జాగ్రత్త చిన్నదే.. కానీ ఫలితం పెద్దది | Take Care Yourselves And Your Family While Celebrate Diwali | Sakshi
Sakshi News home page

జాగ్రత్త చిన్నదే.. కానీ ఫలితం పెద్దది

Published Mon, Oct 21 2019 8:37 PM | Last Updated on Sat, Oct 26 2019 9:43 AM

Take Care Yourselves And Your Family While Celebrate Diwali - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

దీపావళిలో ఆనందం ఉంది. కాని ఆ పక్కనే ప్రమాదం కూడా పొంచి ఉంది. దీపావళి పండుగ నూనెతో, దీపాలతో, మంటతో, భాస్వరంతో ముడిపడి ఉంది. ఇవి కాంతులతో పాటు ఏమరుపాటుగా ఉండే కన్నీళ్లను కూడా మిగులుస్తాయి. ఎన్నేళ్లు గడిచినా కొన్నింటి పట్ల కొందరు నిర్లక్ష్యంగా వుంటారు. పిల్లలకు టపాకాయలు ఇచ్చి బయట వాళ్లు కాలుస్తూ ఉంటే లోపల ఉంటారు. తీరా ప్రమాదం జరిగాక వేదన అనుభవిస్తారు. దీపావళిలో వినోదంతో పాటు జాగురూకత కూడా అవసరం. నివారణ ఇంకా అవసరం. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిపుణులు చెప్పారు. పాటించండి. సేఫ్‌గా దీపావళి జరుపుకోండి.

చర్మం
దీపావళి పిల్లలకు ఇష్టమైన పండుగ. ఆ వెలుగులు ఉత్సవం కాస్తా ఒక్కోసారి జీవితంలో చీకట్లు నిండేలా చేయవచ్చు. మనకు ఇష్టమైన బాణాసంచా చర్మాన్ని కాల్చేయవచ్చు. అలా జరగకుండా మేనిని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చదవండి. ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదంలో చర్మం కాలినా తీసుకోవాల్సిన ప్రథమ చికిత్సల గురించి తెలుసుకోండి. 

ప్రమాదాలకు గురికాకుండా నివారణ ఇలా: 
 సాధారణంగా బాణాసంచా కాల్చడానికి మనం కొన్ని పెద్ద దీపాలను లేదా కొవ్వొత్తులు ఉపయోగిస్తాం. ఈ కొవ్వొత్తి లేదా దీపాలను వెలిగించే ముందు కాటన్‌ దుస్తులు ధరించండి. దీపం మీదికి ఒంగే సమయంలో వేలాడేవి కాకుండా కాస్త  ఒంటికి అంటిపెట్టుకొని ఉండేలాంటి దుస్తులు మంచిది. చున్నీ లాంటివి సైతం ముందుకు వంగినప్పుడు వేలాడకుండా కాస్త బిగించి కట్టుకోవాలి. పైటను నడుములో దోపుకోవాలి. 
► బాణాసంచా కాల్చే సమయంలో మహిళలు తమ జుట్టును క్లిప్‌ చేసుకోవాలి. వదులుగా వదిలేయకూడదు. 
 ఎప్పుడూ ఆరుబయటే బాణాసంచా కాల్చండి. 
► టపాసులు కాల్చే సమయంలో ఒక బకెట్‌ నీళ్లను పక్కనే ఉంచుకోండి. 
 పెద్ద శబ్దం వచ్చే బాంబులకు, తారాజువ్వలకు పిల్లలను దూరంగా ఉంచండి. 
► కాళ్లు మొత్తం కవరయ్యే లాంటి పాదరక్షలు ధరించండి. 
 మీ ఫస్ట్‌ఎయిడ్‌ కిట్‌ దగ్గర ఉంచుకోండి. 
► విపరీతమైన పొగవచ్చే పాంబిళ్లల్లాంటివి కాల్చకండి. ఈ పొగ మీ చర్మానికీ హాని చేస్తుంది.
ఒకవేళ ప్రమాదానికి గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 
 మీ గాయాన్ని చల్లటినీళ్లతో కడగాలి. ఈ నీళ్లు నల్లా/కొళాయి నుంచి పడుతుండేలా జాగ్రత్త తీసుకోవాలి.  కాలిన గాయంపై నుంచి నీళ్లు జారుతుండేలా మగ్‌ను ఒంపాలి. (కాలిన చోట నీళ్లతో కడిగే సమయంలో ఆ నీరు కూడా వేడెక్కుతుంది. ఇలా వేడెక్కిన నీటిని పారేలా చేసి, మళ్లీ చల్లని నీరు గాయం మీద ఎప్పటికప్పుడు చేరుతుండాలి. అందుకే గాయాన్ని నల్లా / కొళాయి కింద గానీ లేదా మగ్‌ సహాయంతో గాని కడగాలన్నమాట)జ ఇలా అక్కడి బాణాసంచాలోని పౌడర్‌ అంతా కడుక్కుపోయేంతవరకు గాయాన్ని కడగాలి. 
► కాలిన గాయాల మీద సిల్వర్‌ సల్ఫాడయజైన్‌ క్రీమ్‌ రాయాలి. కాలిన గాయాలు మరీ పెద్దవైతే  ప్రమాదానికి లోనైన వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించాలి. 
 కాలిన గాయాలు మరీ పెద్దవైతే ప్లాస్టిక్‌ సర్జన్‌ కూడా అవసరం కావచ్చు. 

కళ్లు
టపాసుల కారణంగా కంటికి స్వల్పమైన ఇరిటేషన్‌  నుంచి కార్నియా రాపిడికి గురవ్వడం, రెటీనా ఇబ్బందులు అంధత్వం దాకా దారి తీయవచ్చు. క్రాకర్‌లోని రసాయనాల సాంద్రత, కళ్లకు  ఎంత బలంగా తాకింది అనే దానిపై గాయం ఆధారపడి ఉంటుంది. కంటి గోడకు అయ్యే గాయం వల్ల కలిగే వాపు (ఓపెన్‌ గ్లోబ్‌ ఇంజ్యూరీ) కార్నియల్‌ గాయంతో పాక్షికంగా ఉబ్బడం (క్లోజ్డ్‌ గ్లోబల్‌ ఇంజ్యూరీ)  కంటి చుట్టూ నలిగిపోవడం,(కంట్యూషన్‌ ) కనుగుడ్డు వాపు (లామెల్లర్‌ లాకెరేషన్‌) వగైరా సమస్యలతో దీపావళి  వేడుక అనంతరం కంటి వైద్యులను సంప్రదించేవాళ్లు ఎక్కువే. దీర్ఘకాలం అలుముకుని ఉండే పొగలో నైట్రస్‌ ఆక్సైడ్, సల్ఫర్‌ ఆక్సైడ్‌ స్థాయిలు బాగా పెరగి  కంటి దురదలకు, నీరు స్రవించడానికి దోహదం చేస్తుంది.

జాగ్రత్తలు...  
టపాసుల్ని మూసి ఉంచిన బాక్స్‌లో సురక్షితమైన ప్రదేశంలో  ఉంచాలి. కాల్చే సమయంలో సింథటిక్‌ దుస్తులు ధరించవద్దు. ఖాళీ ప్రదేశాల్లో గాగుల్స్‌ ధరించాలి. ముఖానికి, జుట్టుకి, దుస్తులకు  కనీసం ఒక చేయంత దూరం లేదా  అడుగు దూరంలో, చూసేటప్పుడు  కనీసం 5 మీటర్లు దూరంగా ఉండి చూడాలి. కాల్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం మరచిపోవద్దు. వేడికి నేరుగా ఎక్స్‌పోజ్‌ అయితే తీవ్రమైన ఇబ్బందులు రావచ్చు కాబట్టి కాంటాక్ట్‌ లెన్స్‌లు దరించే వాళ్లు రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాలి. కాల్చేసిన టపాసులలో సగం కాలినవి కూడా ఉండొచ్చు. బకెట్‌ నీళ్లతో తడిపి పారేయడం మేలు. 

కంటికి సమస్య వస్తే...
కాలుస్తున్నప్పుడు కంటి దురద అనిపిస్తే రుద్దడం గాని నలపడం కాని చేయకూడదు వెంటనే కన్రెప్పలు పైకి ఎత్తి శుభ్రమైన నీటితో కడుక్కోవాలి.  కంటిలో ఏదైనా పెద్ద పరిమాణంలో ఇరుక్కుపోతే  తీసేందుకు హడావిడిగా ప్రయత్నించవద్దు. కళ్లు మూసి ఉంచి వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. కంట్లో ఏదైనా రసాయనం లాంటిది పడినట్లయితే కంటి దిగువ భాగాల్ని 30 నిమిషాల పాటు తడిపి  వైద్యుల్ని సంప్రదించాలి. కంటి మీద ఏదైనా పడినా  ఇరిటేషన్‌ అనిపిస్తే పిల్లలు గబుక్కున కంటిని నలిపేయడం గాయాన్ని పెద్దది చేస్తుంది. ఫోమ్‌ క్యాప్‌ వంటి మెత్తని వస్త్రాన్ని కంటి మీద కప్పి వైద్యులను  సంప్రదించాలి. నొప్పి నివారణ మందులు సహా  ఒటిసి మెడిసిన్స్‌ ఉపయోగించవద్దు.. ఆయింట్‌మెంట్‌ అప్లయ్‌ చేస్తే కంటి పరీక్ష చేసేందుకు అది అడ్డంకిగా మారుతుంది. 

ఈఎన్‌టీ
పెద్ద శబ్దంతో పేలే టపాసుల వల్ల కేవలం చెవులకు మాత్రమేగాక మాత్రమే గాక అన్ని రకాలుగా నష్టం జరగవచ్చు. ఉదాహరణకు పెద్ద పెద్ద శబ్దాలు ప్రెగ్నెంట్స్‌లో గర్భస్రావం కలిగించవచ్చు. వయోవృద్ధుల్లో గుండెపోటుకూ దారితీయవచ్చు. 

► ఒక్కోసారి దూరం నుంచి వినిపించే పెద్ద పేలుడు శబ్దం కంటే దగ్గర నుంచి వినిపించే చిన్న చప్పుడే చెవికి ఎక్కువ నష్టం చేయవచ్చు.  అదే అంతకంటే తక్కువ శబ్దమే చెవికి మరింత దగ్గరగా అయితే దానివల్ల నష్టం ఎక్కువ ఉండవచ్చు. 

  మానవులకు హాని చేసే శబ్దాలను రెండురకాలుగా ఉంటాయి. మొదటిది ఇంపల్స్‌ సౌండ్, రెండోది రెండోది... నిత్యం శబ్దాలు వింటూ ఉండటం. దీని వల్ల కలిగే నష్టాన్ని  క్రానిక్‌ అకాస్టిక్‌ ట్రామా  అంటారు. దీపావళి సమయంలో వినిపించే శబ్దం ఇంపల్స్‌ సౌండ్‌. దీని వల్ల కింద పేర్కొన్న ఏవైనా సమస్యలు రావచ్చు. అవి... 
 అకస్మాత్తుగా చెవి దిబ్బెడ పడినట్లు  (ఇయర్‌ బ్లాక్‌) కావడం. 
► చెవిలో నొప్పి, గుయ్‌య్‌బరనే శబ్దం వినిపిస్తూ ఉండవచ్చు. 
 చెవిలోపలి ఇయర్‌ డ్రమ్‌ (టింపానిక్‌ పొర) దెబ్బతిని కొన్నిసార్లు కాస్తంత రక్తస్రావం కావడం. 
► నరం దెబ్బతిని పూర్తిగా వినిపించకపోవడం వంటి శాశ్వత నష్టమూ జరగవచ్చు.  

టెంపొరరీ థ్రెషోల్డ్‌ షిఫ్ట్‌: ఏదైనా పెద్ద శబ్దం అయి చెవికి తాత్కాలికంగా నష్టం జరిగి వినిపించకపోవడం అంటూ జరిగితే సాధారణంగా 16 గంటల నుంచి 48 గంటలలోపు దానంతట అదే సర్దుకొని రికవరీ అవుతూ ఉంటుంది. అలా తాత్కాలికంగా వినిపించకపోయే దశను ‘టెంపొరరీ థ్రెషోల్డ్‌ షిఫ్ట్‌’గా పేర్కొనవచ్చు. అప్పటికీ చెవి వినిపించకపోతే అప్పుడు దాన్ని శాశ్వత నష్టంగా భావించాల్సి ఉంటుంది. పెద్ద శబ్దం తర్వాత చెవులు వినిపించకపోతే అప్పుడు ఆ చెవిలో ఇయర్‌ డ్రాప్స్, నీళ్లూ,  నూనె ఎట్టిపరిస్థితుల్లో వెయ్యకండి.  తప్పక ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించాలి. ఆయన మైక్రోస్కోప్, ఆడియోమెట్రీ పరీక్షలతో చెవికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి చికిత్స చేస్తారు. 

ముక్కుకు, గొంతుకు హాని – టపాసుల పొగతోనూ ముక్కు, గొంతు, స్వరపేటికలో మంటగా రావచ్చు. అందుకే పొగకూ, రసాయనాలకు ఎక్స్‌పోజ్‌ అయితే చేతులనూ, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. గొంతులో నీళ్లు పోసుకొని పుక్కిలించాలి. 

► బాణాసంచా కాల్చాక చేతులకూ రసాయనాలు అంటుతాయి కాబట్టి వాటితో ముక్కు, చెవుల వద్ద రుద్దడం చేయకూడదు. రసాయనాలు అంటిన చేతుల్తో ముక్కు దగ్గర రుద్దితే దాని నుంచి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. ముక్కు నుంచి రక్తం కారడాన్ని వైద్య పరిభాషలో ఎపిస్టాసిస్‌ అంటారు.   ఇలా బాణాసంచాలోని రసాయానాలు చేతులకు అంటినప్పుడు వాటిని ముఖానికి, కళ్లకూ, ముక్కుకూ, చెవులకూ దూరంగా ఉంచాలి. అదే చేతులతో ముఖాన్ని, కళ్లనూ రుద్దుకోవద్దు.

జంతువుల సంరక్షణకు సూచనలు... 
పటాసుల నుంచి జంతువులను రక్షించడానికి పెటా లాంటి పెట్‌ కేర్‌ పీపుల్‌ మాత్రమే కాకుండా, మన లాంటి మామూలు మనుషులూ ముందుకు రావాలి. మన వినోదం కోసం కాల్చే బాణాసంచా వాటికీ  చేటు తెచ్పిడుతుంది. అవి బెదరడం వల్ల మనకే ముప్పు ముంచుకురావచ్చు. ఉదాహరణకు ఒక ఆవు గోడపై పోస్టర్‌ను తింటూ ఉందనుకుందాం. లేదా రోడ్డు పక్కన కూర్చొని తిన్నదాన్ని ప్రశాంతంగా నెమరేసుకుంటుందని అనుకుందాం. పటాసు పేలిన శబ్దంతో అది బెదిరిపోయి రోడ్డు మీదకు అకస్మాత్తుగా వచ్చేస్తుంది. దాంతో వాహనదారులు యాక్సిడెంట్లకు గురికావచ్చు. ప్రమోదం ప్రమాదం కాకుండా ఉండటానికి పశువైద్య నిపుణులు చెబుతున్న జాగ్రత్తలివి... 

► పెంపుడు జంతువుల్లో కుక్కలు ఎక్కువ. బాణాసంచా మోతలకు అవి బెదిరిపోయే ప్రమాదం ఎక్కువ. ఇది ఎంతగా ఉంటుందంటే... దీపావళి నాడు మాత్రమేగాక దీర్ఘకాలం పాటు వాటికి ఆ బెదురు తగ్గదు. చిన్న చిన్న శబ్దాలకే వణికిపోతుంటాయి. లేగదూడలూ, బర్రెకుర్రలూ ఇదే ప్రమాదానికి గురవుతాయి. వీధుల్లో తిరిగే పిల్లుల వంటి స్ట్రే యానిమల్స్‌ విషయంలోనూ ఇదే జరుగుతుంది. 

 ఒక ఒక్కోసారి థౌజెండ్‌వాలా లాంటివి చాలా సేపు అదేపనిగా చిటపటలాడుతూ మోగుతూనే ఉంటాయి. దాంతో పెంపుడు జంతువులు మాత్రమే గాక... చెట్లపై ఉండే పక్షులూ బెదిరిపోతాయి. ఒక్కోసారి వాటి గుండె ఆగిపోయి చెట్టు మీది నుంచి నేల మీదికి రాలిపోవచ్చు. 

► పెద్దగా పేలే శబ్దాలతో కక్కులకు సౌండ్‌ ఫోబియా వచ్చి అన్నం తినడం కూడా మానేస్తాయి. ఆ తర్వాత చాలా రోజులు దిగులుగా ఉంటాయి. ఇలాంటి ప్రమాదాల నుంచి పెంపుడు కుక్కలాంటి జంతువులను, పేలుళ్లు తినిపించే ప్రాంతం నుంచి కాస్త శబ్దాలు తక్కువగా వినిపించే గదుల్లోకి తీసుకెళ్లాలి. వాటికి ఇష్టమైన బొమ్మలతో వాటిని ఆడిస్తూ, శబ్దాల నుంచి దృష్టి మళ్లించేలా చేయాలి. ఇక వాటికి ఇష్టమైన ఆహారం ఇవ్వాలి. 

 చెట్ల మీద గూటిలో ఉండే తల్లిపిట్టలు రాలిపోతే గూళ్లలో కళ్లుతెరవని పిట్టపిల్లలకు పేరెంట్స్‌ను దూరం చేసినట్లే. పెద్ద పక్షుల ఉసురు తీస్తే పిల్లపిట్టల ఉసురూ మనం పోసుకున్నట్లే!  అందుకే గట్టిగా పేలిపోయే శబ్దాలు వచ్చే టపాసులు కాకుండా వెలుగులు చిమ్మే వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి.  
– డాక్టర్‌ ఎం.వంశీధర్, రీజనల్‌ మెడికల్‌, డైరెక్టర్, డాక్టర్‌ అగర్వాల్స్‌ ఐ హాస్పిటల్, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement