దీపావళి టపాసులు పేలాల్సింది 5 గంటలే!
- పండుగనాడు క్రాకర్స్ 'మోత'లకు నిర్ణీత వ్యవధిపై సుప్రీంకోర్టు కసరత్తు
న్యూఢిల్లీ: దీపావళి తెల్లారి ఎంరి ఇంటిముందు చెత్త ఎక్కువుంటే వాళ్లు ఎక్కువ టపాకులు కాల్చినట్టు. అలా వీధిలో ఎక్కువ మందుగుండు కాల్చిన కుటుంబంగా తాత్కాలిక కీర్తి కోసం రాత్రంతా టపాకులు పేల్చేస్తుంటాం. అయితే ఇకపై మనం.. 'పటాకుల కీర్తి' కండూతిని కచ్చితంగా వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇష్టమొచ్చిన వేళల్లో కాకుండా నిర్ణీత వ్యవధిలో మాత్రమే టపాకులు కాల్చేలా ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు కసరత్తు చేస్తోంది.
సంచలనాత్మక రీతిలో పాలుతాగే పసిపిల్లలు గత నెలలో దాఖలుచేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. 'ఇంకా అభివృద్ధి చెందని మా ఊపిరితిత్తులు, ఇతర శరీర భాగాలు.. టపాకులు ద్వారా జనించే శబ్ధ, ధ్వని కాలుష్యాల వల్ల ఎంతగా అల్లాడిపోతాయో ఆలోచించండి' అంటూ ఆరు నెలల వయసున్న అర్జున్ గోపాల్, ఆరవ్ భండారీ, 14 నెలల వయసున్న జోయా రావ్ భాసిన్ అనే చిన్నారులు తమ న్యాయవాద తండ్రుల ద్వారా సెప్టెంబర్ 30న పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
చిన్నారుల అభ్యర్థనలోని పలు అంశాలను చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్. దత్తు, జస్టిస్ అమితాబ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం కూలంకషంగా పరిశీలించింది. పిల్లలు వ్యక్తపరిచిన ఆందోళన సహేతుకంగానే ఉందని, తగిన చర్చలు చేపట్టేలా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడాల్సిందిగా సొలిసిటర్ జనరల్ రజిత్ కుమార్, అదనపు సొలిసిటర్ జనరల్ మనిందర్ సింగ్ లను కోర్టు ఆదేశించింది.
దీపావళి పండుగనాడు టపాకులు పేల్చే కార్యక్రమాన్ని రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిర్వహించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరగా.. రెండు గంటలు చాలా తక్కువ సమయమని, అందుకు కనీసం 5 గంటలైనా వేడుక జరుపుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. టపాకుల పేల్చివేతక వ్యవధిని సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్ధారిస్తే సరిపోతుందని ఒక నిర్ధారణకు వచ్చింది. తరుపరి విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది. సొలిసిటర్ జనరల్ తెలిపే వివరాలను బట్టి అదే రోజు తీర్పును వెలువరించే అవకాశం ఉంది.