న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా నిషేధం ఎత్తివేసేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు. వాతావరణ కాలుష్యం, ఇతర పద్ధతుల్లో దీపావళి జరుపుకొనే అంశాలను చూపుతూ ఈ మేరకు స్పష్టం చేసింది. బీజేపే ఎంపీ మనోజ్ తివారీ అక్టోబర్ 10న సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలో బాణసంచా వినియోగం, విక్రయాలపై ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. అయితే, అప్పుడే ఎలాంటి కొత్త ఆదేశాలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తాజాగా.. తివారీ న్యాయవాది ఈ అంశాన్ని కోర్టు ముందుకు తీసుకొచ్చి లంచ్ బ్రేక్‌లో అత్యవసరంగా విచారించాలని కోరారు. కానీ, కోర్టు మళ్లీ అందుకు నిరాకరించింది.
‘మీ డబ్బులను స్వీట్స్ కొనుగోలు చేసేందుకు ఖర్చు చేయండి.. ప్రజలను స్వచ్ఛమైన గాలి పీల్చుకోనివ్వండి. గ్రీన్ క్రాకర్స్ అయినప్పటికీ ఎలా అనుమతించమంటారు? ఢిల్లీలో కాలుష్యాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా?’ అని పిటిషనర్‌ను ప్రశ్నించింది సుప్రీం కోర్టు. బీజేపీ ఎంపీ తివారీతో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించి ఈ మేరకు వ్యాఖ్యానించింది.
ఢిల్లీ ఆప్ ప్రభుత్వం బాణసంచాపై నిషేదం విధించటంపై బీజేపీ లీడర్ తాజిందర్ పాల్ సింగ్ బగ్గా ఆరోపణలు గుప్పించారు. ‘హిందువులు దీపావళికి క్రాకర్స్ కాలిస్తే కాలుష్యం ఏర్పుడుతుందని, వారిని కేజ్రీవాల్ జైలులో వేస్తామని బెదిరిస్తున్నారు. కానీ, ఢిల్లీ మంత్రి ఫైర్ క్రాకర్స్ కాలిస్తే ఆక్సిజన్ వస్తుందా?’ అని ప్రశ్నించారు. ఢిల్లీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ బాణసంచా కాల్చుతున్న వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఫలితాలు: ఎప్పుడూ ఏకగ్రీవమే, కానీ.. ఇప్పుడే ఇలా!
Comments
Please login to add a commentAdd a comment