిద్ర సమస్యలు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పెద్ద శబ్ధాల వల్ల రక్తపోటు పెరగడంతో పాటు గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా పెద్ద శబ్దాలు వినడంతో తాత్కాలికంగానే కాదు పూర్తిగా చెవుడు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఊపిరితిత్తులు విషపూరితం ఇంట్లో ఎవరికైనా ఆస్త్మా, సీఓపీడీ ఉంటే టపాసుల నుంచి వచ్చే పొగవల్ల అది మరింత ఎక్కువయ్యే ప్రమాదముంది. కొన్ని రకాల టపాసుల్లో రకరకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి. ఉదాహరణకు కాపర్, కాడ్మియం మొదలైనవి. ఇవి గాలిలో దుమ్ము రూపంలో పేరుకుపోతాయి. ఈ దుమ్ము ఆస్త్మా ఉన్నవారికి ఎంతో ప్రమాదకారి. దీనివల్ల పైత్యం, తుమ్ములు, జలుబు, తలనొప్పి వంటి రుగ్మతలు కలుగుతాయి. ఈ పండుగ కూడా చలికాలంలో వస్తుంది కాబట్టి పొగ మంచు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విషపూరితమైన రసాయనాలు ఈ పొగలో కలిసిపోయి మరింత ఇబ్బంది పెడతాయి. ఈ హానికరమైన పొగ వల్ల ఊపిరితిత్తులు కూడా విషపూరితమవుతాయి. కర్ణభేరికి ప్రమాదం అధిక శబ్దంతో పేలే బాంబుల వల్ల కర్ణభేరి దెబ్బతినే ప్రమాదముంది. సాధారణంగా యువత శబ్దం ఎక్కువగా వచ్చే టపాసులను పేల్చేందుకు ఆసక్తి కనబరుస్తారు. అయితే వీటి ప్రభావం అప్పటికప్పుడు తెలియకపోయినప్పటికీ నెమ్మదిగా చెవి సంబంధిత రుగ్మతలతో బాధపడక తప్పదు. వీటి వల్ల పూర్తిగా వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదమైతే లేదు కానీ.. పండగ తరవాత కొన్ని రోజులపాటు వినికిడి లోపంతో ఇబ్బంది మాత్రం తప్పదు. పటాసుల ద్వారా ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలు దీపావళికి, ఇతర సందర్భాల్లో కాల్చే క్రాకర్స్ తయారీలో అనేక రకాల విషపూరిత రసాయనాలను ఉపయోగిస్తారు. వీటిని కాల్చిన తర్వాత రసాయనాలన్నీ పీల్చే గాలిలో కలిసి, మనిషి శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మెగ్నీషియం అనే రసాయనం వల్ల శ్వాస వ్యవస్థ దెబ్బతింటుంది. జ్వరం, తలనొప్పి, జలుబు, వాంతులు వచ్చే ప్రమాదం ఉంటుంది. జింక్ వల్ల తలనొప్పి, వాంతులు వస్తాయి.- గాలిలో కలసిన సోడియం వల్ల శరీరంపై దద్దుర్లు, చర్మ వ్యాధులు వస్తాయి. ఇది తీవ్రంగా ఉంటే చర్మక్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాడ్మియం అనే రసాయనాన్ని పీల్చడం అనీమియాకు దారితీస్తుంది. ఎక్కువగా పీలిస్తే కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంది. రక్తహీనత తలెత్తుతుంది. లెడ్ శరీరంలోకి ప్రవేశిస్తే నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇది శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గాలిలో కలిసిన కాపర్‌ను పీల్చడం వల్ల విపరీతమైన తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. శ్వాస ఆడకపోవడం, విపరీతమైన దగ్గు వస్తుంది. నైట్రేట్ అనే రసాయనం మోతాదు మించితే చాలా ప్రమాదం. ఇది మానసిక సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. చిన్నారులపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కావాల్సింది గ్రీన్ దీపావళి.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ వేడుకలైనా పటాకులు లేకుండా జరుగదు. అయినా అక్కడ కాలుష్యం పెరుగకపోవటానికి కారణం జీరో పొల్యూషన్ పటాకుల వినియోగించడమే. అన్నింటికీ మించి సామూహికంగా క్రాకర్ షో ఏర్పాటు చేసుకుని, అందులో సమిష్టిగా పాలుపంచుకొంటారు. మనదగ్గర సాధారణంగా కర్బన పదార్థాలతో పటాకులు తయారుచేస్తారు. విదేశాల్లో మాత్రం నైట్రోజన్ సంబంధిత పదార్థాలతో తయారుచేస్తారు. అమెరికాకు చెందిన కొన్ని కెమికల్, ఇంజినీరింగ్ కంపెనీలు జీరో పొల్యూషన్ క్రాకర్స్ ఉత్పత్తి చేస్తున్నాయి. వీటివల్ల తక్కువ పొగ రావడంతోపాటు పర్యావరణహితంగా పటాకులు కాల్చుకొనే అవకాశం కలుగుతున్నది. ఇక క్రాకర్ షో వంటి కార్యక్రమాల వల్ల కాలుష్యం ఒక్క చోటికే పరిమితం అవుతుంది. మనదేశంలో కూడా ఎకోఫ్రెండ్లీ పటాసులు అందుబాటులోకి వస్తున్నాయి. వాటితో ఈ దీపావళి వేడుకలు జరుపుకుంటే కాలుష్యాన్ని కొంతమేర తగ్గించినవాళ్లం అవుతాం. ఎకోఫ్రెండ్లీ క్రాకర్స్ కొంత మేలు దీపావళికి క్రాకర్స్ కాల్చడం తప్పనిసరి అని భావిస్తున్న వారంతా ఈ ఎకోఫ్రెండ్లీ క్రాకర్స్‌ని వినియోగించుకోవడం మంచింది. పటాసులు పేలిస్తేనే పండుగా అని భావించేవారి కోసమే ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. కాన్ఫెట్టి, ఫ్లవర్ పవర్, ఫేక్నోట్, బర్ట్స్, స్నేక్‌మిక్స్‌లాంటి పేర్లతో మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి మామూలు బాణాసంచాలా కాకుండా, వాతావరణానికి అతి తక్కువ హాని కలిగించే అవకాశం ఉంది. వీటి ధ్వని పరిమిత దూరం వరకే వినిపించడంతోపాటు కాలుష్యం కలిగించని రంగురంగుల మెరుపులను వెదజల్లుతాయి. కేవలం గన్‌పౌడర్, ఫాస్పేట్ను మాత్రమే ఉపయోగించి ఆధునిక టెక్నాలజీతో ఈ వెరైటీ బాణాసంచాను తయారు చేస్తున్నారు. అయితే వీటి లభ్యత చాలా స్వల్పంగానే ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ► అధిక శబ్దం, విపరీతమైన పొగ వెలువడే టపాసులు కాకుండా చిన్న చిన్న టపాసులను కాల్చండి. ►టపాసులను ఆరుబయట మాత్రమే కాల్చండి. వీటిని పేల్చేటప్పుడు ఇంటి తలుపులు, కిటికీలు మూసేయండి. ►ఎవరైతే ఆస్త్మాతో బాధపడుతున్నారో వారు ఈ సమయంలో తప్పకుండా మందులు వేసుకోవాలి. ►శ్వాసకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉన్న వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. వీరు టపాసులకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. ►టపాసులు కాల్చడం వల్ల వెలువడే రసాయనాల కారణంగా కళ్లు ఎర్రబడకుండా, కంటి నుంచి నీరు కారకుండా ఉండటానికి ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ పెట్టుకుంటే మంచిది. ►అలాగే చేతులతో పట్టుకుని కాల్చే టపాసులతో కొంచెం జాగ్రత్త వహించాలి. వీటి వల్ల చేతులు కాలే ప్రమాదముంటుంది కాబట్టి ముందుగానే మాస్కులు లేదా గ్లౌజులు వేసుకోవడం మంచిది. -
జాగ్రత్త చిన్నదే.. కానీ ఫలితం పెద్దది
దీపావళిలో ఆనందం ఉంది. కాని ఆ పక్కనే ప్రమాదం కూడా పొంచి ఉంది. దీపావళి పండుగ నూనెతో, దీపాలతో, మంటతో, భాస్వరంతో ముడిపడి ఉంది. ఇవి కాంతులతో పాటు ఏమరుపాటుగా ఉండే కన్నీళ్లను కూడా మిగులుస్తాయి. ఎన్నేళ్లు గడిచినా కొన్నింటి పట్ల కొందరు నిర్లక్ష్యంగా వుంటారు. పిల్లలకు టపాకాయలు ఇచ్చి బయట వాళ్లు కాలుస్తూ ఉంటే లోపల ఉంటారు. తీరా ప్రమాదం జరిగాక వేదన అనుభవిస్తారు. దీపావళిలో వినోదంతో పాటు జాగురూకత కూడా అవసరం. నివారణ ఇంకా అవసరం. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిపుణులు చెప్పారు. పాటించండి. సేఫ్‌గా దీపావళి జరుపుకోండి. చర్మం దీపావళి పిల్లలకు ఇష్టమైన పండుగ. ఆ వెలుగులు ఉత్సవం కాస్తా ఒక్కోసారి జీవితంలో చీకట్లు నిండేలా చేయవచ్చు. మనకు ఇష్టమైన బాణాసంచా చర్మాన్ని కాల్చేయవచ్చు. అలా జరగకుండా మేనిని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చదవండి. ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదంలో చర్మం కాలినా తీసుకోవాల్సిన ప్రథమ చికిత్సల గురించి తెలుసుకోండి. ప్రమాదాలకు గురికాకుండా నివారణ ఇలా: ► సాధారణంగా బాణాసంచా కాల్చడానికి మనం కొన్ని పెద్ద దీపాలను లేదా కొవ్వొత్తులు ఉపయోగిస్తాం. ఈ కొవ్వొత్తి లేదా దీపాలను వెలిగించే ముందు కాటన్ దుస్తులు ధరించండి. దీపం మీదికి ఒంగే సమయంలో వేలాడేవి కాకుండా కాస్త ఒంటికి అంటిపెట్టుకొని ఉండేలాంటి దుస్తులు మంచిది. చున్నీ లాంటివి సైతం ముందుకు వంగినప్పుడు వేలాడకుండా కాస్త బిగించి కట్టుకోవాలి. పైటను నడుములో దోపుకోవాలి. ► బాణాసంచా కాల్చే సమయంలో మహిళలు తమ జుట్టును క్లిప్ చేసుకోవాలి. వదులుగా వదిలేయకూడదు. ► ఎప్పుడూ ఆరుబయటే బాణాసంచా కాల్చండి. ► టపాసులు కాల్చే సమయంలో ఒక బకెట్ నీళ్లను పక్కనే ఉంచుకోండి. ► పెద్ద శబ్దం వచ్చే బాంబులకు, తారాజువ్వలకు పిల్లలను దూరంగా ఉంచండి. ► కాళ్లు మొత్తం కవరయ్యే లాంటి పాదరక్షలు ధరించండి. ► మీ ఫస్ట్‌ఎయిడ్ కిట్ దగ్గర ఉంచుకోండి. ► విపరీతమైన పొగవచ్చే పాంబిళ్లల్లాంటివి కాల్చకండి. ఈ పొగ మీ చర్మానికీ హాని చేస్తుంది. ఒకవేళ ప్రమాదానికి గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ► మీ గాయాన్ని చల్లటినీళ్లతో కడగాలి. ఈ నీళ్లు నల్లా/కొళాయి నుంచి పడుతుండేలా జాగ్రత్త తీసుకోవాలి. కాలిన గాయంపై నుంచి నీళ్లు జారుతుండేలా మగ్ను ఒంపాలి. (కాలిన చోట నీళ్లతో కడిగే సమయంలో ఆ నీరు కూడా వేడెక్కుతుంది. ఇలా వేడెక్కిన నీటిని పారేలా చేసి, మళ్లీ చల్లని నీరు గాయం మీద ఎప్పటికప్పుడు చేరుతుండాలి. అందుకే గాయాన్ని నల్లా / కొళాయి కింద గానీ లేదా మగ్ సహాయంతో గాని కడగాలన్నమాట)జ ఇలా అక్కడి బాణాసంచాలోని పౌడర్ అంతా కడుక్కుపోయేంతవరకు గాయాన్ని కడగాలి. ► కాలిన గాయాల మీద సిల్వర్ సల్ఫాడయజైన్ క్రీమ్ రాయాలి. కాలిన గాయాలు మరీ పెద్దవైతే ప్రమాదానికి లోనైన వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించాలి. ► కాలిన గాయాలు మరీ పెద్దవైతే ప్లాస్టిక్ సర్జన్ కూడా అవసరం కావచ్చు. కళ్లు టపాసుల కారణంగా కంటికి స్వల్పమైన ఇరిటేషన్ నుంచి కార్నియా రాపిడికి గురవ్వడం, రెటీనా ఇబ్బందులు అంధత్వం దాకా దారి తీయవచ్చు. క్రాకర్లోని రసాయనాల సాంద్రత, కళ్లకు ఎంత బలంగా తాకింది అనే దానిపై గాయం ఆధారపడి ఉంటుంది. కంటి గోడకు అయ్యే గాయం వల్ల కలిగే వాపు (ఓపెన్ గ్లోబ్ ఇంజ్యూరీ) కార్నియల్ గాయంతో పాక్షికంగా ఉబ్బడం (క్లోజ్డ్ గ్లోబల్ ఇంజ్యూరీ) కంటి చుట్టూ నలిగిపోవడం,(కంట్యూషన్ ) కనుగుడ్డు వాపు (లామెల్లర్ లాకెరేషన్) వగైరా సమస్యలతో దీపావళి వేడుక అనంతరం కంటి వైద్యులను సంప్రదించేవాళ్లు ఎక్కువే. దీర్ఘకాలం అలుముకుని ఉండే పొగలో నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్ స్థాయిలు బాగా పెరగి కంటి దురదలకు, నీరు స్రవించడానికి దోహదం చేస్తుంది. జాగ్రత్తలు... టపాసుల్ని మూసి ఉంచిన బాక్స్‌లో సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. కాల్చే సమయంలో సింథటిక్ దుస్తులు ధరించవద్దు. ఖాళీ ప్రదేశాల్లో గాగుల్స్ ధరించాలి. ముఖానికి, జుట్టుకి, దుస్తులకు కనీసం ఒక చేయంత దూరం లేదా అడుగు దూరంలో, చూసేటప్పుడు కనీసం 5 మీటర్లు దూరంగా ఉండి చూడాలి. కాల్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం మరచిపోవద్దు. వేడికి నేరుగా ఎక్స్పోజ్ అయితే తీవ్రమైన ఇబ్బందులు రావచ్చు కాబట్టి కాంటాక్ట్ లెన్స్‌లు దరించే వాళ్లు రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాలి. కాల్చేసిన టపాసులలో సగం కాలినవి కూడా ఉండొచ్చు. బకెట్ నీళ్లతో తడిపి పారేయడం మేలు. కంటికి సమస్య వస్తే... కాలుస్తున్నప్పుడు కంటి దురద అనిపిస్తే రుద్దడం గాని నలపడం కాని చేయకూడదు వెంటనే కన్రెప్పలు పైకి ఎత్తి శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. కంటిలో ఏదైనా పెద్ద పరిమాణంలో ఇరుక్కుపోతే తీసేందుకు హడావిడిగా ప్రయత్నించవద్దు. కళ్లు మూసి ఉంచి వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. కంట్లో ఏదైనా రసాయనం లాంటిది పడినట్లయితే కంటి దిగువ భాగాల్ని 30 నిమిషాల పాటు తడిపి వైద్యుల్ని సంప్రదించాలి. కంటి మీద ఏదైనా పడినా ఇరిటేషన్ అనిపిస్తే పిల్లలు గబుక్కున కంటిని నలిపేయడం గాయాన్ని పెద్దది చేస్తుంది. ఫోమ్ క్యాప్ వంటి మెత్తని వస్త్రాన్ని కంటి మీద కప్పి వైద్యులను సంప్రదించాలి. నొప్పి నివారణ మందులు సహా ఒటిసి మెడిసిన్స్ ఉపయోగించవద్దు.. ఆయింట్మెంట్ అప్లయ్ చేస్తే కంటి పరీక్ష చేసేందుకు అది అడ్డంకిగా మారుతుంది. ఈఎన్టీ పెద్ద శబ్దంతో పేలే టపాసుల వల్ల కేవలం చెవులకు మాత్రమేగాక మాత్రమే గాక అన్ని రకాలుగా నష్టం జరగవచ్చు. ఉదాహరణకు పెద్ద పెద్ద శబ్దాలు ప్రెగ్నెంట్స్‌లో గర్భస్రావం కలిగించవచ్చు. వయోవృద్ధుల్లో గుండెపోటుకూ దారితీయవచ్చు. ► ఒక్కోసారి దూరం నుంచి వినిపించే పెద్ద పేలుడు శబ్దం కంటే దగ్గర నుంచి వినిపించే చిన్న చప్పుడే చెవికి ఎక్కువ నష్టం చేయవచ్చు. అదే అంతకంటే తక్కువ శబ్దమే చెవికి మరింత దగ్గరగా అయితే దానివల్ల నష్టం ఎక్కువ ఉండవచ్చు. ► మానవులకు హాని చేసే శబ్దాలను రెండురకాలుగా ఉంటాయి. మొదటిది ఇంపల్స్ సౌండ్, రెండోది రెండోది... నిత్యం శబ్దాలు వింటూ ఉండటం. దీని వల్ల కలిగే నష్టాన్ని క్రానిక్ అకాస్టిక్ ట్రామా అంటారు. దీపావళి సమయంలో వినిపించే శబ్దం ఇంపల్స్ సౌండ్. దీని వల్ల కింద పేర్కొన్న ఏవైనా సమస్యలు రావచ్చు. అవి... ► అకస్మాత్తుగా చెవి దిబ్బెడ పడినట్లు (ఇయర్ బ్లాక్) కావడం. ► చెవిలో నొప్పి, గుయ్య్బరనే శబ్దం వినిపిస్తూ ఉండవచ్చు. ► చెవిలోపలి ఇయర్ డ్రమ్ (టింపానిక్ పొర) దెబ్బతిని కొన్నిసార్లు కాస్తంత రక్తస్రావం కావడం. ► నరం దెబ్బతిని పూర్తిగా వినిపించకపోవడం వంటి శాశ్వత నష్టమూ జరగవచ్చు. టెంపొరరీ థ్రెషోల్డ్ షిఫ్ట్: ఏదైనా పెద్ద శబ్దం అయి చెవికి తాత్కాలికంగా నష్టం జరిగి వినిపించకపోవడం అంటూ జరిగితే సాధారణంగా 16 గంటల నుంచి 48 గంటలలోపు దానంతట అదే సర్దుకొని రికవరీ అవుతూ ఉంటుంది. అలా తాత్కాలికంగా వినిపించకపోయే దశను ‘టెంపొరరీ థ్రెషోల్డ్ షిఫ్ట్’గా పేర్కొనవచ్చు. అప్పటికీ చెవి వినిపించకపోతే అప్పుడు దాన్ని శాశ్వత నష్టంగా భావించాల్సి ఉంటుంది. పెద్ద శబ్దం తర్వాత చెవులు వినిపించకపోతే అప్పుడు ఆ చెవిలో ఇయర్ డ్రాప్స్, నీళ్లూ, నూనె ఎట్టిపరిస్థితుల్లో వెయ్యకండి. తప్పక ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించాలి. ఆయన మైక్రోస్కోప్, ఆడియోమెట్రీ పరీక్షలతో చెవికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి చికిత్స చేస్తారు. ముక్కుకు, గొంతుకు హాని – టపాసుల పొగతోనూ ముక్కు, గొంతు, స్వరపేటికలో మంటగా రావచ్చు. అందుకే పొగకూ, రసాయనాలకు ఎక్స్పోజ్ అయితే చేతులనూ, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. గొంతులో నీళ్లు పోసుకొని పుక్కిలించాలి. ► బాణాసంచా కాల్చాక చేతులకూ రసాయనాలు అంటుతాయి కాబట్టి వాటితో ముక్కు, చెవుల వద్ద రుద్దడం చేయకూడదు. రసాయనాలు అంటిన చేతుల్తో ముక్కు దగ్గర రుద్దితే దాని నుంచి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. ముక్కు నుంచి రక్తం కారడాన్ని వైద్య పరిభాషలో ఎపిస్టాసిస్ అంటారు. ఇలా బాణాసంచాలోని రసాయానాలు చేతులకు అంటినప్పుడు వాటిని ముఖానికి, కళ్లకూ, ముక్కుకూ, చెవులకూ దూరంగా ఉంచాలి. అదే చేతులతో ముఖాన్ని, కళ్లనూ రుద్దుకోవద్దు. జంతువుల సంరక్షణకు సూచనలు... పటాసుల నుంచి జంతువులను రక్షించడానికి పెటా లాంటి పెట్ కేర్ పీపుల్ మాత్రమే కాకుండా, మన లాంటి మామూలు మనుషులూ ముందుకు రావాలి. మన వినోదం కోసం కాల్చే బాణాసంచా వాటికీ చేటు తెచ్పిడుతుంది. అవి బెదరడం వల్ల మనకే ముప్పు ముంచుకురావచ్చు. ఉదాహరణకు ఒక ఆవు గోడపై పోస్టర్‌ను తింటూ ఉందనుకుందాం. లేదా రోడ్డు పక్కన కూర్చొని తిన్నదాన్ని ప్రశాంతంగా నెమరేసుకుంటుందని అనుకుందాం. పటాసు పేలిన శబ్దంతో అది బెదిరిపోయి రోడ్డు మీదకు అకస్మాత్తుగా వచ్చేస్తుంది. దాంతో వాహనదారులు యాక్సిడెంట్లకు గురికావచ్చు. ప్రమోదం ప్రమాదం కాకుండా ఉండటానికి పశువైద్య నిపుణులు చెబుతున్న జాగ్రత్తలివి... ► పెంపుడు జంతువుల్లో కుక్కలు ఎక్కువ. బాణాసంచా మోతలకు అవి బెదిరిపోయే ప్రమాదం ఎక్కువ. ఇది ఎంతగా ఉంటుందంటే... దీపావళి నాడు మాత్రమేగాక దీర్ఘకాలం పాటు వాటికి ఆ బెదురు తగ్గదు. చిన్న చిన్న శబ్దాలకే వణికిపోతుంటాయి. లేగదూడలూ, బర్రెకుర్రలూ ఇదే ప్రమాదానికి గురవుతాయి. వీధుల్లో తిరిగే పిల్లుల వంటి స్ట్రే యానిమల్స్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ► ఒక ఒక్కోసారి థౌజెండ్‌వాలా లాంటివి చాలా సేపు అదేపనిగా చిటపటలాడుతూ మోగుతూనే ఉంటాయి. దాంతో పెంపుడు జంతువులు మాత్రమే గాక... చెట్లపై ఉండే పక్షులూ బెదిరిపోతాయి. ఒక్కోసారి వాటి గుండె ఆగిపోయి చెట్టు మీది నుంచి నేల మీదికి రాలిపోవచ్చు. ► పెద్దగా పేలే శబ్దాలతో కక్కులకు సౌండ్ ఫోబియా వచ్చి అన్నం తినడం కూడా మానేస్తాయి. ఆ తర్వాత చాలా రోజులు దిగులుగా ఉంటాయి. ఇలాంటి ప్రమాదాల నుంచి పెంపుడు కుక్కలాంటి జంతువులను, పేలుళ్లు తినిపించే ప్రాంతం నుంచి కాస్త శబ్దాలు తక్కువగా వినిపించే గదుల్లోకి తీసుకెళ్లాలి. వాటికి ఇష్టమైన బొమ్మలతో వాటిని ఆడిస్తూ, శబ్దాల నుంచి దృష్టి మళ్లించేలా చేయాలి. ఇక వాటికి ఇష్టమైన ఆహారం ఇవ్వాలి. ► చెట్ల మీద గూటిలో ఉండే తల్లిపిట్టలు రాలిపోతే గూళ్లలో కళ్లుతెరవని పిట్టపిల్లలకు పేరెంట్స్‌ను దూరం చేసినట్లే. పెద్ద పక్షుల ఉసురు తీస్తే పిల్లపిట్టల ఉసురూ మనం పోసుకున్నట్లే! అందుకే గట్టిగా పేలిపోయే శబ్దాలు వచ్చే టపాసులు కాకుండా వెలుగులు చిమ్మే వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. – డాక్టర్ ఎం.వంశీధర్, రీజనల్ మెడికల్, డైరెక్టర్, డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్, హైదరాబాద్ -
ఈ నియంత్రణలైనా ఫలిస్తాయా?
దీపావళి టపాసుల విక్రయాలపై ఉన్న నిషేధం పోయి ఈసారి వాటి వినియోగంపై నియంత్రణ లొచ్చాయి. గత రెండేళ్లుగా జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లోనూ, దాని శివార్లలోనూ టపాసుల విక్రయాలను పండుగకు 20 రోజుల ముందు నిషేధిస్తూ ఉత్తర్వులు ఇస్తున్న సర్వోన్నత న్యాయస్థానం ఈసారి అందుకు భిన్నంగా వాటిని కాల్చడానికి కొన్ని పరిమితులు విధించింది. దీపా వళి నాడు రోజంతా కాకుండా రాత్రి 8 గంటలకు మొదలుపెట్టి 10 గంటలకల్లా టపాసులు కాల్చ డాన్ని నిలిపేయాలని ఆంక్షలు విధించింది. అలాగే పరిమితికి మించిన ధ్వని, కాంతి, కాలుష్యం వగై రాలు లేకుండా చూడమని ఢిల్లీ పోలీసు శాఖను ఆదేశించింది. ఈ నియంత్రణలే రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, ఇతర ఉత్సవాలకు కూడా వర్తిస్తాయని తెలిపింది. దీపావళి పండుగ హడావుడంతా చీకటిపడ్డాక మొదలవుతుంది. పోటాపోటీగా రకరకాల బాణసంచా, టపాసులు కాల్చడం పిల్లలతోపాటు పెద్దలకూ సరదాయే. కానీ మరుసటి రోజు ఉదయం వీధులన్నీ యుద్ధ క్షేత్రా లను తలపిస్తాయి. వ్యర్థాలతో వీధులన్నీ నిండిపోతాయి. ఇదంతా కంటికి కనిపించేది. పర్యావరణ చైతన్యం పెరగడం వల్ల కావొచ్చు...ఆ టపాసులు, బాణసంచా తీసుకొచ్చే కాలుష్యంపై కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని నగరంలో సాధారణ దినాల్లోనే కాలుష్యం హద్దులు దాటుతుండగా దీపావళి రోజున అది మరింతగా పెరుగుతోంది. నిరుడు దీపావళి రోజున న్యూఢిల్లీలో వాయు కాలుష్యం మాములు రోజులతో పోలిస్తే మూడున్నర రెట్లు ఎక్కువున్నదని తేలింది. ఈసారి సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల ద్వారా ‘సురక్షితమైన హరిత దీపావళి’ జరుపుకోవాలని సూచించింది. అంటే తక్కువ కాలుష్యం వెదజల్లే టపాసుల్ని, బాణసంచాను మాత్రమే ఈసారి ఉత్ప త్తిచేయాలి. వాటినే అమ్మాలి. అవే కాల్చాలి. భారీగా కాలుష్యం వెదజల్లే అన్ని రకాల బాణసంచా, టపాసులు తయారు చేయడం, వాటిని విక్రయించడం, అవి కొనుక్కుని కాల్చడం ఈ తీర్పు పర్యవ సానంగా చట్టవిరుద్ధమవుతాయి. అలాగే బాణసంచా, టపాసులు రాత్రి 8–10 మధ్య మాత్రమే విని యోగించాలి. అంతకు ముందూ, ఆతర్వాత కాలిస్తే పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అంతేకాదు... వాటిని ఎవరింటి ముందు వారు కాల్చడం కాక అందరూ ఒకచోట చేరి ఆ కార్యక్ర మాన్ని పూర్తి చేసే విధానం అనుసరించాలని సూచించింది. దాంతోపాటు ఆకాశంలోకి రివ్వును దూసుకుపోయి అక్కడ రకరకాల రంగుల్లో కాంతులు వెదజల్లుతూ పెను శబ్దాలతో పేలే టపాసుల్ని కూడా నిషేధించింది. వీటితోపాటు ఆన్లైన్ విక్రయాలు ఉండరాదని చెప్పింది. అయితే ప్రభుత్వాలు, వివిధ సామాజిక సంస్థల క్రియాశీలపాత్ర లేకుండా ఇదంతా సాధ్యమేనా? ముందస్తుగా వివిధ మార్గాల్లో ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలను చేపట్టకుండా కింది స్థాయికి ఇదంతా చేరు తుందా? పోలీసులు ప్రతి వీధిలోనూ, ఇంటి ముందూ పహారా కాసి అదుపులో పెట్టడం సాధ్యమా? మన దేశంలో ఏదైనా సమస్య ముంచుకొచ్చినప్పుడు మాత్రమే దానిపై చర్చ మొదలవుతుంది. న్యాయస్థానాలు కూడా ఆ మాదిరిగానే స్పందిస్తున్నాయి. రెండు మూడేళ్లుగా దీపావళి టపాసుల విషయంలో విచారణలు సుప్రీంకోర్టులో 15, 20 రోజుల ముందు సాగుతున్నాయి. ఉత్తర్వులు వెలు వడుతున్నాయి. ఈసారి కూడా పండుగ పక్షం రోజులుందనగా న్యాయస్థానం మార్గదర్శకాలొ చ్చాయి. నిజానికి దీపావళి కోసమని బాణసంచా, టపాసులు ఈపాటికే భారీ మొత్తంలో ఉత్పత్తి చేసి ఉంటారు. వీటితోపాటు పాత నిల్వలుంటాయి. తమిళనాడులోని శివకాశిలోనూ, దేశంలోని కొన్ని ఇతరచోట్లా బాణసంచా, టపాసుల తయారీ ఏడాది పొడవునా సాగుతూనే ఉంటుంది. వీటిని దీపా వళికి మాత్రమే కాక పెళ్లిళ్లు, వేర్వేరు పండుగల్లో కూడా వినియోగిస్తారు. ఇప్పటికే దేశ రాజధానిలో వందల టపాసుల దుకాణాలు వెలిశాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ స్థితిలో సుప్రీం కోర్టు ఆదేశాలు అమలుకావడం సాధ్యమా? అందుకు భిన్నంగా ఏడాది ముందుగానే నిర్ణయం తీసు కుని ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, రాజకీయ పార్టీలు నిరంతరం ఆ దిశగా పనిచేస్తే ఎంతో కొంత ఫలితం వస్తుంది. బాణసంచా, టపాసుల తయారీ విషయంలో ఇప్పుడు విధించిన పరిమి తుల వల్ల వ్యర్థాల పరిమాణం తగ్గడంతోపాటు ధ్వనికాలుష్యం, కాంతి తీవ్రత పరిమితమవుతాయని లెక్కలేస్తున్నారు. మంచిదే. కానీ అసలు గ్రీన్ టపాసులకు అవకాశమే లేదని ఉత్పత్తిదారులు చెబు తున్నారు. వాటిల్లో వాడే రసాయనాలను కొంత మేర తగ్గించవచ్చుగానీ దానికి సమయం పడుతుం దంటున్నారు. ఈ ఉత్తర్వులు కనీసం ఏడెనిమిది నెలలక్రితం వచ్చి ఉంటే ఉపయోగం ఉండేదేమో! వాయు కాలుష్యం తీవ్రత వల్ల అనేక అనర్థాలు ఏర్పడతాయి. విపరీతమైన దగ్గు, కఫం, ఊపిరా డనీయని ఆస్త్మా, శ్వాసకోశ వ్యాధి, అలెర్జీలు, కేన్సర్ వగైరాలు వస్తాయి. ఢిల్లీ నగరంలో ఇప్పుడున్న వాయు కాలుష్యం వల్ల మనిషి ఆయుఃప్రమాణం 6.4 ఏళ్లు తగ్గిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తు న్నారు. దేశంలో హైదరాబాద్‌తోసహా వివిధ నగరాల్లో జాతీయ వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ)లు ఏర్పాటు చేశారుగానీ వాటివల్ల ఎలాంటి ప్రయోజనం సిద్ధిస్తున్నదో అనుమానమే. పరిశ్రమల యజ మానుల్లో కాలుష్య నియంత్రణపై అవగాహన పెరిగిందా? కాలుష్య నియంత్రణ బోర్డులు చురుగ్గా వ్యవహరించి చర్యలు తీసుకుంటున్నాయా? కాలుష్యం తీవ్రతపై అవగాహన పెరిగి జనం ప్రభు త్వాలపై ఒత్తిళ్లు తెస్తున్నారా? వీటన్నిటికీ లేదన్న సమాధానమే వస్తుంది. దీపావళి టపాసులు, బాణ సంచా విషయంలో సుప్రీంకోర్టు తాజా నియంత్రణలు హర్షించదగ్గవే. కానీ ఇంత స్వల్ప వ్యవధిలో ఇవి ఎంతవరకూ సత్ఫలితాలిస్తాయన్నది అనుమానమే. పైగా రాజకీయపార్టీలు, సామాజిక సంస్థల తోడ్పాటు, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది. అది జరిగే పనేనా? జల్లికట్టు, కోడిపందాలు వగైరా అంశాల్లో కోర్టు ఉత్తర్వులు ఎలా అమలయ్యాయో అందరికీ తెలుసు. జనం మనోభావాల పేరిట దేన్నయినా చలామణి చేయించే పార్టీలు, సంస్థలు ఉన్నంతకాలం ఫలి తాలు పరిమితంగానే ఉంటాయి. -
పేలుతున్న మామూళ్లు
ఆళ్లగడ్డ : దీపావళి సందర్భంగా టపాసుల విక్రయ దందా సాగుతోంది. అధికారులు మామూళ్లు దండుకుని యథేచ్ఛగా అనుమతి ఇచ్చేస్తున్నారు. ఆళ్లగడ్డలో సుమారు వంద తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసి టపాసుల విక్రయాలు చేపడతారు. ఈ సందర్భంగా అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది మామూళ్ల పంట పండించుకుంటున్నారు. తాత్కాలిక లైసెన్స్‌దారుల నుంచి రూ.10 వేల చొప్పున, అనుమతులు లేకుండా మంచంపై పెట్టుకుని అమ్మేందుకైతే రోజుకు రూ.5 వేలతో పాటు వారి పిల్లలకు ఉచితంగా టపాసులు తీసుకుంటున్నారు. ఆళ్లగడ్డలోనే కాకుండా.. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో దందా సాగుతోంది. కొందరు అధికారులతో పాటు ఆళ్లగడ్డ, కర్నూలు, ఆదోని, నంద్యాల, కోవెలకుంట్ల పట్టణాల్లో టీడీపీ నేతలు సైతం దందాకు దిగినట్లు తెలుస్తోంది. జిల్లాలోని అన్ని పట్టణ, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో సైతం తాత్కాలిక స్టాల్స్ ఏర్పాటు చేసి యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. ఇందుకోసం భారీమొత్తంలో అధికారులకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. సామాన్యులపై భారం జిల్లాలోని దుకాణాలకు తమిళనాడు, కర్ణాటకతో పాటు రాష్ట్రంలోని గుంటూరు, ప్రొద్దుటూరు, కర్నూలు, నంద్యాల, ఆదోని తదితర ప్రాంతాల నుంచి బాణసంచా వస్తోంది. విక్రయ అనుమతుల కోసం భారీగా ముడుపులు చెల్లించిన వ్యాపారులు దాన్ని టపాసులపై రేటు పెంచడం ద్వారా సామాన్యుల నుంచి వసూలు చేసుకుంటున్నారు. రూ.100 విలువ చేసే వాటిని రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. నిబంధనలివీ.. ♦ వీధుల్లో, నివాసాల మధ్య బాణసంచా విక్రయించరాదు. గ్రామ, పట్టణ శివారుల్లోని ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి. ♦ స్టాల్స్ వద్ద అగ్నిమాపక వాహనాన్ని, ప్రతి స్టాల్ దగ్గర 200 లీటర్ల సామర్థ్యమున్న రెండు డ్రమ్ముల్లో నీటిని ఏర్పాటు చేసుకోవాలి. ♦ ఒక్కో దుకాణం దగ్గర రెండు ఇసుక నింపిన బకెట్లు ఉంచుకోవాలి. ♦ దుకాణానికి దుకాణానికి మధ్య కనీసం మూడు మీటర్ల దూరం ఉండాలి. ♦ 13 ఏళ్లలోపు పిల్లలకు బాణసంచా విక్రయించరాదు. ♦ పై నిబంధనలన్నీ పాటిస్తూ టపాసుల విక్రయానికి లైసెన్స్ పొందేందుకు రూ .500 చలానాతో ఫైర్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. వారు దరఖాస్తు పరిశీలించి ఆర్డీఓ కార్యాలయానికి రెఫర్ చేస్తారు. అక్కడి నుంచి ఆయా మండలాల రెవెన్యూ, పోలీస్ కార్యాలయాలకు పంపిస్తారు. వారు నిబంధనలకు అనుగుణంగా ఉన్న షాపులకు ఎన్ఓసీ ఇస్తారు. ఆ తర్వాతే బాణసంచా విక్రయాలు చేపట్టాల్సి ఉంటుంది. -
దీపావళి మోతలు తగ్గాయి!
దీపావళికి టపాసులు కాలుస్తుంటే విషవాయువులు వెలువడతాయని, అందువల్ల దీపాల పండుగలాగే దీపావళిని చేసుకోవాలని ఈసారి విస్తృతంగా ప్రచారం జరిగింది. దానికితోడు చైనాలో తయారైన టపాసులకు మేడిన్ ఇండియా అనే స్టాంపు తగిలించి అమ్మేస్తున్నారని, వాటిలో అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్నారని కూడా వాట్సప్ లాంటి సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. వాటన్నింటి ఫలితమో ఏమోగానీ ఈసారి చాలావరకు దీపావళి టపాసుల మోతలు తగ్గాయట. ప్రధానంగా ముంబై నగరం గురించే చెప్పినా.. హైదరాబాద్‌లో కూడా చాలావరకు ఈ ప్రభావం కనిపించింది. ఏవో కొన్ని ప్రాంతాల్లో తప్ప చాలావరకు నగరంలో మోతలు గణనీయంగా తగ్గాయి. ఇంతకుముందు అర్ధరాత్రి వరకు టపాసుల మోతలు వినిపిస్తూనే ఉండేవని, చుట్టుపక్కల అంతా పొగమేఘం కమ్ముకునేదని, కానీ ఈసారి రాత్రి 10 గంటలలోపే మొత్తం ఆగిపోయాయని ఎల్బీనగర్, హయత్‌నగర్ పరిసర ప్రాంతాల వాసులు తెలిపారు. ముంబై మహానగరంలో అధిక శబ్దాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సుమైరా అబ్దులాలీ కూడా ఇదే మాట చెప్పారు. గత కొన్నేళ్లుగా.. అర్ధరాత్రి వరకు టపాసుల మోతలతో నరకం అనుభవించామంటూ నగర పౌరుల నుంచి తనకు లెక్కలేనన్ని ఫిర్యాదులు వచ్చేవని, కానీ ఈసారి మాత్రం కేవలం ఐదారు ఫిర్యాదులు మాత్రమే వచ్చాయని ఆమె హర్షం వ్యక్తం చేశారు. పిల్లల్లో అవగాహన పెరగడం వల్ల కూడా ఈసారి దీపావళికి మందుల మోతలు తగ్గాయని చెబుతున్నారు. ముంబైవాసులు అధిక శబ్దాల వల్ల ఆరోగ్యానికి జరిగే ప్రమాదాన్ని తెలుసుకున్నారని ఆమె ఆనందంగా చెప్పారు. హీరో చెప్పాడని.. ఇటీవల విడుదలైన జనతా గ్యారేజ్ సినిమాలో కూడా.. హీరో ఎన్టీఆర్ దీపావళి మందులు కాల్చొద్దని, దీన్ని దీపాల పండుగలాగే చేసుకోవాలని నిత్యామీనన్, ఆమె స్నేహితురాళ్లకు చెబుతాడు. దాని ప్రభావం కూడా కొంతవరకు కనిపించినట్లే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి దీపావళి టపాసుల అమ్మకాలు కూడా చాలావరకు తగ్గాయని వ్యాపారవేత్తలు చెబుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 40-50 శాతం మాత్రమే అమ్మకాలు జరిగినట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెరగడం, పిల్లలు కూడా ఇంతకుముందులా ఎక్కువ మొత్తంలో టపాసులు కావాలని మారాం చేయకపోవడం లాంటి కారణాల వల్ల కాలుష్యం తగ్గినట్లు చెబుతున్నారు. వర్షం చేసిన పుణ్యం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం, రాత్రి వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల నుంచి కొన్ని ప్రాంతాల్లోను, రాత్రి 9 గంటల నుంచి మరికొన్ని ప్రాంతాల్లోను వర్షం పడింది. అప్పటివరకు టపాసులు కాల్చిన పొగ మొత్తం ఆకాశంలో కమ్ముకుంటున్న తరుణంలో సరిగ్గా ఈ వర్షం కురవడంతో.. కాలుష్యం మొత్తం వర్షపు నీళ్లలో కొట్టుకుపోయింది. దానివల్ల కలుషిత వాయు ప్రభావం కూడా చాలావరకు తగ్గిందని చెబుతున్నారు. -
అగ్గిపుల్లలతో ఐఎస్ ఉగ్రవాదుల బాంబులు!
ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఉగ్రవాదులు గత ఏడు నెలలుగా అగ్గిపుల్లల్లోను, దీపావళి టపాసుల్లోను ఉపయోగించే రసాయనాలు సేకరించి.. వాటితో బాంబులు తయారుచేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు వీటిని వాడాలని వాళ్లు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. వాళ్ల వద్ద స్వాధీనం చేసుకున్న బాంబుల్లో పొటాషియం క్లోరేట్, పొటాషియం నైట్రేట్ లాంటి రసాయనాలు ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు. పొటాషియం క్లోరేట్‌ను అగ్గిపుల్లల చివర ఉండే మందులో వాడతారు. పొటాషియం నైట్రేట్‌ను దీపావళి సామగ్రి తయారీలో విరివిగా వాడతారు. ఆన్లైన్ నియామకాల ద్వారా ఐఎస్ఐఎస్లో చేరినట్లు అనుమానించిన 16 మందిని ఎన్ఐఏ ఇటీవలే అరెస్టు చేసింది. వాళ్ల వద్ద స్వాధీనం చేసుకున్న బాంబుల్లో ఈ రెండూ ఉన్నాయి. అంతకుముందు అమోనియం నైట్రేట్‌ను ఎక్కువగా ఉపయోగించేవాళ్లు. తర్వాతి కాలంలో దాని అమ్మకాలపై ప్రభుత్వం నియంత్రణలు విధించింది. దాంతో ఇప్పుడు ఈ పదార్థాలపై ఉగ్రవాదుల కన్నుపడింది. ఐఎస్ మాడ్యూలుకు నాయకత్వం వహిస్తున్న ముదాబిర్ ముష్తాక్ షేక్.. తన అనుచరులకు అగ్గిపెట్టెలు, దీపావళి మందులు భారీ మొత్తంలో సేకరించాలని చెప్పాడు. వాటి నుంచి బాంబులు ఎలా చేయాలో అతడే నేర్పించాడని అంటున్నారు. ముంబై, హైదరాబాద్ నగరాల్లో అరెస్టుచేసిన వాళ్ల నుంచి ఐడీడీలు తయారు చేయడానికి ఉపయోగించే పరికరాలు, టైమర్లను కూడా ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. అల్ కాయిదాకు చెందిన 'ఇన్స్పైర్' అనే ఆన్లైన్ పత్రికలో నాటు బాంబుల నుంచి ఐఈడీల వరకు ఎలా తయారుచేయాలో నేర్పిస్తున్నారు. -
దీపావళి టపాసులు పేలాల్సింది 5 గంటలే!
- పండుగనాడు క్రాకర్స్ 'మోత'లకు నిర్ణీత వ్యవధిపై సుప్రీంకోర్టు కసరత్తు న్యూఢిల్లీ: దీపావళి తెల్లారి ఎంరి ఇంటిముందు చెత్త ఎక్కువుంటే వాళ్లు ఎక్కువ టపాకులు కాల్చినట్టు. అలా వీధిలో ఎక్కువ మందుగుండు కాల్చిన కుటుంబంగా తాత్కాలిక కీర్తి కోసం రాత్రంతా టపాకులు పేల్చేస్తుంటాం. అయితే ఇకపై మనం.. 'పటాకుల కీర్తి' కండూతిని కచ్చితంగా వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇష్టమొచ్చిన వేళల్లో కాకుండా నిర్ణీత వ్యవధిలో మాత్రమే టపాకులు కాల్చేలా ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు కసరత్తు చేస్తోంది. సంచలనాత్మక రీతిలో పాలుతాగే పసిపిల్లలు గత నెలలో దాఖలుచేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. 'ఇంకా అభివృద్ధి చెందని మా ఊపిరితిత్తులు, ఇతర శరీర భాగాలు.. టపాకులు ద్వారా జనించే శబ్ధ, ధ్వని కాలుష్యాల వల్ల ఎంతగా అల్లాడిపోతాయో ఆలోచించండి' అంటూ ఆరు నెలల వయసున్న అర్జున్ గోపాల్, ఆరవ్ భండారీ, 14 నెలల వయసున్న జోయా రావ్ భాసిన్ అనే చిన్నారులు తమ న్యాయవాద తండ్రుల ద్వారా సెప్టెంబర్ 30న పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చిన్నారుల అభ్యర్థనలోని పలు అంశాలను చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్. దత్తు, జస్టిస్ అమితాబ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం కూలంకషంగా పరిశీలించింది. పిల్లలు వ్యక్తపరిచిన ఆందోళన సహేతుకంగానే ఉందని, తగిన చర్చలు చేపట్టేలా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడాల్సిందిగా సొలిసిటర్ జనరల్ రజిత్ కుమార్, అదనపు సొలిసిటర్ జనరల్ మనిందర్ సింగ్ లను కోర్టు ఆదేశించింది. దీపావళి పండుగనాడు టపాకులు పేల్చే కార్యక్రమాన్ని రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిర్వహించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరగా.. రెండు గంటలు చాలా తక్కువ సమయమని, అందుకు కనీసం 5 గంటలైనా వేడుక జరుపుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. టపాకుల పేల్చివేతక వ్యవధిని సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్ధారిస్తే సరిపోతుందని ఒక నిర్ధారణకు వచ్చింది. తరుపరి విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది. సొలిసిటర్ జనరల్ తెలిపే వివరాలను బట్టి అదే రోజు తీర్పును వెలువరించే అవకాశం ఉంది. -
ఢాంలెస్‌తో టపాస్
ఆస్తమాతో దీపావళి చేసుకోవడం ఎంత కష్టం. కాలుష్యం వల్ల నగరం మొత్తం తాను అనుభవిస్తున్న క్షోభ మనిషికీ అనుభవంలోకి రావాలని బహుశా ప్రకృతి ‘ఆస్తమా’ అనే జబ్బును సృష్టించి జనాల మీదికి వదిలిందేమో! ఉరి బాధను ఊరికే కాసేపని కాకుండా... ఆస్తమా ఉన్నవారికి అస్తమానం ఆ బాధ గంటలూ, రోజులూ అనుభవంలోకి వచ్చేలా చేసే జబ్బు అది. దానికి కారణం... మనం వెలువరిచే పొగ, కాలుష్యం! అలాగని ఆస్తమాతో దీపావళి చేసుకోకపోవడమూ ఎంత కష్టం! అందుకే ఉత్సవాన్ని ఊరితో అనువర్తించుకుని ఆవిష్కరించుకుంటే ఉరిబాధ నుంచి కాసేపు ఊరట! అందుకోసమే పండుగనాటి సాయంత్రం పూట బాణసంచాను మన షహర్‌కు ఆపాదించి ఆ బహార్‌లో విహరించి, ఆనందించడం మొదలుపెట్టా. అంతేకాదు... ఇలా స్మోక్లెస్, సౌండ్‌లెస్ దీపావళిని ఆలోచనలతో జరుపుకోవడం ఎలాగో మా బుజ్జిగాడికీ చెప్పడం ప్రారంభించా. ట్యాంక్‌బండ్ ఈ చివర్నుంచి ఆ చివరి వరకూ రోడ్డు తారాజువ్వ ప్రయాణమార్గంలా సూటిగా ఉందనిపించింది. ఇక రింగురోడ్డు అచ్చం భూచక్రం వెలువరించి ఏర్పాటు చేసిన కాంతివలయంలా ఉంది. మెహిదీపట్నం వద్ద మొదలై... శంషాబాద్ వరకు ఉన్న ఎక్స్‌ప్రెస్ హైవే అచ్చం... చీపురుపుల్ల రాకెట్‌ను ఏటవాలుగా వదిలితే... ఇక్కడ మొదలై... విమానాలు దిగే చోట... రాకెట్ కూడా దిగినట్లనిపించింది. ‘మరి చిచ్చుబుడ్డి లేదా నాన్నా’ అడిగాడు మా బుజ్జిగాడు. ‘ఎందుకు లేదూ...! బిర్లా మందిర్ ఉన్న నౌబత్పహాడ్ అచ్చం చిచ్చుబుడ్డి షేప్లోనే ఉంటుంది. దాని చివర తెల్లటి కాంతుల వెలుగులు విరజిమ్ముతూ ‘బిర్లామందిర్’ ఒకపక్కా.... మరో వైపు నుంచి చూస్తే విజ్ఞాన కాంతులు ఎగజిమ్ముతూ ‘ప్లానెటోరియం’ మరో పక్క. ఏదైనా వాహనం మీద ఆ గుట్ట పక్కనుంచీ ప్రయాణం చేస్తూ ఉంటే... ఆ మందిరమూ, ఈ భవనమూ సదరు నౌబత్పహాడ్ అనే చిచ్చుబుడ్డి శిఖరంపై మారిమారి దివ్వెలు వెలువరిస్తూ కనిపిస్తుంటే... మనసులో ఆధ్యాత్మిక, వైజ్ఞానిక వెలుగురవ్వలు రాలుతున్నట్లుంటుంది. ఇక ఊరి మధ్యనున్న హస్సేన్‌సాగర్ అంటావా... మంటలేవైనా అకస్మాత్తుగా వెలువడితే ఆర్పడానికి ముంగిట్లో పెట్టిన నీళ్ల బక్కెట్లా ఉంటుంది. ‘‘అన్నీ బాగున్నాయ్ నాన్నా. కానీ బాంబులు లేవా? ఢామ్మంటూ శబ్దాలు వద్దా’’ ‘‘వద్దు... ఆనాడు గోకుల్ చాట్‌లో మొదలైన ఆ పేలుళ్లు... నిన్నటి దిల్సుఖ్నగర్ బాంబులతో ఆఖరైతే ఇక అంతేచాలు. జంతువుల గుండెలు గుబగుబలాడించడంతో పాటు... గుండెలవిసిపోయేలా మనుషులనూ గుండెలు బాదుకునేలా చేసే బాంబులు వద్దే వద్దు. ఈ విషయాన్ని బాంబులు పేల్చేవాళ్లూ గ్రహిస్తే ఇక నగరంలో పూలపూల దీపావళే తప్ప పేలుళ్ల దీపావళి ఉండదు. టపాసు ‘టప్’ అని సున్నితంగా పాస్ కావాలి తప్ప... ఢామ్మంటూ గుండెల్నీ, చెవుల్నీ బద్దలు కొట్టకూడదు. ఇది నగరవాసులంతా గ్రహించిన నాడు నగరవాసులందరూ కలిసి నగరం నగరాన్నే ‘ఆస్తమా’ నుంచి రక్షించినంత గొప్ప. ఆనాడు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నంత ఘనత. అందుకే పండుగ ఎంత ‘ఢామ్’లెస్‌గా జరిగితే... టపాస్ ఎగ్జామ్స్‌లో పాస్ కావడమే కాదు... అందులో టాపర్సూ మనమే. మన పర్సులోని కాపర్సూ, కరెన్సీ సేఫే’’ అంటూ పెన్సిల్ కడ్డీలాంటి విషయాన్ని స్ట్రెయిట్గానే ఉపదేశించా మా బుజ్జిగాడికి. అన్నట్టూ... ఇంతకీ ఈ రోజు మీరు జరుపుకొనేది ఢాంలెస్ దీపావళేనా? - యాసీన్ -
14 ఏళ్లుగా 8 గ్రామాలు దీపావళీ పండగకు దూరం!
పక్షులను ప్రేమించే ఎనిమిది గ్రామాలు ఎంతో సంతోషంగా జరుపుకునే దీపావళీ పండగకు దూరంగా ఉంటున్నారు. కేవలం పక్షుల రాక ఆగిపోతుందనే కారణంతో గత పద్నాలుగేళ్లుగా తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఎనిమిది గ్రామాలు దీపావళీ పండగ రోజున టపాసులను కాల్చకపోవడం గమనార్హం. ఈరోడ్ కు 15 కిలోమీటర్ల దూరంలోని వెల్లోడ్ పక్షలు సంరక్షణ కేంద్రానికి సమీపంలోని ఎనిమిది గ్రామాల్లోని సుమారు 750 గ్రామాల కుటుంబాలు దీపావళీ పండగకు దూరంగా ఉంటున్నాయి. అక్టోబర్-జనవరి మాసంలో వేలాది పక్షులు తమ గ్రామాలను సందర్శిస్తాయని మనిక్కం అనే స్థానికుడు వెల్లడించారు. దీపావళి సమయంలో టపాసులు కాల్చడం వలన పక్షులు బెదిరిపోతాయనే కారణంగా గత 14 ఏళ్లలో ఎనిమిది గ్రామాల్లో బాణసంచా, టపాసులు కాల్చడం లేదు అని తెలిపారు. అంతేకాకుండా మిగితా పండగ రోజుల్లో కూడా ప్రజలు బాణసంచా కాల్చడానికి దూరంగా ఉంటారని స్థానికులు తెలిపారు. దీపావళి పండగ రోజున కొత్త దుస్తులు ధరించి.. సంరక్షణ కేంద్రానికి వెళ్లి పక్షులకు, చేపలకు ధాన్యం వేస్తామని తెలిపారు. దీపావళి సందర్భంగా శనివారం రోజున సుమారు 2 వేల మంది సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. -
సురక్షితంగా దీపావళి జరుపుకోండి
హైదరాబాద్: మన దేశంలో మతాలకు అతీతంగా పిల్లలు, పెద్దలు ఇంటిల్లపాది అందరూ ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. చెడు మీద మంచి సాధించిన విజయమే దీపావళి భావిస్తారు. అమావస్య రోజైనప్పటికీ అంతటా దీపాల వెలుగులు, బాణాసంచా పేలుళ్లు, వెలుగుల పువ్వులు విరజిమ్మే మతాబులు, తారాజువ్వలు, కాకరపువ్వొత్తులు ...... అంతా సందడే సందడి. జీవితంలో మధురానుభూతులను నింపే పండుగ. అటువంటి దీపావళి పండుగను అందరూ ఆనందంగా, సంతోషంగా, సురక్షితంగా జరుపుకోవడానికి అగ్నిమాపక అధికారులు, వైద్యులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. వారి సలహాలను పాటిస్తే పండుగపూట ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చు. క్షేమంగా పండుగ జరుపుకోవచ్చు. అగ్నిమాపక అధికారులు, డాక్టర్ రాఘవ సునీల్, రంగారెడ్డి జిల్లా కంటి వైద్యాధికారి డాక్టర్ మాన్సింగ్ ముందు జాగ్రత్త చర్యలు, సలహాలు ఈ దిగువ ఇస్తున్నాం. 1. బాణాసంచా కాల్చే సమయంలో మహిళలు పట్టు చీరలు కట్టుకోకూడదు. అందరూ కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. 2. తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు బాణాసంచా కాల్చాలి. పిల్లలను ఒంటరిగా వదిలివేయకూడదు. 3. నీళ్ల బక్కెట్టు, ఒక దుప్పటి సమీపంలో పెట్టుకోవాలి. 4.పేలని టపాసులను వదిలివేయాలి. 5. అవకాశం ఉన్నమేరకు ఖాళీ ప్రదేశంలోనే బాణాసంచా కాల్చాలి. -
బస్సులో పేలుడు పదార్థాలు ఉన్నాయా?
హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన వోల్వో బస్సులో పేలుడు పదార్థాలు రవాణా అవుతున్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. దీపావళి టపాసులు బస్సులో హైదరాబాద్‌కు చేరవేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు బస్సులో సరుకు రవాణపైన కూడా విచారణ జరుపుతున్నారు. బస్సు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీకొనటంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా 45మంది సజీవ దహనం అయ్యారు. మరోవైపు బస్సు ప్రమాద సంఘటన జరిగిన సమాచారం తెలుసుకుని మృతుల బంధువులు మిన్నంటాయి. బస్సు యాజమాన్యంపై మృతుల బంధువులు తీవ్రంగా మండిపడుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లుగా తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన ప్రాంతానికి చేరుకుని తీవ్ర ఆవేదన చెందుతున్నారు.